Previous Page Next Page 
సంసారంలో శ్రీశ్రీ పేజి 23

 

    "నన్ను బలవంతం  పెట్టడం  కాదు. మీరు కూడా రాత్రిళ్ళు  మాత్రమే తాగాలి. పగలంతా  తాగి తందనాలాడతానంటే  ఇంటికి పోదాం పదండి.

    ఈ మాత్రం  సౌభాగ్యానికి  బెంగుళూరెందుకు  రావడం?" అన్నాను.

    "అలాగే_పగలు  తాగనులే" అన్నారు.

    మా స్నానాలు, టిఫిన్లయ్యేసరికి  దగ్గిర దగ్గిర  పన్నెండు  గంటలయింది. ఇద్దరం  రూము  తాళం వేసుకొని  ఆటోలో  బయలుదేరాం. బెంగుళూరంతా  ఓ రౌండ్ కొట్టాం.

    శ్రీ పట్టాభిగారు  అప్పుడు బెంగుళూరులోనే వున్నారు. వారింటికి వెళ్ళాం. శ్రీశ్రీగారిని  చూడగానే  ఆయన ఎంతో పొంగిపోయారు. ఆ పూట వారింట్లోనే భోజనాలు చేశాం.

    అక్కడ  నుండి  ఊడిపడేసరికి నాలుగు గంటలయింది.

    "రేపు మైసూరు  వెళదామా?" అని అడిగారు.

    "ఎందుకులెండి" అన్నాను.

    వచ్చినదారినే  మరోసారి  రౌండ్ కొట్టి రూముకి చేరుకున్నాం. బోయ్ చేత బాటిల్ తెప్పించారు.

    "ఇప్పుడు  తాగితే  ఒప్పుకోను" అన్నాను.

    "సరే_నువ్వు  తాగమన్నప్పుడే  తాగుతానులే" అన్నారు.

    బాటిల్ దాచేశాను.

    "అబ్బా! దాచకు సరోజా! దాన్నక్కడే  ఆ టేబిల్ మీదే వుండనీ, తాగనంటే తాగను. నా సంగతి నీకింకా తెలియదు" అన్నారు.

    "తెలియకేమండీ బాబూ! పూర్తిగా  కాకున్నా  కొంతవరకైనా  తెలుసుకున్నాను. కానీ ఇప్పుడేమిటి  మన ప్రోగ్రాం?" అని అడిగాను.

    "సినిమాకి వెళదామా" అని అడిగారు.

    ఇద్దరం  కాఫీ  టిఫిన్  చేసి సినిమాకి వెళ్ళాం. ఆ మూడు రోజులుగా బెంగుళూరులో  గడిపి  మద్రాసు చేరుకున్నాం. గొడవలేమీ లేవు.
ఎవరిళ్ళలో వాళ్ళం హాయిగా  ఉంటున్నాం. రెండు మూడుసార్లు  రవణమ్మగారు రమ్మని కబురు చేశారు. కారణాంతరాలవల్ల  నేను వెళ్ళలేకపోయాను.

    1959 వ సంవత్సరం  ప్రవేశించింది.

    నాకు ఒంట్లో  బాగుండడంలేదు .డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ప్రెగ్నెన్సీ  అని డాక్టర్ చెప్పారు.

    ఇక శ్రీశ్రీగారి ఆనందానికి  అంతులేదు. 'నిజంగానే_నిజంగానే' అని రోజుకి ఎన్నిసార్లు  అనేవారో!

    "అబ్బబ్బో! శ్రీశ్రీకి పిల్లల్ని  కంటున్నావేమిటి? నిజంగా నువ్వు రాక్షసివేనే" అని అంటూవుంటే, వారి సంతోషాన్ని చూసిన నాకు  కళ్ళనీళ్ళు గిర్రున తిరిగేవి.

    మొదట్లో  కొంచెం  అవస్థపడినా  తర్వాత  మామూలుగా కంపెనీకి వెళ్ళి పనులూ, పాట్లూ చేసుకొనేవాళ్ళం. కస్తూరీ సుబ్బరామన్ గారు  తీసిన 'నాన్ సొల్లుమ్ రగసియం' అనే సినిమాను స్వంతంగా డబ్ చెయ్యాలని ప్రయత్నాలు మొదలుపెట్టాం. మా యిద్దరికీ స్వంత పిక్చర్ తియ్యాలంటే  మహా సరదా.

    ఎడిటర్  మాణిక్యంగారి  ప్రోత్సాహంతో  పిక్చర్  తియ్యడానికి  నడుంకట్టాం. పాటలూ ,మాటలూ  రాసేశారు. స్క్రిప్టు ఫెయిర్ కూడా చేసేశాను. ఇక రికార్డింగ్ కి వెళ్ళాలి.

    ఆ సమయంలో  "స్టాక్ హోమ్ వెళతానన్నా"రు  శ్రీశ్రీగారు.

    "ఇప్పుడెందుకు?" అన్నాను.

    "వెళ్ళాలి సరోజా! నాతోపాటు  పెద్దావిడనీ (రవణమ్మగారిని), అమ్మాజీని కూడా  తీసుకువెళతాను" అని అన్నారు.

    "డబ్బులేవీ?" అని అడిగాను.

    "దానికీ ,అమ్మాజీకి  అది డబ్బులు పెట్టుకుంటుందట" అన్నారు.

    చివరికి  ప్రయాణం  మరో వారం రోజులుందనగా  ఆవిడ  ఇంట్లో  బంగారమంతా  అంటే వడ్డాణం, కాసులమాల, పెద్ద పెద్ద  గొలుసులు, నక్లెస్ లు, వెండీ_వగైరాలతో  పాటు  ఇల్లు కూడ తాకట్టుపెట్టి  డబ్బు తెస్తున్నారని డ్రైవర్ సుబ్బారావు చెప్పగా విన్నాను.

    నేనిక  రంగంలోకి దిగాను.

    స్వంత పిక్చర్  డబ్బింగ్ కే రెండు లక్షల దాకా  ఖర్చవుతుంది. అందులో కనీసం లక్షదాకా మనమే పెట్టుకోవాలి. తీరా పిక్చర్  ఏమవుతుందో? ఉండే ఇల్లూ, వాకిళ్ళూ కూడా ఎగిరిపోతే, నడి రోడ్డున  పడతామని, తాకట్లు  పెట్టి వాళ్ళని  తీసుకు వెళ్ళొద్దని  డబ్బుంటే  తప్పకుండా  తీసుకు వెళ్ళమని  గొడవ చేశాను.

    అప్పటికే  నాకు తెలియకుండా కారు మీద ఆరువేలు, వెండి బంగారాల మీద ఇరవై అయిదు వేలు దాకా తెచ్చేశారు. తిడితే  తిట్టారులే  అని కల్పించుకున్నాను.

    రెండు మూడు రోజులు గొడవలయ్యాయి. నేను ఆవిడ్ని తీసుకొని  మార్వాడి దగ్గరికి వెళ్ళి నగల మీద ఇచ్చిన డబ్బు వాడికిచ్చేసి  నగలన్నీ విడిపించేసి ఆవిడ ఇంట్లో  పడేశాను. ఇక ఇంటి మీద  అప్పు తెచ్చే ప్రశ్నే లేదు. మొదట్లో  నా మీద విసుక్కొని  తిట్టినా తర్వాత  ఆవిడ నన్ను చాలా మెచ్చుకున్నారు.

    కారు మీద తెచ్చిన  కేష్ మాత్రం వుంది. దాని మీద మరి కొంత డబ్బువేసి  శ్రీశ్రీగారు 5_5_59 వ తేదీన బయలుదేరి స్టాక్ హోమ్ కి వెళ్లారు. పది రోజుల తర్వాత  ప్రయాణం ముగించుకొని  స్వదేశానికి  తిరిగివచ్చేలోగా  నేను మా స్వంత పిక్చర్ మాటలూ, పాటలూ  పూర్తి చేసేశాను. ఎవ్వరికి నయాపైసా  బాకీ  పెట్టలేదు. డబ్బింగ్ దైలాగ్సు డైరెక్షన్ అన్నీ నేనే చేసుకున్నాను. నా సంగీత దర్శకత్వంలో  శ్రీ ఘంటసాలగారు, సుశీల, పిఠాపురం, మాధవపెద్ది, పి. లీల, ఈశ్వరి  వగైరా_ అందరూ పాడారు. పిక్చర్ బ్రహ్మాండంగా వచ్చింది.

    ఇంటికి రాగానే, "మొత్తం పిక్చర్  పూర్తిచేశాన"నే సరికి  నిర్ఘాంతపోయారు. తరువాత  నేను బిడ్డని కన్నానన్న  సంతోషంతో  వారు తాను సంపాదించుకున్న  ఆస్తిపాస్తుల మీద సర్వ హక్కులూ నాకూ, నా పిల్లలకి వుండాలనే ఉద్దేశం మీద, ముందు మామూలుగా పెళ్ళి జరిగినా, 28_5_59 వ తేదీన నన్ను రిజిష్టరు మ్యారేజ్ చేసుకున్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS