Previous Page Next Page 
సంసారంలో శ్రీశ్రీ పేజి 24

    "పెళ్ళి చేసుకోలేదని  ఎవరన్నా, ఈ పత్రం చాలు సరోజా!" అన్నారు.

    "మీ కెందు కిలాంటి  అనుమానం వచ్చింద" ని  అడిగాను.

    "నేను చేస్తున్న  ఈ పని కేవలం  నీ కోసం, నీ పిల్లలకోసం. మన పెళ్ళిచూసినవాళ్ళు ఎంతమంది వున్నారు? ఆ చూసినవాళ్ళే రేపు జరగలేదని  చెప్పరన్న  నమ్మకం ఏముంది? అందుకే ఈ రిజిష్టరు మేరేజ్. అదీగాక నువ్వు నాకు బిడ్డని కానుకగా  ఇస్తున్నావు. ఆ సంతోషంతో  నేను నీకిస్తున్న  బహుమానం ఇది" అన్నారు.

    17_9_59వ  తేదీ  గురువారం  తెల్లవారు  ఝామున మూడు గంటల పదినిముషాలకి  మా పెద్దమ్మాయి  పుట్టింది. ఇంటికి  ఫోన్ చేసి చెప్తే వారు ఎగిరి గంతేశారు.

    తొమ్మిది గంటలకి నన్ను చూడడానికి  వచ్చిన  శ్రీశ్రీగారు  తన కూతుర్ని చూసుకొని మురిసిపోయి, దాని తల కింద పదివేల రూపాయలు పెట్టారు.

    "ఎక్కడివండీ" అని అడిగాను.

    "వస్తూ దారిలో  కంపెనీకి వెళ్ళాను సరోజా! పదివేలు  ఇచ్చారు. కాబట్టి ఈ డబ్బు తల్లిగాడిదే" అన్నారు. ఆయన మా పెద్దమ్మాయిని  'తల్లి' అని పిలిచేవారు.

    బాలసారె  చాలా బ్రహ్మాండంగా జరిపించాం. ఆ పిల్ల పుట్టినప్పుడు  శ్రీ ఆరుద్రగారు ప్రెజంట్ చేసిన స్టీలు పువ్వుల పళ్ళెం  నా పూజాగదిలో  ఇప్పటికీ  భద్రంగా ఉంది.

    బాలసారె  అయిన తర్వాత  రెండు రోజులు గుమ్మం  కదలకుండా  ఆ పసిపిల్లతోనే  కాలం గడిపారు.

    ఆ అమ్మాయికి 'అప్పన్న కొండ' అని మా అత్తగారి (శ్రీశ్రీగారి తల్లి)పేరు పెట్టారు. స్కూల్లో వేసేటప్పుడు  'మంజుల' అని పెట్టాను. ఇంట్లో మాత్రం శ్రీశ్రీగారు పెట్టిన  'తల్లి' అనే పేరుతోనే పిలుచుకునేవాళ్ళం.


            ఆకలి మంటలు


    "స్టాక్ హోమ్ విశేషాలేమీ చెప్పారుకారేం?" అని శ్రీశ్రీగారిని  అడిగాను. "ప్రత్యేకించి  ఏమున్నాయిలే? ఈసారి  కూడా  ప్రపంచ  శాంతి  సంఘ ప్రతినిధిగానే వెళ్ళాను. శాంతిసంఘం  పదవ  వార్షికోత్సవం జరిగింది. స్టాక్ హోమ్ నుండి  రష్యా  వెళ్ళాలని  చాలా ప్రయత్నించాను గానీ జరగలేదు.

    నేను అక్కడికి  చేరుకునేసరికి  వెంటనే  బయలుదేరి  రమ్మని  ఇక్కడివాళ్ళిచ్చిన  కేబుల్స్ నాకోసం ఎదురు చూస్తున్నాయి. అన్నీ మన ప్రొడ్యూసర్లిచ్చినవే. వెళ్ళింది మొదలు తిరుగు ప్రయాణానికి  సన్నాహాలు చేసుకోవడంతో  సరిపోయింది. దానికి తోడు నీ గురించి దిగులొకటి.

    ఉత్త  మనిషివి కావు. పిక్చర్ల పన్లన్నీ  నీ మీదే  వదిలిపెట్టేను. అన్నీ కలిసొచ్చాయి. ఇప్పుడు మన పిక్చరు రిలీజ్ కి ఏర్పాట్లయిపోయాయి" అన్నారు.

    "డిస్ట్రిబ్యూషన్  ఎవరికిచ్చా రేమిటి?" అని అడిగాను.

    "చమ్రియా సుందరలాల్  నహతాగారికే" అన్నారు.

    (ఈ మధ్యలో  ఒక విషయం రాయడం మరచిపోయాను. మా పెద్దమ్మాయి  కడుపులో  వుండగా 'నీకేమిటి కావాలో కోరుకో' అన్నారు శ్రీశ్రీగారు. 'ఏమీ వద్ద'న్నాను. కానీ ఆయన వదలలేదు. చివరికి ఆయన బలవంతం మీద 'కింద నున్న  బెడ్ రూమ్ కిపైన  ఓ రూమ్ వేస్తే, ఆ రూమ్ కిటికీలో నుండి  సముద్రం మీద పడే పున్నమి వెన్నెలని చూడాలని వుంద'ని  అడిగాను. వెంటనే  కొత్తగా మెట్లు కట్టించి, బ్రహ్మాండమైన రూమ్ కట్టించి ఇచ్చారు.

    మేము  ఆ రూమ్ లోనే రాతపని పెట్టుకొనే వాళ్ళం. రాత్రిళ్ళు  హాయిగా వెన్నెల్లో పడుకొని  ఎన్నెన్నో కథలు  చెప్పేవారు. ఇప్పుడు సముద్రం కనిపించినా  ఎదురుగా  చాలా బిల్డింగులు  లేచిపోయాయి. అప్పటంత  బాగా కనిపించకున్నా సుమారుగా కనిపిస్తుంది.)   

    పిక్చర్ రిలీజయ్యింది. డబ్బాలు తిరిగొచ్చాయి. డిస్ట్రిబ్యూటర్స్ కి మేమే బాకీపడ్డాం. చమ్రియావాళ్ళు  తెగ సతాయిస్తున్నారు.

    "సరోజా ఏం దారి?" అన్నారు  శ్రీశ్రీగారు.

    "అలా భయపడతారేమిటండి" అన్నాను.

    ఇంతలో  మళ్ళీ  సుబ్బరామన్ గారు వచ్చి 'తమిళ భాషలో  తను తీసిన 'పార్ మగ్ హళేపార్' అనే పిక్చర్ పార్ట్నర్ షిప్ లో తీద్దామ'ని  ఆఫరిచ్చారు.

    "ఈ పిక్చర్ ఒప్పుకుందాం  సరోజా! నష్టాలు కాస్త సర్దుకున్నా  సర్దుకోవచ్చు" అన్నారు.

    నాకు ఇష్టం లేకున్నా  వారి మాటమీద సరే ననక తప్పలేదు. దానికి 'కవల పిల్లలు' అని టైటిల్ ఇచ్చారు. దానికి  కూడా మ్యూజిక్ డైరెక్షన్ నేనే చేశాను. అది అనుకున్నంత బాగా  పోలేదు. మొత్తంమీద  నష్టమనే చెప్పాలి.

    "సుందర్ లాల్ గారికి మళ్ళీ డబ్బయ్యయిదు  వేలదాకా  బాకీపడ్డాం సరోజా! ఇది మనవంతు షేరు మాత్రమే. సుబ్బారామన్ గురించి  ఫరవాలేదు. అతను స్ట్రయిట్ పిక్చర్ తీసి మేనేజ్ చేసుకుంటాడు. కానీ మనం అప్పు ఎలా తీర్చడం?" అన్నారు శ్రీశ్రీగారు.

    ఇద్దరం  బెంగపెట్టుకు కూర్చున్నాం. ఉన్న  ఈ ఒక్క ఇల్లు  ఆధారం. ఏం చేయాలో  తోచలేదు .డబ్బుకోసం చమ్రియానుండి  ఒత్తిడి  ప్రారంభమయ్యింది. ఇంటిమీద యాక్షన్ తీస్తామని చెప్పారు.

    నేను శ్రీశ్రీగారికి ధైర్యం  చెప్పి, "మనిద్దరం  చమ్రియాకి  వెళదాం రండి" అని బయలుదేరాం.

    "ఏం చేస్తావు?" అని అడిగారాయన. నా ఉద్దేశం ఆయనతో  చెప్పాను.

    "వాళ్ళు ఒప్పుకుంటే  బాగానే వుంటుంది" అన్నారు.

    "నేను ఒప్పిస్తానుగా. మీరు  నా పక్కనుందురూ" అన్నాను.

    ఇద్దరం  వెళ్ళాం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS