Previous Page Next Page 
చీఫ్ మినిస్టర్ పేజి 24

 

టీవీల్లో లైవ్ మొదలయాకో, హీరోయిన్ శైల శ్రీ రాజకీయాల్లోకి వచ్చాకో వాళ్ల లో ఇలాంటి వింత పోకడలు మొదలయ్యాయి. 

శైల శ్రీ ఒక్క రోజు కూడా సభకి రాదు. వీళ్ళలో ఆమె కంట పడాలన్న ఆశ చావదు.

నవ్వుకున్నాడు కార్తీక్.

స్పీకర్ తన సీట్ దగ్గరకి వెళ్ళగానే అంతా లేచి నిలబడ్డారు. 

"తనకి దక్కే గౌరవం అంతా అసెంబ్లీలో నే. బయట తను వెళ్లి అడిగితే ఒక్క పని చేయరు. ఇక్కడ నక్క వినయాలకేం కొదవ లేదు"  స్పీకర్ కసిగా అనుకున్నాడు.

జాతీయ గీతం పాడాక తను కూర్చుంటూ అందరినీ కూర్చోమని ఆదేశించాడు. 

ఆ సంవత్సరం అప్పటి వరకూ మరణించిన రాజకీయ నాయకులకు నివాళి ప్రకటించి, అంతా రెండు నిమిషాలు మౌనం పాటించారు.

"సీఎం చూడు మొహాన్ని ఎంత నిర్మలంగా పెట్టాడో?!. పోయిన వాళ్ళల్లో ముగ్గురిని మనోడే లేపించాడు. మనం చంపించిన వాళ్ళకి మనమే సంతాపం ప్రకటించటంలో ఉన్న కిక్కే వేరబ్బా! అనుకుంటూ ఉండి ఉంటాడు" ఒక మంత్రి గొణుక్కోవటం వినపడింది కార్తీక్ కి.

చివుక్కుమంది అతని మనస్సు. తన అన్న మీద విరక్తి లాంటి భావం కదిలింది. 

"ముందుగా గవర్నర్ ప్రసంగంతో సభ మొదలవుతుంది" ప్రకటించాడు స్పీకర్.

ఆ ఏడాది అదే మొదటి సమావేశం.

గవర్నర్ తోస్తే పడిపోయేట్లుగా ఉన్నాడు. అతి కష్టం మీద డైయస్ మీదకి ఎక్కుతున్నాడు.

హడావుడి గా అప్పుడే లోపలకి వచ్చాడు ప్రతిపక్ష నాయకుడు పార్థు.

వస్తూనే స్పీకర్ పోడియం దగ్గరకి నడిచాడు. 

"గవర్నర్ ప్రసంగం మొత్తం తప్పుల తడక.  ఆసాంతం అబద్ధాల తో నిండి ఉంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని అయిన నేను రాక ముందే ప్రసంగం పూర్తి చేశారు. ప్రభుత్వ తప్పుల్ని నేను ఎత్తి చూపుతానని కావాలని, కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. నేను రాకముందే, ఎజెండా లో ఇచ్చిన విధంగా కాకుండా ఇలా ముందే పూర్తి చేయటం లో ఉద్దేశ్యం ఏమిటి అధ్యక్షా? ప్రతి విషయం లో అవినీతి జరుగుతోంది. అవినీతి లేనిది ఎక్కడ? వ్యవస్థ కుళ్ళిపోయింది. గవర్నర్ గారేమో గవర్నమెంట్ ని ఆకాశానికి ఎత్తటం హాస్యాస్పదంగా లేదా అని అడుగుతున్నాను అధ్యక్షా!"

స్పీకర్ బిత్తరపోయి చూస్తున్నాడు.  నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే వేరే పార్టీలోకి పోవాలని చూస్తున్న వాళ్లలో స్పీకర్ మొదటివాడు. 

సుధీర్ అధికారం లోకి వచ్చిన కొత్తలో అతను అడిగిన కాంట్రాక్టు అతనికి దక్కకుండా చేసి, ఎక్కువ కమీషన్ ఇచ్చిన మరో కాంట్రాక్టర్ కి ఇప్పించాడు. మంత్రి పదవి ఇవ్వకుండా స్పీకర్ పోస్ట్ అంటగట్టాడు. కనీసం ఆ పదవి ఇవ్వకపోయినా అదొక తీరుగా ఉండేది. స్పీకర్ పదవి అంటే అసెంబ్లీ జరిగినన్నాళ్ళూ గొడ్డు చాకిరీ తప్పదు.

పైకి మామూలుగానే ఉంటూ వచ్చినా అతనా విషయం మనసులో పెట్టుకున్నాడు.

అతను పార్ధుకి సైగలు చేయటానికి ప్రయత్నించాడు. కానీ పార్థు కి అర్ధం కావటం లేదు. తన ధోరణి లో తను ఉన్నాడు. 

పార్థు పార్టీలో నెంబర్ టూ గా చెప్పుకునే అతను వచ్చి పార్థు చెయ్యి పట్టుకుని చెవి లో చెప్పాడు.

"ఇంకా ప్రసంగం మొదలవలేదు. మీ స్పీచ్ గవర్నర్ ప్రసంగం తర్వాత చదవొచ్చు. కాసేపు ఓపిక పట్టండి. పావుగంట నుంచి ముసలోడు స్టేజి ఎక్కుతున్నాడో, దిగుతున్నాడో అర్ధం కాక చస్తున్నాం. మీరు కాస్త అత్యుత్సాహం తగ్గించుకోవాలి."

గతుక్కుమన్నాడు పార్థు. గబగబా ఏమీ జరగనట్లే తన సీట్ వైపుకు నడిచాడు. అతనికి కాస్త అవమానంగా అనిపించింది. అందరూ తనని చూసి నవ్వుకుంటున్నారనిపిస్తోంది. 

"గవర్నర్ గారు స్టేజి ఎక్కుతుండగా ఈయన అనవసరంగా గొడవ చేశాడు. అతికష్టం మీద గవర్నర్ వెనక్కి తిరిగాడు. ఇపుడు మళ్ళీ ముందుకి తిరగాలి. మళ్ళీ అదొక పావుగంట ప్రహసనం. అన్నిటికీ హడావుడి. ఈయన చేష్టలతో పరువు పోతోంది"

దారిలో ఇద్దరు ఎమ్మెల్యేలు మాట్లాడుకోవడం వినపడింది. "ఇద్దరూ తన పార్టీ ఎమ్మెల్యేలే. ఇద్దరూ పరువు అన్న పదం ఎత్తే అర్హత లేనివాళ్లే. ఒకడు రౌడీ వెధవ, ఇంకొకడు ఒక పెద్ద మనిషి ఇంట్లో పనివాడిగా చేరి, అతణ్ణి హత్య చేసి ఆస్తి మొత్తం కొట్టేసాడని జనాలు చెప్పుకుంటారు. ఈ సన్నాసులు కూడా పరువు గురించి మాట్లాడటం. వాగనీ, కొన్నాళ్ళు ఇటువంటివి భరించక తప్పదు. ప్రస్తుతం తను ప్రభుత్వాన్ని కూల్చేసి తమ పార్టీని అధికారం లోకి తేవాలి. తను సీఎం అవ్వాలి"

సీట్ వద్దకు వెళ్తుండగా కనపడ్డాడు సీఎం. తన వైపు చూసి పలకరింపుగా నవ్వాడు. ఒక్క క్షణం పార్ధుకి సీఎం ని గట్టిగా హత్తుకుని భోరున ఏడవాలనిపించింది.  చిన్న పిల్లలను కొత్త వాళ్ళ మధ్యలో ఉంచితే సడన్ గా తల్లో, తండ్రో కనపడితే అనిపించే ఫీలింగ్. 

ఒక్క క్షణం మాత్రమే. మళ్ళీ సర్దుకుని గంభీరంగా మొహం పెట్టి వెళ్లి తన సీట్ లో కూర్చున్నాడు. 

"తను ఎందుకలా ఫీల్ అయ్యాడు. అతన్ని సీట్ దించబోతున్నామన్న గిల్టీ ఫీలింగ్ తనలో ఉందా? లేక వయసు వల్ల తనలో హార్మోన్ల తేడా వచ్చి ఇలా అనిపిస్తోందా?"

గవర్నర్ ప్రసంగం మొదలయింది.

ఎమ్మెల్యే సుబ్బారావు తన పక్కన ఉన్న అతనితో గుసగుస గా అన్నాడు.

"నాకు నిద్రలేమి సమస్య బాగా ఉందోయ్. ఈ సెషన్స్ లో హాయిగా నిద్ర పడుతుందంటే నమ్ము. అసెంబ్లీ జరిగినన్ని రోజులు ప్రశాంతమయిన నిద్ర పడుతుంది. ముఖ్యంగా గవర్నర్ స్పీచ్ అప్పుడు గాఢ నిద్ర పట్టేస్తుంది" చెప్తూనే నిద్రలోకి జారుకున్నాడు. 

తల కొట్టుకొన్నాడు పక్కనున్న ఎమ్మెల్యే.

***

"నా గవర్నమెంట్ చేసిన కృషి వల్ల ఒక్క సంవత్సరం లోనే అక్షరాస్యత లో దేశం లో అయిదవ స్థానానికి చేరుకున్నాం." చెప్తున్నాడు గవర్నర్.

"అంతకు ముందు మూడవ స్థానం లో ఉండేది" గొణుక్కున్నాడు అధికార పార్టీ ఎమ్మెల్యే. 

"అయినా పోయిన సంవత్సరం లెక్కలు ఎవరికి గుర్తు ఉంటాయిలే!" తనే సర్దిచెప్పుకున్నాడు.

"నా గవర్నమెంట్ రాష్ట్రం మొత్తం రోడ్లు వేసింది. పక్కారోడ్ లేని ప్రాంతం కనపడని రాష్ట్రం ఏదయినా ఉంది అంటే అది మన రాష్ట్రమే అని చెప్పటానికి గర్వపడుతున్నాను."

"కళ్ళు కనిపిస్తేగా రోడ్స్ ఉన్నదీ లేనిదీ తెలిసేది.  ఇందుకే వెతికి ఇట్లాంటి వాళ్ళని గవర్నర్స్ గా వేస్తారనుకుంటా" అనుకున్నాడొక కుర్ర ఎమ్మెల్యే.

"నా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాల వల్ల ఎంతో మంది లబ్ది పొందుతున్నారు."

చదువుతూ పోతున్నాడు గవర్నర్.

ప్రసంగం మొత్తం అతిశయోక్తులు తో నిండి ఉంది. వినటానికి అధికార పార్టీ వాళ్ళకే చాలా మొహమాటం గా ఉంది.

చేతులు నులుముకుంటున్నారు. వేరే పార్టీ ల వాళ్ళు తమకేసి చూసినప్పుడు వెర్రి నవ్వు నవ్వుతున్నారు.

***

స్పీకర్ కి చిన్న నోట్ పంపింది వాణి. ప్యూన్ తీసుకెళ్లి అది స్పీకర్ కి ఇచ్చాడు. గమనించిన కొంత మందికి అదేంటోనని కుతూహలంగా ఉంది.

నోట్ తీసుకుని కళ్ళజోడు పెట్టుకుని చదివి వాణి కూర్చున్న వైపు చిరాగ్గా చూశాడు. 

అందులో 'ఇవాళ తనకొక టాపిక్ ఉందనీ, గవర్నర్ ప్రసంగం అవ్వగానే తనకి అవకాశం ఇప్పించమనీ' ఉంది 

అతనికి వొళ్ళు మండటానికి కారణం ఉంది. ఇదివరకు ఒకసారి ఇటువంటి అభ్యర్ధన పంపింది. వృత్తి పట్ల ఆమె నిబద్ధత కి తనెంతో ముచ్చట పడ్డాడు. తర్వాత తెలిసింది రోజు గడుస్తున్న కొద్దీ మేకప్ చెరిగి పోతుంటుంది కాబట్టి ముందే మాట్లాడే అవకాశం అడిగిందని. యూట్యూబ్, అసెంబ్లీ లైవ్ వచ్చాక అందరూ ఇట్లాగే తయారయ్యారు.

***

గవర్నర్ స్పీచ్ అయ్యాక టీ బ్రేక్.

అక్కడ అన్ని పార్టీ ల వాళ్లు కలిసి మెలిసి కబుర్లు చెప్పుకుంటున్నారు. కొందరికి బిజినెస్ రీత్యా ఏర్పడిన సంబంధాలు ఉన్నాయి, మరి కొంత మందికి బంధుత్వాలు, స్నేహాలు ఉన్నాయి. 

రాజకీయ నాయకుల జీవితం మొత్తం అవకాశాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ అవకాశం ఉంటే వాళ్ళక్కడ వాలిపోతారు. అవసరమైతే కాళ్ళు, లేకపోతే జుట్టు పట్టుకోడానికి వెనుకాడరు. వాళ్ళకి శత్రువులు, మిత్రులన్న ఉద్దేశ్యాలు ఉండవు.

ఆ సంగతి తెలియని కొంతమంది ప్రజలు యూట్యూబ్ లో, సోషల్ మీడియా లో నోటికి వచ్చిన కామెంట్స్ పెట్టి, ఒకరినొకరు తిట్టుకుంటూ తెలిసిన వాళ్ళతో, స్నేహితులతో, బంధువులతో గొడవలు పెట్టుకుంటారు. బీపీ లు పెంచుకుని అనారోగ్యాలు కొని తెచ్చుకుంటారు. 

***

మళ్ళీ సభ మొదలయింది.

లైవ్ లో చూస్తున్న సుధీర్ కి ఆందోళనగా ఉంది. ఆ టైం లో బీపీ చూసుకుని ఉంటే మరింత పెరిగి ఉండేది.

టీ టైం లో స్పీకర్ తో సీఎం మాట్లాడటం కొంతమంది గమనించారు. అది లైవ్ టెలికాస్ట్ కాకపోవడం వల్ల సుధీర్ కి తెలిసే అవకాశం లేదు.

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టాడు అధికార పార్టీ సభ్యుడు.

దానిపైన వాదోపవాదాలు మొదలయ్యాయి.

ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడసాగాడు.

"గవర్నర్ ప్రసంగం అబద్ధాల పుట్ట లాగా ఉంది. కంటికి కనపడుతున్న ప్రతి తప్పుని అడ్డగోలుగా కప్పెట్టి ప్రగతి కింద చూపిస్తున్నారు. కళ్ళు పోతాయి అధ్యక్షా!"

స్పీకర్ అతడిని వారిస్తూ అన్నాడు.
"గవర్నర్ గురించి కళ్ళు పోతాయని మాట్లాడకూడదు. మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి. లేదా మీ మాటల్ని రికార్డుల నుంచి తొలగించాల్సి వస్తుంది."

"అబద్ధాలు విన్న ఆక్రోశం తో వచ్చిన మాటలు తప్ప గవర్నర్ ని కానీ మరొకరిని కానీ కించపరిచే ఉద్దేశ్యం లేదు అధ్యక్షా! ఒకవేళ నా మాటలు తప్పయితే గవర్నర్ గారిని క్షమాపణ కోరుతున్నాను" అంటూనే ప్రసంగాన్ని కొనసాగించాడు.

"స్త్రీ సాధికారిత గురించి ఇందాక గవర్నర్ గారు మాట్లాడారు. సాధికారత కాదు సరి కదా, వాళ్ళకి మర్యాదగా బ్రతికే అవకాశాన్ని కూడా మనం ఇవ్వటం లేదు. ఈ గవర్నమెంట్ ఏర్పడ్డాక ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు అక్షరాలా యాభై శాతం పెరిగాయి. గత సంవత్సర కాలంలోనే మూడు వేల పై చిలుకు గృహ హింస కేసులు, రెండంకెల్లో ఆసిడ్ దాడులు, అయిదు వందల పైన రేప్ కేసులు నమోదయ్యాయి" చెప్తున్నాడు.

అభ్యంతరం తెలిపింది అధికార పార్టీ సభ్యురాలు మంజుల.

"ఇంత మంది ఆడవాళ్ళం ఉన్న సభలో రేప్ లాంటి అసభ్యపదజాలం వాడకుండా చూడాల్సిన బాధ్యత మీదే అధ్యక్షా!"

"రేప్ అనే పదం వెనక్కి తీసుకోవాల్సిందిగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని కోరుతున్నాను" అన్నాడు స్పీకర్.

కోపంగా చూశాడు పార్థు. అతని సహనానికి పరీక్ష లా ఉంది.

"ఇకపోతే రోడ్లు అధ్యక్షా, ఎన్నో యాక్సిడెంట్ లకి ఈ రోడ్లు కారణం అవుతున్నాయి. అసలు రోడ్లు ఎక్కడ వేశారు అని అడుగుతున్నాను అధ్యక్షా!  సీఎం కాంట్రాక్టర్ తో కుమ్మక్కై ప్రజల నోట్లో మట్టి కొట్టాడు"

అతనికి మళ్ళీ బ్రేక్ పడింది.

ఈ సారి అధికార పార్టీ కి చెందిన సీనియర్ నాయకుడు అభ్యంతరం లేవనెత్తాడు. 
"ప్రజల నోట్లో మట్టి కొట్టటం అనే వాక్యం తప్పు అధ్యక్షా! మట్టి ఎవరి మీద వేస్తారు అధ్యక్షా? చనిపోయిన వాళ్ళ మీద. అంటే ప్రజలు బ్రతికున్నా చచ్చి పోయినట్లే వారు భావిస్తున్నారా? నాకు సమాధానం చెప్పక్కర్లేదు కానీ ప్రజలకి వారు సమాధానం చెప్పి తీరాలి."
 

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS