Previous Page Next Page 
మరో కర్ణుడి కథ పేజి 23


    ఎముకలు తేలివున్న ఆ ముఖంమీది చర్మం ఎండిపోయిన చెట్టు బెరడులా వుంది.


    లోతుకు పోయిన కళ్ళు తేజోహీనంగా గాజు గోళీల్లా వున్నాయి.


    పెదవులు ఎండి రాలడానికి సిద్ధంగా వున్న ఆకుల్లా వున్నాయి. జుట్టు అడచలు కట్టి, చీకిపారేసిన తాటి గింజలా వుంది.


    "బాబూ!"


    "నీ పేరేమిటి?"


    శరత్ ప్రశ్నకు ఆమె ఆశ్చర్యంగా చూసింది.


    "ఎందుకు బాబూ!" బిచ్చగత్తె పేరు అడిగేవాళ్ళను ఇంతవరకూ చూడలేదు అన్న భావం ఆమె స్వరంలో వ్యక్తం అయింది.


    "చెప్పు! బాగా బతికినదాన్ని అన్నావుగా?"


    "ఇప్పుడు పేరుతో పనిలేదు. అందుకే పేరు మర్చిపోయాను." అన్నది.


     "నీకు బిడ్డలు లేరా?"


    నిస్తేజంగా వున్న ఆమె కళ్ళలో క్షణకాలంపాటు వెలుగు కిరణం కన్పించి ఇట్టే మాయం అయింది.   


    కాని సమాధానం ఇవ్వలేదు.


    "చెప్పు! నీకు డబ్బుయిస్తాలే!" అంటూ ఐదురూపాయల నోటు జేబులో నుంచి తీశాడు.  


    డబ్బు చూసి ఆమె కళ్ళలో మరోసారి వెలుగు కిరణం తోసుకు వచ్చింది.


    "ఒక మగబిడ్డ పుట్టాడు."


    "అతను ఎక్కడ వున్నాడు?"


    "ఏమో తెలియదు." ఆ కంఠం వణికింది.


    శరత్ ఉలిక్కి పడ్డాడు. తనను తాను సంబాళించుకున్నాడు. మరుక్షణంలో.


    "అదేమిటి నీ బిడ్డ ఎక్కడ వున్నాడో నీకు తెలియదా?"


    "తెలియదు బాబూ! ఒక మగవాడి వల్ల మోసపోయాను. బిడ్డ పుట్టగానే పారేశాను. ఎవరో ధనవంతుల దగ్గర పెరుగుతున్నాడని తెలిసింది. ఇంతకంటే నన్నేం అడక్కు బాబూ! పాతిపెట్టిన శవాన్ని వెలికి తియ్యకు."     


    శరత్ గుండెలు దడదడ లాడాయి.


    "ఒక ప్రశ్న. ఇంకేమీ అడగను." చిన్నగా అన్నాడు.


    "ఏమిటి బాబూ!"


    "ఆ బిడ్డకు చెవు పక్కగా పెద్ద పుట్టుమచ్చ వుందా?"


    "నీకెట్టా తెలుసు బాబూ!" ఆ కంఠంలో ఆశ్చర్యం.


    శరత్ కు సంతోషం, దుఃఖం, ఒకేసారి కలిగాయి.


    "అమ్మా!" అరవాలనుకున్నాడు.


    కంఠం పెగలడం లేదు.


    నాలుక పిడచకట్టుకుపోతూ వుంది.


    ఊపిరి సలపడం లేదు.


    ఆ బిచ్చగత్తె ఓ క్షణం చూసి ముందుకు కదిలి మరో మనిషి ముందు చెయ్యి చాస్తూ వుంది.    


    "వద్దు! వద్దు!" అరవాలనుకున్నాడు.


    పరిగెత్తుకెళ్ళి ఆమెను ఇవతలకు లాగాలనుకున్నాడు.


    కాళ్ళు కదలవేం?


    కంఠం పెగల్దేం?


                            *    *    *


    శరత్ ఉలిక్కిపడి నిద్రలేచాడు.


    వళ్ళంతా చెమటతో ముద్దగా వుంది.


    చిన్నగా లేచి వెళ్ళి కూజాలో నీళ్ళు వంపుకొని గటగట తాగాడు.


    మళ్ళీ వచ్చి పడుకున్నాడు.


    ఇదంతా కలేనా? తను సరిగా నిద్రపోలేదే! పట్టీ పట్టని నిద్రలో అలసిన మనసు చూసిన ఊహా చిత్రమేనా?


    ఆమె తన తల్లి కాదు. కాదు. కాదు.


    ఆలోచిస్తూ నిద్రలోకి జారిపోయాడు శరత్.


                           *    *    *


    అది కోర్టు!


    శరత్ నల్లకోటులో వున్నాడు.


    బోనులో నిల్చుని వున్న ఆడపిల్ల వయస్సు ఇరవై లోపే వుంటుంది.


    చెక్కిళ్ళు కమిలిపోయి వున్నాయి.


    పెదవులు తాంబూలం ఎక్కువగా తినడంవల్ల ఎర్రగా మొరటుగా వున్నాయి. పగుళ్ళు మధ్య తెల్లసారలు కన్పిస్తున్నాయి.    


    కళ్ళలో ఎటువంటి భావం లేదు.


    ముఖం నిర్లిప్తంగా వుంది.


    "నీ పేరు?"


    "సావిత్రి!"


    మంచి పేరే.... మనసులోనే కసిగా అనుకున్నాడు శరత్.


    "ఈ వృత్తిలో ప్రవేశించి ఎంతకాలం అయింది."


    "ఆరేళ్ళు."


    నీకెన్నేళ్ళు ఇప్పుడు?"


    "పందొమ్మిది."


    శరత్ ముఖంలోకి జాలిగా చూశాడు.


    ఆ తర్వాత ఆ పిల్ల ఏదో కథ చెప్పింది? ఇది నాలుగోసారి పోలీసులకు దొరకటం.


    జడ్జి ఆరునెలలు శిక్ష విధించారు.            


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS