Previous Page Next Page 
చీఫ్ మినిస్టర్ పేజి 23

 

ఆ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

అన్ని చానెల్స్ లైవ్ అని జనాల్ని ఊదరగొడుతున్నాయి.

ఇంకా అసెంబ్లీ కి వెళ్లాల్సిన రాజకీయ నాయకులు లేచి మొహాలు కడుక్కోక ముందే యూట్యూబ్ చానెల్స్ లైవ్ కోసం నిరీక్షిస్తూ, గొడవలు పడటం మొదలెట్టారు వాళ్ల సోషల్ మీడియా టీం మెంబర్స్, ఫాలోవర్లు.

అధికార పార్టీ: "ఇవ్వాళ ఉంటది మీ వాడికి" 

ప్రధాన ప్రతిపక్ష: "ఏం పీకుతారురా!"

మరో ప్రతిపక్ష: "ఒరేయ్. మా అన్న దేవుడురా".

అ పా: "మొన్న మా అన్న ని ఏదో వాగావ్. మళ్ళీ అను చూద్దాం"

ప్ర ప్ర: "మీ అన్న ఎదవ. నువ్వు కూడా"

మరో ప్రతిపక్ష: ఒరేయ్. మా అన్న దేవుడురా

అ పా: "నువ్వివాళ అయిపోయావ్ రా నా చేతిలో. దమ్ముంటే నీ అడ్రస్ చెప్పరా"

ప్ర ప్ర: "దమ్ముంటే కనుక్కోరా నా అడ్రస్"

మ ప్ర: నాతో ఎందుకు రా మాట్లాడరు. భయపడుతున్నారా?

అ పా: "అడ్రస్ చెప్పటానికి భయపడే సన్నాసి. మీ కులమే ఇంతరా!"

ప్ర ప్ర: "నీ లాంటి పనికి మాలిన కులం లో పుట్టిన వాడికి నా కులం పేరెత్తే అర్హత లేదురా"

మ ప్ర: ఒరేయ్ మీకు నేను ఎట్లా కనిపిస్తున్నారా? నాతో ఎవరూ వాదించరేంట్రా?
 
వాళ్లందరికీ అధికార, ప్రతిపక్ష పార్టీ ల లీడర్ల కులం పేర్లు తోకలుగా ఉన్నాయి.

అక్కడ నుంచి కులం, తల్లి, భార్య, చెల్లి అందరినీ తిట్టుకుని బీపీలు బాగా పెంచుకున్నాక తీరిగ్గా అసెంబ్లీ లైవ్ మొదలయింది.

----***-----

అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒక్కొక్కరుగా అసెంబ్లీ ఆవరణ లోకి చేరుకోసాగారు.

ప్రెస్ వాళ్ళు ఎమ్మెల్యే ల నుంచి బైట్స్ కోసం ఎగబడ్డారు. 

మరో పక్క కొంత మంది నాయకులు అనధికారికంగా ప్రెస్ వాళ్ళతో చిట్ చాట్ మొదలెట్టారు.

అదే ఆవరణలో ఎమ్మెల్సీల సమావేశం కూడా జరగనుంది. దానికి కూడా నాయకులు చేరుకోసాగారు. 

లోపలకి వెళ్తూ తన పక్కనున్న అతనితో అంటున్నాడొక ఎమ్మెల్సీ.

"మనని ప్రెస్ వాళ్ళు మరీ చూసీ చూడనట్లు చేస్తున్నారు. ఎంత నామినేటెడ్ పదవులు అయితే మాత్రం అంత చులకనా? ప్రజలు ఎన్నుకున్న వాళ్లేమన్నా పత్తిత్తులా? డబ్బులు పంచి, అవిస్తాం, ఇవిస్తాం అని ఎర చూపి, భయపెట్టో, బెదిరించో, రిగ్గింగ్ చేసో గెలిచిన వాళ్లేగా అంతా?"

అతడికి ఈ మధ్యే మొదటిసారిగా పదవి దక్కింది. బిజినెస్ ఫామిలీ కి చెందిన వాడు. అంతకు ముందు ఎమ్మెల్సీ గా ఉన్నతని పదవీ కాలం ముగియడంతో ప్రతిపక్షం ఇతణ్ణి నామినెట్ చేసి గెలిపించుకుంది. అధికారంలో ఉన్న పార్టీ కి ఫండ్స్ భారీ మొత్తంలో ఇచ్చి తనకి కావాల్సిన లైసెన్సులు, స్థలాలు దక్కించుకోవటం అతనికి అలవాటు. కొత్తగా వచ్చిన పదవిని పూర్తి స్థాయిలో అనుభవించాలన్నది అతని కోరిక. ఎవరూ తనని పట్టించుకోకపోవడం అతనికి కాస్త అవమానంగా అనిపిస్తోంది.

"నువ్వు అలా ఫీల్ అవాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రెస్ వాళ్ళు. రాబట్టినా, రాబట్ట లేకపోయినా తర్వాత మన దగ్గరకి వస్తారు ఇంకో వెర్షన్ కోసం అయినా" ఓదార్పుగా భుజం తట్టాడోక సీనియర్.

"అంతగా అయితే  బూతులు లంకించుకోవోయ్. మొత్తం అందరి దృష్టి ని ఆకట్టుకోవచ్చు" వెనుకగా నడుస్తూ సంభాషణ వింటున్న మరో ఎమ్మెల్సీ సరదాగా వాళ్ళ సంభాషణలో పాలు పంచుకున్నాడు.

"వద్దులే అన్నా!" నవ్వేశాడు కొత్త ఎమ్మెల్సీ.

ప్రెస్ వాళ్ళతో ఎమ్మెల్యేలు, మంత్రుల సంభాషణ కొనసాగుతోంది.

"సర్, ఈ రోజు ముఖ్యమంత్రి గారి మీద అవిశ్వాస తీర్మానం పెడతారనే వార్తలు ఎంత వరకూ నిజం? దాని వెనక మీ హాండ్ కూడా ఉందని చెప్పుకుంటున్నారు" ఆర్ధిక శాఖ మంత్రి రాంబాబు ని అడిగాడు ఒకతను.

***

టీవీ లైవ్ లో ఇదంతా చూస్తున్న సుధీర్ గుండె జారినంత పనయింది. 

"ఏమి చెప్తాడు?" అప్రయత్నంగానే ముందుకు జరిగి కూర్చుని వినసాగాడు.

***
" ఎవరు చెప్పుకుంటున్నారు?" అడిగాడు రాంబాబు.

"అందరూ" నీళ్లు నమిలాడు ప్రశ్న అడిగిన జర్నలిస్ట్.

"అందరూ అంటే నేను కూడా అవ్వాలి కదా. నేనైతే నీకేం చెప్పలేదు. అందరూ అంటే ఇంకెవరు?"

బిక్క మొహం వేసాడు జర్నలిస్ట్. అతని దగ్గర ఖచ్చితమయిన ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ సోర్స్ పేరు చెప్పలేడు. పొలిటీషియన్ లు అడ్డగోలు వాదనలకు దిగితే వాళ్ళని ఎదురు ప్రశ్నించటానికి భయపడే వాతావరణం ఉందక్కడ.

"మా సీఎం కి వ్యతిరేకంగా నేనెందుకు పని చేస్తాను?" ఉగ్రరూపం దాల్చాడు రాంబాబు.

"అన్న దేవుడు" కళ్ళు అరమోడ్చి, చేతులతో దణ్ణం పెట్టుకుంటూ అన్నాడు. 

***

తృప్తిగా నవ్వుకున్నాడు సుధీర్. 

రాంబాబు తనకి విశ్వాసపాత్రుడు. ఎక్కడో మారుమూల రౌడీయిజం చేసుకుంటూ బ్రతికే వాడిని తీసుకొచ్చి ఎమ్మెల్యే గా చేసి , మంత్రి పదవి ఇచ్చాడు తను. తనను మోసం చేయడు.

***

అప్పుడే అక్కడికి వస్తూ ప్రతిపక్షానికి చెందిన ముఖ్య నాయకుడు భరణి రాంబాబు తో చేయి కలిపాడు. 

జర్నలిస్ట్లు అతణ్ణి కూడా ప్రశ్నించబోయారు. అందరినీ వారిస్తూ ఒక నమస్కారం పెట్టి, స్నేహ పూర్వకంగా రాంబాబు భుజం మీద చేయి వేసి లోపలకి దారి తీసాడు భరణి.

***

ఎడమ కన్ను అదురుతోంది సుధీర్ కి. వీళ్ళిద్దరికి స్నేహం ఎప్పటి నుంచి?

***

కార్తీక్ అసెంబ్లీ కి బయలుదేరబోతున్నాడు. విష్ణు మళ్ళీ ఒకసారి అతనికి అవిశ్వాసం పెట్టినప్పుడు ఎలా ప్రవర్తించాలో, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలో, మొహం అభావంగా ఎలా పెట్టాలో వివరించబోయాడు.

కొట్టి పారేస్తూ అన్నాడు కార్తీక్. 

"ఎన్ని అసెంబ్లీ సెషన్స్ లైవ్ లో చూడలేదు? ఏ రోజన్నా మొదటి రోజు అసెంబ్లీ సక్రమంగా జరిగిందా? గవర్నర్ స్పీచ్ ఇవ్వటం. అవ్వగానే ప్రతిపక్షాలన్నీ గవర్నర్ ని తిట్టి, మర్నాటికి సభ వాయిదా వేయటం"

***
కార్తీక్ సభ లో అడుగుపెట్టి తన సీట్ లోకి వెళ్లే దారిలో ప్రతిపక్ష సభ్యులని దాటుకుని వెళ్ళాలి.
వాళ్లందరికీ చిరునవ్వుతో అభివాదం చేస్తూ వెళ్తున్నాడు.

అతని చిరునవ్వు నేల మీద సన్నజాజులు కురుస్తున్నట్లు ఉంది. మొదటి వర్షానికి తడిచిన మట్టి వాసనంత ఆహ్లాదంగా ఉంది. ఎమ్మెల్యే వాణి అప్రయత్నంగా జుట్టు సవరించుకుంది.
ప్రతిపక్ష ఎమ్మెల్యే లు మొహం తిప్పుకోకుండా చూస్తున్నారు. 

దానికి మరో కారణం కూడా ఉంది. మొహం మాడ్చుకుని తమని శత్రువుల్లా చూసే సుధీర్ లో ఏమిటీ మార్పు? ఆలోచన లో పడ్డారు.
అవిశ్వాస తీర్మానం అనేసరికి భయం వల్ల కావచ్చు. అయితే ఇక తమకి పిలుపులు వస్తాయి. ఏమి బేరం పెడితే బాగుంటది? లోలోపల వాళ్ళకి చాలా సంతోషంగా ఉంది.

వాణి తన పక్కన ఉన్న పద్మ ని అడిగింది. "ఏమిటండీ? సీఎం లో ఏదో మార్పు కనపడట్లేదా? బొటాక్స్ చేయించుకుని ఉంటాడా?"

తల తిప్పకుండానే అంది పద్మ.

"చెప్పలేం. కలికాలం. ఇదివరకు ఎంత వయసు ఉంటే అంత జ్ఞానులు అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఎంత కుర్రాళ్ళలా కనపడితే అంత సమర్ధులని అనుకోవాల్సి వస్తుంది. ఎంత తెలివితేటలు లేకపోతే అంత తక్కువ వయస్సులో ఈ స్థాయి కి వస్తారు చెప్పు."

"నిజమే అక్కా!" అంది వాణి.

"నన్ను అక్కా అనకు తల్లీ, నీ కంటే పెద్దదాన్ని అనుకుంటారు. నీ కన్నా నేను రెండు నెలలు చిన్నదాన్ని" అంది పద్మ.

మూతి తిప్పింది వాణి. 
"నువ్వా నెక్లెస్ పెట్టక పోతే బాగుంటుంది. లేదా కాస్త లూస్ చేయించరాదూ? టైట్ అయినట్లుంది. నువ్వు మెడ తిప్పరాక ఒకే వైపుకి చూస్తుంటే తమకి లైన్ వేస్తున్నావని ఇద్దరు, ముగ్గురు అనుమానపడి నన్ను అడిగారు కూడా!" కాస్త అక్కసుగా అంది.

నగ సవరించుకుని ఆమె మాటలు వినపడనట్లు నటించింది పద్మ.

వాళ్ళిద్దరూ పెళపెళ లాడే పట్టు చీరలు కట్టుకుని ఉన్నారు. పెళ్లికో, ఫంక్షన్ కో తయారయినట్లుగా ఉన్నారు.

ముందు వరుసలో కనపడుతున్న అంజలిని చూసి అంది పద్మ.
"ఆమె ఏమిటీ మరీ బైరాగి లాగా తయారవుతుంది.  కాటన్ చీరలు, బోసి మెడ. ఎమ్మెల్యే అన్నాక కాస్త హోదా వెలగబెట్టాలిగా. లేకపోతే ఎవరు విలువిస్తారు?" 

"అదో వేషం అక్కా. ఎమ్మెల్యే అయ్యాక మనందరికంటే ఎక్కువ డబ్బులు నొక్కేసింది. పైకి తెలీకుండా ఉండటానికి ఈ వేషం. ఎవరికి తెలీదు. ఇటువంటి వాళ్ళని చాలా మందిని చూసా" 

"అదిగో మళ్ళీ అక్కా అంటున్నావు" కోపంగా అంది పద్మ.

కార్తీక్ వెళ్లి తన సీట్ లో కూర్చున్నాడు. సుధీర్ కి బాగా నమ్మకస్తులు అనుకున్న వాళ్లంతా ముఖ్యమంత్రి సీట్ చుట్టుపక్కల కూర్చున్నారు.

టీచర్ రావటానికి ముందు స్కూల్ పిల్లలు గబగబా కబుర్లు చెప్పుకున్నట్లుగా మాట్లాడుకుంటున్నారు అంతా.

ఇంకా సభ పలచగానే కనిపిస్తుంది. అప్పటికి యాభై శాతం సీట్లు మాత్రమే నిండాయి.  ఒకొక్కరూ నిద్ర మొహాలతో కాళ్ళను ఈడ్చుకుంటూ చేరుకుంటున్నారు.

***

కాసేపటికి మెల్లగా సభ నిండసాగింది. 

స్పీకర్ అద్దాలు కుట్టిన పట్టు కోటు లాంటిది వేసుకొచ్చాడు. అతని మొహం వైపు పరిశీలనగా చూసిన వాళ్ళకి బాగా పౌడర్ రాసుకొచ్చాడని తెలుస్తోంది.


 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS