Previous Page Next Page 
మరో కర్ణుడి కథ పేజి 24


    మరో స్త్రీ బోనులోనికి వచ్చింది.


    ఆమె వయసు దాదాపు నలభై సంవత్సరాలు వుంటాయి.


    ఎందుకో ఆమె వేషం చూడగానే శరత్ కు వెగటనిపించింది.


    "ప్రొసీడ్" జడ్జి అన్నారు.


    "నీ పేరు?"


    "అనసూయ."


    శరత్ ముసిముసిగా నవ్వుకున్నాడు.


    ఈ దేశంలో వాళ్ళకు పతివ్రతల పేర్లంటే ఎందుకో అంత మోజు?


    "ఏం బాబూ! అలా నవ్వుకుంటున్నావ్? మాబతుకులు చూస్తుంటే నవ్వొస్తుందా? సిగ్గువెయ్యడం లేదూ? మేము ఇలా కావడానికి ఎవరు కారణం?"


    శరత్ చివ్వున తలెత్తి ఆమె ముఖంలోకి చూశాడు.


    ఆమెను తను ప్రశ్నించాలి! కాని ఆమే తనను ప్రశ్నించింది. కాని ప్రశ్నకు సమాధానం తను ఇవ్వగలడా?


    శరత్ సిగ్గుతో తలదించుకున్నాడు.


    "నీ గురించి చెప్పు!"


    శరత్ ఎలాగో అనగలిగాడు.


    "నా గురించి చెప్పడానికేముంది బాబూ? నేనేం గొప్ప పనులు చెయ్యలేదు."


    "అడిగినదానికి సరిగా సమాధానం చెప్పాలమ్మా."


    తెలియకుండానే శరత్ ఆమెను గౌరవంగా సంబోధించాడు.


    "అమ్మా!" తనలో తనే గొణుక్కుంది మళ్ళీ చెప్పసాగింది. నా కథ.... మామూలే. తెలిసీ తెలియని వయసులో కాలు జారిన నన్ను నమ్మినవాడు మోసగించాడు. పిల్లవాణ్ణి రహస్యంగా కన్నాను. నా బిడ్డను తల్లిదండ్రులు ఏం చేశారో నాకు తెలియదు నాకు పెళ్ళి చేశారు. రహస్యాన్ని దాచిపెట్టి - ఇలాంటివి ఎంతకాలం దాగుతాయి. నా భర్తకు తెలిసింది నన్ను అడిగితే నిజమేనని ఒప్పుకున్నాను. నాకు ఆ ఇంట్లో స్థానం పోయింది. ఆ యింటి తలుపులు శాశ్వతంగా మూసుకున్నాయి. పుట్టింటికి వెళ్తే నాలాంటి ఆడదానికి ఎటువంటి స్థానం లభిస్తుందో కూడా నాకు తెలుసు. అందుకే వంటరిగా నడి బజారులోకి వచ్చాను నాకు చదువులేదు. కాయ కష్టంచేసి పొట్టపోసుకుందామనుకున్నాను. గౌరవంగానే బతకాలనుకున్నాను. అది అనుకున్నంత తేలికకాదని అనుభవంతో తెలుసుకున్నాను. ఆ తర్వాత కాశింఖాన్ చేతుల్లో పడ్డాను యింతకంటే చెప్పేదేమీలేదు.


    శరత్ గుండెలు దడదడలాడాయి.


    "నీ కొడుకు ఎక్కడ పెరుగుతున్నాడో తెలుసా?"


    "తెలియదు. అనాథ శరణాలయం నుంచి పిల్లలు లేని వారెవరో తీసుకెళ్ళారట."


    "ఆ అబ్బాయికి చెవుకింద పెద్ద పుట్టుమచ్చ వుందా?


    ఆ స్త్రీ శరత్ ముఖంలోకి ఆశ్చర్యంగా చూసింది.


    "మీకెలా తెలుసు?" ఆశ్చర్యంగా ప్రశ్నించింది.


    "అమ్మా! నేనేనమ్మా నీ కొడుకును." గట్టిగా అరవాలనుకున్నాడు గొంతుకు ఏదో అడ్డుపడింది.     


    ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు.


    గొంతు పెగల్చుకోవడానికి తల విదిలించాడు.


    శరత్ కు మెలుకువ వచ్చింది.


                          *    *    *


    ఇది కూడా కలేనా?


    "ఏమిటి ఈ పిచ్చి కలలు?


    తన కన్నతల్లి ఇటువంటి హీనస్థితికి దిగజారి వుండదు. ఎక్కడో గౌరవంగా బతుకుతూ వుండి వుంటుంది.


    ఆ కల ఇంకా వాస్తవంగా కళ్ళముందు కన్పిస్తూనే వుంది.


    కలలో చూసిన స్త్రీ మూర్తిమాత్రం కదిలిపోయిన ఫోటో గ్రాఫ్ మసకగా వుంది.


    కళ్ళు మూసుకుని నిద్రపోవడానికి ప్రయత్నించసాగాడు.


    తెలతెలవారుతుండగా నిద్రలోకి జారిపోయాడు.


                                                    *    *    *


    ఇంటిముందు తాటాకుల పందిరి.


    మంగళవాద్యాలు మ్రోగుతున్నాయి.


    విద్యుద్దీపాల వెలుగులో ఆడవాళ్ళు పట్టుచీరల్లో, రకరకాల నగల్లో మెరిసిపోతున్నారు. ఆడవాళ్ళంతా ఒక ప్రక్కగా కూర్చున్నారు.


    మగవారు వివాహమండపం ఎదురుగా కూర్చున్నారు.


    శరత్ పందిట్లో వెనకవరసలో గుంజకు ఆనుకొని నిలబడి వున్నాడు.


    వివాహమండపంకేసి రెప్పవాల్చకుండా చూస్తున్నాడు.


    వధూవరులు కూర్చున్నారు.


    వధువు తల్లిదండ్రులూ, వరుడి తల్లిదండ్రులూ కూడా పీటలమీద కూర్చుని వున్నారు.


    కన్యాదానం జరుగుతూ వుంది.


    వధువు తల్లికేసే కన్నార్పకుండా చూస్తున్నాడు శరత్.


    ఆమె శరీరం పచ్చగా వుంది.


    కొంచెం బొద్దుగా పట్టుచీరలో, మెడ తిరగని నగలతో లక్ష్మీదేవిలా నిండుగా వుంది.


    ఆమేనా తన తల్లి?


    ఆ పెళ్ళికూతురు తన చెల్లెలా? ఎంత ముద్దుగా వుందో!


    కొందరు యువకులు పందిట్లో తిరుగుతున్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS