Previous Page Next Page 
నా కథవింటావా పేజి 23


    అసలు ఆడదాని కన్నీళ్ళకి కరిగిపోని  మొగాడుండడు. అందులోనూ  కట్టుకున్న భార్యామణి! కడుపుతో వున్న మనిషి! క్రాంతి కావ్యని కేకలేశాడు. "వొదినంటే, తల్లితో సమానం. వొదినని దూషిస్తే  తల్లిని  దూషించినట్టే  లెఖ్క!"
    కావ్యకి నవ్వొచ్చింది. "ఇవేమైనా  లెఖ్కలనుకున్నావా అన్నయ్యా ? 'టూxటూ=ఫోర్' అని చెప్పడానికి!, "వొదినా=అమ్మా  అనడానికి !" అనుకుని మనసులో, మాట్లాడకుండా ఊరుకునేది.
    "అసలు  ఆ శాంతే  నీ మనస్సుని పాడుచేస్తున్నట్టుంది. ఆమెని ఇంటికి రావొద్దని  చెప్పు" అన్నాడు.
    "శాంత తన మనసుని పాడుచేస్తోందా ? పాడయిన తన మనస్సుకి కాస్త ఊరట కలిగిస్తోంది! కొంచెం ఉపశమనం  కలిగిస్తోంది. అయినా  పాపం  ఆమె కెందుకు  తనవల్ల  అప్రతిష్ట?" అనుకుంది. ఆ మాటే శాంతతో చెప్పింది.
    "కావ్యా! వాళ్ళేమైనా అనుకోనీ! నీ మీదున్న  అభిమానంతో, మీ అమ్మగారి మీదున్న  గౌరవంతో, మన స్నేహానికి అన్యాయం చెయ్యలేను. నేనొచ్చేది నీకోసం! వాళ్ళేమనుకుంటే  నాకేం?" అంది.
    "శాంతా! నిష్ఠూరంగా భరించడం  ఎంత కష్టమో నాకు తెలుసు. నా స్నేహంవల్ల అది మీకు  సంభవించకూడదు. వీలున్నప్పుడు  నేనే మీ ఇంటికొస్తాను. మీరు రాకండి. ప్లీజ్!" అంటూ ఏడ్చింది కావ్య.
    "ఛీ ఛీ! క్రాంతి కూడా  ఇంత మారిపోతాడని  కలలో కూడా అనుకోలేదు" అంది బాధగా  శాంత.
    "మారిపోవడం సహజమేకదా  శాంతక్కా ! గడ్డాలొచ్చాక బిడ్డలే కారని కన్నతల్లే  అనుకుంటుందే, అటువంటిది  భార్యవొచ్చాక, అక్క చెల్లెళ్ళని ప్రేమగా  చూసుకునే  అన్నదమ్ములు ఎంతమందుంటారు. అలా వుండాలంటే, భార్యకూడా అందుకు తోడ్పడాలి. ఆమె కూడా అభిమానాన్నీ గౌరవాన్నీ అందిస్తేతప్ప, భార్యనికాదని  మగాడు ఎదురు తిరగడం, సముద్రంలో  ఎదురీదినట్టే ! అవి ఏ కొందరికో తప్ప  అందరికీ  సాధ్యంకాదు." 
    "కావ్యా! నీలో ఇన్ని  తెలివితేటలున్నాయి ,ప్రేమా  అభిమానం. అంతులేనంత గుండెనిండా  వున్నాయి. అందరినీ ఆదరించే  ఆప్యాయతా, క్షమించే సహృదయతా  రెండూ వున్నాయి, చదువొక్కటే కాదు  దాంతోపాటు  ఈ రోజుల్లో  చాలామందికి లేని సంస్కారమూ వుంది. అందముందీ, ఆకర్షణుంది. ఇవన్నీ సమకూర్చిన  ఆ దేముడు, నీ నుదుట  కళ్యాణగీత గియ్యడం మర్చిపోయేడేమోనమ్మా!" కళ్ళనీళ్ళు  పెట్టుకుంది శాంతా!
    "శాంతక్కా! జీవితంలో  ఎవ్వరూ లేని నాకు  ఒక తోబుట్టువులా నిలిచి ఆదరించి ఓదారుస్తున్న  మిమ్మల్ని  ఏమనాలో తెలీక, మీ ఋణం ఎలా తీర్చుకోవాలో తెలీక 'అక్కా!' అని పిలుస్తున్నాను. నాకు మరో జన్మంటూ వుంటే, మీకు చెల్లెల్నై  పుడతాను" అంది కళ్ళు తుడుచుకుంటూ, కన్నీటిని ఆపుకుంటూ  కావ్య!
    పక్క గదిలో నుంచి  తుఫానులా వొచ్చింది  సొభన౧ "ఏమ్మా ? నేనూ మీ అన్నయ్య నిన్ను  పెడుతూన్న బాధలు  చెప్పుకుంటూ  ఏడుస్తున్నావా ? నిన్నెవరేమన్నారని  ఆమెతో  చెప్పుకొని  ఏడుస్తున్నావ్ ?"
    "వొదినా! మీమీద  నేనేమీ ఆమెతో  చెప్పలేదు."
    "మరయితే  నిండు  ఇంట్లో  తీరికూర్చుని  ఎందుకమ్మా  ఏడుపు ? ఏం కష్టం వొచ్చిందని ? కావలసింది తింటావ్! నీ గదిలో కెళ్ళి  పడుకుంటావ్! నిన్నెవరేమంటున్నారానీ ?" గర్జించినంత గట్టిగా  అడిగింది శోభన.
    "నిజమే వొదినా! కావలసింది ఇష్టముంటే  తింటున్నాను లేకపోతే లేదు. నాకంటూ ఇచ్చిన ఒక గదిలో పడుంటున్నాను. నాకూ జంతువులకీ తేడా ఏముంది ? కుక్కపిల్ల కూడా  కాస్సేపు దాన్నీ  పలకరించమని, దాంతోటీ ఆడుకోమని, తోకాడిస్తూ వెంటతిరుగుతుంది. కానీ నాకు అదీ లేదే!
    వొదినా ! మనిషికి కావలసింది, తినడం  పడుకోవడం ఒక్కటే కాదు. మనసువిప్పి మాట్లాడే  మనిషి  తోడు కావాలి. మమతల పంచే మనిషి నీడ కావాలి! అంతేకానీ ,వేళకింత  తిని ఒక మూల  పడుండమని  చెప్పడం, అభిమానమూకాదు, ఆప్యాయతా కాదు. మీరు  తీర్చుకునే బాధ్యత! బంధాలు  అనురాగానికీ, ఆప్యాయతకీ  ముడిపడతాయి  కానీ, బాధ్యాతకి కాదు." కన్నీరు చెంపలమీదుగా  జారుతుంటే, కళ్ళు తుడుచుకుంది కావ్య.
    శోభన మొహం  కోపంతో  ఎర్రబారింది! శాంత  ఎదురుగుండా  తనని  నిర్భయంగా నిలదీసి అడుగుతున్న కావ్యని పీక పిసికెయ్యాలన్నంత కోపం వొచ్చింది. ఆవేశం పట్టలేక ,"ఏ సినిమాలోవమ్మా ఈ డైలాగులు ? బట్టీపట్టిన  పాఠంలాగా అప్పగించేవ్ ?" అంది వ్యంగ్యంగా !
    "హూఁ....నీలాంటి వాళ్ళకి, సినిమా డైలాగులూ, సినిమా ఆదర్శాలే గుర్తుంటాయి. మనసు, మమతా, మాటా, మంతీ వీటికి అర్ధాలు కూడా తెలీవు. చెప్పేం లాభం ?" అంది కావ్య.
    "షటప్! పక్క  నాలికుందికదా  అని ఇష్టం   వొచ్చినట్టు  వాగుతున్నావ్! మీ అన్నయ్య రానీ చెబుతా!" అంటూ గావుకేకలు పెడుతూ శాంతవైపు తిరిగి, "ఏమ్మా! మీ ఇంట్లో నీకు ఏమీ  పనిలేదా? ఇలా ఇరుగింటిమీదా, పొరుగింటిమీదా  వెళ్ళి  పడుతున్నావ్ ? మా ఇంట్లో  చిచ్చుపెట్టి  మమ్మల్ని  రచ్చకీడుస్తున్నావ్ ?" అంది కోపంతో సెగలుకక్కుతూ.
    "వొదినా! నీ కోపం  నామీద చూపించు. శాంతనేమైనా  అంటే నే వూరుకోను. నువ్వు ఈ ఇంటికి రాకముందే, శాంత ఈ ఇంటికొచ్చేది. అమ్మకి  శాంతకూడా  ఇంకో  కూతురులాంటిది" అంది.
    "అంటే  నేనా శాంతపాటి  చెయ్యనన్నమాట ! ఆమెకున్న  విలువ కూడా నాకు లేదన్నమాట!" ఉడుకు మోతుతనంతో ,ఏడుపు లంకించుకుంది శోభన.
    "కావ్య! నావల్ల  ఆమెకెందుకు  బాధ? నే వెళతాను. ఏదైనా  కావాలంటే, నువ్వే మా యింటికిరా. ఈమెతో నాకే సంబంధమూలేదు. మన స్నేహం  పవిత్రమైనది. ఒస్తా!" అంటూ  వెనక్కి తిరిగి  చూడకుండా  వెళ్ళిపోయింది శాంత.
    కావ్య మాట్లాడకుండా  తన  గదిలోకి  వెళ్ళి, ఏడుస్తూ  మంచం మీద కూర్చుంది.
    ఆ సాయంత్రం  క్రాంతి  ఇంట్లో  కాలుపెడుతూ  వుండగానే  ప్రారంభించింది శోకాలు, శోభన!
    "ఏమయింది ? ఏమయింది శోభనా ?" అంటూ  కంగారుగా  అడిగాడు క్రాంతి.
    శోభన మాట్లాడలేదు. ఏడుపు లంకించుకుంది.
    "ఏయ్! ఏంటా  ఏడుపు! ఉత్తమనిషివి కూడా కాదు." అంటూ దగ్గరకెళ్ళి  లాలనగా  "కావ్య ఏమైనా  అందా? అన్నా 'ఇగ్ నోర్' చేయమన్నా కదా? మనసు బాగోలేక ఏమైనా  అనుంటుంది  అంతేనా ?"
    మరి వినలేకపోయింది కావ్య! "అన్నయ్య  తన  గురించి  అంటూన్న  మాటలేనా  అవి ? అంటే, తను అంటూ వుంటే పట్టించు కోకుండా  వుండమని, ఆమెతో చెబుతున్నాడా? అసలు  తను అలా అనేరకమేనా ? ఆ సంగతి అన్నయ్యకి తెలీదా? భార్యమీద  ఎంత  మక్కువ వున్నా, చెల్లెలని  ఆ మాత్రం  ప్రేమలేదా ? నామీద అంత నమ్మకం లేదా ? అన్నయ్యే  తన  గురించి  అలా  మాట్లాడుతూ వుంటే, ఇంత శోభనకి ఎదురేముంది ? ఆమెకి తనమీద  గౌరవంకానీ, తన మాట మీద  విలువకానీ ఎలా  వుంటుంది ?" అనుకుంటూ  మోకాళ్ళ  మీద తల  దూర్చి, తల్లిని తలుచుకుని  ఏడ్చింది కావ్య.
    కాస్సేప్పటికి  క్రాంతి కావ్య  గదిలోకొచ్చాడు. "అస్తమానం అలా ఏడుస్తూ కూర్చోకపోతే ,లేచి తిరగరాదూ?" అన్నాడు.
    "ఏం జరిగిందని  ఆ ఏడుపు ?" అది  ప్రశ్నో, స్వగతమో తెలీలేదు  కావ్యకి.
    క్రాంతి మొహంలోకి చూసింది ,అది ప్రశ్నే! తననుద్దేశించి   అడిగాడని గ్రహించుకుంది.
    "అమ్మ జ్ఞాపకం  వొచ్చింది" అంది మెల్లగా!
    "చూడు కావ్యా! ఇరవై నాలుగుగంటలూ  అమ్మ జ్ఞాపకమొచ్చిందని  ఏడుస్తూ కూర్చుంటే ,నేను ఉద్యోగాని కెళ్ళేవాడినికాను, మీ వొదిన ఇంట్లో పనిచేసేది కాదు. అమ్మమీద ప్రేమ నీ ఒక్కదానికే వుందా? నాకు లేదా ? అయినా వయసొచ్చినవాళ్ళం ,పసిపిల్లల్లా  ఏడుస్తూ కూర్చోవడమేమిటి ? లేచి ఇంట్లో పన్లన్నీ  చూసుకోవొచ్చుగా ? పనంతా  మీ వొదిన  ఒక్కర్తే చేసుకుంటోంది" అన్నాడు.
    "నిన్నటిదాకా  మంచం  దిగలేదు తను. పథ్యం  తిని  రెండురోజులు కూడా  కాలేదు. వొంట్లో ఎలా వుంది అని అడగవలసింది  పోయి, తనేదో సోమరిపోతులా  కూర్చున్నట్టు  ఈ ఉపన్యాసాలేమిటి ?" అనుకున్నా సమాధానం చెప్పలేదు కావ్య.                    
    కాస్సేపూరుకుని "అయినా  ఆ శాంతతో  అంత  స్నేహం ఏమిటి నీకు ? నా కన్నా, వొదినకన్నా ఎక్కువయిందా  నీకు  ఆవిడ ?" అన్నాడు.
    "ఈపాటికి  శోభన  ఉన్నవీ  లేనివీ  అన్నీ  చెప్పేసుంటుంది అన్నయ్యకి" అనుకుంది  కావ్య.
    "అన్నయ్యా! శాంత  ఈ ఇంటికి  కొత్తేమీ కాదు. ఆమె ఎటువంటిదో  నీకూ తెలుసు."
    "అంతమాత్రంచేత, మన  స్వంత విషయాల్లో  జోక్యం  చేసుకోనక్కరలేదు  ఆవిడ"
    "ఆవిడేమీ జోక్యం  చేసుకోలేదు. ఆమెని  చూస్తేనే  వొదినకి పడదు. నాతో మాట్లాడితే  అంతకన్నా  ఇష్టంలేదు. ఎన్ని మాటలన్నా  వొదిన, ఆమె గాబట్టి  ఊరుకుంది. మరొకరైతే...."
    "కావ్యా! పోనీ  మీ వొదినకీ  ఆవిడకీ  పడనప్పుడు, నువ్వావిడతో మాట్లాడ్డం  మానేయ్యొచ్చుగా !"
    "అంటే  వొదినకిష్టం  లేనిదేదీ  నేను చేయకూడదన్నమాట. ఆమెకి నేనూ ఇష్టం లేకపోతే, ఇంట్లోంచి  వెళ్ళిపొమ్మంటావా ?"
    "చూశారా  ఎలా  మాట్లాడుతోందో ? ఒకదాన్లోంచి  ఇంకోటంటుంది" అంది శోభన.
    "కావ్యా! అర్ధం  లేకుండా  మాట్లాడకు! అసలే అనేక సమస్యలతో  సతమతమైపోతూన్న  నాకు, కొత్త సమస్యలు కూడా  తెచ్చిపెట్టకు. నీకు పుణ్యం  వుంటుంది." అంటూ అక్కడి నుంచి  వెళ్ళిపోయాడు క్రాంతి.
    కావ్యకి  దుఃఖం  ఇంకా  ఎక్కువైంది ? శోభన  అన్న  మాటలకన్నా  క్రాంతి  చూపించే నిరాదరణ, ఆమె మనస్సుని మరింత  గాయపరిచింది!
    "ఈ లోకంలో  తన కింకెవ్వరూ లేరు!" అనుకుంటూ  ఒంటరిగా  విలపించింది.
    నాలుగు మెతుకులు  గతికి ,చీకట్లో  కిటికీలోంచి  కనబడుతూన్న ఆకాశాన్ని  చూస్తూ, తన మనసులో  నిండిన చీకటిని, ఆకాశంలో మిణుకు మిణుకుమంటూ  వెలిగే  తారల వెలుగు  తొలగించడానికి  ప్రయత్నం చేస్తూ పడుకుంది కావ్య! కన్ను మూతపడటంలేదు, నిద్ర దరిదాపుల్లోకి  రావడం లేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS