పాపా? నీ పేరు ?" ప్రొఫెసర్ కంఠం గంభీరంగా వున్నది.
"సునీత"
"కాదు! మాధవి"
"కాదు! సునీత"
"సునీత అని ఎవరు పిలిచేవాళ్ళు?"
"మా అమ్మా, నాన్న - ఇంకా అందరూ."
"అందరూ అంటే ఇంకా ఎవరు పిలిచే వాళ్ళో చెప్పు!"
"మా వంటవాడు!"
"వాడి పేరు?"
"వాడి పేరు - పేరు"
"బాగా గుర్తు చేసుకో?"
"అవును! రాముడు, వంట రాముడు."
"రాముడంటే నీ కిష్టమేనా?"
"లేదు."
"ఎందుకని?"
"వాడు చెడ్డవాడు?"
"ఎలా వుంటాడు?"
"లావుగా , ఎత్తుగా, నల్లగా , మొద్దులా వుండేవాడు. "
సాగర్ ప్రొఫెసర్ పక్కగా వచ్చి ప్రొఫెసర్ చెవిలో మెల్లగా అన్నాడు.
"డాక్టర్ మూర్తిలా ఉంటాడేమో అడగండి సార్."
"ప్లీజ్ సాగర్! మాట్లాడవద్దు." చంద్ర శేఖర్ సాగర్ కేసి చురుగ్గా చూశాడు. ఆమె ఇప్పుడు బాల్యదశ ట్రాన్స్ లో వున్నది. ఆ ప్రశ్నకు సమాధానం రాకపోవచ్చు."
సాగర్ నిస్పృహతో ప్రొఫెసర్ కేసి చూశాడు. అది గమనించి ప్రొఫెసర్ 'అల్ రైట్ సాగర్! ప్రయత్నిస్తాను" అంటూ ప్రొఫెసర్ చంద్ర శేఖర్ "మాధవీ" అని పిలిచాడు.
మాధవి పలకలేదు.
"సునీత?" మళ్ళా పిలిచాడు చంద్ర శేఖర్.
"ఊ"
"డాక్టర్ మూర్తి తెలుసా?"
"తెలియదు!" మాధవి టపీమని సమాధానం చెప్పింది.సాగర్ అయోమయంలో పడి ప్రొఫెసర్ కేసి ఆశ్చర్యంగా చూశాడు. ప్రొఫెసర్ 'నేను చెప్పానుగా' అన్నట్టు సాగర్ ను ఓసారి చూసి మాధవి పరుకొన్న బల్ల మీదకు మళ్ళీ వంగాడు.
"మాధవీ! సారీ! సునీత! చూడమ్మా పాపా! మీ నాన్నగారి పేరు ఏమిటి?"
'డాడీ!"
"డాడీ సరే! అందరూ ఆయన్నీ యేమని పిలిచేవాళ్ళు?"
డాక్టర్ సాబ్ అని"
"డాక్టర్ సాబ్ అనా?" ప్రొఫెసర్ చంద్ర శేఖరమే ఆశ్చర్యంగా అడిగాడు.
'అవును డాక్టర్ సాబ్ అని పిలిచేవాళ్ళు"
"మీ అమ్మగారి పేరు?"
"నేను మమ్మీ అని పిలిచేదాన్ని? నన్నేమో సుశీ అని పిలిచేవాడు. వంటవాడు మేడం సాబ్! మేడం సాబ్! అనేవాడు."
"వంటవాడు చెడ్డ వాడన్నావు గదా? ఎందుకని?"
"వాడంటే నాకు భయం?"
"ఎందుచేత?"
"ఒక రోజున - ఒక రోజున....."
"ఊ కమాన్ పాప! ఒకరోజున?"
"కత్తితో వేలు కోసుకున్నాడు."
"ఏ వ్రేలు?"
"చిటికిన వేలు పక్కన ఉన్న బుల్లి వేలు?"
"అతని చేతికి ఎన్ని వ్రేళ్ళు ఉండేవి ?"
"ఆరు! ఆరో వ్రేలు చాలా తమాషాగా ఉండేది. అది చూపించి నన్ను ఆడించేవాడు."
"ఆ వ్రేలు పొరపాటున తెగిందా?"
"కాదు కావాలనే కోసుకున్నాడు"
"అని ఎలా చెప్పగలవ్?"
"నేను వంట గదిలోకి వచ్చింది వాడు చూడలేదు. కూరగాయలు కోసే కత్తి తీసుకొని చేతిని పొయ్యి గట్టుమీద పెట్టి ఒక్క దెబ్బతో నరుక్కున్నాడు. ఆ తెగిన వ్రేలు వంటింటి గచ్చుమీద పడి కాసేపు ఎగిరింది. అది చూసి భయపడి నేను పారిపోయాను."
"ఎక్కడికి?"
"అమ్మ దగ్గరకు పరుగెత్తాను."
"ఊ తర్వాత ఏమైంది?"
"అప్పుడే నాన్నగారొచ్చారు. కూరలు కోస్తుంటే వ్రేలు తెగిందని నాన్నతో అబద్ధం చెప్పాడు. నాన్నగారు వాడి చేతికి కట్టు కట్టాడు."
"మరి నువ్వు నన్నాకు చెప్పావా?"
"చెప్పాను. అమ్మా నాన్న నా మాట నమ్మలేదు. వాడి మాటే నమ్మారు."
"అప్పట్నుంచి వాడంటే కోపమా?"
"వంటవాడంటే కోపమే కాదు భయం కూడా. నన్ను చూసినప్పుడల్లా అదోలా చూసేవాడు.
వాడి దగ్గరకు పోవడం మానేశాను. వాడిని చూసి నప్పుడల్లా తప్పుకు తిరిగేదాన్ని. వాడికి నేను ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నం చేసేదాన్నో వాడు అంత దగ్గరకు రావడానికి ప్రయత్నం చేసేవాడు. నన్ను ఎత్తుకుని ఆడించడానికి ప్రయత్నం చేసేవాడు. వాడిని తిట్టి పారిపోయేదాన్ని అది చూసి అమ్మ నన్ను కోప్పడేది. వాడు వంట ఇంట్లో లేనప్పుడు కూడా వంట ఇంటిలోకి పోవడం అంటేనే నాకు భయంగా ఉండేది. .." మాధవి ఆగింది.
సాగర్ ఆత్రుతగా మాధవి కేసి చూశాడు. మాధవి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా పడుకొని వున్నది. ఆమె వదనంలో ఎలాంటి ఉద్రేకమూ కన్పించడం లేదు. సాగర్ ప్రొఫెసర్ ను ప్రశ్నార్ధకంగా చూశాడు.
"సాగర్! ఆమె ఇంకా ట్రాన్స్ లోనే ఉన్నది ఎక్కువసేపు ఉంచడం మంచిది కాదు. మరో రెండు ప్రశ్నలు వేసి ప్రస్తుతానికి ఇన్ వెస్టిగేషన్ ఆపుతాను, ఇంతవరకు ఆమె చెప్పిందంతా పరిశీలించి విశ్లేషణ చేయాలి."
"ప్రొఫెసర్ ! మాధవిని లేపే ముందు ముఖ్యంగా మీకు అభ్యంతరం లేకపోతే ------" సాగర్ ఆగి ప్రొఫెసర్ కేసి అభ్యర్ధన పూర్వకంగా చూశాడు.
"గో ఏ హెడ్ సాగర్!" కళ్ళజోడు తుడుచుకుంటూ సాగర్ ను ప్రోత్సహించాడు.
భావ ప్రకటనలను రికార్డు చేసే యంత్రాలలో గళ్ళ కాగితాల మీద నల్లటి గీతాలు మందకొడిగా నాట్యం చేస్తున్నాయి. వుండి వుండి గ్రాఫ్ మీద గీతాలు ఎత్తుపల్లాల మీద ప్రవహించే నీరులా కదిలిపోతున్నాయి. ఊదా, నీలి రంగు గాజు గోళాలు లయబద్దంగా వెలిగి అరిపోతున్నాయి.
