సుందర్ లాల్ గారికి అప్పుడు తెలుగు అంత బాగారాదు. ఏదో మాట్లాడేవారు. "రండి రండి బాగున్నావే" అని అనేవారు.
"ఏమిటండీ తెలుగు మాట్లాడడం రాకుంటే, మానేసి హిందీలోనే మాట్లాడరాదూ! నాకు హిందీ బాగా తెలుసు. 'ఏవే. ఏవిటే' అని ఎవర్ని ఎవరు పిలుస్తారో మీకు తెలుసా?" అంటే నవ్వేస్వారు.
మాటలన్నీ అయ్యాక. "శ్రీశ్రీగారూ! మీవంతు డబ్బు పదిహేను రోజులలోగా కట్టేయాల"ని అన్నారు నహతాగారు.
నేను వెంటనే అందుకుని, "పదిహేను రోజులుకాదు_పదిహేనేళ్ళు మీరు టైమిచ్చినా మేమా మొత్తాన్ని కట్టలేం" అన్నాను.
"మరైతే ఎలాగ?" అన్నారాయన.
"చూడండి. మీకు అరడజను పిక్చర్లు మేము రాసేస్తాం. ప్రస్తుతం మేము పిక్చర్ కి పన్నెండువేలు తీసుకుంటున్నాం. ఎంత డబ్బు బాకీవున్నా దాంతో సరిపెట్టుకోండి. మీరు శ్రీశ్రీగారికీ, నాకూ చేయాల్సిన మహోపకారం ఇదే" అన్నాను.
తర్వాత ఏవో డిస్కషన్స్ అయినా, ఆ ప్రకారంగానే నహతాగార్ని ఒప్పించి, ఆ కష్టం నుండి గట్టెక్కాం. అనుకున్న ప్రకారం ఆరు పిక్చర్లూ తీసు రుణం తెర్చుకున్నాం. అది చాలక మా మొదటి పిక్చర్ వారి దగ్గరే వదిలేశాం.
"మొత్తానికి సాధించావు సరోజా!" అన్నారు శ్రీశ్రీగారు.
"లేకుంటే ఏమిటండీ! ఈ ఫీల్డు మీకు ఎంత డబ్బు ఎగగొట్టింది?" అని అడిగాను.
"చాలా" అన్నారు.
"మనం ఎగగొట్టలేదు. పనిచేసి అప్పు తీర్చుకున్నాం" అన్నాను.
మా పెద్దమ్మాయికి ఎనిమిదో నెల వచ్చేసరికి, మా రెండో పాప కడుపులో పడింది.
ఒకరోజు నేనూ, శ్రీశ్రీగారూ డాబామీద కూర్చున్నాం. ఆయన విపరీతంగా ఆలోచిస్తున్నారు.
"ఏమీటండీ ఆలోచిస్తున్నారు?" అని అడిగాను.
"మన దేశంలోని ప్రజల విషయమే ఆలోచిస్తున్నాను. డబ్బయ్యయిదు శాతం నిరక్షరాస్యులమీద ఇరవై అయిదు శాతం అక్షరాస్యులూ, తొంబైశాతం దరిద్రులమీద పదిశాతం ధనవంతులు పరిపాలన సాగించే వ్యవస్థ మనది. ఇదే ప్రజాస్వామ్యం అనుకోవడమంత సిగ్గుచేటు మరొకటి లేదు. ఈ వ్యవస్థకి రకరకాలుగా కొమ్ముకాచే వాళ్ళంతా నా దృష్టిలో ప్రజాద్రోహులే.
1947లో మనకి స్వాతంత్యం వచ్చిందంటారు. అది ఎలా వచ్చిందన్న విషయం ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చెప్పుకోసాగారు. కానీ నేను మాత్రం మనకింకా స్వరాజ్యం రాలేదనే అంటాను.
కరువు కాటకంతో, దరిద్రంతో మన దేశం వెలిగిపోతోంది. దారిద్ర్యం, దురవస్థ....ఇదే మన దేశం గురించి చెప్పుకోవలసిన మాటలు. మధ్య తరగతి వారు క్రమంగా పేదవాళ్ళయిపోతున్నారు. నిరుద్యోగం విశ్వరూపం దాల్చి తాండవమాడుతోంది.
పెట్టుబడిదారులు వడ్డీలు చాలక చక్రవడ్డీలతో సహా పేద ప్రజల్ని ఏలుతున్నారు. ప్రజల్లో చైతన్యం కలగాలి. కాదు కలిగించాలి. వాళ్ళని మేల్కొల్పాలి.
దేశంలో ముదిరిపోతున్న దౌర్జన్యాలను, అక్రమాలను, అహింసలను వాళ్ళకి తెలియజేసి కనువిప్పు కలిగించాలి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఆంధ్ర ప్రజలు మేలుకొనే వున్నారు. కానీ ఆశయం మాత్రం దూరంగానే వుంది.
ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళాలంటే ఎన్ని చోట్లకని వెళతావు? ఎంతమందికని చెప్తావు? అందుకనే సినిమా ప్రజల హృదయాల్లోకి చొచ్చుకుపోయే మంచి ఆయుధం అంటాను. ధైర్యంతో ముందుకొచ్చి ప్రజల్లో మార్పు తెచ్చేటందుకు చేయూతనిచ్చే ప్రొడ్యూసర్, డైరెక్టర్ వుంటే సినిమా ద్వారానే చాలా సులభంగా ప్రచారంచేసే అవకాశాలు ఎక్కువ వున్నాయి సరోజా!
అందుకనే నేనే డైరెక్టు చేసి, ఓ పిక్చర్ తీద్దామనుకుంటున్నాను. దానికి టైటిల్ కూడా అప్పుడే పెట్టేశాను. స్క్రిప్ట్ కూడా రడీగా వుంది. స్క్రీన్ ప్లే....అన్నీ రడీ. తిన్నగా సెట్ కి వెళ్ళిపోవడమే" అన్నారు. ధోరణి చాలా ఘాటుగా సాగుతోందని మధ్యలో డిస్టర్బ్ చేయకుండా వినసాగారు.
"టైటిల్ ఏమిటి చెప్పుకో" అన్నారు.
"ఏమయివుంటుంది? మీ మాటల్నిబట్టి దానికి సంబంధించినదే అయి వుంటుంది" అన్నాను.
"అవును. ఆకలి మంటలు', ప్రజలందరినీ ముందుకు నడిపించేటట్టు దాన్ని రాశాను. వాళ్ళ బ్రతుకుల్ని స్వర్గంలా వాళ్ళే చేసుకునేలా చెయ్యాలని నా తపన.
మానవుడిలో మహత్తర శక్తి వుందని ధృవపరచాలి. మానవుడు పరిసరాలకు బానిస అనే విశ్వాసాన్ని విచ్చిన్నం చెయ్యాలి.
అప్పుడే ఇవన్నీ అనేకచోట్ల, అనేక దేశాల్లో అమలులోకి వచ్చి సాగుతూనే వున్నాయి. ప్రజలు మేల్కొంటున్నారు.
మనం కూడా కొత్త పోకడలతో ప్రజా హృదయాలలోకి నడక సాగించాలి. మనదేశంలో కూడా నాటకాలలో, బుర్రకథలలో, నృత్యాలలో, పాటలలో, జానపదాలలో సాహిత్యరీత్యా కూడా కొత్త కొత్త పోకడలతో ముందుకి సాగి ప్రజలతో కలిసిపోతూ వాళ్ళని చైతన్యవంతుల్ని చేస్తున్నారు. అనేకులు అనేక విధాలుగా చురుగ్గానే ముందుకు సాగుతున్నారు. మహోజ్వలమైన చారిత్రక స్మృతులతో నూతన సంచలనం కనిపిస్తోంది. అయినా చాలదు.
ప్రజలు తమ చుట్టూ ఆవరించి వున్న దారిద్ర్యాంధకారం నుండి బైటపడాలి. మనది ప్రజా ప్రభుత్వం కాదు. పోలీసు రాజ్యం. ఒక మనిషిని మరొక మనిషి దోచుకునే విధానానికి స్వస్తి చెప్పాలి. సమసమాజాన్ని నిర్మించాలి. అనేక రూపాల్లో పోరాటం సాగిస్తేనే గానీ ఇది సాధ్యంకాదు. ఆయుధాన్ని ఆయుధంతోనే ఎదిరించాలి. హింసని ప్రతి హింసతో ప్రతిఘటించాలి. అనుక్షణం దండయాత్ర జరుపుతూనే వుండాలి.
