Previous Page Next Page 
ఇదీ కధ! పేజి 24

 

    "ప్రొఫెసర్! మాధవి , వాళ్ళింట్లో దొంగలు పడి ప్రెషర్ కుక్కర్ ఎత్తుకు పోయిన రాత్రి ఇంటికి వచ్చిందని మీకు చెప్పాను గుర్తుందా? అర్ధరాత్రి దాటాక నా గది కిటికీ పక్కన మంత్రించిన బొమ్మలా కూర్చొని వున్న మాధవిని చూశాను . అప్పుడామె'....."
    "యస్! యస్! ఐ రిమెంబర్ ఇట్" సాగర్ మాటకి అడ్డొచ్చి అన్నాడు ప్రొఫెసర్.
    "అవును, నాకు గుర్తున్నది. నేనే అడగబోయే ప్రశ్న కూడా అదే! కుక్కర్ ఎత్తుకుపోయిన దొంగ తల్లీ తండ్రిని హత్య చేశాడని చెప్పింది కదూ?" కళ్ళజోడు పైనుంచి సాగర్ కేసి చూశాడు ప్రొఫెసర్ చంద్ర శేఖరం.
    "ఈ వంటవాడు అదే చేసి వుంటాడు!" దుర్భేధమైన రహస్యాన్ని బద్దలుకొట్టిన అనందం సాగర్ కళ్ళల్లో తొణికిసలాడింది.
    "ఎవరినీ? రామనాధం గారిని, అయన భార్యను హత్య చేసి వుండాలి'"
    'అవునవును! నో....నో....ప్రొఫెసర్' సాగర్ కంగారుపడ్డాడు.
    "మైడియర్ బాయ్! యూ ఆర్ యాన్ ఎంగ్ సైకాలజిస్ట్ ఇన్ మేకింగ్! నీ ఆలోచన, అన్యయం ఒక కోణం నుంచి చూస్తే కరెక్ట్ గానే అనిపిస్తుంది. వాస్తవికతకు దూరంగా ఉండే ఆలోచన అన్యయం వల్ల ప్రయోజనం శూన్యం . వెల్! లేట్ అజ్ నాట్ హర్రీ ఫర్ కంక్లూజన్స్!  మాధవిని ఇంకా అలా ఉంచడం ప్రమాదకరం. ఐ మస్ట్ వేక్ హర్ అప్ సూన్!" అంటూ ప్రొఫెసర్ చంద్రశేఖరం మాధవి పడుకొని వున్న బల్లమీదకు వంగాడు.
    "మాధవి ! చూడమ్మా!"
    "యస్ మిస్టర్ ప్రొఫెసర్!"
    "నో! నో! ఐ యాం సారీ! సునీతా?" ప్రొఫెసర్ కంగారుపడ్డాడు.
    "సునీతా! సునీత ఎవరండి?" మాధవి ఒళ్ళు విరుచుకుంటూ లేచి కూర్చున్నది.
    "ఓ! షి హేజ్  కమ్ అవుటాఫిట్!" ప్రొఫెసర్ గాభరాగా బుర్ర గోక్కున్నాడు.
    "సునీత ఎవరండి?" లాబ్ గదంతా కలియజూస్తూ అడిగింది మాధవి.
    ప్రొఫెసర్ చంద్ర శేఖరం, సాగరూ ఒకరు ముఖాలు ఒకరు చూసుకున్నారు.
    "మాధవీ! ఆర్ యూ అల్ రైట్ ?" అంటూ సాగర్ ముందుకొచ్చి మాధవి చెయ్యి పట్టుకున్నాడు.
    "నా కేమయిందంటావోయ్ సాగర్!" మాధవి సాగర్ భుజం ఆసరాగా పట్టుకొని బల్ల మీద నుంచి కిందకు దూకింది.
    ప్రొఫెసర్ చంద్ర శేఖరం సాగర్ భుజం వెనుక తట్టి ఆమెను ఇంకేమి అడగ వద్దన్నట్టుగా చూసాడు.
    "సాగర్! ఎవరా సునీతా!" దీర్ఘం తీస్తూ అడిగింది మాధవి . సాగర్ చెప్పాలో వద్దా అన్న మీమాంసలో పడి ప్రొఫెసర్ చంద్రశేఖరం కేసి చూశాడు.
    "ఏమిటలా మొహాలు చూసుకుంటారూ? ఈ గదిలో మనం ముగ్గురం తప్ప ఎవరూ లేరు. మరి ఈ సునీత ఎవరని పిలుస్తున్నారూ?" మాధవి ఇద్దర్ని ఎగాదిగా చూస్తూ అడిగింది.
    "ఆ సునీతంటే.....' తడబడ్డాడు.
    "ప్రొఫెసర్ గారి భార్యా?" మాధవి కళ్ళు తిప్పింది అర్ధమైనదన్నట్టు.
    "లేదు మా మేనకోడలు! సునీత మొన్ననే ఊరునుంచి వచ్చింది. సునీతను కాఫీ పట్టుకొని రమ్మని పిలుస్తున్నా! అదీ సంగతి' ప్రొఫెసర్ టవల్ తో ముఖానికి పట్టిన చెమటను తుడుచుకొన్నాడు. బ్రతికాం రా భగవంతుడా, అన్నట్టు సాగర్ నిట్టూర్చాడు.
    "మేనకోడలా? అదేవతండోయ్?" ప్రొఫెసర్ చేతిలో వున్న టవల్ కింద పడిపోయింది. ఉన్నపాటున ఒళ్ళంతా చెమటలు పట్టాయి.
    "మీకు చెల్లులు లేదు. నాకు తమ్ముడు లేడు. మీకు అక్కలేదు! నాకు అన్న లేడు! మరి మేనకోడలు ఎక్కడ్నుంచి వచ్చినట్టండీ!' ప్రొఫెసర్ గారి భార్య కళ్యాణి రంగప్రవేశం చేసింది. మాధవి అయోమయంగా చూసింది. ప్రొఫెసర్ దొంగకు తేలు కుట్టినట్టు ఉండిపోయాడు. సాగర్ కు ఏమి తోచక దిక్కులు చూడసాగాడు.
    "అయ్యో పాపం ! ఈయన గారికి కివ్వాళ నువ్వు దొరికావా తల్లీ!' అంటూ కళ్యాణీ మాధవిని సమీపించింది.
    "ఏమిటో ఈయన పరిశోధనలూ- ఈయననూ! మాములు వాళ్ళనే పిచ్చి వాళ్ళను చేస్తాడు. ఇహ పిచ్చి వాళ్ళను ఏం బాగు చేస్తాడమ్మా యీయానా? నన్ను చూడు తల్లి పిచ్చిదాన్ని చేసాడు యీ ప్రొఫెసర్ గారూ!"
    "నేను పిచ్చి దాన్ని కాదు. నేను బాగానే ఉన్నాను." ఇలాంటి ప్రొఫెసర్ దగ్గరికి తీసుకోచ్చాడెం సాగర్. ఆలోచించిన కొద్దీ మాధవికి మనసు వశం తప్పుతూ వున్నది. ప్రొఫెసర్ భార్య కళ్యాణీ మాధవి రెండు చేతులూ హటాత్తుగా పట్టుకొన్నది మాధవి ఉలిక్కిపడి బిత్తరచుపులు చూడసాగింది.
    "నీకు పిచ్చని ఎవరన్నారమ్మా! లక్ష్మి దేవిలా చూడముచ్చటగా వున్నావు. నీకు పిచ్చన్న వాళ్ళకు పిచ్చి గానీ! ఇంతకీ నీ పేరుమిటమ్మా?" కళ్యాణి గొంతు చాలా సౌమ్యంగా ఉన్నది. ఆమె పలకరింపులో ఆదరణా ఆప్యాయతా స్పురించాయి. మాధవి తేరుకుంది. కళ్యాణి కేసి పరిశీలనగా చూసింది. ఈ మనిషి ధోరణే ఇంతేనేమో అనుకొన్నది. ఈ ప్రొఫెసర్ గారి పరిశోధనలు - చికిత్సలు రోజూ చూస్తూ ఆమె విసిగి వేసరి పోయి ఉండొచ్చు! అందుకే ఆమె ఇలా తయారయిందేమో!
    "అమ్మా నీ పేరు చెప్పావు కాదు?"
    "మాధవి"
    "ఎంత మంచి పేరు! రూపానికి తగ్గ పేరు, అవునూ-' దీర్ఘం తీస్తూ ఓ క్షణం అలోచించి గిర్రున భర్త కేసి తిరిగింది కళ్యాణి.
    "సునీత! సునీతా! అని పిలుస్తున్నారు. ఈ అమ్మాయి తన పేరు మాధవి అని చెబుతున్నది. ఇంతకీ ఆ సునీత ఎవరండీ!' ప్రొఫెసర్ చంద్ర శేఖరాన్ని నిలదీసింది భార్య.
    "అవును అంటీ! అలా అడగండి! నేనూ అదే అడుగుతున్నాను."
    "ఏం చెప్పారూ?" అంటీ - అని పిలవగానే ఐస్ అయిపోయి మాధవి తల నిమురుతూ అడిగింది.
    "సునీతంటే ప్రొఫెసర్ గారి మేనకోడలనీ ఆమె వూరి నుంచి వచ్చి మీ ఇంట్లో ఇప్పుడు ఉన్నట్లు చెబుతున్నారు అంటీ వీళ్ళు" గాడంగా అన్నది మాధవి.
    "అన్నీ అభూత కల్పనలే తల్లీ! ఈయన మాటలు ఒక్కటీ నమ్మడానికీ వీల్లేదు. అదేం అంటే అదో ఎక్స్ పెరిమెంటు , పరిశోధన అంటారు. ఏ శాస్త్రం చదివారో గాని తల్లీ ఈయనతో కాపురం చేయడం వల్ల నాకు సగం మతి పోతుంది!"
    "నీకు సగం పోయిందేమో, నీతో వేగలేక నాకు. పూర్తిగా పోయింది" ప్రొఫెసర్ చిరాకు పడ్డాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS