Previous Page Next Page 
విష్ణు విలాసిని పేజి 24

    "సర్వం ఖల్విదం బ్రహ్మ అని మామూలు వారికి కూడా అర్థమయ్యేట్టు చెప్పాడమ్మా అన్నమాచార్యులు ఈ కీర్తనలో. బ్రాహ్మణుడు, అంటరానివాడు, కుక్క, ఏనుగు, రాజు, బంటు అనే తేడాలు లేవు. అందరిలోనూ అంతరాత్మగా ఉన్నది శ్రీహరి ఒక్కడే" అని అర్థం.
    "అంటే శరీరాలు ఎన్ని ఉన్నా, వాటన్నింటిలో ఉండేది పరమాత్మ ఒక్కడే అన్నమాట"
    "నువ్వు సరిగ్గా అర్థంచేసుకున్నావు. అన్ని శరీరాలూ, నిజానికి ఈ సృష్టి అంతా ఆ పరమాత్మ వ్యక్త స్వరూపమే"
    "అంటే భగవంతుడు కానిదేదీ ఈ లోకంలో లేదనేగా!"
    "అంతే! సరిగ్గా అంతే!"
    "అన్నింటినీ అందరినీ దైవంగా చూడాలంటావు"
    ఔనన్నట్టు తల ఊపింది వెంకమాంబ.
    "మరి వెంకటాచలపతిలో, మీ అత్తవారిలో దైవం లేడా? వాళ్ళు దైవస్వరూపులు కారా?"
    "వాళ్ళనీ గౌరవిస్తున్నానుకదా!"
    "ఆదరించాలికూడా!"
    "... ... ..."
    "పేచీ పెట్టకుండా కాపురానికి వెళ్ళాలి. నీ భర్తలోను, సంసారజీవితంలోనూ కూడా నీ ఇష్టదైవాన్ని దర్శించటం అభ్యాసం చెయ్యి. పెద్దలమాట వినమని, ఒద్దికగా నడుచుకోమని నీ మిత్రుడు చెప్పలేదా?" - ఈ మాటలంటున్నప్పుడు మంగమాంబ గొంతులో తొణికిన ఆర్ద్రత వెంకమాంబని వివశురాలిని చేసింది. మౌనంగా తల వంచుకుంది. తన ముఖంలోకే చూస్తున్న తన ప్రియమిత్రుని నవ్వుముఖం సేదదీర్చింది. అంతా దైవలీల అనుకుంది.
    "నీ కడుపున పుడతా" నంటూ నాయనమ్మ, భార్య పునిస్త్రీగా వెళ్ళిపోవాలని ఎదురుచూసిన తాతగారు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయారు. వెంకమాంబ మంచి సన్నిహితులని కోల్పోయింది.
    కాలం ఆగదుకదా!
                                                           * * *
    అనుకున్న ముహూర్తానికి అన్ని ఏర్పాట్లు శాస్త్రోక్తంగా జరిగిపోయాయి. వెంకమాంబ ముఖంలో ఉత్సాహంకాని, చిరాకు కాని, సంతోషంకాని, కోపంగాని ఏమీ లేవు. నిర్లిప్తంగా ఉంది. స్వప్నావిష్టురాలిగా యాంత్రికంగా ఎవరేం చెపితే అది చేస్తోంది. అందరి ముఖాలూ తన ప్రియమిత్రుడిలాగానే ఉన్నాయి. పగలంతా వైదిక కర్మలు నడిచాయి. పొద్దువాటారిన తరవాత హడావుడి అంతా అమ్మలక్కలది. వెంకమాంబ విషయంలో మరింత కుతూహలం. అలంకారం చేస్తున్నారు. పరిహాసం చేస్తున్నారు. ఎన్నో రసరమ్య రహస్యాలు చెపుతున్నారు. ఎంతటి పెద్దవాళ్ళూకూడా కొత్త పెళ్ళికూతుళ్ళలాగా మారిపోయి సిగ్గు పడుతూను, సిగ్గు విడిచీ కూడా మాట్లాడుతున్నారు. ఇంతటి సంభ్రమంలో తనకేమీ పట్టనట్టు ఉండిపోయింది ఒక్క వెంకమాంబ మాత్రమే.  
    వేంకటాచలపతి ఉదయం కార్యక్రమాలు మొదలు పెట్టినప్పటినుండి ఈ లోకంలో లేడు. మరేదో లోకంలో ఉన్నాడు. తన పక్కన వెంకమాంబ పీటలమీద కూర్చున్నప్పటినుండి ఏదో అయస్కాంత క్షేత్రంలో ఉన్న అనుభూతి. తనుతనుకాడు, పోనీ, తనెవరో తెలియటం లేదు. ఆ స్థితి తనకి ఆనందమే కలిగిస్తోంది. అది చాలానే తృప్తి కలుగుతోంది. ముఖంలో కనపడుతున్న ఆ సంతోషాన్ని చూసే వాళ్ళు మరొక రకంగా అర్థం చేసుకున్నారు. అది సహజమే!
    వరసయినవాళ్ళ వేళాకోళాలు, పరిహాసాలు, సలహాలు, ఏవీ వేంకటాచలపతిని కదిలించలేక పోయాయి. తన సహచరితో భౌతిక సాన్నిహిత్యం కలుగబోతోందని మాత్రం అంతరాంతరాలలో ఎక్కడో ఒక ఊహ మెదులుతోంది అంతే!
    ఎదురుచూపులోని ఆనందం అనుభవిస్తున్నాడు. వెంకమాంబను అమ్మలక్కలు శోభనపుగదిలో ప్రవేశపెట్టి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. వెంకమాంబ తన ప్రాణ మిత్రుడిని తలచుకుంటూ నిలబడింది. ఆమెను తనివితీరా చూచి సౌందర్యాన్ని ఆరాధించాలని ఎదురుచూస్తున్న వేంకటాచలపతికి సర్వాలంకార శోభితురాలై నిలబడి ఉన్న భార్య సాక్షాత్ తమ కులదైవం చౌడేశ్వరీ దేవిలాగా కనిపించింది. వెన్నెముక మూలం నుండి ఏదో విద్యుత్తు జరజరా పైకి పాకినట్టనిపించింది. కన్నులు మిరుమిట్లు గొలిపి మూతపడ్డాయి. శరీరం ఆ ఆనందోద్వేగాన్ని తట్టుకోలేక గజగజా వణికింది. అప్రయత్నంగా మంచం పైనుండిలేచి భార్య పాదాలకి ప్రణమిల్లి,
    "తల్లీ! ఇన్నాళ్ళకి కరుణించావా? ఈ దీనుడిపై ఇంతకాలానికి దయగలిగిందా? ధన్యుడిని తల్లీ! ధన్యుడిని" అంటూ ఉండిపోయాడు.
    'ఇతరులతో ఎంత చెప్పినా లాభం లేకపోయింది. ఈ వేంకటాచలపతితోనైనా తన మనసు విప్పి చెప్పి ఒప్పిద్దాం. ఆపైన దైవేచ్చ ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంద'ని అనుకుంటూ వచ్చిన వెంకమాంబకి ఆశ్చర్యం కలిగింది వేంకటాచలపతి ప్రవర్తన.
    వెంటనే తన కాళ్ళని వెనక్కి లాక్కుంది. అతనిని లెమ్మని మంచంపై కూర్చోమని అతడి పాదాలకి తానే నమస్కరించింది.
    "నాకన్నా పెద్దవారు, నాకు నమస్కరించకూడదు. తప్పేదయినా ఉంటే దండించండి. నేను మీకు నచ్చలేదు, నేనంటే ఇష్టంలేదు అంటారా సంతోషం."
    వేంకటాచలపతి ఇంకా మామూలు స్థితికి రాలేదు. వెంగమాంబ తాను చెప్పదలచుకున్నది చెప్పుకు పోతోంది.
    "మీరూ అన్ని శాస్త్రాలూ చదివిన పండితులని విన్నాను. ప్రాజ్ఞులు, విజ్ఞులు అని అనుకుంటున్నాను."
    వేంకటాచలపతి అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు.
    "నేను భూమిమీద పడకముందు నుండీ శ్రీనివాసుని సొత్తుని. దైవం సొత్తుని ఇంకొకరు ఆశించరుకదా! అది పాపం. ఆ సంగతి ఎంత చెప్పినా మన పెద్దలకు అర్థం కాలేదు. నన్ను భార్యగా చూసి తప్పుచేయకండి. మీకు భార్యగా మెలగలేని నన్ను క్షమించండి. భగవంతునికి సర్వసమర్పణ చేసుకున్న ఒక భక్తురాలిగా భావించి, మీకు ఇబ్బంది కలిగించినందుకు మన్నించండి. మీనామ సామ్యంవల్ల ఇంతవరకు జరిగిన తంతుకి అవకాశం లభించింది. ఇరువురం కలిసి ఆ స్వామిని సేవించుకుందాం. వేంకటేశ్వరుని సేవలో సహచరులుగా జీవితాన్ని పండించుకుందాం. జన్మని తరింపచేసుకుందాం."
    వేంకటాచలపతికి ఆ మాటలు అర్థమవుతున్నట్టే ఉన్నాయి. అవన్నీ బయటి నుండి కాక తనలోనుండే వినపడుతున్నట్టున్నాయి. తన మాటలే తను వింటున్నట్టు తన గుండెచప్పుడే మాటలుగా మారినట్టు తన మనోభావాలే తన అర్థాంగి ప్రకటిస్తున్నట్టు, తన మనస్సు తనకే అద్దంలో కనబడుతున్నట్టు...అనిపించింది.
    "ఈ పాంచభౌతిక శరీరం అశాశ్వతం. దాని సహాయంతో శాశ్వతమైన దానిని పొందాలి. దుర్లభమైన మానవ జన్మని సద్వినియోగం చేసుకుని, జన్మని సార్థకం చేసుకోవాలి."
    "నిజమేగా" అనుకున్నాడు వేంకటాచలపతి. ఇంకా మాటడగలిగే స్థితిలో లేడు.
    "జీవాత్మలన్నీ ప్రకృతిలో భాగం కనక స్త్రీలు. ప్రకృతికి అధిపతి అయిన పరమాత్మ మాత్రమే జీవాత్మలన్నిటికి అధిపతి, ప్రాణేశ్వరుడు, భర్త. పురుషోత్తము డొక్కడే పురుషుడు. మనందరికీ నాధుడు వేంకటనాధుడే. మనమంతా అక్కచెల్లెళ్ళమే"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS