Previous Page Next Page 
ప్రార్థన పేజి 24


    ఐసి-4 మిగతా ఆస్పత్రికి దూరంగా వుంది. పొడవైన వరండా ఎంత నడిచినా తరగటం లేదు. అతడు ముందుకు నడిచి, ఒక సెల్ ముందు ఆగాడు.

 

    ఆ గదిలో ప్రార్థన వుంది. కళ్ళు తెరిచే పైకప్పుకేసి చూస్తూ వుంది.

 

    తన కూతుర్ని చూడగానే అతడి గుండె లోతుల్లోంచి ఆప్యాయత పొంగిపొర్లింది. అప్పటివరకూ వున్న కోపమూ, కసీ పోయి- వాటి స్థానే జాలీ, వేదనా నిండుకున్నాయి. క్రితం రోజు యిదే సమయానికి తనకోసం బుట్టెడు మల్లెపూలని గదిలోకి దొంగతనంగా చేరవేసి దారాల్తో మాలకట్టిన పాప ఇరవై నాలుగు గంటల్లో పూలమధ్య పడుకుని వెళ్లిపోవటానికి ఆయత్తమవుతూంది. పూవులాగా రాలిపోతూంది. ఈ భావం రాగానే అప్పటివరకూ తమాయించుకున్నవాడు ఇక ఆపుకోలేక ఒక్క అడుగులో మంచం దగ్గరికి వెళ్ళి కూతుర్ని కౌగిలించుకున్నాడు. ఆమెకూడా దానికోసమే చూస్తున్నట్టూ చప్పున అతడి మెడచుట్టూ చేతులు వేసి జాలిగా 'నాన్నా' అంది. ఆ ఒక్క పదంలోనూ- "చూసేవా నాన్నా! నువ్వు లేనప్పుడు వీళ్లంతా కలిసి నన్నేంచేసేరో" అన్న భావం వుంది. అతడు వెంటనే మాట్లాడలేదు. గుండెల్లోంచి ఉబికి ఉబికి వచ్చే వేదనని కనపడనివ్వకుండా తమాయించుకోవటం కోసం ఏదో పనివున్నట్టూ ఆమె తలదగ్గిర దిండు సర్దే నెపంమీద తల తిప్పుకున్నాడు. అలా కొద్దిక్షణాలు వుండి నెమ్మదిగా తలెత్తాడు. తెల్లగా పాలిపోయిన కూతురి మొహంమీద పట్టుకుచ్చులా పడుతున్న జుట్టుని వెనక్కితోసి నుదుటిని చుంబించి "ఎలావుంది పన్నూ" అని అడిగాడు.

 

    ప్రార్థన వెంటనే జవాబు ఇవ్వలేదు. వదిలేస్తే తండ్రి ఎక్కడ వెళ్ళిపోతాడో అన్నట్టుగా అతడి చెయ్యి గట్టిగా పట్టుకుని "నాన్నా- నిజమేనా" అని అడిగింది.

 

    అతడి గుండె ఒక్కక్షణం ఆగిపోయినట్టయింది. "ఏ... ఏదమ్మా?" అని అడిగాడు.

 

    "నేను ఈ రాత్రి కూడా ఇక్కడే వుండాల్ట" ఫిర్యాదు చేస్తున్నట్టూ అన్నది.

 

    "అవునమ్మా".

 

    "ఊహు, నేనిక్కడ వుండను డాడీ"

 

    "ఎంతమ్మా! ఒక్కసారి కళ్ళు మూసుకుంటే చాలు ... తెల్లారి పోతుంది"

 

    "కానీ స్కూలు కెళ్ళకపోతే ఎలా డాడీ? వచ్చేనెలే పరీక్షలు కూడా! నేను బానే వున్నాను కదా".

 

    "ఎంతమ్మా, ఇంకా రెండు పరీక్షలు చేసి వదిలేస్తారు".

 

    అతడికి ఆ వర్షంరోజు ప్రార్థనని వసుమతి పిక్నిక్ కి తీసుకువెళ్ళినప్పటి సంగతి గుర్తొచ్చింది. ఆ పబ్లిక్ హెల్త్ సెంటర్ లో డాక్టర్ ని దబాయించాయి. టాన్సిల్స్ అని చూడకుండా మలేరియాకి మందిచ్చినందుకు.... ! మరి తను చేసింది ఏమిటి? కేన్సర్ ఇన్ స్టిట్యూట్ లో పనిచేస్తూ కళ్ళముందు తిరుగుతున్న పాపకి కేన్సర్ అని గుర్తించలేకపోయాడు.

 

    అతడు పాప చేతిద్వారా ఎక్కించబడుతూన్న ద్రవం వున్న బాటిల్ వైపు చూశాడు.

 

    ప్లేట్ లెట్స్. (కొత్తరకం)

 

    అతడు కూతురి శరీరంమీద చెయ్యివేసి, ఆప్యాయంగా నిమిరాడు. లోపలికి ప్రవహిస్తున్న ప్లేట్ లెట్స్ ఏమీ సాధించలేవని అతడికి తెలుసు! ఈ శరీరంలో, తను వేసిన చెయ్యి క్రింద వడివడిగా ప్రవహించే రక్తంలో వున్న వేల వేల నిర్జీవ తెల్లకణాలు క్షణక్షణానికి అభివృద్ధి చెందుతూ వేగంగా పెరిగిపోతూ, ఏమైనా కొద్దిగా 'మంచి' ప్లేట్ లెట్స్ వుంటే వాటిని కూడా చంపేస్తున్నాయని తెలుసు!! పాపని రక్షించటానికి ప్రయత్నం చేసే ప్లేట్ లెట్స్ నిస్సహాయంగా ఆ పోరాటంలో మరణిస్తున్నాయని తెలుసు!!! మనిషికి కేన్సర్ గురించి అంతా తెలుసు, రాకుండా నిరోధించడమే తెలీదు.

 

    ప్లేట్ లెట్స్ కాక ఇంకా ఏం వాడుతున్నారా అని అతడు తల తిప్పి చూసేడు. గోడదగ్గర వున్న బల్లమీద మూడుసీసాలు వున్నాయి.

 

    అతడు కూతుర్ని వదిలి బల్ల దగ్గరకు నడిచాడు. చిన్న ఇంజక్షన్ బాటిల్ లో వున్న ఆ సీసాని చేతిలోకి తీసుకుని దానిమీద వున్న పేరు చూసేడు.

 

    కేన్స్ క్యూర్!

 

    భరించలేని నిస్సహాయతతోనూ, ఉక్రోషంతోనూ, అతడి మొహం కందిపోయింది. అలాగే మరో క్షణంవుండివుంటే ఏమయ్యేదో తెలీదు. కానీ- వెనుకనుంచి 'హల్లో' అని వినిపించింది.

 

    గుమ్మం దగ్గిర మహేంద్రజైన్ నిలబడి వున్నాడు. దేశంలో కెల్లా గొప్ప కేన్సర్ స్పెషలిస్టు అతడు- చూడటానికి గమ్మత్తుగా వున్నాడు. కొద్దిగా పొట్టిగా, గుండ్రంగా వున్నాడు. కళ్ళు చిన్నవైనా చురుగ్గా వున్నాయి. నుదురు మాత్రం విశాలంగా వుండి, తెలివితేటల్ని సూచిస్తుంది. ఏ రోగికైనా అతడిని చూస్తే ధైర్యం, నమ్మకం కలుగుతాయి. కానీ బైటచూస్తే మాత్రం ఎవరూ అతడిని డాక్టరు అనుకోరు. మిఠాయిషాపు యజమాని అనుకుంటారు. కేన్సర్ రంగంలో అతడు చేసిన కృషి అపూర్వం అని చెప్పుకుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో వచ్చే లింఫోసైటిక్ లుకేమియాని నిరోధించటంలో అతడు అగ్రగామి.

 

    మహేంద్రజైన్ ని చూడగానే భార్గవ బైటకి వచ్చాడు. పాప ముందు ఏమీ మాట్లాడటం అతడి కిష్టంలేదు. వాళ్ళిద్దరూ బైటికి వస్తూంటే వసుమతి కూడా రావటం కనిపించింది.

 

    "భార్గవా" అన్నాడు డాక్టర్ మహేంద్ర. "కూతురి అనారోగ్యం గురించి మాకు ఎంత తెలుసో, ఈ ఫీల్డులోనే వున్నారు కాబట్టి మీకూ అంతే తెలుసు. మనం చెయ్యగలిగినంతా చేద్దాం".

 

    భార్గవ విసుగ్గా "ఏమిటి మీరు చెయ్యగలిగింది?" అని అడిగాడు. అతడు అలా అడిగేసరికి మహేంద్ర ఉలిక్కిపడి చూసేడు. వసుమతికి భర్త ప్రవర్తన అర్థం కాలేదు. దేనికైనా ఒక లిమిట్ వుంది. అసలీ రోగాన్ని డాక్టర్లే సృష్టించారన్నట్టూ ప్రవర్తిస్తున్నాడు అతడు.

 

    "నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు మీరు" రెట్టించాడు భార్గవ.

 

    "వెల్" అన్నాడు మహేంద్ర. "ముందు మనం కెమోథెరపీ (మందులు ద్వారా పాపలో క్షణక్షణానికి పెరిగిపోతున్న తెల్లకణాల్ని నిరోధించాలి".

 

    భార్గవే అన్నాడు. "నాకేమీ తెలీదనుకొని, నేనూ ఒక మామూలు తండ్రి అనుకొని సమాధానం చెప్పండి. కెమోథెరపీలో మీరు వాడేది ఏమిటి?"

 

    "ఏముంది భార్గవా! మన దేశంలోకెల్లా అత్యంత ప్రతిభావంతమైన మందు - కేన్స్ క్యూర్".

 

    భార్గవ అతడివైపు సూటిగా చూసి "దాని సైడ్ అఫెక్టు గురించి అడుగుతున్నాను నేను. మీరు చెప్పలేకపోతే నేను చెప్తాను వినండి. మీరు శరీరంలోకి పంపించే మందు కేవలం కేన్సర్ కణాన్ని మాత్రమే చంపి వూరుకోదు. అది గుండెనీ కాలేయాన్నీ కూడా తినటం ప్రారంభిస్తుంది. దాంతో పేషెంటు జుట్టు వూడిపోతుంది. వీటన్నిటికన్నా ముఖ్యమైనది .... 'బాధ'. మీరు కేన్సర్ నిరోధానికి మందు ఎక్కిస్తున్నకొద్దీ ఆ శరీరం బాధతో విలవిల లాడిపోతుంది. ఆ నరకయాతన శత్రువులకి కూడా వద్దు అనేలా వంకర్లు తిరిగిపోతుంది. పోనీ ఇదంతా చేసిన తరువాత అయినా పాప బ్రతుకుతుందా అంటే... చెప్పండి డాక్టర్! కెమోథెరపీవల్ల ఎంతమంది పేషెంట్లు కేన్సర్ నుంచి కవర్ అయ్యారు?"

 

    "దాదాపు ఎనిమిది శాతం".


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS