.
"ఎంత పక్షపాతంతో వాదిస్తున్నారు మీరు." బాధతో అంది శాలిని. "ఆర్దికంగా మగవాళ్లమీద ఆధారపడిన ఆడవాళ్లను అంత హీనభావంతో చూడక్కరలేదంటాను. ఎందుకంటే, అతడికి పిల్లల్ని కని సంసారానికి సర్వచాకిరీ చేస్తుంది. కాబట్టి! గృహిణి రోజుకు పదహారు గంటలు శ్రమిస్తుందని అంచనా!......
"కొన్ని మైళ్ల నడుస్తుందని అంచనా! ఆమె శ్రమకు కొన్నివేలు కట్టివ్వాలని మీడిమాండ్. అవునా. మీ ఆడవాళ్ల ఆలోచనలు ఇలా వుంటాయి కాబట్టే మగవాడు మిమ్మల్ని బానిసగా చూస్తున్నాడంటాను. అతడికి పిల్లల్ని కను... అన్నారు. అంటే ఏమిటి అర్దం? అతడికి వుంపుడు కత్తె అనా అర్దం? భార్య భర్తకి పిల్లల్ని కనక ఇంకెవరికి కంటుంది? ఇంకెవరివల్ల మాతృత్వాన్ని పొందాలనుకొంటుంది? తనకూ, తన పిల్లలకూ, తన భర్తకూ చాకిరీచేస్తూ దానికి విలువ కట్టాలనడం - తనకు తనదానినీ, ఉంపుడుకన్నెనూ చేసుకోవడమే కదా? మిమ్మల్ని మీరే అగౌరవపరుచుకొంటూ మగవాడు అగౌరవపరుస్తున్నాడని ఎందుకు అవుకోవడం?"
"భలే తమాషాగా మాట్లాడతారే! ఆడది మగవాడి సంపాదనమీద పడి తింటూన్నందుకు అతడిచేత చులకన చేయబడుతుందని ఇందాక మీరే అన్నారు."
"ఊరికే తినడంలేదు. ఇంట్లో ఆమెచేసే చాకిరీకి విలువలేదా అని అడిగాను. దానికి మీరు ఎంత అసహ్యకరమైన అర్దాలు తీశారు. మగవాడి మీద మాటపడకుండా లాజిక్ తో వాదించగలరు. వట్టి పురుష పక్షపాతులు! మీకు స్త్రీలంటే యెక్కడ గౌరవముందంటారు?" చురుగ్గా అడిగింది శాలిని.
"ఇక్కడ!" తన గుండెలమీద తట్టి చూపి చిరునవ్వు నవ్వాడు శర్మ.
"అక్కడ స్త్రీలంటే ఎందుకూ పనికిరానివాళ్లన్న తేలికభావంతప్ప యింకేం లేదు" శాలిని విసురుగా లేచింది.
"మళ్లీ అంటున్నానని కోప్పడకండి. శాలినిగారూ! మీరు, అంటే మీస్త్రీలు అటు సాంప్రదాయాలనుండి పూర్తిగా బయటపడనూలేకుండా వున్నారు. ఇటు పూర్తిగా అభ్యుదయంవైపూ వుండలేకపోతున్నారు. ప్రస్తుతం మీది కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. ఎవరో రచయిత్రి చెప్పినట్టు పల్లెటూరి స్త్రీ ని తెచ్చి మహానగరం మధ్య వదిలిపెట్టిన స్థితి. మగవాడి ఆధిపత్యం సహించని దశకు చేరుకోగలరేగాని మగవాడు అంటే యిక్కడ మగడని అర్దం చెప్పుకొందాం. మీకంటే యెక్కువ చదివినవాడుండాలి. మీకంటే కొంచెం పెద్ద ఉద్యోగం చేస్తూండాలి. ఆర్దికంగా మీకంటే ఓ పెట్టుమీదుండాలి మీకంటే ఓ మెట్టు పైనుండాలని, అధికుడు కావాలని కోరుకొంటూ. అతని ఆధిపత్యాన్ని మాత్రం ఎందుకు సహించ లేకపోతున్నారో నాకు చచ్చినా అర్దం కావడంలేదు."
"తనకంటే ఓ మెట్టు పైనుండే ఆడది భార్య అయితే మీ మగవాళ్ళే ఇన్ ఫీరియారిటీకాంప్లెక్స్ తో తన్నుకు చస్తారు కదా?" ఒళ్ళు మండినట్టుగా అడిగింది శాలిని.
"ప్రకృతే సృష్టించింది పురుషుడిని ఒక మెట్టుపైన స్త్రీకంటే. దాన్ని తలకిందులు చేయాలంటే యిలాంటి వివరాలు తప్పవు మరి."
శర్మమాటకే జయం అన్నట్టుగా బడిగంట కొట్టేశారు గణ గణమంటూ.
