"నా భర్త ఆ ఏడుకొండలవాడు. ఆయనెప్పుడూ నాతోనే ఉంటే నేనింకా ఎక్కడికో వెళ్ళటం ఎందుకు?"
"ఏమో! పెళ్ళి అయితే పిచ్చి కుదురుతుందనుకుంటే ఎక్కువైందేమిటి?" అంటూ మూతివిరిచి వెళ్ళింది. వెడుతూ మంగమాంబ మనసులో ముళ్ళుగుచ్చింది.
"తప్పమ్మా! అట్లా మాట్లాడచ్చా?" అంటూ సముదాయింపుగా అడిగింది మంగమాంబ.
"మరి వాళ్ళట్లా మాట్లాడితే స్వామికి కోపంరాదూ?" వెంకమాంబ బుంగమూతిపెట్టి అమాయకంగా అడిగింది.
"వాళ్ళు తప్పేం మాట్లాడారు చెప్పు?"
"వేంకటేశ్వరునికి నివేదన అయిపోయిన నన్ను మరొక పురుషుడితో కాపురం చేయమనటం తప్పుకాదూ?"
"నీ పెళ్ళికిముందే ఈ విషయాలన్నీ మాట్లాడుకున్నాం! నువ్వు చెప్పే సంబంధం ఆత్మ పరమైనది. మేము మాట్లాడేది పాంచభౌతికమైనది. రెండింటికీ పొంతన ఉండాలికదా!"
"నా శరీరం కూడా దైవార్పితమే. దానిపై నాకే అధికారం లేదు. దానిని మీ రెవ్వరికో ఇవ్వటం ఏం సమంజసం?"
"అదేం మాటతల్లీ? నువ్వు అంగీకరించాకనే సంబంధం ఖాయం చేసి వివాహం జరిపించాం. ఇప్పుడా వేంకటాచలపతి సంగతి ఏమిటి చెప్పు. అల్లుడు బాధ పడకుండా చూడటం మా బాధ్యత కదా!"
"ఆ సంగతి ఆ వేంకటాచలపతే చూసుకుంటాడు. మీరు నిశ్చింతగా ఉండండి."
"నీ ధోరణి నీదేకాని, మా మాట వినవుకదా!"
"అందరం వినాల్సింది ఆయన మాట" అంటూ దేవుడి మందిరం వైపు చూపించింది.
* * *
వెంకమాంబ ఈడేరటం ఊళ్ళో అందరికీ కావాల్సినంత కాలక్షేపం.
"అమ్మయ్య! దేవతో, దెయ్యమో కాదు. మామూలు ఆడపిల్ల" అని హాయిగా నిట్టూర్చారు కొందరు.
"అమ్మయ్య! కాపురానికి వెడితే ఊరికి పీడావదులుతుంది. నాకెదురుండదు" అని సంతోషించినవారిలో సోమయాజి, పూజారి ముఖ్యులు.
"పెళ్ళికే పేచీ పెట్టింది. ఇప్పుడు కాపురానికి వెడుతుందా?" అని మీమాంస లేవదీసినవాళ్ళు కొందరు.
'వెడుతుంద'ని ఒక వర్గం, 'వెళ్ళద'ని ఒక వర్గం, వాదోపవాదాలలో మునిగితే 'చూద్దాం ఏం జరుగుతుందో"ని గోడమీద పిల్లిలాగా చూసేవాళ్ళు మరోవర్గం.
వేడుకలు ఘనంగా జరిగాయి. అత్తవారింటికి కబురు వెళ్ళింది. చీరసారెలతో మేళతాళాలతో కన్నెపిల్లలందరకీ అసూయ కలిగే విధంగా ఇంజేటి తిమ్మయార్యుని కుటుంబం బంధుమిత్రులతో తరలి వచ్చింది.
సహజమైన శారీరక పరిణామానికి ఈ ఆర్భాటాలు అనవసరమని అందరికీ ప్రకటించవలసిన అవసరం లేదనీ, ఎంతో గుట్టుగా ఉండాలని తల్లికి, నాయనమ్మకి చెప్పి చూసింది. తనకి ఇష్టం లేదని కూడా అంది. నాయనమ్మ తన ముద్దు ముచ్చట తీర్చమని బతిమాలితే ఊరుకుంది. ఇటువంటి ప్రతి చేష్టా తల్లితండ్రులిద్దరికీ గుండెల్లో గునపమే. గుడ్డిలో మేలు ఈ సంగతి ఎవరికీ తెలియదు.
అత్తవారింటికి ఆనందంగా బయలుదేరాడు వేంకటాచలపతి తన భార్యని చూడవచ్చని. దరిదాపుల్లో నాలుగేళ్ళు దాటిపోయిందిచూసి. అప్పట్లో సాక్షాత్తు భండాసురుని పుత్రులని వధించిన బాలలాగా అనిపించింది తనకి. మధ్యలో రెండు మూడుసార్లు పండగలకి వచ్చినపుడు, పెళ్ళిళ్ళలోనూ కలిసినా పదిమంది మధ్యలో మెరుపుతీగలాగా తళుక్కున మెరసి, చటుక్కున మాయమయ్యిందే తప్ప దగ్గరిగా, సరిగ్గా చూడలేదు. ఇప్పుడెలా ఉండి ఉంటుందో? స్వయంవరానికి సిద్ధమౌతున్న సావిత్రిలాగా ఉంటుందా? శివుని వ్యామోహపెట్టిన జగన్మోహినిలాగా ఉంటుందా? మూర్తీభవించిన తారుణ్యంతో లాలిత్యంతో లలితా త్రిపుర సుందరిలాగా ఉంటుందా? ... ... ... ఇటువంటి ఆలోచనలతో వేంకటాచలపతి మనస్సు వెంకమాంబని ఎప్పుడు చూద్దామా అని ఉవ్విళ్ళూరుతోంది. వచ్చిన వెంటనే చూడటానికి అవకాశం రాలేదు. ఎగతాళి చేసేవారే కాని ఎవరూ వెంకమాంబని చూడమనలేదు.
పుణ్యాహవచనాలు, శాంతులు, పూజలు, భోజనాలు, పేరంటం అంతా అయినాక అక్షింతలు వెయ్యటానికి మగవాళ్ళంతా వెడుతున్నప్పుడు వేంకటాచలపతి కూడా వెళ్ళాడు. అందరి పాదాలకీ వెంకమాంబ నమస్కరిస్తోంది. తన పాదాలని తాకగానే విద్యుద్ఘాతం తగిలినట్లయి కాళ్ళు వెనక్కి తీసుకున్నాడు. అక్షింతలు వేశాడో లేదో తెలియదు. నమస్కరించి లేచిన వెంకమాంబ ముఖం చూస్తూ నిశ్చేష్టుడైపోయాడు.
అది తనకి చిరపరిచితమైన ముఖం.
నిత్యం తను ధ్యానించి పూజించే ముఖం.
తనతోపాటుగా తోడునీడగా ఉండే ముఖం.
తనకి శక్తిని, ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇచ్చే ముఖం.
తనకి ప్రియమైన అపురూపమైన దివ్యమైన ముఖం.
వేంకటాచలపతి ముఖంలో ఆనందం రెట్టింపయ్యింది.
* * *
వచ్చిన వియ్యాలవారు ఊరికే వెళ్ళలేదు. శోభనానికి ఆరునెలల తర్వాత ముహూర్తం పెట్టించి మరీ వెళ్ళారు.
ఇంట్లో తల్లిదండ్రులకి వెంకమాంబకి ఆరోజునుండీ వాదోపవాదాలే.
సృష్టిలో ప్రతిపదార్థానికి, ప్రతి జీవికీ పుట్టటం, పెరగటం నశించటం అనే ధర్మాలున్నాయి. నీ శరీరం ఆ ధర్మాన్ననుసరించి పెరిగింది. నశించే లోపల ఆ శరీరం నిర్వర్తించవలసిన పనులు కొన్ని ఉన్నాయి. మనం మూడు అప్పులతో పుట్టాం. దేవఋణం, ఋషి ఋణం, పితౄణం. మనకీ శరీరం కల్పించిన పితృదేవతల ఋణం తీర్చుకోవటం అంటే మరో జీవి శరీర నిర్మాణానికి సహాయపడటమే. అందుకే దాంపత్య ధర్మానికి వేదసంప్రదాయం అంతటి ప్రాముఖ్యం ఇచ్చింది. రఘువంశరాజులని కూడా "ప్రజాయై గృహమేధినాం" అని వర్ణించాడు కాళిదాసు. ఇది ధర్మబద్ధం. అన్నీ తెలిసినవారు దీనిని కాదనరు, ఈ విషయాలని వీలైనప్పుడల్లా బోధిస్తూనే ఉన్నాడు కృష్ణయార్యుడు.
సమాజం, కుటుంబం, బంధుత్వాలు, ప్రేమాభిమానాలు, పిల్లలు మమకారాలు, వంశాంకురాన్ని చూడాలనే పెద్దల కోరికలు మొదలైన అంశాలని మనసుకెక్కించే ప్రయత్నం మంగమాంబ చేస్తూనే ఉంది.
అంతకు ముందు చెప్పిన సమాధానాన్ని వెంకమాంబ వినిపిస్తూనే ఉంది.
ఒకరోజు పూలు మాలకడుతూ,
"కందువగు హీనాధికము లిందులేవు
అందరికీ శ్రీహరే అంతరాత్మ..."
అన్నమాచార్య కీర్తనని తన్మయత్వంతో పాడుతోంది వెంకమాంబ.
"ఈ చరణానికి అర్థం ఏమిటి?" అని అడిగింది మంగమాంబ.
