తండ్రి ఉత్తరం చదువుతూవుంటే అతనికి చేతులెత్తి మొక్కాలనిపించింది. 'నాన్నా! మరో జన్మంటూ వుంటే నీ కడుపునే పుట్టి నువ్వు చెప్పినట్టు విని నిన్ను సంతోషపెడతాను నాన్నా! ఈ జన్మలో ఆ అదృష్టం ఒక్క భరణికే దక్కింది.' అంటూ కన్నీళ్లతో మనసులోనే అతని పాదాలకి అభిషేకం చేసింది.
భరణీ కాశ్యప్ ల ఉత్తరం విప్పింది. ఏడ్చి ఏడ్చి మొహం కందగడ్డలా అయిపోయిన రాగిణికి, చల్లటి మంచినీళ్ళు తెచ్చిచ్చింది పూర్ణిమ. నీళ్ళు తాగి ఉత్తరం చదవడం మొదలెట్టింది.
"అక్కా! నీ ఉత్తరం చదువుతుంటే నీతో మాట్లాడుతున్నట్టుగానే వుంది! నీ జీవితం ఇలా మొగ్గలోనే వాడిపోతుందనుకోలేదు. ఒకటి పోగొట్టుకున్నా తెలిసో తెలియకో, ఇంకో విధంగా తృప్తిగా వుంటావనుకున్నాను. నిజంగా నీ అంత అదృష్టవంతురాలు లేదనుకునేదాన్ని చిన్నప్పుడు, అన్నిట్లో నీదే అగ్రస్థానం అవడం వల్ల.
అక్కా! జీవితంలో తప్పుచెయ్యని మనుషులుండరు! ప్రతివారూ, ఏదో ఒకరకమైన తప్పు, తెలుసో తెలియకో! చిన్నదో పెద్దదో చేస్తూనే వుంటారు. నువ్వెంత పశ్చాత్తాప పడుతున్నావో, నీ ఉత్తరంలోని ప్రతి అక్షరం చెబుతుంది! అంతకంటే ప్రాయశ్చిత్తం వేరే లేదు. కానీ అక్కా! లోకులు కాకులన్న సంగతి అక్షరాలా నిజం. నువ్వు మరచిపోయినా, నీ తప్పుని మన సమాజం మరచిపోదు. అడుగడుగునా, దెప్పిపొడుస్తూనే వుంటుంది. నువ్వు శిల్పని తీసుకుని అమెరికా వచ్చేసెయ్! కొత్త జీవితం ప్రారంభించవచ్చు! ఏదైనా, ఉద్యోగం చేసుకుందువుగాని! అందరం ఒక్కచోట వున్నట్టుంటుంది శిల్ప భవిష్యత్తు కూడా బాగుపడుతుంది! నీ జవాబు కోసం, ఎదురు చూస్తూ వుంటాం!
నీ
భరణి!
కాశ్యప్!"
అన్ని ఉత్తరాలూ వరసగా ఒక్కసారే చదివేసరికి మతిపోయింది రాగిణికి. సోఫామీదే తలవాల్చింది, అలసిపోయినట్టు.
ఆ రాత్రి అన్నం సహించలేదు రాగిణికి. ఏదో నిరాశా, నిస్పృహ మనస్సును ఆక్రమించుకున్నాయ్. ఎవ్వరితోటీ మాట్లాడాలనిపించడం లేదు. బలవంతాన రెండు ముద్దలు తిని, మంచంమీద వాలిపోయింది, వికలమైన మనస్సుతో!
ఆ రోజు అందరూ అలాగే వున్నారు. రోజూ కబుర్లు చెప్పుకుంటూ భోంచేసి, టి. వి. కార్యక్రమాలన్నీ చూసి నిద్దరపోయేవారు, గబగబా భోంచేసి లేచిపోయారు. టి. వి. ఎవరూ చూడలేదు.
రాగిణికి ఆ రాత్రి చాలాసేపు నిద్దరపట్టలేదు. "రాజేష్ తనని మనసారా ప్రేమించాడు. అతని మాట వినకుండా, అతని ప్రేమని తిరస్కరించింది తను! భార్గవని తను కోరుకుంది. అతను తిరస్కరించి వెళ్ళిపోయాడు. తనని అపనిందలపాలుచేసి, తననెందుకిలా ఏడిపిస్తున్నాడు దేముడు? తనేం నేరం చేసింది? అర్ధరాత్రి దాటినా ఎడతెగని ఆలోచనలూ, సమస్యలూ వేధిస్తుంటే, మంచంమీద పొర్లి పొర్లి ఏ తెల్లవారుజామునో కన్నుమూసింది.
రెండుమూడు రోజులు అలాగే మామూలుగా గడిచిపోయాయి.
"బాబాయ్! నేను ఊటీ వెళ్లిరానా?" అడిగింది రాగిణి. ఆ రోజు కోటయ్యగారిని.
"ఇప్పుడు వాళ్లకి పరీక్షలవుతున్నాయ్! నువ్వెళ్ళి మాత్రం ఏం లాభం? సెలవులకి శిల్పే ఇక్కడికి వస్తుంది కదా! ఎందుకు తొందరపడతావ్?" అన్నాడు కోటయ్యగారు.
రాగిణి ఎన్నో ఉత్తరాలు రాసింది శిల్పకి. శిల్ప దగ్గరనుంచి సమాధానం రాలేదు. రాగిణికి అర్థమయిపోయింది. శిల్ప కావాలనే తనకి ఉత్తరాలు రాయడంలేదన్న సంగతి!
"దానికి నేనంటే బాగా అసహ్యం పుట్టుంటుంది. అందుకే నాకు ఉత్తరాలు రాయడంలేదు. అంతేకదూ బాబాయ్!"
కోటయ్యగారికీ ఆ అనుమానం రాకపోలేదు. ఎన్నిసార్లు రాగిణి సంగతి, తనురాసిన ఉత్తరాలల్లో రాసినా తనకి శిల్ప సమాధానం రాస్తున్నప్పుడు, అన్ని విషయాలూ రాసేది రాగిణి సంగతి తప్ప! దాన్నిబట్టి రాగిణి సంగతి రాయడంకూడా ఆ అమ్మాయికి ఇష్టంలేదని తేలిపోయింది ఆ మాటే రాగిణితో అన్నాడు.
"బాబాయ్ నేనొక్కసారి వెళ్ళొస్తాను. ఏమంటుందో చూద్దాం!"
"రాగిణీ! నువ్వు పదేపదే వెళతానంటూ వుంటే నేను ఒద్దనడానికి కారణం, నీకు అర్థమయ్యే వుంటుంది ఈపాటికి తీరా నువ్వు వెళ్ళాక, శిల్ప నీతో కఠినంగా మాట్లాడితే నువ్వు తట్టుకోలేవని నా అనుమానం. ఆ అవమానాన్ని నువ్వు భరించలేవు. అందుకనే నిన్ను వెళ్ళొద్దని ఆపుచేస్తున్నాను" అన్నారాయన.
"ఫరవాలేదు బాబాయ్! ఏం జరుగుతుందోనని పరిస్థితులకు భయపడి తప్పించుకు తిరగడం కంటే, పరిస్థితులని ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగడమే మేలు!" అంది రాగిణి.
"నీకా ధైర్యంవుంటే, తప్పకుండా వెళ్ళు! ఒకసారి శిల్పతో మాట్లాడేశాక, నీ భవిష్యత్తుని కూడా......"
"హూ..... నాకింకా ఏంభవిష్యత్తు మిగిలివుంది బాబాయ్! మొండిదాన్ని గాబట్టి బ్రతికున్నాను మరో ఆడదయితే, ఆత్మహత్య చేసుకుని వుండేది." కళ్లు తుడుచుకుంది, కన్నీరు కన్పించకుండా.
"రాగిణీ ఆత్మహత్య చేసుకోవడం గొప్పకాదమ్మా! పిరికితనం. చనిపోవడానికి ఒక్క నిమిషం చాలు. ఎవరయినా చెయ్యొచ్చాపని తెగిస్తే! కానీ ఒక్క మనిషిని బ్రతికించమను, ఎవ్వరికైనా చూద్దాం! చావడం గొప్ప విషయం అనుకుంటే పొరపాటు. బతికుండి ఏదైనా ఒక్క మంచి పనిచేస్తే చాలు! జీవితం సార్థకమయినట్టే లెక్క!"
"పోస్ట్!" అన్న కేకవిని పరుగెత్తింది రాగిణి. శిల్ప కోటయ్యగారికి రాసిన ఉత్తరం. కోటయ్యగారి చేతికిచ్చింది. కవరు చింపి ఉత్తరాన్ని పెద్దగానే చదివారు. అందరికీ వినిపించేలాగా! మరో పది రోజుల్లో స్కూలుకి సెలవులిస్తారనీ, అవినాష్ ఒక్కడే సెలవుల్లో హైదరాబాదొస్తున్నాడనీ, తను తన ఫ్రెండు కావేరీతో కోయంబత్తూరు వెళ్ళాలనుకొంటోందని రాసింది.
"నేనిక్కడున్నాననే అది హైదరాబాదు రానంటోంది బాబాయ్ అర్థమయిపోయిందిగా!"
"అంత చిన్నపిల్లకి, ఎంత పట్టుదల?" ఆశ్చర్యపోయారు కోటయ్యగారు.
"అంత చిన్న పిల్లలో ఇంతపట్టుదల కలిగిందంటే నా ప్రవర్తన ఆ అమ్మాయిని ఎంత బాధపెట్టిందో! ఆ పసిహృదయం ఎంత గాయపడకపోతే, అలా ఆలోచిస్తుంది!" బాధగా అంది.
"రాగిణీ! వెంటనే నువ్వు బయల్దేరు. శిల్పకి నచ్చజెప్పి తీసుకురా. ఆ తరువాత నువ్వు ఏదైనా ఉద్యోగం చూసుకుందువుగాని! లేదా, అమెరికా వెళ్ళి కొన్నాళ్ళుండి ఒద్దువుగాని. ముందు వెంటనే బయల్దేరు."
"అలాగే బాబాయ్!"
ఆ మర్నాడే ప్రయాణమయింది ఊటీకి రాగిణి. "నేను ఊటీ ఎప్పుడూ చూడలేదు. అవినాష్ వాళ్ళ స్కూలు ఎలావుంటుందో చూడాలని వుంది. నాలుగురోజులే కదా, రాగిణితో కూడా వెళ్లనా?" కోటయ్యగారిని అడిగింది సూర్యకుమారి.
అసలు రాగిణిని ఒక్కతినీ పంపడానికి కొంచెం వెనకాముందూ అవుతూన్న కోటయ్యగారికి, సూర్యకుమారి కోరిక కలిసొచ్చింది. "తప్పకుండా వెళ్ళు" అన్నారు. రాగిణిలో కూడా ఉత్సాహం రెండింతలయింది. రెండు టిక్కెట్లు రాగిణి కొని తీసుకొచ్చింది. హైదరాబాదు నుంచి బెంగుళూరు వరకు ఫ్లయిట్ టిక్కట్లు!
సూర్యకుమారి కూడా బయలుదేరడంతో రాగిణికి కూడా కొండంత ధైర్యమొచ్చింది.
సూర్యకుమారితో మాట్లాడుతూన్నంత సేపూ బాగానే వుంది. కాస్త సమయం దొరికితే, మనసు గతంలోకి వెళ్ళిపోతోంది రాగిణికి. శిల్పని స్కూల్లో చేర్పించడానికొచ్చినప్పుడూ, శిల్పకి టైఫాయిడ్ వచ్చి తగ్గాక చూడ్డానికొచ్చినప్పుడూ, రకరకాల అనుభూతులు కళ్లముందు కదలాడాయి.
రెండోసారొచ్చినప్పుడే భార్గవ ఇక్కడ కలిశాడు! ఆ జ్ఞాపకాలన్నీ ఆనాడు ఎంత తియ్యగా అనిపించాయో, ఇప్పుడు అంత చేదుగా మింగుడుపడకుండా వున్నయ్!
