"మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి. లేదా రికార్డుల నుంచి తొలగించాల్సి వస్తుంది" అన్నాడు స్పీకర్.
'ఆరాచకంగా ఉంది. అసలు తనేమన్నాడు. దాన్ని ఎట్లా మారుస్తున్నారు. తొక్కలో రికార్డులు. తొలగించుకుంటే తొలగించుకోండి. రికార్డులు ఎక్కడుంటాయో, వాటితో ఏం చేస్తారో కూడా ఎవ్వరికీ తెలీదు.' పళ్ళు పటపట కొరికిన శబ్దం చుట్టుపక్కల వాళ్లందరికీ వినపడింది. ఏది మాట్లాడినా ఇష్యూ చేస్తున్నారని ప్రసంగం ముగించేసి కూర్చున్నాడు పార్థు.
కార్తీక్ కి అతణ్ణి చూస్తే నవ్వొస్తోంది. మరో పక్క జాలేస్తోంది.
మరో ఇద్దరు ప్రతిపక్ష పార్టీల వాళ్ళు మాట్లాడాక చివరిగా సీఎం కి మాట్లాడే అవకాశం వచ్చింది.
కార్తీక్ మాట్లాడటం మొదలెట్టాడు.
"మా గవర్నమెంట్ కి సహాయసహకారాలు అందిస్తున్న అధికారులు, ప్రజలు, ప్రతిపక్షాలు అందరికీ మా ధన్యవాదాలు. అలాగే గత సంవత్సర కాలంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి జనరస్ గా ప్రసంగించిన గవర్నర్ గారికి మా ధన్యవాదాలు. అయితే కొన్ని అంశాల్లో మా పని తీరు మెరుగుపర్చుకోవాల్సి ఉందనే విషయం నాకు తెలుసు. గత కొన్నాళ్లుగా ఆత్మ పరిశీలన చేసుకోవటంతో పాటు, అధికారులతో మేము సమీక్షలు నిర్వహించి మేము చేయాల్సిన పనుల పైన ఒక అంచనా కి వచ్చాము. అంతే కాకుండా ఒక టైం లైన్ పెట్టుకుని మేము చేయాల్సినవి రాబోయే సంవత్సర కాలంలో పూర్తి చేస్తానని మీ అందరికీ మాట ఇస్తున్నాను"
ఎమ్మెల్యేలు చాలా మంది అలోచనలో పడ్డారు.
'ఏంటీ కొత్త నాటకం? ఆత్మపరిశీలన చేసుకోవాలంటే ఆత్మ ఉండాలి కదా. వీడిలో ఉన్నది ఆత్మ కాదు ప్రేతాత్మ.'
కొన్ని క్షణాలు ఆగి బాంబ్ పేల్చాడు కార్తీక్. (సుధీర్ స్థానంలో ఉన్న కార్తీక్)
"అయితే ఇవన్నీ చేయడానికి ముందుగా నా బలాన్ని నేను నిరూపించుకోదల్చుకున్నాను. గత కొన్నాళ్లుగా నన్ను పదవి నుంచి తప్పించి కుర్చీలో ఎక్కాలని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలన్నీ నాకు తెలుసు. నా బలాన్ని నిరూపించుకోవడానికి ట్రస్ట్ మోషన్ మూవ్ చేస్తున్నాను. దీనికి అంగీకరించి నాకు అవకాశం ఇవ్వాలసిందిగా స్పీకర్ గారిని కోరుతున్నాను"
క్షణం పాటు అంతా నిశ్శబ్దం. ఎమ్మెల్యేలంతా ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్నారు. ఇదేమి ట్విస్ట్??!!
పార్థు మొహం పాలిపోయింది. తనకు వచ్చిన ఆన్సర్ ను క్లాసురూమ్ లో పక్కనున్న పిల్లవాడు తనకంటే ముందు చెప్తే వచ్చే లాంటి ఉక్రోషం ఫీల్ అయ్యాడు.
'అంతా తొండి. తమ వైపు నుంచి రావాల్సిన అవిశ్వాస తీర్మానం అతని వైపు నుంచి వచ్చింది.' అతని మనసు ఘోషిస్తోంది.
తర్వాత ప్రక్రియ అంతా యధాప్రకారంగా జరిగింది.
రెండు రోజుల పాటు సభ వాయిదా పడింది. మూడవ రోజు ముఖ్యమంత్రి తన బలాన్ని అసెంబ్లీలో నిరూపించుకోవల్సిందిగా షెడ్యూల్ నిర్ణయించారు.
***
సుధీర్ ఆగ్రహంతో ఊగిపోతున్నాడు.
'వీడి సంగతి తనకు బాగా తెలుసు. తన పదవి పోగొట్టి కానీ వీడు ఊరుకోడు.
ఇప్పుడేం చేయటానికి కూడా లేదు'.
ఆలోచనలో పడ్డాడు.
***
కార్తీక్ ఆ పూట నుంచే తన ప్రయత్నాలు మొదలెట్టాడు.
మొత్తం సీట్స్ సంఖ్య 270 అయితే అధికార పార్టీ కి ఉన్న మెజారిటీ బొటాబొటి మాత్రమే. 137 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీ నుంచీ గెలుపొందగా 110 మంది ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నారు. ఇద్దరు ఇండిపెండెంట్లు, ఇంకో ప్రతిపక్ష పార్టీ నుంచి 15 మంది, మరో ప్రతిపక్షం నుంచి 8 మంది ఉన్నారు. తనకి తెలిసిన మేరకు తమ పార్టీ నుంచి నలభై మందిని కొనేసాడు పార్థు. మిగిలిన వాళ్ళతో కలిపి కనీసం మరొక 39 మంది ఉంటే కానీ తమ బలం నిరూపించుకోవటం వీలు కాదు.
విష్ణు ఆ సాయంత్రం 15 మంది సభ్యులున్న పార్టీ నాయకుడితో సమావేశం ఏర్పాటు చేశాడు.
అతనితో పాటు ముఖ్యనేతలు మరో ఇద్దరు వస్తారు. తమ వైపు నుంచి కూడా కనీసం మరొకరు ఉంటే బాగుంటుందన్నాడు విష్ణు.
కార్తీక్ కి తన రూమ్ బయటే తచ్చాడుతున్న హోమ్ మంత్రి రాఘవేంద్ర కనపడ్డాడు. ఆర్ధిక మంత్రి రాంబాబు ని పిలుద్దామంటే విష్ణు వద్దన్నాడు. అతని ప్రవర్తన కాస్త అనుమానంగా ఉందనీ, ప్రతిపక్షంతో కుమ్మక్కయి తమ పార్టీ లో వాళ్ళని పార్ధుకి అమ్ముడు పోయేలా చేయటంలో అతనిది ప్రధాన పాత్ర అని టాక్ అన్నాడు.
సాయంత్రం నాలుగవగానే ముందుగా అనుకున్న ప్రకారం గెస్ట్ హౌస్ కి చేరుకున్నారంతా. తామెవరిని కలుపుకోబోతున్నామో ప్రత్యర్థి వర్గానికి తెలీకుండా ఉండాలనే ప్రయత్నం అది. వాళ్ళు మరింత ఎక్కువ ఆశ చూపి గాలం వేసే అవకాశాలు ఉన్నాయి.
డైరెక్ట్ గా విషయం లోకి వచ్చేసారు.
"ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మీకు తెలుసు. మీ మద్దతు మాకు అవసరం. అందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసాం" అన్నాడు కార్తీక్.
"మా దగ్గర ఉన్నది 15 మంది. మీ పొజిషన్ మీకు అర్ధం అవుతుందో లేదో నాకు తెలీట్లేదు. దాదాపు సగం పార్టీ మీది ఖాళీ అవుతోంది. మేము మద్దతు ఇచ్చినంత మాత్రాన మీకు మెజారిటీ రాదు" వింతగా చూసి అన్నాడు ఆ పార్టీ నాయకుడు.
"సగం మంది కాదు దాదాపు నలబై మంది" నవ్వి అన్నాడు కార్తీక్.
"మా పార్టీ లో నుంచి అవతల పార్టీ లోకి వెళ్తున్నట్లే అవతల పార్టీ నుంచి మా దాంట్లోకి వచ్చేవాళ్ళు ఉన్నారు. దాని గురించి మీరు ఆలోచించకండి. మీరు మాకు మద్దతు ఇవ్వండి చాలు"
అక్కడ నుంచి బేరసారాలు మొదలయ్యాయి.
"మాకు రెండు మంత్రి పదవులు కావాలి. రాబోయే మునిసిపల్ ఎలక్షన్స్ లో మేయర్ పదవి"
"మేయర్ పదవి పక్కన పెట్టండి. మునిసిపల్ ఎలెక్షన్స్ నాటికి ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడతారో తెలీదు. అప్పుడు చూద్దాం. 15 మందికి రెండు మంత్రి పదవులు అంటే కష్టం" అన్నాడు కార్తీక్.
వెనక్కి వాలి చూస్తున్నారు వాళ్ళు. చాలా ధీమాగా ఉన్నారు. ఇవ్వక చస్తాడా అన్నట్లుంది వాళ్ళ ప్రవర్తన.
"సార్, ఒక్క నిమిషం" కార్తీక్ ను పక్కకు పిలిచాడు విష్ణు.
రాఘవేంద్ర కూడా వెళ్ళాడు. ముగ్గురూ కాసేపు మాట్లాడుకున్నారు.
వెనక్కొచ్చాక అన్నాడు కార్తీక్.
"ఇప్పటికే అన్ని పదవులు నిండి ఉన్నాయి. ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్ లో మంత్రుల్ని మారిస్తే మళ్ళీ అసంతృప్తి మొదలవుతుంది. ఒక్క మంత్రి పదవి, మేయర్ ఓకే"
"మళ్ళీ ఆలోచించుకోండి. మీరన్నట్లు మేయర్ తర్వాత చూద్దాం. రెండు మంత్రి పదవులు లేకపోతే ఈ డిస్కషన్ అనవసరం" తెగేసి చెప్పాడు ప్రతిపక్ష నాయకుడు.
కాసేపు ఆలోచించి అన్నాడు కార్తీక్.
"సరే. జౌళి శాఖ, దేవాదాయ శాఖ తీసుకోండి" అన్నాడు.
అవతల వాళ్ళు ముగ్గురూ పెద్దగా నవ్వటం మొదలెట్టారు. కింద పడి దొర్లటం ఒక్కటే తక్కువ.
"ఇంకా నయం. క్రీడా శాఖ తీసుకోమనలేదు" నవ్వుతూనే అన్నాడు వాళ్ళ నాయకుడు.
సడన్ గా నవ్వాపి "హోమ్ శాఖ కావాలి. దేవాదాయ శాఖ ఓకే"
'దేవాలయాల భూములు, ఆదాయం, హుండీల్లో డబ్బులు, వెండి శఠగోపాలూ కొట్టేస్తారేమో' అనిపించింది కార్తీక్ కి. పక్కకి చూసేసరికి రాఘవేంద్ర మొహం మాడ్చి ఉన్నాడు.
వాళ్ళందరి ఆరాటాలు చూస్తుంటే కార్తీక్ కి
నవ్వొస్తోంది.
ఆర్ధిక శాఖ, దేవాదాయ శాఖ, చిన్నా చితకా పదవులు రెండు, మూడింటితో బేరం సెటిల్ అయింది చివరకి.
***
కార్తీక్ ఇంటికి వచ్చేసరికి పదయింది. తనలో ఎనర్జీ అంతా ఎవరో స్ట్రా వేసి లాగేసినట్లుంది.
అతని మొహం చూసి నవ్వింది బృంద.
"ఏదో అనుకుంటాం కానీ బాగా ఒత్తిడి ఉండే ఉద్యోగమే సీఎం గిరీ!" అంది
కార్తీక్ తో పాటు విష్ణు వచ్చాడు. ఆ రెండు రోజులు తనతోనే ఉండమన్నాడు అతణ్ణి.
డిన్నర్ చేసి తమ మెజారిటీ నిరూపించుకోటానికి ఇంకా ఏమేమి మార్గాలున్నాయో ఆలోచన మొదలెట్టారు.
"కొత్త వాళ్ళని లాగే కంటే పార్టీ లో నుంచి వెళ్లిపోబోతున్న వాళ్ళ అసంతృప్తి కి కారణం ఏంటో తెలుసుకుని వాళ్ళని ఆపటం బెటర్ ఏమో" అంది బృంద.
"ఫోన్స్ ఆఫ్ చేసుకున్నారు. ఎక్కడున్నారో తెలీదు" చెప్పాడు విష్ణు.
"కొంత మందిని వాళ్ళ భార్యలు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరేమో. వాళ్ల వైపు నుంచి నేను ప్రయత్నిస్తా! లేడీ ఎమ్మెల్యేలు కొంత మందిని కూడా నేను టాప్ చేస్తా" అంది బృంద.
కార్తీక్ ఇప్పుడు ఉన్న వాళ్ళకి తేడా రాకుండా ఏమేమి పదవులు ఎర వేయొచ్చో విష్ణుతో చర్చిస్తూ, నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ కూర్చునే సరికి బాగా లేట్ అయిపోయింది.
అతను పడుకోటానికి వెళ్తున్నప్పుడు బృంద ఫోన్ మాట్లాడుతూ కనపడింది.
***
పొద్దున లేచేసరికి ఆరయింది.
హడావుడి గా లేచి హాల్ లోకి వచ్చాడు కార్తీక్. విష్ణు ఇంకా లేచినట్లు లేడు. బృంద డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని కాఫీ తాగుతోంది.
అతణ్ణి చూసి ఆమె మొహం ఆనందంతో వెలిగిపోయింది.
వేళ్ళు కదిలిస్తూ పది అని రెండు చేతులు విప్పి చూపించింది.
"ఏంటీ?" అన్నాడు.
"పది మందిని మేనేజ్ చేశా" అంది.
"నిజంగా?" ఆశ్చర్య పోతూ అన్నాడు.
అప్పుడు గమనించాడు ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. రాత్రంతా నిద్ర పోకుండా ఫోన్లు చేస్తూ కూర్చున్నట్లుంది.
"నిన్న పదిహేను, ఇప్పుడు పది, మొత్తం ఇరవై ఐదు. ఇంకో పదిహేను మందిని మన వైపు తిప్పుకుంటే చాలు." ఆనందంగా అన్నాడు అప్పుడే హాల్ లోకి వచ్చిన విష్ణు.
అప్పటికే అతను స్నానం చేసి రెడీ అయిపోయాడు.
కాఫీ కప్ తీసుకుని టీవీ ఆన్ చేసాడు కార్తీక్.
'నిన్న తాము డీల్ కుదుర్చుకున్న 15 మంది సభ్యులున్న పార్టీ పార్థు కి మద్దతు ప్రకటించిందనీ, వాళ్ళ మధ్య ఒప్పందం ప్రకారం రెండు కీలకశాఖ లు, ఒక ఉప ముఖ్యమంత్రి పదవి వాళ్ళకి ఖరారు చేసుకున్నారనీ' టీవీ లో బ్రేకింగ్ న్యూస్ వస్తోంది.
---***---
