Previous Page Next Page 
ది పార్టనర్ పేజి 24

 

    అసలు దీరజను ఈ జీవితంలో ఒకసారి అయినా తను చూస్తాడో లేదో -------కానీ ఆమె ఎదుటకు వెళ్ళే ధైర్యం తనకు లేదు ----చటుక్కున బీరువా తలుపులు మూశాడు. కాని తన హృదయ ఫలకం మీదతిష్ట వేసిన ధీరజను మరచిపోలేకపోతున్నాడు.

    
                                                           *    *    *

    విశాఖపట్నం -------
    సాయం సంధ్య వేళ.......
    సముద్రపు వొడ్డున.........
    ధీరజ కూర్చుని ఉన్న ఆ రాతి బండను వచ్చి డీ కొన్న సముద్ర కెరటాలు తమ శక్తి మేరకు వర్షపు జల్లులా నీటి తుంపర్లను ఆమెపై విరజిమ్ముతున్నా ఆమెలో చలనం లేదు.
    ఈ రాతి బండపైనే సునీల్ తో తను ఎన్నో సాయంత్రాలు గడిపింది.
    అసలు తను ఏమయి పోయాడో?
    యెక్కడ వున్నాడో / ఏం చేస్తున్నాడో?
    తనను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేని సునీల్ ఇన్ని సంవత్సరాలు తనను చూడకుండా కనీసం ఉత్తరమయినా రాయకుండా యెలా వుండగలిగాడు.
    ఎంత ఆలోచించినా ఆమెకు సమాధానం దొరకలేదు.
    తను హైదరాబాద్ ట్రయినింగ్ వెళ్ళేటప్పుడు అతను అన్న మాటలు ఇంకా తన చెవులలో మారుమోగుతూనే వున్నాయి.
    ఇద్దరి గమ్యాలు వేరు కాబోతున్నాయి కాబట్టి తనను మరచిపోమ్మని ఈ జన్మలో తనను పెళ్ళి చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పాడు."
    అతని మాటలకు అర్ధం ఏమిటో తను అప్పుడు అంత సీరియస్ గా ఆలోచించలేదు ఏదో కఠోర నిర్ణయం తీసుకుని ఆనాడు ఆవిధంగా మాట్టాడి నట్టు ఇప్పుడు అర్ధం ఆవుతుంది.
    ఈవిధంగా జరుగుతుందని అతనికి అప్పుడే తెలుసు అన్నమాట.
    గుండెను రాయిలా మార్చుకునెంటంత తప్పుగా తానేమీ ప్రవర్తించలేదు. వుద్యోగం కారణంగా తనను తిరస్కరించాడు అనుకోవడానికి వీల్లేదు.....ఇంకేదో కారణం వుంది.
    ఏమిటో అది.....!
    ఆమె నిర్లిప్తంగా లేచి నిలుచున్నది.
    తను వైజాగ్ వచ్చింది సీతాపతి కేసులో ఎంక్వయిరీ చేయడానికి .
    కానీ ఇక్కడకు వచ్చాక అనుక్షణమూ గడిచిపోయిన గతం తనను వెక్కిరిస్తున్నట్టుగా వుంది.
    ముందు లలితకు వున్న మగ స్నేహితులు ఎవరో తెలుసుకోవాలి.
    వైజాగ్ స్టేషన్ లో పాసింజర్ బయలుదేరడానికి ముందు లావాటి పీపాను ఎవరూ ఎక్కించలేదని రైల్వే కూలీలను, బెగ్గర్స్ ను వాజబు చేసి నిర్ధారించుకున్నది ధీరజ.
    అంటే సీతాపతి హత్య వైజాగ్ లో జరగలేదా? ఒకవేళ జరిగి వుంటే అనుమానం రాకుండా ఆ శవాన్ని వేరే స్టేషన్ కు తరలింఛి పీపాలో పెట్టి అక్కడ నుండి ట్రెయిన్ లోకి ఎక్కించి వుండాలి.
    ఆ రైల్వే స్టేషన్ ఏదో తెలుసుకోవాలి.
    తను చేయవలసిన రెండవ పని ఇది.
    కర్తవ్యం వెన్ను తట్టి హెచ్చరించడంతో జూన్ వొకటవ తేదీనాడు డ్యూటీలో వున్న గార్డు నోటు చేసిన వివరాలు వున్న రిజిస్టర్ చూడాలి.
    తను చేయవలసిన దర్యాప్తు నంతా చకచకా నోట్ చేసుకున్నది ధీరజ.
    ఇప్పుడు వైజాగ్ లో లలిత ఇంటిదగ్గరకు వెళ్ళి ఆమె స్నేహితులను గురించి ఎంక్వయిరీ చేయడమే మిగిలింది. అలా అనుకోవడంతో వెంటనే గాజువాక బయలుదేరింది.
    టైం అయిదు ముప్పయ్ అవుతుండగా లలిత వుండే ఇంటి దగ్గరలోని కిళ్ళీ బంకు ముందు ఆగి రెండు వీక్లీలు కొని వందరూపాయల నోటు యిచ్చింది.
    'చిల్లర లేదమ్మా...."
    "ఫరవాలేదు....అయిదు నిమిషాలు నిలుచుంటాను ఈలోపు చిల్లర వస్తుందిగా అప్పుడు యివ్వు" అన్నది ధీరజ చిరునవ్వుతో.
    కిల్లీ బంక్ వాడు వుబ్బితబ్బిబ్బు అయిపోయాడు.
    "ఇలా కూర్చోండమ్మా......" అంటూ లోపల వున్నా స్టూలును బయట వేశాడు.
    ధీరజ స్టూల్ మీద కూర్చున్నది.
    ఆమె వున్న చోటికి లలిత ఇల్లు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది.
    అప్పుడే అటోలో నుంచి దిగింది లలిత.
    ఆమె చేతిలో సరుకులు వున్న సంచులు వున్నాయి అంటే బజారుకు వెళ్ళి వస్తున్నదనుకుంది.
    ధీరజ ఆమెను నఖశిఖ పర్యంతం పరీక్షగా చూసింది.
    భర్త పోయిన దిగులు మచ్చుకు అయినా ఆమె ముఖంలో కనిపించడం లేదు.
    "ఆమె పేరూ లలితా కదూ...."
    ధీరజ ఏమీ తెలియనట్టూ ప్రశ్నించింది.
    "అవునండీ.....వాళ్ళ అయన కనిపించడం లేదు!"
    "ఏమయి వుంటాడు"
    "పోలీసులకు చెప్పడమయితే ఇంటిలో నుంచి వెళ్ళిపోయాడు అని.....కానీ నిజానికి ఆమె అడ్డు తొలగించుకుని వుంటుంది....." గొప్ప రహస్యం చెబుతున్నట్టు మెల్లగా చెప్పాడతను.
    "అదేమిటీ?" పేపర్లలో ఇంకేదో వ్రాశారుగా?"
    "ఆ ----వాళ్ళకేం తెలుసు మేడమ్! పాపం పుణ్యాత్ముడు. బ్రతికినంత కాలం ఆమె వేపుకు తింటూనే వుంది. అమెగారికి లేని అలవాటు లేదు. ఎప్పుడూ రెగ్యులర్ గా ఇంటికి వచ్చిపోయే మగవాళ్ళు నలుగురు వున్నారు. ఒకతను ఎర్రగా బుర్రగా వుంటాడు. అతని పేరు ఏదో వుంది మూడు అక్షరాలు పేరు. పేరు ఏమిటో గుర్తు;లేదు.
    "మిగిలిన ముగ్గురిలో ఒకడు ఈ గాజువాకలోనే చిన్న మోస్తరు రౌడీ.... పేరు జానీవాకర్. మిగిలిన ఇద్దరిలో ఒకడు మెకానిక్ షాపులో పని చేస్తుంటాడు. ఇంకొకడు హోం గార్డు. నలుగురితో రంకు చేస్తుందని తెలిసి కూడా సీతాపతి పాపం కిమ్మనేవాడు కాదు!"
    తను ప్రత్యేకించి అడగకుండానే విషయం మొత్తం అతని నోటి వెంట వినడంతో ధీరజ అనుమానం లలితపైనే నిలిచిపోయింది.
    కానీ అతను చంపబడిన రోజు రాధాదేవి కూడా వైజాగ్ లోనే వుందనీ, ఆరోజు ఉదయం అతనిని కలిసిందని తెలియడంతో ఆమెను అనుమానించకుండా వుండలేకపోతున్నది.
    ఒకవేళ లలితను హత్య చేయకపోయినా తన కోసం వచ్చే ఆ నలుగురిలో ఎవరో ఒకరి చేత చంపించడానికి అవకాశం వుంది.
    సో..... ఆ నలుగురూ ఆరోజు ఎక్కడ వున్నారో .... అసలు వాళ్ళ క్యారెక్టర్స్ ఏమిటో ముందు తేల్చుకోవాలి.
    అంటే, తను ఈ వైజాగ్ లోనే ఇంకొక రెండు రోజులయినా ఉండవలసి రావచ్చు.
    "ఇదిగో అమ్మా చిల్లర తీసుకోండి."
    చిల్లర అందుకుని అక్కడకు దగ్గరలోనే కనిపిస్తున్న ఎస్. టి.డి. బూతు లోకి వెళ్ళి డి.ఎస్. పి. తో మాట్లాడి ఇన్ వెస్టిగేషన్ ప్రోగ్రెస్ వివరించింది.
    ధీరజ అడుగులు వేస్తున్నదన్న మాటే గానీ ఆమె మనస్సు ఎక్కడో వున్నది.
    తను ఇక్కడే ఇంకొక రెండు రోజులు వుంటాను అనే ఊహకీ ఆమె అంతరంగం ఆనందంతో యెగిరి గంతులు వేస్తోంది.
    కారణం ...ఈలోపు సునీల్ ఎక్కడ ఉన్నాడో! ఏం చేస్తున్నాడో తను తెలుసుకుంటుంది.
    రెట్టించిన వుత్సాహంతో ధీరజ అడుగులు వేస్తున్నది.
    

                                                             *    *    *

    కాలింగ్ బెల్ మోగింది.
    సునీల్ తలుపు తీశాడు.
    ఎదురుగా రమణి.
    ఆమెను చూడడంతో అతని కళ్ళలో కలవరం.
    "ఏమిటలా చూస్తున్నావు. నీ ఇల్లు వెదుక్కుంటూ వచ్చాననా? లేక ఇంతకాలం తరువాత ఇలా వస్తున్నాను ఏమిటా అనా మైడియర్ ప్లే బోయ్"
    ఏయ్ రమణీ ! ఏమిటా పిలుపు"
    "గొంగళి పురుగు దశ నుంచి సీతా కోక చిలుక అవతారం ఎత్తావు అన్నమాట. నువ్వు ప్లే బోయ్ నని నాకు తెలుసు ....... బుకాయించడం మానెయ్యి ముందు నన్ను లోపలకు రానిస్తావా లేదా? నీతో మాట్లాడవలసింది చాలా వుంది."
    మౌనంగా అడ్డు తప్పుకున్నాడు సునీల్.
    రమణి వయ్యారాన్ని పలికిస్తూ వచ్చి సోఫాలో కూర్చుంది.
    "నీకు గుర్తుందా సునీల్ నువ్వంటే నాకు విపరీతమయిన మోజు వుండేది ఆరోజులు నువ్వు మరచిపోయినా నేను మరచిపోలేదులే కలిసి ఎన్ని సినిమాలు చూశామో, ఎన్ని రాత్రులు గడిపామో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో.
    "ఇప్పుడు అవన్నీ ఎందుకు రమణీ"
    "నీకు అవసరం లేకపోయినా నాకు కావాలి. ముందు వచ్చిన చెవుల కన్నా వెనుక వచ్చే కొమ్ములు వాడి అనే సామెత నిజం చేశావు కదూ?" రమణి అక్కసుగా అన్నది.
    "అంటే?"
    "అదేనోయ్ అసలు లలితకన్నా ముందునుంచే మన ఇద్దరికీ పరిచయం వుంది. ఆ విషయం ఆమెకు తెలియకుండా నేను ఎవరో అసలు తెలియనట్టే ప్రవర్తించావు. అదీ మంచిదేనని నేనూ మౌనం వహించాను తరువాత నువ్వు చేసింది ఏమిటి ..... పూర్తిగా ఆ అందగత్తె మోజులోపడి నన్ను నిర్లక్ష్యం చేశావు. నేను దగ్గరలో వుంటే మీ సుఖానికి ఎక్కడ అడ్డుగా వుంటానో అని ఆ రంకులాడి నన్ను తన ఇల్లు ఖాళీ చేయించి దూరంగా పంపింది. దాని దగ్గిర ఏం చూసి నువ్వు దానికి బానిసై పోయావో నాకు అర్ధం కాలేదు ....అది సరేగానీ నీ ప్రియమయిన లలిత ఇంటికి పోలీసులు వచ్చి వెళ్ళారు. ఆ విషయం నీకు తెలియకుండా ఉండదనుకో ఎందుకో తెలుసుకోవచ్చా నేను?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS