"ఆ లెటర్ అతను మీకు ఎప్పుడు ఇచ్చాడు?"
"మా ఇంటికి రావడానికి నాలుగు రోజులు ముందుగానే నా చేతికి సీల్ వేసిన కవర్ ఇచ్చి నేను ఎప్పుడయినా హటాత్తుగా కనిపించక పోయినా, చనిపోయినా కమీషనర్ గారికి అందజేయమని రిక్వెస్ట్ చేశాడు.....అతని కోరిక ప్రకారంగానే చేశాను."
"అంటే రాధాదేవికి కూడా అతనిని హత్య చేయించడానికి అవకాశం ఉంది కదూ"
"ఏమో చెప్పలేం..,. భార్యలు ఇద్దరికీ అతనిని చంపినందు వలన నష్టమే కానీ ప్రయోజనం లేదు" అన్నాడు కిశోర్.
"నో ....నో .... మీ అనాలసిస్ తప్పు కావచ్చు. ఆస్తుల దగ్గర తగాదా ఎందుకు రాకూడదు. ఎనీవే అది నేను దర్యాప్తు చేస్తాను. మీరు ఇక వెళ్ళవచ్చు..... ఈ విషయంలో ఏ చిన్న అనుమానం కలిగినా, లేక ఎలాంటి ఇన్ ఫర్మేషన్ లభించినా కమీషనర్ గారికి తెలియజేయడం మరచిపోవద్దు ' అన్నది ధీరజ.
కిశోర్ నమస్కరించి వెళ్ళిపోయాడు.
ధీరజ జీప్ లో బయలుదేరింది.
ఇప్పుడు ఆమె ఆలోచనలు రాధాదేవి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి.
సీతాపతిని చంపించవలసిన అవసరం లలిత, రాధాదేవిలలో ఎవరికి ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా ఆ ఇద్దరిలో వొకరికి ఆ హత్యతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం ఉండి తీరుతుందని ధీరజ గట్టిగా నమ్ముతుంది.
లలిత చెప్పిన మాటలను బట్టి రాధాదేవిని అనుమానించాలి.
రాధాదేవి చెప్పిన ప్రకారం అయితే లలితనూ , ఆమెతో పరిచయం వున్న స్నేహితులను అనుమానించాల్సి వుంటుంది.
ఆ స్నేహితులు ఎవరో!
వాళ్ళు ఎవరో తెలుసుకుంటే తప్ప సీతాపతి హత్య యెందుకు జరిగిందీ తెలియదు.
అసలు ఆ శవం ఉన్న డ్రమ్ము ఆ పాసింజర్ లో ఎక్కడ ఎక్కించింది తెలిస్తే ఎవరు ఆ హత్య చేశారో తెలుసుకునే అవకాశం వుంటుంది.
ఆమె ఆలోచనలు వొక కొలిక్కి రాకముందే జీప్ కమీషనర్ కార్యాలయం ముందు ఆగింది.
* * *
సునీల్ తన ప్లాటుకి వచ్చాడు.
లెటర్ బాక్సు లో వున్న ఒకే ఒక్క లెటర్ చూశాడు.
ప్రం ఎడ్రస్ ధీరజ అని వున్నది.
అతని గుండె ఝల్లుమన్నది.....కొన్ని క్షణాలు ఏం చేయాలో పాలు పోక అలా నిలుచుండిపోయాడు.
ఆలోచించిన మీదుట ఒక స్థిర నిర్ణయానికి వచ్చి లెటరును తెరవకుండానే చించి పక్కనే వున్న డస్ట్ బిన్ లో పడేశాడు సునీల్.
క్షణం పాటు అతని అంతరాత్మ తప్పు చేశావు అన్నట్లు నిలదీసింది.
తన అంతరాత్మకు గత ఎనిమిది సంవత్సరాలుగా సమాధానం చెప్పుకోలేకపోతున్నాడు.
ఇప్పుడు అదే బాధ.....
మనసులో ఎక్కడో చెరగని తీపి గుర్తులు.....
క్షణం అతని మనస్సు మూగగా రోదించింది.
భారమయిన హృదయాన్ని సమాధాన పరచుకుంటూ బాత్ రూమ్ కు వెళ్ళాడు. ఎర్రబడిన కళ్ళను చన్నీటితో తడుపుకున్నాడు.
బీరువా తెరచి లాల్చీ పైజమా తీసుకుంటుండగా మరలా అతని శరీరం జలదరించింది.
చూడకూడదు అనుకుంటూనే తల పైకి ఎత్తి బీరువా పైభాగం లోకి చూశాడు.
చిరునవ్వులను చిందిస్తున్న ధీరజ ఫోటో వుంది అక్కడ.....
ఎప్పుడో మరచిపోయాననుకున్న జ్ఞాపకాలు....ఇప్పుడు చెరగని ముద్రలుగా ఒక్కసారి అతనిని చుట్టుముట్టాయి.
ఇద్దరూ కలిసి తిరిగిన సాయంత్రాలు.....షికార్లు చేసిన రాత్రిళ్ళు.... ఆ నందాన్ని పంచుకున్న పార్కులు ---సరదాగా తిరిగిన వీధులు అన్నీ ఒకదాని వెంట ఒకటి గిర్రున కళ్ళముందు మెదలడంతో మనస్సంతా వికలమై పోయింది అతనికి---
ధీరజ.....తన........ధీరజ.
ఇప్పుడు ఏం చేస్తున్నాదో ------- ఏం చేయడమేమిటి తన పిచ్చి కాకపోతే పోలీస్ ఆఫీసరుగా ఎక్కడో ఒకచోట వుంటుంది. ఎంచక్కా పెళ్ళి చేసుకుని తన భర్త .......తన సంసారం......తన పిల్లలు.....తన కుటుంబం అనే చట్రంలో బంధించబడి వుంటుంది.
ఒకప్పుడు తనను ప్రేమించిన నేరానికి ఆమె పెళ్ళి చేసుకోకుండా తనకోసమే ఎదురు చూడాలనే వెర్రి ఆశ తనకు లేదు ...... అసలు అలాంటి ఆశ ఆమెకు లేకుండా వుండడానికే ఆరోజు హైదరాబాద్ వెళ్లేముందే ఆమె మనస్సు విరిగిపోయేలా మాట్టాడాడు.
తన ఆచూకీ ఆమెకు తెలియకుండా అలానే వుండిపోయినా తను ఆమెకు భర్తగా వుండే అర్హతను కోల్పోయాడు.
అందుకే ఆమె కంటపడకుండా వుండాలని ప్రయత్నించడం వలనే ఆమె ఇప్పుడు ఎక్కడ వున్నదో ఏం చేస్తున్నదో తెలిసే అవకాశం లేకపోయింది.
ఎప్పుడు అయినా ఆమె నుండి తన అడ్రస్ కు తిరిగి తిరిగి లెటర్ వస్తే ప్రం అడ్రస్ చూసి వెంటనే చింపేసిన సందర్భాలు చాలా వున్నాయి.
తను వివాహానికి అనర్హుడు ----
తన జీవిత పుటల నుండి భార్య, పిల్లలు అనే పదాలకు యెప్పుడో తొలగించుకున్నాడు.
ఆ అదృష్టం తనకు ఈ జన్మకు లేదు.
తన జీవితాన్ని తనే జేజేతులా నాశనం చేసుకున్నాడు.
కొవ్వొత్తిలా తన జీవితం కరిగిపోతుంది. యెప్పుడో ఒకప్పుడు అరిపోక తప్పదు .....అది అరిపోయేముందు వెదజల్లుతున్న వెలుగులా వుంది తన జీవితం......
తను యెంత విలసవంతమయిన జీవితాన్ని గడుపుతున్నాడో చూసిన ధీరజ సంతోషించే మాట యెలా వున్నా --- ఏవిధంగా సంపాదిస్తున్నదీ తెలిస్తే మాత్రం చీదరించుకోవడం ఖాయం.
మానవతా విలువలు మచ్చుకు కూడా లేని మృగాల ప్రవర్తనకూ తనకూ తేడా ఏముంది?
తనను కోరి వచ్చిన పడతులనే సుఖపెడుతున్నాడు తప్ప ఏ అడదానినీ తనంతట తను పాడుచేయడం కానీ ........చెడగొట్టడం లేదని తన మనస్సుకు సర్దిచేప్పుకోవచ్చు.
కానీ సమాజం కొన్ని కట్టుబాట్లను సంస్కృతీ సంప్రదాయాలను, నీతి నియమాలను అద్ఘునిక మానవునికి నియంత్రించింది.
అలాంటప్పుడు తను యెంత ఘోరమైన తప్పు చేస్తున్నదీ వెను తిరిగి చూసుకుంటే అర్ధం అవుతుంది.
ఇప్పుడు తనపై తనకే అసహ్యం వేస్తుంది.
కొందరు స్త్రీలు సమాజ కట్టుబాట్లను, మన సంస్కృతిని కాదని, ఈ సమాజంలో యెక్కడో ఒకచోట తమ విశ్రుంఖలమయిన సెక్స్ కోరికలను తీర్చుకుంటే తీర్చుకుని వుండవచ్చు.
అలాంటి కొందరిలో తనూ ఒకడు.
అంతమాత్రాన తను మాత్రమే తప్పు చేయడం లేదు కదా అని తనను సమర్ధించుకోవడం తప్పు కదా!
యెవరి మీదనో ఉన్న కసినీ మరేవారీ మీదనో చూపుతున్నాననే భ్రమలో పడి చేతులారా తన పండంటి జీవితాన్ని మేడిపండు జీవితంలా మలచుకున్నాడు.
కానీ చివరకు తను సాధించిందేమిటి?
డబ్బు ......కీర్తి పటిష్టలు ---హోదా .........మంచితనం ------వీటిలో తను కోల్పోయాడు ......ఒక డబ్బు తప్ప.........
కేవలం డబ్బు సంపాదన వలెనే మిగిలినవన్నీ సమకూరుతాయి..... అనుకోవడం వెర్రితనమే అవుతుంది.
మన ముందు మెచ్చుకున్న వాళ్ళే వెనుదిరిగే సరికి చీదరించు కుంటారు .
అలాంటి జీవితం తను కోరుకున్నది.
ధీరజ గురించి తను యెన్ని కలలు కన్నాడు.....కానీ ఇప్పటి తన బతుకు బాట గాడితప్పి వూబిలో కూరుకుపోయింది....?
ఇప్పుడు వెనక్కు రావాలంటే రాలేని అశక్తుడు తను.
తన నేరస్తుడుగా ఏ న్యాయస్తానమూ శిక్షించలేకపోవచ్చు.
తన భార్యలను ఏ కోర్టులు తనను దోషిగా నిలబెట్టలేవు.
కానీ ప్రతి మనిషికి ఆత్మసాక్షి అనే కోర్టు వుంటుంది.
ఆ కోర్టు సమక్షంలో తను దోషి కిందే లెక్క.
ఆ కోర్టుకు సాక్ష్యాలతో పనిలేదు ------మనస్సాక్షి చాలు. ఏ న్యాయస్థానం నుండి తప్పించుకున్నా ఆ న్యాయస్థానం ముందు తలవంచుకుని తీరవలసిందే.
నైతిక విలువలను పొక్కకు తోసివేసిన తను ధీరజ లాంటి నిష్కల్మషమైన ప్రియురాలిని భార్యగా పొందే హక్కుని యెప్పుడో కోల్పోయాడు.
ఏ కోణంలో నుండి చూసినా తనకు తను యెలాంటి శిక్ష విధించుకోవచ్చో నిర్ధారించలేకపోవచ్చు. కానీ సర్వ చరచరా జగత్తును నడిపించే శక్తి ఒక్కటే వుంది.
ఆ శక్తి ముందు తను నేరస్తుడే.
ఆ శక్తి విధించే శిక్ష నుండి తను తప్పించుకోవాలని అనుకోవడం లేదు.
ధీరజ జీవితంలోకి తను ప్రవేశించకూడదు.
తను ఎన్నుకున్న మార్గాన్ని వదిలి సభ్య సమాజానికి దూరంగా బ్రతకాలి ----
