Previous Page Next Page 
సంపూర్ణ గోలాయణం పేజి 24


    శ్యామ్ సంతోషం వర్ణనాతీతం. "చిట్టిబాబుగారూ! మీ రుణం యెలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు. ఓకే వ్యక్తికి పుల్ టైం, పార్ట్ టైం రెండు వుద్యోగాలూ ఇప్పించిన ఘనత మీకే దక్కింది" అన్నాడు సంతోషంగా.

    "సర్లెండి యిదేం గొప్ప సాయం? అసలు నాకే శక్తి వుంటే నిరుద్యోగులందర్నీ పిల్చి  ఉద్యోగాలు యిప్పించేసి హాయిగా బ్రతకండి బ్రదర్స్ అంటాను" అన్నాడు చిట్టిబాబు.

    వారం రోజులు గడిచాయి. శ్యామ్ కి ఆ పిల్లలు బాగా  అలవాటు అయ్యారు. ట్యూషన్ కి వచ్చీ రాగానే చదువుతారా చంపమంటారా? అని వెంటపడకుండా నవ్వుతూ నవ్విస్తూ ఆడుతూ పాడుతూ చదువు చెప్పే ఈ మాస్టారు పిల్లలకి యెంతో బాగా వచ్చారు.

    చదువు చెప్పే టీచర్ కీ, చదువుకునే పిల్లలకీ మధ్య ఏర్పడిన ఈ సామరస్యం గమనించి తృప్తిపడ్డారు పిల్లల  తల్లిదండ్రులు. శ్యామ్ ఏ సమస్యా లేకుండా నిశ్చితంగా కాలంగడుపు తున్నాడు. కడుపునిండా తింటున్నాడు కంటి నిండా నిద్రపోతున్నాడు.

    ఓ రోజు సాయంత్రం ట్యూషన్ ముగించి యింటికి వస్తూ బస్ బీచ్ రోడ్ గుండా పోతూ వుంటే కిటికీ పక్క సీట్లో కూర్చుని బయటకు చూస్తుండగా మోహన్ రోడ్ పక్కన వున్న రెస్టారెంటులో కూల్ డ్రింక్ తాగుతూ కనిపించాడు. అతని యెదురుగా  మెరుపు తీగలాటి అమ్మాయి.

    బస్ కాస్త స్లోగా వెళుతుండడం వల్ల స్పష్టంగా కనిపించారు. ఆ అమ్మాయిని యెక్కడో చూసినట్లుకూడా అనిపించింది అతనికి. యెవరా యెవరా అని ఆలోచించినా గుర్తురాలేదు.

    ఆ తరువాత ఆ విషయమే మర్చిపోయాడు. యింటికి చేరగానే అలవాటు ప్రకారం కాసేపు విశ్వనాధంతో కబుర్లు చెప్పి హొటల్ కి వెళ్ళి భోం చేసి వచ్చి పడుకున్నాడు.

    మర్నాడు పొద్దున షేవ్ చేసుకుంటూవుంటే మళ్ళీ మోహన్ విషయం జ్ఞాపకం వచ్చింది. ఆ వెంటనే ఆ అమ్మాయి కళ్ళముందు మెదిలింది. మెరుపులా గుర్తొచ్చింది ఆ అమ్మాయి ఆరోజు బస్టాప్  లో చూసాడతను. పలకరిస్తానని పందెం కాసి యాభై రూపాయలు గెలుచుకున్నాడు. ఆవిడ పేరేమిటి జ్ఞాపకంలేదు. ఆవిడనే పెళ్ళి చేసుకుంటానని  పందెం కట్టాడు మోహన్.

    ఆ అమ్మాయితో కలిసి కూల్ డ్రింక్ తాగుతూ కనిపించాడు అంటే పందెంలో గెల్చే ప్రయత్నం చేస్తూనే వున్నాడన్నమాట అమ్మదొంగా అమాయకంగా కనిపిస్తాడు గానీ గట్టివాడే.

    "రోడ్డుమీద కనిపించిన అమ్మాయితో ముక్కూ మొహం తెలియని ఆవిడతో అసలు పరిచయం ఎలా చేసుకోగలిగాడో!" కుతూహలం అతన్ని నిలవనీయలేదు.

    గబగబ స్నానం చేసి తయారై రూం లాక్ చేసి బయలుదేరాడు. మోహన్ చెప్పిన గుర్తుల ప్రకారం ఆ ఇంటికి చేరాడు. వాకిట్లో జాజిపందిరి దగ్గర బల్ల వేసుకుని దానిమీద నిలబడి విచ్చిన సన్నజాజి పూలు కోసుకుంటోంది భారతి.

    గేటు తీసుకొని నాలుగడుగులు వేసి- "సూర్యనారాయణమూర్తిగారిల్లు ఇదేనాండీ?" అని అడిగాడు.

    కూనిరాగం తీస్తూ పూలు కోస్తున్న భారతి ఆ ప్రశ్న విని గిర్రున వెనక్కి తిరగబోయింది. ఆ బల్లఅసలే కొంచెం కుంటిది. భారతి వేగంగా వెనక్కి తిరిగేసరికి బల్ల కదిలిపోయింది. భారతి తూలి పడబోతూ కెవ్వుమంది.

    కాస్త దూరాన నిలబడివున్న శ్యామ్ అప్రయత్నముగా 'అరెరె!' అంటూ ముందుకి పరిగెట్టి పట్టుకో బోయాడు.

    ముందుగా విచ్చిన జాజిపూలు జల్లుగా అతని తల మీద పడ్డాయి. ఆ తరువాత ఠంగుమంటూ వచ్చి తగిలింది స్టీలు పళ్ళెం. అందరికన్నా ఆఖరుగా అందమైన వూబాల!

    ఏం జరిగిందో ఇద్దరికీ అర్థంకాలేదు. ఇహలోకంలోకి వచ్చి తలెత్తి చూసింది భారతి ఎర్రబడ్డ ఆ చెంపలని చూసి తెలివి తెచ్చుకుని చేతుల్లో వున్న భారతిని వదిలేశాడు శ్యామ్.

    తలోంచుకుని లోపలికి  వెళ్ళబోయింది భారతి" సూర్యనారాయణమూర్తిగారిల్లు ఇదేనా?" మళ్ళీ ప్రశ్నించాడు శ్యామ్.

    "అవును" ప్రమాదం గ్రహించి ఈసారి వెనక్కి తిరక్కుండానే సమాధానం చెప్పింది భారతి.

    "మోహన్ ఉన్నాడా?"

    "ఉన్నాడు లోపలికి రండి!" అనేసి లోపలికి వెళ్ళి పోయింది. క్రాఫ్ మీద, షర్టుమీద చిక్కుకున్న జాజపూలు  దులుపుకొని లోపలికి వెళ్ళాడు శ్యామ్. హల్లో కుర్చీలో కూర్చున్నాడు. మేడ దిగివచ్చాడు మోహన్. స్నేహితుడిని చూడగానే ముఖం ఇంత చేసుకుని__

    "ఎన్నాళ్ళకెన్నాళ్ళకి మా మీద దయ కలిగింది! ఎప్పుడు పిలిచినా ఇదుగో వస్తా అదిగో వస్తా అని దాటేసేవారు" అంటూ ఎదురుగా కూర్చున్నాడు. లోపలినుంచి సూర్యం గారు వచ్చారు. పరిచయం చేసాడు మోహన్. ఆదరంగా మాట్లాడారాయన ఆసనాలు చేసే  అలవాటుందా లేదా  అడిగి లేనందుకు చాలా విచారించారు. ఆసనాలవల్ల కలిగే లాభాలు వివరిద్డామానుకున్నారుగానీ  మోహన్  తెలివిగా మాట తప్పించాడు.

    "ఏం తాగుతారు? కాఫీయా? కూల్ డ్రింకా?" అని అడిగాడు "ఏం వద్దు" అనేశాడు శ్యామ్.

    "అలా వీల్లేదు ఏదో ఒకటి తీసుకోవాల్సిందే" అంటూ లోపలికి వెళ్లారు సూర్యం. కాఫీ కలిపి భారతి చేతి కిచ్చి పంపించారు.

    "మీట్ భారతి. మా మామయ్య కూతురు" పరిచయం చేసాడు మోహన్.

    కాఫీ తాగుతూ కెళ్ళేత్తి చూసాడు శ్యామ్. తన వంకే చూస్తోంది భారతి తలవంచి నమస్కారం చేసాడు. చిన్నగా నవ్వేసి  లోపలికి వెళ్ళిపోయింది భారతి.

    తనోచ్చిన పని మర్చిపోయిన శ్యామ్ మోహన్ ఏదేదో మాట్లాడుతుంటే వింటూ కూర్చున్నాడు. అలా ఓ అరగంట గడిచాక ఇక నేను  వెళ్ళోస్తానని లేచాడు.

    లోపలినుంచి సూర్యంగారు వచ్చారు. వస్తూవుండు నాయనా! దగ్గరే అన్నావుగా తెల్లవారుజామునే లేచి ఆసనాలు వేయ్. నీకు ఒంటరిగా కష్టం అయితే మా ఇంటికి రా! అని చెప్పారు.

    తలాడించి వినయంగా శలవు తీసుకున్నాడు. లోపలికి తొంగి చూసాడు. నిట్టూర్పు అణుచుకొని బయటికి వచ్చే శాడు. గేటుదాకా వచ్చి దిగబెట్టాడు మోహన్.

    ఆప్రయత్నంగా తలెత్తి చూసిన శ్యామ్ కి మేడ మీద కిటికీ దగ్గర లేతనీలం రంగు చీరకొంగు కనిపించింది. అటునుంచి దృష్టి తిప్పుకోడానికి ఆ తరువాత వెనక్కి చూడకుండా వెళ్ళడానికి తీవ్రప్రయత్నం చేసి  సఫలు డయ్యాడు శ్యామ్.

    ఆ రోజంతా ఆ సుతిమెత్తని స్పర్శ అతన్ని వెంటాడుతూనే వుంది. ఆ రాత్రి పడుకున్న తరువాత ఆ సన్నజాజుల పరిమళం అతన్ని  చుట్టేసింది. నిద్రపోవాలని తీవ్రప్రయత్నం చేసి కూడా విఫలుడయ్యాడు శ్యామ్.

    మర్నాడు ఆఫీసు టైంకి పావుగంట ముందే రెడీ అయిపోయి మళ్ళీ సూర్యనారాయణ మూర్తి గారింటికి వెళ్ళాడు. డైనింగ్ టేబిల్ ముందుకూర్చుని  భోంచేస్తున్నాడు మోహన్. అతనికి సర్వ్ చేస్తున్నాడు వంటతను. మెట్లమీద కూర్చొని ఏదో మేగజైన్ చదువుకొంటూంది భారతి.

    కాలింగ్ బెల్ చప్పుడు విని వచ్చి తలుపుతీసింది. ఎదురుగా శ్యామ్ ని చూసి తడబడిపోయి పక్కకు తప్పుకుంది. తలతిప్పి చూసి "రండి రండి!" అని ఆహ్వనించాడు మోహన్.

    "కూర్చోండి" అన్నాడు.

    "ఆఫీసుకి వెళ్ళుతూ మిమ్మల్ని కూడా వెంటబెట్టుకు వెళ్దాం అని వచ్చాను వెధవది రోజూ వంటరిగా వెళ్ళాలంటే బోర్ గా వుంది!" అడక్కుండానే తన రాకకి కారణం చెప్పేసాడు.

    "మంచి పని చేశావయ్యా అయినా యిద్దరిదీ ఒకే ఆఫీసు అయినప్పుడు రోజూ కలిసే వెళ్ళొచ్చుగా!" అన్నారు సూర్యం. "రా  నువ్వూ భోం చేద్దువుగాని" అన్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS