Previous Page Next Page 
Sri N T Rama Rao Prasangalu పేజి 24

 

కొండవీటి వైభవం


    
    ఇది చరిత్రాత్మకమైన కథ. తెలుగువారిని ఎంతో ఉత్తేజపరచే కథ ఇది కావ్య రూపంగా రావడం ఎంతో సంతోషించతగినది.
    ఓరుగల్లు కాకతీయులు-గణపతిదేవ చక్రవర్తి, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు తెలుగుగడ్డ కీర్తిని అఖండంగా నిలబెట్టారు.
    ఆ రాజ్య పతనానంతరం తెలుగునాడులో ఎందరో స్వతంత్ర రాజులు పొడుచుకువచ్చారు. వారిలో కొండవీటి రెడ్డి రాజులు ప్రముఖులు.
    అనవేమారెడ్డి, కుమారాగిరి రెడ్డి, పెదకోమటి వేమారెడ్డి, రాచవేమారెడ్డి గొప్ప సాహిత్యప్రియులు; కవులుకూడా వారి పరిపాలనలో కొండవీడు మూడుపువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లింది. 14వ శతాబ్దప్రాంతంలో వంద ఏండ్లకుపైన ఆ రాజ్యం ఎదురులేకుండా విహరించింది.
    అనేకమంది కవులు పండితులు ఆ వంశంలో వెలసారు. వారు వామనభట్టు వంటి సంస్కృత కవిని, శ్రీనాధునివంటి కవిసార్వభౌముని తమ సంస్థానంలో పోషించి తెలుగుదేశానికే గొప్ప గౌరవ ప్రతిష్టలను సంపాదించారు.
    శ్రీనాథుని రచనలు ఆంధ్రభాషలో ఎంతో ప్రచారంపొందాయి. దురదృష్టవశాన కల్లోలాలతో రెడ్డి రాజ్యం అంతరించింది. ఆ వైభవమంతా యుద్దాల తాకిడివల్ల శిధిలమైపోయింది. వేమనవంటి ప్రజాకవి ఆ ప్రాంతంవాడేనని కూడా చెబుతారు.
    తర్వాత గజసతులు, కృష్ణరాయలు, మహమ్మదీయులు ఆక్రమించుకొని పాలించారు.
    రెడ్డిరాజుల పాలన స్వర్ణయుగంగా ఉన్నదంటే అతిశయోక్తికాదు. వారిలో ఐకమత్యం తక్కువై రాజ్యం అంతరించింది. తెలుగువారికి అప్పుడు కలిగిన దెబ్బవల్ల కోలుకోవడం కష్టమైంది.
    అటువంటి వీరగాథలను, వైభవమైన కథలను మన కవులు కవితా వస్తువుగా స్వీకరించి ప్రజలలో చైతన్యం కలిగించాలి. తమ కవిత్వాన్ని జనంలోకి దూసుకపోయేటట్టు చెయ్యాలి. అప్పుడు మనం తెలుగు వాళ్ళంగా పుట్టినందుకు జన్మసార్ధకమౌతుంది.
    తెలుగుభాష పూర్వప్రతిష్ఠ పొందాలంటే గొప్ప ప్రయత్నం జరగాలి. తేకుగును అధికార భాషగాపొంది, ఆభాషలో రుచిని ప్రతి తెలుగువాడు అనుభవించాలి. అందుకు ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. సాహిత్యవేత్తలు సహాయపడాలి. మాటు మణిగిపోయిన ఇటువంటి ప్రశస్తమైన కథను తీసుకొని కావ్యంగా వ్రాసినందుకు కొసరాజుగారిని అభినందిస్తున్నాను.
    సాహిత్య సంపన్నులైన తెలుగు కవులు ఒక్కసారి తమ కలాలకు పదునుపెట్టి మన దేశ కథలకు స్వరూపం కల్పించాలి.
    ఇటువంటి మధురమైన కావ్యాన్ని కృతి స్వీకరణం చేసిన అయ్యపు రెడ్డిగారు శాశ్వతమైన కీర్తి పొందగలరని భావిస్తూ ఈ కావ్యావిష్కరణ చేస్తున్నాను.
    తెలుగునాట వచ్చిన ప్రతి ప్రజా ఉద్యమాల్లోను పాల్గొని జానపద సాహిత్యాన్ని కోకొల్లగా సృష్టించిన కొసరాజుకు మూడు సంవత్సరాలనాడు మద్రాసులో జరిగిన సన్మాన సభలో నాచేతిమీదుగా కనకాభిషేకం చేశాను. ఈరోజు 'కొండవీటి వైభవాన్ని'నా చేతులమీదుగా ఆవిష్కరిస్తున్నాను. శ్రీకొసరాజు చిరకాలం తెలుగు సారస్వతానికి తన అమూల్యసేవ లందించాలని ఆకాంక్షిస్తున్నాను.
    
         శ్రీ కొసరాజు రచించిన 'కొండవీటి వైభవం' కావ్యావిష్కరణ సందర్భంగా హైదరాబాదులో

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS