Previous Page Next Page 
ది ఎడిటర్ పేజి 24


    మాచర్లలో సిమెంటు రాళ్ళు దొరుకుతాయి. రాయలసీమ బెతంచర్లలో కూడా సిమెంటు రాళ్ళు దొరుకుతాయి.
    చర్ల పేరుతొ ఇంకేం ఊళ్లు ఉన్నాయి?
    చాకిచెర్ల ........అక్కడేం దొరుకుతుంది? అది సముద్రపు ఒద్దు. అంతా ఇసుక.
    బహుశా ముందుముందు పెట్రోలియం దొరుకుతుందేమో అక్కడ.
    బాంబే హైలో లాగా! నవ్వుకున్నాడు ఉదయార్కర్. అప్పుడు జరిగింది అది. అతని స్కూటరు కంట్రోలు తప్పి అష్టవంకర్లు తిరగడం మొదలెట్టింది.
    "గాడ్" అనుకున్నడు ఉదాయర్కర్. టైరు పంక్చరయినట్లు వుంది. స్కూటర్ మీద వెళ్ళడంలో కొంత సుఖం ఉన్నది గానీ ఇలాంటి అవాంతరాలు వస్తే మటుకు న్యుసేన్సే!
    "నడిచినంత సేపూ బండి నడవకపోతే మొండి' అనుకుంటూ స్కూటర్ దిగాడు ఉదయార్కర్.
    అప్పటికి మసక చీకటి పడుతోంది. డిక్కీలో నుంచి టార్చ్ లైటూ ఇన్ స్ట్రుమెంట్స్ బాక్సు బయటికి తీశాడు ఉదయార్కర్.
    స్కూటర్ టైరు మార్చి స్టేప్ని వెయ్యడం అంత కష్టమేమీ కాదు. కానీ చీకటిగా ఉంది. ఎవరన్నా టార్చి చేతిలో పట్టుకుని చూపిస్తూ ఉంటే పని సులభం.
    నిమిషానికొకటి చొప్పున లారీలు రివ్వున దూసుకుపోతున్నాయి. కానీ, వాళ్ళెందుకు ఆగుతారు తనకోసం! అప్పుడు గమనానికోచ్చింది, అతని పక్కన ఎవరో నిలబడి ఉన్నట్లు తలతిప్పి చూసి వెంటనే వులిక్కిపడ్డాడు ఉదయార్కర్.
    చాలా పొడుగ్గా ఉన్నాడు ఆ మనిషి. కానీ .....అతని మొహమంతా జుట్టే. జుట్టు కాదది......జూలులా ఉంది! తలా నుదురు , ముక్కు చెంపలు, చుబుకం , మెడా --------దట్టంగా వెంట్రుకలు..........
    "భయపడకండి నేను మనిషినే" అన్నాడా మనిషి. గొంతు బొంగురుగా వుంది. ఇంకా తేరుకోలేదు ఉదయార్కర్.
    "సాయం కావాలా!" అని అడిగి తర్వాత ఉదయార్కర్ స్థితిని గమనించి తన మీద తనే జాలిపడుతున్నట్లు అన్నాడు అతను "ఇది ...ఈ జుట్టు ఇలా పెరగడం .....ఒక జబ్బు లాంటిది. కానీ అంటు వ్యాధి కాదు బెదిరిపోకండి" అప్పుడు గుర్తువచ్చింది ఉదయార్కర్ కి.
    ఆ వ్యాధిని హైపర్ ట్రైకోసిస్ HYPERTRICHOSS అంటారు. చాలా అరుదైన వ్యాధి అది. అది వస్తే శరీరమంతా దట్టంగా వెంట్రుకలతో నిండిపోతుంది. కుదుటపడ్డాక అతన్ని మరోసారి పరిశీలనగా చూసి, "కాస్త ఈ టార్చ్ పట్టుకోగాలరా!" అన్నాడు ఉదయార్కర్. ఆ మనిషి టార్చ్ పట్టుకుని వెలుగు చూపిస్తూ "ఎందాకో ప్రయాణం?" అన్నాడు.
    "మాచర్ల" అన్నాడు ఉదయార్కర్.
    "మాచర్లా?" ఎవరింటికి?"
    చెప్పాలా వద్దా అని కాసేపు అలోచించి "బ్రహ్మచారి గారింటికి?" అన్నాడు ఉదయార్కర్. బ్రహ్మచారి ఇతనికి తెలిసి ఉంటే మరికొంత సమాచారం రాబట్టవచ్చు తను. ఆది వినగానే "అట్లాగా!" అన్నాడు ఆ ఆమనిషి ఉదాసీనంగా. తర్వాత ఇంకేం మాట్లాడలేదు అతను.
    టైరు మార్చడం పూర్తి అయింది. "నేనూ మీతో రావచ్చా?" అన్నాడా మనిషి.
    "దానిదేముంది ఎక్కండి"
    స్కూటర్ స్టార్ట్ అయ్యాక అప్పుడు హటాత్తుగా తట్టింది ఉదయార్కర్ కి.
    మాచర్ల కి వెళ్ళవలసినవాడు ఇతను నడిచేందుకు వస్తున్నాడు. అదే అడిగాడు. దిగులుగా నవ్వాడు అతను. "బస్సెక్కాలంటే డబ్బులేవీ. అయినా దయ్యంలా ఉన్న నన్ను బస్సెవరేక్కనిస్తారు"అన్నాడు. తలకొంచెం తిప్పి ఓరగా చూశాడు ఉదయార్కర్. చీకటిలో నిజంగానే దెయ్యంలా కనబడుతున్నాడు ఆ మనిషి. చటుక్కున తల తిప్పుకుని స్కూటర్ ముందుకు ఉరికించాడు ఉదయార్కర్.
    మాచెర్ల పొలిమేర చేరేసరికి చీకటిపడిపోయింది. ఆ ఉళ్ళో ఎక్కడ చూసినా సన్నటి దుమ్ము ఆవరించుకుని ఉంది. గాలిలో నేలమీద కూడా.
    "సిమెంటు ఫ్యాక్టరీ ప్రభావం అయి ఉంటుంది." అనుకున్నాడు ఉదయార్కర్.
    అప్పుడు అతనికి గుర్తువచ్చింది ఒక విషయం. బ్రహ్మచారికి అభ్యంతరం లేకపోతే అయన చెప్పిన విషయాలు టేపు మీద రికార్డు చేసుకోవచ్చనే ఉద్దేశ్యంతో టేప్ రికార్డర్ తెచ్చాడు తను. కానీ ప్రయాణం తొందరలో కాసెట్స్ తేవడం మర్చిపోయాడు.
    "ఈ ఊళ్ళో టేప్ రికార్డర్ కేసేట్స్ ఎక్కడ దొరుకుతాయి." అన్నాడు ఉదయార్కర్ వెనక వున్న మనిషితో. అలా అంటుండగానే అతనికి అనిపించింది. అసలు కేసేట్స్ అంటే తెలుస్తుందా ఈ మనిషికి - ఏమో-
    "బస్టాండ్ దగ్గర ఉంటాయి షాపులు. మూసేస్తారేమో తొందరగా వెళ్ళండి! ఈలోగా ఇక్కడొక్కసారి ఆపితే నేను దిగిపోతాను." అన్నాడు ఆ వ్యక్తీ. అతని పద్దతి చూస్తే మనుషుల మధ్యకు రావడం ఇష్టం లేనివాడిలాగా అనిపించింది ఉదయార్కర్ కి. స్కూటర్ ఆపాడు. స్ట్రీట్ లైట్స్ లేవు అక్కడ. నిర్జనంగా ఉంది ఆ ప్రాంతం. స్కూటర్ దిగాడు ఆ మనిషి.
    "బస్టాండు నుంచి బ్రహ్మచారి ఇల్లు దగ్గరే ఎవర్నడిగినా చెబుతారు. మీరు బజారులో పని చూసుకుని వెళ్ళండి వస్తాను నమస్కారం.' అని చెప్పి క్రీనీడలో కలిసిపోయాడు ఆ వ్యక్తీ. స్కూటర్ స్టార్టు చేసి వేగంగా ముందుకుపోనిచ్చి అప్పుడే షట్టర్లు మూసేస్తున్న ఒక షాపు ముందు ఆపాడు ఉదయార్కర్. లక్కీగా దొరికాయి కాసెట్స్ అక్కడ.
    వాటికి డబ్బు చెల్లిస్తూ అడిగాడు ఉదయార్కర్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS