Previous Page Next Page 
కౌగిట్లో కృష్ణమ్మ పేజి 23

 

    అమ్మా! శ్రేయ్హ కామనతో మీరు చెప్పిన మాటలు పదిలంగా మనసులో దాచుకుంటాను. నా గుండెను గుడిగా మలచి ఆ గుడిలో మీ పాదాలను పవిత్రంగా ప్రతిష్టించుకుని పూజించుకుంటాను. కష్టసుఖాలలో మీరే నాకు తోడూ నీడ అనుకుంటాను.
    ఈ ప్రయత్నంలో నేను పొందగలిగింది ఏమిటో, పోగొట్టుకుంది ఏమిటో నాకు తెలియదు. కాని ఎవరూ లేని నాకు అన్నీ మీరే అయి దారి చూపుతున్నందుకు చివరి ఊపిరి విడిచే దాకా మీ నామం స్మరిస్తాను.
    చీకటి నిండారిన బ్రతుకులో, అనాధలా మిగిలిపోయిన నా బ్రతుకులో కాంతి కిరణంలా మీరు ప్రవేశించినారు. విద్యాలోకానికి వెలుగు కిరణమయిన మీ వ్యక్తిత్వం అనుక్షణం నన్ను ప్రభావితం చేస్తోంది.     
    మీరు నా దైవంగా , మీరే ఆదర్శంగా బ్రతుకు అర్ధాలను అన్వేషించుకుంటాను. ఇక నాకు శెలవు యిప్పించండి" అంటూ మరొక మారు ప్రొఫెసర్ శ్రద్దాదేవి పాదాలకు నుదురు తాకించింది జ్యోతి.
    శ్రేయ కామనతో నిండారిన మనసుతో, వ్యధాపూర్ణ హృదయంతో తడిసిన చెక్కిళ్ళతో, శూన్యమయిపోతున్న నేత్రాలతో, వొణికే చేతులతో ఆమె శిరస్సును తాకి ఆశీర్వదించింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
    శ్రద్దాపూర్ణమయిన మనసుతో, రగులుతున్న అంతర్యంతో , వ్యధాక్షుభితమయిన ఆత్మ సంవేదనతో విడువలేక విడువలేక ప్రొఫెసర్ శ్రద్దాదేవిని విడిచి వెళ్ళిపోయింది జ్యోతి బ్రతుకు లక్ష్యాలను అన్వేషిస్తూ.
    తెగిన గాలిపటం దూరదూర తీరాలకు దిశాంతాలకు ఒంటరిగా గాలి వాటానికి కొట్టుకుపోతున్నట్టు తనతో బంధాన్ని ఒదులుకుని వెళ్ళిపోతున్న జ్యోతిని దిగులుగా చూసింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
    "ఈ పిచ్చి పిల్ల ఒంటరిగా వెళ్ళిపోయి, ఈ పురుషాధిక్య ప్రపంచంలో ఏమి సాధించగలదో కొన్ని రోజుల తర్వాత కదా తెలుస్తుంది" అనుకుంటూ కనుమరుగైపోతున్న ఆమె వంక చూస్తోంది ప్రొఫెసర్ శ్రద్దాదేవి. ఆమె చెంపలు చిత్తడి అయినాయి.
    అందరికీ దూరమయిన ఒంటరి బ్రతుకులో ప్రేమను పంచి యిచ్చిన ఏకైక వ్యక్తీ ప్రొఫెసర్ శ్రద్దాదేవి ని వదలి వెళ్ళిపోయింది జ్యోతి. కృష్ణా తీరంలో విజయవాడ -- అమరావతి ల మధ్య ఆమెకు తెలియని చోటు లేదు." అందునించి ఎగువ ప్రాంతాలకు పోయి ప్రయత్నించాలన్న పట్టుదల, ముందుగా జయ కృష్ణ ను కలుసుకోవటం గురించి ఆలోచిస్తూ సాగిపోయింది. కనుచీకటిపడే వేళకు శ్రీపర్వతం చేరుకుంది జ్యోతి.


                          *    *    *

    జ్యోతి చెప్తున్న సాహసోపేతమైన కార్యక్రమం గురించి విని అబ్బురపడి పోయినాడు. ఆశ్చర్యం వల్ల విప్పరితమయిన నేత్రాలతో  ఆమె వంక రెప్ప వేయక చూశాడతడు.
    ప్రొఫెసర్ శ్రద్దాదేవి ప్రోత్సాహం లభించింది అంటే అది ఎంతో బాధ్యతా యుతమయిన పని అయి వుండాలని భావించాడు. జరిగినది, జరుగవలసినది అంతా విన్నాక అతనిలో ఉత్సాహం ఉరకలు వేసింది.
    జనావాసాలకు దూరంగా అడవుల మధ్యలో, కొండల్లో వుండే పురాతన చరిత్ర తాలుకూ ప్రాంతాలలో త్రవ్వకం పనులు చూసుకుంటూ తిరగటం అర్కేలాజికల్ శాఖ ఉద్యోగులకు అలవాటయిన విద్య.
    అతడు వెంటనే జ్యోతిని వెంట పెట్టుకుని మ్యూజియం. క్యూరేటర్ గారి దగ్గరకు తీసుకుపోయినాడు. అయన గొప్ప అనుభవశాలి. ఉత్తరాది రాష్ట్రాల నించి ట్రాన్స్ ఫర్ మీద ఐలాండ్ మ్యూజియం ఇన్ చార్జిగా వచ్చాడు.
    ఒంకలేని పాపితం చెరగని జుట్టు , చిరునవ్వు అయన ప్రత్యేకతలు. వయసు అయిదు పదులు దాటి వుంటుంది. పేరు శ్రీ బృందావన్ గోయెల్. వృత్తిరిత్యా ఉత్తరాది రాష్ట్రాలలో సాంచి, సారనాద్ కురుక్షేత్రం , గయా లాంటి ప్రాంతాలన్నీ పర్యటించి వచ్చిన వాడాయన. దక్షిణాది రాష్ట్రాల ప్రాచీన చరిత్రల మీద గొప్ప పరిశోదకుడు.
    పైపులో పొగాకు దట్టిస్తూ పదేపదే ఆరిపోతున్న పైపుని పలుమార్లు అగ్గిపుల్ల సాయంతో వెలిగిస్తూ, పొగ దట్టంగా లాగి గుప్పుగుప్పుమని వదులుతూ జయకృష్ణ చెప్పిన జ్యోతి కధను శ్రద్దగా విన్నారయన. వింటున్నంత సేపు చిరునవ్వు చేరగనీయలేదు.
    వినటం పూర్తయాక చివరిసారిగా పైపు నించి పొగను దట్టంగా లాగి మేఘంలా దాన్ని బయటకు వదిలేశాడు. ఆరిపోయిన పైపుని అష్ట్రేలో విదిలిస్తూ చెప్పసాగారు , శ్రీ బృందావన్ గోయల్.
    "అమ్మా! జ్యోతి! నిన్ను చూస్తోంటే నాకు ఎంతో ముచ్చట అనిపిస్తోంది. సాహసమే ఊపిరిగా, పట్టుదల ప్రాణంగా ఉండే ఆడపిల్లలు ఈ తరం యువతీ యువకులకు ఆదర్శ ప్రాయమయినారు.
    తల్లీ! నీవు తప్పనిసరిగా అయినా ఉద్యమించిన కార్యక్రమం చాలా కష్టతరమైనది. ఇందులో ఎంతో బాధ్యతతో పాటు ఎన్నో ప్రమాదాలు కూడా ఉన్నాయి. అయినా నేను నిన్ను నిరుత్సాహపరిచేది లేదు.
    నీ పనిలో నీవు ముందుకి పోవాలి.
    "జయకృష్ణ మంచివాడు. ఈ వరకే నా దృష్టిని ఆకర్షించిన యంగ్ స్కాలర్! అతని సాయంతో నీవు నీ ప్రయత్నంలో పూర్తి విజయం సాధించగలవని విశ్వాస పూర్ణంగా ఆశిస్తున్నాను.
    "చరిత్ర కధాసాగరం. అందునా ఆంధ్రదేశ చరిత్ర కధాసరిత్సాగరమ్! నీవు చెప్పిన ప్రతి అక్షరం యదార్ధమయినదే అని నేను నమ్ముతున్నాను.
    ఈజిప్టు పిరమిడ్ల గురించి , వాటిలోని మమ్మీల గురించి గొప్పగా చెప్పుకోవటం మాత్రమే మనవాళ్ళకి తెలుసు.
    కాని అంతకన్నా అద్భుతాలు వెదికితే మన దేశంలోనూ వున్నాయని అనుకోరు. ఉదాహరణకు ఈ విషయమే చూడు!
    రాక్షసి గుహలు చాలా చారిత్రాత్మక విలువలు కలిగినవి. వాటి గురించి పరిశోధించటం చాలా ప్రయాసతో కూడుకున్న పని ఈ పరిశోధనలో నీవు విజేతవు కాగలిగితే అద్భుతమయిన రహస్యాలు ఎన్నో వెలుగులోకి వస్తాయి."
    "నీ ప్రయత్నం సఫలం కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను" అంటూ ఆశీర్వదించినారు.
    జయకృష్ణ మాట్లాడేందుకు రవంత సందేహించినాడు. జ్యోతి ముందుగా తానే చొరవ తీసుకుంది.
    "క్యూరేటర్ సర్! మీ వంటి జ్ఞానమూర్తుల ప్రోత్సాహం లభించటం నిజంగా నేను చేసుకున్న అదృష్టమే అనుకుంటాను, ఈ పరిశోధన ప్రమాదాలతో కూడుకున్నది అని మీరే అంటున్నారు కదా!
    ఒక వేళ ఈ ప్రయత్నంలో నేను ప్రాణాలను కోల్పోతే ఆ వార్త ఒక్క శ్రద్దాదేవికి చెప్పేందుకయినా జయకృష్ణ నాతొ రావాలి అందుకు వీలవుతుందా అని అడిగితె వారు మీ పర్మిషన్ కావాలంటున్నారు.
    జయకృష్ణగారు నాతొ వుంటే ఈ ప్రయత్నంలో విజయం సాధించగలనని నేను అనుకుంటున్నాను" అంటూ అర్ధించింది జ్యోతి.
    బృందావన్ గోయల్ దాన్ని డిపార్టుమెంటు వ్యవహారంగా తీసుకుని రాబోయే చిక్కుల గురించి రవంత సేపు ఆలోచించారు.
    "డియర్ యంగ్ స్కాలర్! జ్యోతికి నువ్వు ఎలాంటి సాయం అందించాలని అభిప్రాయపడుతున్నావు?" అని అడిగారాయన.
    తను మాట్లాడేందుకు అవకాశమిచ్చినందుకు క్యూరేటర్ బృందావన్ గోయల్ గారికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు జయకృష్ణ. వారి దగ్గర అసిస్టెంట్ క్యూరేటర్ గ పనిచేసి ఎన్నో కొత్త సంగతులు తెలుసుకున్నాడు. అందు నించి వారంటే గురుభావం. ఆ గౌరవంతోనే వారు మాట్లాడేందుకు అనుమతి యిచ్చేదాకా ఎదురు చూశాడు.
    అవకాశం రానే వచ్చింది.
    "క్యూరేటర్ సర్! ప్రొఫెసర్ శ్రద్దాదేవి గురించి మీతో ఈవరకు అనేక సార్లు చెప్పాను. ఆమె దగ్గర కొద్దికాలం చదువుకున్న విద్యార్ధినీ విద్యార్ధులెవ్వరూ ఆమెను జీవితంలో మర్చిపోలేరు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS