Previous Page Next Page 
కౌగిట్లో కృష్ణమ్మ పేజి 24

 

    ఆమె విద్యాలోకానికి ఆదర్శ ప్రాయురాలయిన ఉపాధ్యాయిని. తనదంటూ ఏమీ లేకుండా తన సర్వస్వాన్ని విద్యార్ధినీ విద్యార్ధులకు ధారా పోస్తున్న దేవత! అందునించి నా ఊపిరులు ఆసాంతమయేదాకా ఆమెను నేను స్మరిస్తాను. ఆమె ఆదేశాన్ని కర్తవ్యంగా భావిస్తాను.
    జ్యోతిని ఆమె పంపినారని వినగానే నాకు చేతనయినదంతా చేయాలని నాకు అనిపించింది. అవసరమయితే ఈ ప్రయత్నంలో జ్యోతితో పాటు నేను కూడా ప్రాణాలను అర్పించేందుకు సిద్దంగా ఉన్నాను.
    "ఇది కేవలం అర్కేలాజికల్ ప్రాధాన్యత మాత్రమే కాదు. యుగయుగాలనుంచీ హిందువులు విశ్వసించిన ప్రేతాత్మలున్నాయా, లేదా అన్న చికిత్సకు ఈ పరిశోధన సమాధానమివ్వగలదు.
    అందునించి నేను చేయగలిగినది యావత్తు చేయాలనుకుంటున్నాను మీ అనుమతి లభించటమే తరువాయి" అన్నాడు జయకృష్ణ.
    అతని ఉత్సాహం చూసి ఉప్పొంగిపోయినారు శ్రీ బృందావన్ గోయెల్. మళ్ళీ పైపు వెలిగించి దట్టంగా పోగలాగి గుప్పున వొదిలారు. పరిచయమయి కొద్ది గంటల కాకపోయినా ఇరువురూ ఒకే అభిప్రాయం మీద అంతటి పట్టుదల కలిగి వుండటాన్ని గమనించి గుబురు మీసాల చాటున గుంభనగా నవ్వుకున్నారు శ్రీ బృందావన్ గోయెల్.
    "వెల్! మైడియర్ యంగ్ స్కాలర్స్! మీరు అంత పట్టుదలగా వుండగలగటమే విజయానికి తొలిమెట్టు. మంచిది. ప్రొసీడ్! నీకు ఈ పరిశోధనలో అవసరమయే సమయాన్ని సెలవుగా మంజూరు చేయించటానికి ప్రయత్నిస్తాను. పై వాళ్ళకి వ్రాస్తాను.
    అందు గురించి నీవు బెంగపెట్టుకోక!
    ఈ ప్రయత్నంలో ఎదురయే ప్రమదాలన్నింటినీ మీరిరువురూ కలిసి ఎదుర్కోండి. మీ వెనుక ప్రొఫెసర్ శ్రద్దాదేవి , నేనూ వున్నామన్న సంగతి మర్చిపోక ధైర్యంగా ముందుకు పొండి.
    మీరు తెలుసుకోవాలని ఆశించే రాకాసి గుహలు బహుశా నంది కొండ -- శ్రీశైలం మధ్య ప్రాంతాలలో కృష్ణా తీరాన్నే వుండి వుంటాయని స్థూలంగా ఒక అంచనా వేయవచ్చు.
    అందునించి మీరు కిట్టు సర్దుకుని నంది కొండ నించి కృష్ణ ఒడ్డున గులక రాళ్ళలో నడుస్తూ శ్రీశైలం దాకా పోవాలి. అదంతా అడవులు, కొండలతో నిండిన ప్రాంతం. జాగ్రత్తగా పోవాలి. మీకు ధైర్యం చెప్పే మరొక తోడు వుండదనుకుంటాను.
    "కృష్ణానది కర్నూలు, మొహబూబ్ నగర్ , గుంటూరు, ప్రకాశం జిల్లాలను వేరు పరిచే ఒక చోటు వుంది. అక్కడే పై నాలుగు జిల్లాల సరిహద్దు కొసలు కలుస్తాయి. అది శ్రీపర్వతానికీ, శ్రీశైలానికి యించుమించు మధ్యగానే వుంటుంది. అక్కడకు సమీపాన చిరిగిరిపాడు అనే ఒక గ్రామం వుంది. దాన్నిప్పుడు శ్రీగిరిపాడు అని పిలుస్తున్నారనుకుంటాను.
    అది మీ పరిశోధన ఫలించే చోటు అయి వుండవచ్చు. ఏది ఏమైనా కృష్ణానది ఒడ్డునే, అడవులు, కొండల మధ్య మీరు ఎగువకు పయనించాలి. వీలయినంత త్వరలో ప్రయాణానికి సిద్దం కండి. విష్ యూ ఆర్ సేక్సేస్" అంటూ పైపుని అష్ట్రేలో విదిల్చి లేచి నిలిచినారు శ్రీ బృందావన్ గోయెల్.
    చప్పున తానూ లేచి నిలబడ్డాడు జయకృష్ణ. జ్యోతి తప్పనిసరి అయినట్లుగా లేచింది. ఆమె అనుభవశాలి అయిన బృందావన్ గోయెల్ తో ఇంకా మాట్లాడాలనీ , వారి నించి మరికొంత సమాచారం రాబట్టుకోవాలనీ ఆశించింది.
    కాని అదంతా జయకృష్ణకు తెలుసు. లేమ్మన్నట్లుగా లేచారాయన. ఒక తెల్ల కాగితం పై సంతకాలు పెట్టి అవసరమయినప్పుడు అవసరమయిన విషయాలు టైపు చేసి ప్రభుత్వానికి పంపుకునే ఏర్పాటు కోసం ఆ కాగితాన్ని శ్రీ బృందావన్ గోయెల్ కి ఇచ్చివేశాడు.
    శ్రీ బృందావన్ గోయెల్ అది తీసుకుని , అడవులకు వెళ్ళే వ్యాన్ వచ్చి వాకిలి ముందు నిలబడటంతో హడావుడిగా వెళ్ళిపోయినారు.
    జయకృష్ణ , జ్యోతి ఇంటికి తిరిగి వచ్చేశారు.
    జ్యోతి అనుకున్నట్లుగానే జయకృష్ణ చాలా పట్టుదల కలిగిన యువకుడు. చిన్న వయసులోనే మంచి ఉద్యోగం సంపాదించాడు. చాల చురుకయిన వ్యక్తీలా అనిపిస్తాడు చూడగానే. వొంకీల క్రాపు నుదుటి మీదకి దూకుతూ వుంటుంది. దాన్ని చూపుడు వ్రేలితో వెనక్కి తోస్తూ తరళాయితంగా వున్న కన్నులతో చూస్తాడు. విశాలమయిన నుదురు చిరునవ్వులాంటి వెలుగు ముఖమంతా నిండారినట్లు కన్పిస్తుంది. అతడు మాట్లాడుతూనే ఎదుటి వారిని సమ్మోహనపరచగలడన్నట్లు వుంటాడు.
    మహబూబ్ నగర్, కర్నూల్ , ఒంగోలు , గుంటూరు జిల్లాలు కలిపే శ్రీగిరి ప్రాంతం గురించి అతడు కొద్ది గంటలలోనే కొన్ని వివరాలు సేకరించాడు. అక్కడకు చాల దగ్గరలోనే నల్గొండ జిల్లా సరిహద్దులున్నాయి. దాదాపు అయిదు జిల్లాల సరిహద్దులకు కేంద్ర బిందువుగా కృష్ణ వేణి ప్రవహిస్తుంది కూడా.
    పరిమితమయిన, అత్యవసరమయిన వస్తువులతో కిట్టు తయారుచేశాడు జయకృష్ణ. జ్యోతి కిట్టు ఎనిమిదిన్నర కిలోల బరువుంది. తన కిట్టు పన్నెండు కిలోల బరువు వచ్చింది.
    అతడు కావాలనే ఆ పని చేశాడు.
    భుజాలకు పట్టీలు తగిలించుకుంటే కిట్టు వీపున వ్రేలాడుతోంది. రాళ్ళ మీద నడిచేప్పుడు నాడాలున్న మొరటు బూట్లు జారకుండా హాండ్ స్టిక్స్ సంపాయించాడు. నాలుగు అడుగుల పొడవున్నాయి. మహా జవంతు మాండవ్యం అన్నట్లు ముహూర్తాలతో పనిలేకుండా ఒక తెల్ల వారుజామున ఇద్దరూ కిట్లు తగిలించుకుని బయల్దేరారు. అంతకు ముందు రోజే జ్యోతి ప్రొఫెసర్ శ్రద్దాదేవి కి ఉత్తరం వ్రాసి పోస్టులో పడేసింది.
    "అమ్మా! నీ ఆశీస్సుల అండతో నేను క్షేమంగా ఉన్నాను. జయ కృష్ణ నాకు తోడూ నీడ అయినాడు. ఈరోజు తెల్లవారుఝామునే ప్రయాణం. తిరిగివస్తే తప్పక కలుస్తాను. ఒకవేళ అలా జరగనప్పుడు ఈ దీనురాలి గురించిన జ్ఞాపకాలను కనీసం కొంత కాలమైన మనసులోంచి చెరిగిపోనివ్వకండి" అని వ్రాసింది జ్యోతి.
    నాడాలు గుండ్రాళ్ళమీద కరకర శబ్దం చేస్తున్నాయి. రిజర్వాయరులో చేపల వేటకు తిరుగుతున్న సరంగుల పాటలు ఏటిగాలిలో గిరికీలు కొడుతూ ఒడ్డుకి చేరుతున్నాయి.
    పగలంతా ఏటిఒడ్డున కఠినతరమయిన కాలినడక ప్రయాణం కోన సాగించారు. చీకటి పడుతూ ఉండగా ఒక చదును అయిన చోటు చూసి "ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి" అన్నాడు జయకృష్ణ.
    ఆ మాట ఎప్పుడు అతని నోట వెంట వస్తుందా అని ఎదురు చూస్తూన్నట్లు జ్యోతి వెంటనే కిట్టులను దింపి ఉస్సురని నిట్టూర్చింది. ఏటిగాలిలో కాసేపు కూర్చున్న తరువాత ఆయాసం తగ్గినట్లు అయింది. రవంత ఉత్సాహం వచ్చినట్లయింది.
    జయకృష్ణ ఈలపాట పాడుకుంటూ ఎండు పుల్లలు ఏరి నిప్పు రగిలించి టీ పెట్టాడు. రవంత సేపు అయాక మరుగుతున్న టీతో పాటు ఒక రొట్టె, కొన్ని బిస్కెట్లూ జ్యోతికి అందించాడు.
    ఆమెకు అవి తీసుకున్న అయిదు నిముషాలకే గాడంగా నిద్రపట్టేసింది. రాళ్ళ మీద శరీరం ఒత్తుకుంటున్నా ఆమెకు తెలియలేదు. ఆదమరచి నిద్రపోయింది జ్యోతి.
    అర్ధరాత్రి అవుతూ వుండగా ఏదో చల్లని స్పర్శ తగిలినట్లు అయి ఉలికిపడి చూచిందామే. చివాలున లేచి కూర్చుంది.
    ఎదురుగా కన్పించిన దృశ్యం చూసి గుండె బేజారు అయిపొయింది. పాలనురుగులా, వెన్నెల తరగలా ధవళకాంతులీనుతున్న వస్త్రాలను ధరించి ప్రత్యక్షమయింది శ్వేతకి!
    ఆమె శరీరమంతా రక్తసిక్తమయి వుంది, పెదవుల మీదుగా పొడుచుకు వచ్చిన కోరల్నించి రక్తం స్రవిస్తోంది. రెండు చేతులలో రెండు  పెద్ద మాంసపు ,ముద్దులున్నాయి.
    జుట్టంతా విరపోసుకుని ఎర్రని కళ్ళతో భీకరంగా చూచిందామె జ్యోతి వంక!
    జ్యోతికి గుండెలు అవిసిపోయాయి. కనీసం అరిచెందుకయినా నోరు పెగలలేదు. పరుగేత్తెందుకు కాలూ చెయ్యి ఆడలేదు. నిలువుగ్రుడ్లు పడిపోయినాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS