అతి కష్టం మీద తనని తాను కంట్రోలు చేసుకుంటూ "ప్రార్థనకి లుకేమియా అని ఎలా తెలిసింది?" అని అడిగాడు.
"డయాగ్నైజ్ చేసేం భార్గవా"
భార్గవ వెంటనే అడిగాడు - "ఏ రకం లింఫోసైటిక్?"
"సారీ భార్గవా! ఐయామ్ రియల్లీ సారీ- అక్యుట్ మైలోబ్లాస్టిక్ లుకేమియా"
అయిపోయింది. చివరి ఆశ కూడా తెగిపోయింది.
"అక్యూట్ మైలోబ్లాస్టిక్ !! అక్యూట్ ....? అక్యూట్...."
"అవును భార్గవా! ఆమె రక్తంలో తెల్ల కణాల కౌంటు 50,000 పైగా వుంది" ఇంగ్లీషులో అన్నాడు అన్నాజీరావు.
కిటికీలోనుంచి వచ్చిన బలమైన గాలితెరకి టేబిల్ మీద పుస్తకం రెపరెప లాడింది.
యాభైవేలు.
ప్రతీ ఒక్క చిన్న రక్తపు చుక్కలోనూ, యాభైవేల నిర్జీవమైన రక్తకణాల చొప్పున అవి వేగంగా శరీరం అంతా ప్రవహిస్తూ గుండెనీ, కాలేయాన్నీ, మెదడునీ, మొత్తం శరీరాన్నీ, ప్రాణాన్నీ నిర్జీవం చెయ్యటానికి కంకణం కట్టుకుని క్షణక్షణానికీ విపరీతంగా పెరిగిపోతూ ప్రళయ కాలహోమాన్ని సృష్టిస్తున్నాయ్. దిదితై... దితై.... మంటూ విలయతాండవం చేసిన కాళ్ళు చచ్చుబడిపోతాయి. రామ పట్టాభిషేకాన్నీ, బాలగోపాలాన్నీ అభినయించిన లేతచేతులు నిర్జీవమైపోతాయి. డాక్టర్లకేం ? రెండక్షరాల్లో చెప్పేస్తారు...సారీ... సారీ... అని.
అతడు ఎడమచేతి పిడికిలి బిగించి కుడిచేతిలో కొట్టుకున్నాడు. అంతలో అనుమానం వచ్చిన వాడిలా చప్పున తలెత్తి అడిగాడు...
"యూ సెడ్ ... మైలోబ్లాస్టిక్ లుకేమియా".
"అవును భార్గవా".
"కానీ మైలోబ్లాస్టిక్ లుకేమియా రక్త పరీక్షలో బయటపడదు. అదైతే టాన్సిల్స్ ఆపరేషన్ కి ముందే బయటపడి వుండేది".
అన్నాజీరావు మాట్లాడలేదు.
"బోన్ మారో ఆస్పిరేషన్ (ఎముక లోపలి మూలగ పరీక్ష) చెయ్యకుండా నా కూతురికి మైలోబ్లాస్టిక్ అని ఎలా నిర్ధారణ చెయ్యగలిగారు?" కరుగ్గా అడిగాడు.
"ఆ పరీక్ష కూడా జరపబడింది భార్గవా".
"కానీ ఆ పరీక్ష చెయ్యటానికి నేను మీకు అనుమతి ఇవ్వలేదు".
"నేను ఇచ్చాను" అన్న స్వరం పక్కనుంచి వినపడేసరికి భార్గవ విసురుగా అటు తిరిగాడు. వసుమతి తప్పు చేసేనేమో అన్న అనుమానంతో బెదిరి తడబడుతూ మళ్ళీ ఇంకొక్కసారి "నే - నేను ఇచ్చాను" అన్నది. అతడు దాన్ని పట్టించుకోకుండా "స్లెయిడ్స్ ఎక్కడున్నాయ్" అని అడిగాడు.
"లాబ్ లో"
"నేను ఒకసారి చూడాలనుకుంటున్నాను".
అన్నాజీరావు కొద్దిగా తటపటాయించి, "అలాగే" అన్నాడు. ఇద్దరూ లాబ్ లోకి వెళ్ళారు. హెమటాలజిస్టు అందించాడు. గ్లాసుమీద చిన్న కాగితం అతికించి వుంది- 'ప్రార్థన నెం. 287462' అని. అతడికి బాధేసింది. ప్రార్థనకి కూడా ఒక నెంబరు ఇవ్వబడటం.
స్లెయిడ్ ని మైక్రోస్కోప్ కింద అమర్చి నెమ్మదిగా కదిపాడు. లెన్సు కదుల్తున్న కొద్దీ ఆకారాలు మరింత స్పష్టమవసాగేయి. అతడు ఒక కన్ను మూసి, రెండో కన్నుతో గొట్టంలోకి చూడసాగేడు. అతడి వెన్ను జలదరించింది. స్పష్టమయిన జీవాకృతిలో కళకళలాడుతూ వుండవలసిన కణాల స్థానే విభిన్న రాక్షసాకృతిలో వేలవేల స్యూక్లియోలు వున్నాయి.
అతడికి దుఃఖం వచ్చింది. అది దుఃఖం కూడా కాదు, వ్యధ. వ్యధ దుఃఖంకన్నా బాధాకరమయినది. క్రింది అద్దంలోంచి పడుతున్న సూర్యకాంతిలో నిస్తేజంగా వున్న ఆ కణాల్నిచూసి అతడు బెదిరిపోయాడు. అది తన స్వంత రక్తమైనా కూడా అతడు అంత వ్యధ చెంది వుండేవాడు కాదేమో. అతడి ముఖంలో వస్తూన్న మార్పుని వారిద్దరూ గమనిస్తున్నారు.
"నేను చెప్పినది కరక్టే అనుకుంటాను" అన్నాడు డాక్టరు టై సర్దుకుంటూ. ఆ మాటలు అగ్నికి ఆజ్యం తోడైనట్టు అతడిని మరింత ఇరిటేట్ చేశాయి. తన చుట్టూ జరుగుతున్న్ కుట్రలో అందరూ తోడైనట్టు ఉక్రోషం వచ్చింది. ఒక్కసారిగా స్టూల్ ని వెనక్కి విసురుగా తోస్తూ చేతితో మైక్రోస్కోప్ ని విసిరేసేడు. అది గోడకి తగిలి పెద్ద శబ్దంతో భళ్ళున పగిలిపోయింది.
ఆ గదిలో వున్న ఇద్దరూ క్షణం పాటు స్థాణువులయ్యారు. ముందు తేరుకున్నది వసుమతే. ఒక్క వూపులో వెళ్ళి భర్త చేతులు పట్టుకొని "మీకేమైనా మతి పోయిందా?" అని అరిచింది.
సడెన్ గా అతడిలో మార్పు వచ్చింది. ఉన్నట్టుండి కామ్ అయి ఆమెవంక, తనని పట్టుకున్న ఆమె చేతులవంకా చూసేడు. అతడిలో అకస్మాత్తుగా వచ్చిన ఆ స్థబ్దతని చూసి ఆమె బెదిరి అతడిని వదిలేసింది. 'మతిపోయిందా' అని తను తొందరపడి అనేసింది. ఐతే అతడు దాన్ని గురించి పట్టించుకోలేదు.
"ప్రార్థన ఎక్కడుంది?" అని అడిగాడు.
"ఐసి-4లో"
మోహన్ లాల్ కపాడియా జ్ఞాపకార్థం ఆస్పత్రిలో కట్టబడిన ఒక రింగు ఐసి-4. కేన్సర్ రోగులకి అక్కడ చికిత్స జరుగుతుంది.
అన్నాజీరావు అడుగు ముందుకు వేసి భార్గవని అనునయిస్తున్నట్టూ చెయ్యి వేశాడు.
"పరీక్ష పూర్తవగానే ప్రార్థనని ఆస్పత్రిలో ఇన్ పేషెంట్ గా అడ్మిట్ చేశాను. రక్తంలో క్షణ క్షణానికి పెరిగిపోతున్న తెల్లకణాల కౌంట్ ని వెంటనే తగ్గించాలి. మీకు తెలుసుగా డాక్టర్ మహేంద్రజైన్! దేశంలోకెల్లా ప్రసిద్ధి చెందిన కేన్సర్ స్పెషలిస్టు. అతడి ఆధ్వర్యంలో ట్రీట్ మెంట్ మొదలవబోతూంది భార్గవా! మీరూ డాక్టరే. ఈ పరిస్థితుల్లోనే మనం ధైర్యంగా వుండాలి...."
వసుమతి కృతజ్ఞతా పూర్వకంగా అతడివైపే చూసింది. అతడి నెమ్మదీ, మర్యాదా ఆమెకు నచ్చినయ్. ఆ పరిస్థితుల్లో ఇంకెవరున్నా ఎంతో రభస జరిగి వుండేది. ఆమె అతడితో ఏదో అనబోతూ వుంటే అప్పటివరకూ ఏదో ఆలోచిస్తున్న భార్గవ కళ్ళు తెరచి, "నేను ముందు ప్రార్థనని చూడాలి" అంటూ అక్కడున్న వారిని పట్టించుకోకుండా తలుపు తెరుచుకుని వడివడిగా బయటకు నడిచాడు. వసుమతి అతడిని అనుసరించబోయి, ఆగి- డాక్టర్ వైపు చూసింది. అన్నాజీరావు కదలకుండా నిలబడి వున్నాడు. అతడి ముఖంలో నిర్లిప్తత ఆమెకు బాధ కలిగించింది. భర్త అతడితో మర్యాద కోసమయినా ఏమీ చెప్పకుండా అలా వెళ్లిపోవటం భర్తమీద కోపాన్ని కలిగించింది కూడా. ఆమె దృష్టి మైక్రోస్కోపు మీద పడింది. ఆమె ఏదో అనబోతుంటే "మీరు వెళ్లి ముందు పేషెంట్ ని చూసిరండి" అన్నాడు అతడు. ఆమె తలూపి బయటకు వచ్చింది.
