ప్రొఫెసర్ గారి గుండె దడదడలాడింది. ముఖం పాలి పోయింది.
"ఏమిటయ్యా మోహన్ అలా అంటావు? అయితే ఇప్పుడు నన్నేం చెయ్యమంటావు?" అడిగాడు.
"అలా అడిగారు బాగుంది. చెప్తాను వినండి. మీరు చేసే రిసెర్చి భూమి గురించి-అసలు భూమి అంటే ఏమిటి? చెట్లు చేమలూ, కొండలూ, కోనలూ నదులూ సముద్రాలు.....అంతేనా వివరించసాగాడు మోహన్.
అంతే వెంటనే అంగీకరించాడు పృథ్వి.
"మరి అలాటప్పుడు ఏం చెయ్యాలి? అలా బయటికి వెళ్ళి నై సర్గిక ప్రపంచాన్ని పరిశీలించాలి. ప్రకృతిని పరీక్షిస్తూ రిసెర్చి చెయ్యాలి. అలా చేస్తే ఎన్నో కొత్త కొత్త విషయాలు బయటపడతాయి. ఎన్నో నిజాలు తెలుస్తాయి. రిసెర్చ్ చకచక ముందుకి సాగుతుంది."
ఆశగా చూశారు పృథ్వి. అది గమనించి మరింత హుషారుగా చెప్పుకుపోసాగాడు మోహన్.
"అందుకని నా మాట విని మీరు కాస్త ఇల్లు దాటి బయటికి వెళ్ళండి......" సలహా యిచ్చాడు.
"ఎలా? ఎలా వీలవుతుంది? నాదసలే టైట్ ప్రోగ్రాం. క్షణం తీరికుండదు." నిరాశగా అన్నాడు ప్రొఫెసర్.
"అలా అంటే ఎలా? వున్న సమయాన్నే సద్వినియోగం చేసుకోవాలి మరి! ఓ పని చెయ్యండి. రేపటి నుంచి సాయంత్రంగానీ, పోద్దునగానీ ఓ గంటసేపు బయట తిరిగివచ్చే ప్రోగ్రాం పెట్టుకోండి. అన్ని ప్రదేశాలూ తిరిగి చూడండి. మీరేం చూశారో నోట్ చేసుకోండి. యింటి కొచ్చి ఆ నోట్ చేసుకున్న విషయంమీద రీసెర్చ్ చెయ్యండి.
"అంతపనీ నా ఒక్కడివల్ల అవుతుందంటావా?" నిరాశగా అడిగారు పృథ్వి.
"అలా అ దైర్యపడకండి. నేనూ, మిస్ దీపికాలేమూ! మేము కూడా మీతో వస్తాం. ఇంట్లో చేసేసాయం బయట చేస్తాం. ఇలాచేసి చూడండి ఏడాది తిరిగేసరికల్లా మీ రిసెర్చ్ కంప్లీట్ అయిపోకపోతే నా చెవి కోయించుకుంటా" నమ్మకంగా చెప్పాడు మోహన్.
ఆయన మొహం కళకళలాడింది. "సరే అయితే! ఆ విషయం నువ్వు చూసుకో! ప్రోగ్రాం తయారుచెయ్యి" అన్నారు.
అమ్మయ్య అనుకున్నాడు మోహన్. అప్పటికప్పుడు కూర్చుని ఓ పదిరోజులకి సరిపడా ప్రోగ్రాం తయారు చేశాడు.
ఒకరోజు సాయంత్రం బీచ్ కి, మరో రోజు సింహాచలం, ఇంకోరోజు ఇంకోచోటికి ఇలా టైంటేబిల్ తయారై పోయింది.
ఆ ప్రోగ్రాం ప్రకారం ఇంటినుండి ఓ అరగంట ముందే ప్రొఫెసర్ గారింటికి చేరుకుంటుంది దీపిక. ఆఫీస్ నుంచి తిన్నగా అక్కడికి చేరుకుంటాడు మోహన్. ముగ్గురూ కలిసి బయలుదేరుతారు.
ఏ బీచ్ ఒడ్డుకో చేరడం, ఆయన దారిన ఆయన ఓ కాగితాలకట్ట పుచ్చుకుని బరబరా రాసేసుకుంటూ వుంటాడు. మోహన్ దీపతో కబుర్లు మొదలు పెడతాడు కాసేపు అయ్యాక వెంట తెచ్చుకున్న కాఫీ టిఫెన్ల మీదకి దాడిచేసి మరికాసేపు అటూ-ఇటూ తిరిగి యింటికి చేరుకుంటారు. అలా ఓ వారం గడిచిపోయాయి.
సాయంత్రాలు మంచి హుషారు హుషారుగా గడిచిపోతున్నాయి మోహన్ కి.
కానీ శ్యాం పరిస్థితి అందుకు భిన్నంగా వుంది. చక్కటి గది అద్దెకి దొరికిందికదా అని నిశ్చింతగా వుండేందుకు అవకాశంలేదు. అద్దె బోలెడు. జీతం మూడోవంతు అద్దెకి పోసేస్తే నెలగడవడం ఎలా? అందుకే ఏదైనా చిన్న పార్ట్ టైం జాబ్ చూసుకుందాం అని ప్రయత్నిస్తున్నాడు.
కాళ్ళరిగేలా తిరిగినా యెక్కడా దొరకడంలేదు. ఎక్కడికి వెళ్ళినా చుక్కెదురు అవుతోంది. సాయంత్రం ఆఫీస్ నించి ఏదో హొటల్ కి వెళ్ళి కాసిని కాఫీనీళ్ళు గొంతులో పోసుకుని బాగా రాత్రయ్యేదాకా తిరగడం, నిరాశగా యింటికి చేరడం ఓ వారం రోజులు గడిచి పోయాయి.
ఇక లాభంలేదు! మరో పది రోజుల్లో ఏదైనా దొరికితే సరే లేకపోతే ఈ గది వదిలెయ్యాలి. మరోచోటేదైనా వెతుక్కోవాలి ఆ రోజురాత్రి ఆలోచనలతో కలతనిద్రే అయింది శ్యామ్ కి.
ఆ సాయంత్రం మెయిన్ బజార్లో ఓ పెద్ద బట్టల షాపులోకి వెళ్ళి వాళ్ళకి సేల్స్ మెన్ గానీ, లెక్కలు చూసే మనిషిగానీ కావాలేమో అడిగి అక్కర్లేదని తెలుసుకుని నీరసంగా బయటికొస్తుంటే ఎదురయ్యాడు చిట్టిబాబు.
షూటింగ్ ఎడ్వర్ టైజ్ మెంట్ లో మోడల్ లా వున్నాడు. అతనివెంట అతని మరదలు హుందాగా అందంగా మహారాణిలా వుంది. "హల్లో" అంటూ అతనే విష్ చేశాడు.
నీరసంగా విష్ చేశాడు శ్యామ్ . "ఇదుగో ఈవిడ నావుడ్ బీ పేరు చాలా పెద్దదే. క్లుప్తంగా పద్మ అంటాం. పద్మా ఇతను శ్యామ్ సుందర్. మన కంపెనీలో ఈ మధ్యనే టైపిస్ట్ గా చేరాడు" అని పరియం చేశాడు.
ఆదరంగా నవ్వుతూ చేతులు జోడించింది ఆవిడ. నీరసంగా ప్రతి నమస్కారం పెట్టాడు శ్యామ్. ఆవిడ షాప్ లోపలికి వెళ్ళిపోయింది.
పరిశీలనగా శ్యామ్ వంక చూశాడు చిట్టిబాబు. "శ్యాం అలా వున్నారేం?' అనుమానంగా అడిగాడు.
"ఏం లేదండీ! నేను బాగానే వున్నాను" వెంటనే సమాధానం చెప్పాడు అతను.
తల ఆడించాడు చిట్టిబాబు.
"మామూలుగా మాత్రంలేరు! ఏదో సమస్యతో బాధపడుతున్న వాడిలా వున్నారు. అలాంటిదేమైనా వుంటే నాతొ చెప్పండి. చాతనైతే సాయం చేస్తాను" అన్నాడు అతని ఆదరానికి కరిగిపోయాడు శ్యామ్.
వెంటనే తన సమస్య చెప్పేశాడు. "ఏమిటోలెండి మా మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ " అన్నాడు.
"మరి ఇన్నాళ్ళూ మాట మాత్రమైనా నాతొ చెప్పలేదేం? ఏదైనా మార్గం ఆలోచించేవాడినిగా!" అన్నాడు చిట్టిబాబు.
చిన్నగా నవ్వేసి ఊరుకున్నాడు అతను. సీరియస్ గా ఆలోచించడం మొదలుపెట్టాడు చిట్టిబాబు. అతని దగ్గర శెలవు తీసుకుని వచ్చేశాడు శ్యామ్. పది గజాలైనా వెళ్ళక ముందే వెనకనించి పిలిచాడు చిట్టిబాబు.
వెనక్కి వెళ్ళాడు అతను. "మీకు ట్యూషన్ చెప్పడం వచ్చా?" అడిగాడు చిట్టిబాబు. తెల్లబోయాడు శ్యామ్.
"నా ఫ్రెండ్ ఒకడు వున్నాడు. వాళ్ళిద్దరూడాక్టర్స్ వాళ్ళ పిల్లలు కొంచెం చదువులో వెనకపడి వున్నారుట మంచి ట్యూషన్ టీచర్ కోసం ట్రై చేస్తున్నాడు. నాతొ కూడా చూడమని చెప్పాడు చెప్పి దాదాపు నెల దాటిపోయింది. మీకు ట్యూషన్లు చెప్పడం వస్తే చెప్పండి ఓ సారి అలా వెళ్ళి ట్రై చేద్దాం" వివరించాడు చిట్టిబాబు.
శ్యామ్ ముఖంలో కళ వచ్చింది పిల్లలంటే? ఎంత వయసుంటుంది? ఏ క్లాస్ చదువుతున్నారు? అడిగాడు. "నాకంత గుర్తులేదు, పెద్దవాడికి పదకొండో పన్నెండో వుంటాయి" చెప్పాడు చిట్టిబాబు.
"అంత చిన్నపిల్లలైతే నిక్షేపంగా చెప్తాను. మా ఊళ్ళో కొన్నాళ్ళు ట్యూషన్లు చెప్పేవాడిని" వెంటనే సమాధానం చెప్పాడు శ్యామ్.
"అయితే వాళ్ళింటికొసారి వెళ్ళోద్దాం. వాళ్ళకి ఇంకా ఎవరూ కుదరకపోతే ప్రయత్నం చేద్దాం!"
"ఎప్పుడు వెళ్దాం సార్?" ఆశగా అడిగాడు.
"ఎప్పుడోనా? యిప్పుడే వెళదాం!"
తెల్లబోయాడు శ్యామ్ "ఇప్పుడా?" అన్నాడు అనుమానంగా షాపులోకి చూస్తూ, అతని సందేహం కనిపెట్టి తమాషాగా నవ్వేశాడు చిట్టిబాబు.
"మరేం ఫర్వాలేదు. ఆవిడని అలా వదిలేసి మనం ఫ్రెండింటికే కాదు సినిమాకి వెళ్లోచ్చినా అబ్బ ఒక్కక్షణం ఆగు బావా అంటుంది" అనేసి లోపలికి వెళ్ళి పద్మతో చెప్పి బయటికి వచ్చేశాడు.
ఇద్దరూ కారులో ఆ ఫ్రెండింటికి వెళ్ళారు. బీచ్ రోడ్ లో వుంది అతని యిల్లు ఇంటి ముందు కారాపి బోయ్ మని హరన్ మోగించాడు.
లోపల్నించి వచ్చాడు డాక్టర్ శ్రీహరి చిట్టిబాబుని చూసి బోలెడంత ఆనంద పడిపోయాడు. ఏవిట్రోయ్ ఇలా హఠాత్తుగా వేంచేశావ్? ఈయన యెవరు? నీ ఆరో ప్రాణం యేది?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు.
"అవన్నీ తరవాత చెప్తానుగానీ ముందు మీ పిల్లలకి ట్యూషన్ టీచర్ దొరికారోలేదో చెప్పు అన్నాడు చిట్టిబాబు కారుదిగకుండానే.
"ఇంకా లేదురా!" నసిగాడు శ్రీహరి.
"అమ్మయ్యా అంటూ కారు దిగి "రండి శ్యామ్" అనేసి లోపలికి వెళ్ళాడు. శ్రీహరి దంపతులకు శ్యామ్ ని పరిచయం చేశాడు.
"టీచర్లు చాలామంది వస్తున్నారు మాకు కావలసింది కేవలం డబ్బుకోసం కాకుండా కాస్త సిన్సియర్ గా వుండే వ్యక్తి" అన్నాడు శ్రీహరి.
"అవునండీ! పిల్లలు చిన్నవాళ్ళు. ఆటకాయితనం ఎక్కువ. తమంతట తాము చదువుకోటం అలావాటు కాలేదు మేమిద్దరం యింట్లో వుండం. పిల్లలకి వచ్చేలా ట్యూషన్ చెప్పే టీచర్ కోసం చూస్తున్నాం" అంది సుధ.
"ట్యూషన్ విషయం అయితే నాకు తెలియదు గానీ, శ్యామ్ చాలా నిజాయితీపరుడు. అతని సిన్సియారిటీ విషయంలో మీరు నిశ్చితంగా వుండొచ్చు" చిట్టిబాబు హామీ యిచ్చాడు.
"పదిరోజులు ప్రయత్నించి చూడండి. మీ పిల్లలుఇ నాకు అలవాటై నా కోచింగ్ వాళ్ళకి నచ్చితే కంటిన్యూ చేద్దాం లేదంటే మరో టీచర్ని చూద్దురుగానీ" అన్నాడు శ్యామ్.
మొహామొహాలు చూసుకుని అంగీకారంగా తల పంకించారు. శ్రీహరి, సుధ. పిల్లలని పిల్చి పరిచయం చేశారు. బాబు పేరు అరవింద్, అయిదో క్లాసు, పాప పల్లవి, మూడో క్లాసు. రోజూ రమ్మన్నారు జీతం నూటయాభై యిస్తామన్నారు.
"ఎప్పటినించి ప్రారంభించమంటారు?" అడిగాడు శ్యామ్ "స్కూళ్ళు తీసి పదిరోజులైంది. ఆలస్యం ఎందుకు రేపటినుంచే రండి" అంది సుధ.
"అమ్మయ్య పనైపోయింది. చాలా థాంక్స్ యిక వెళతాం" అని లేచాడు చిట్టిబాబు. వాళ్ళు కాఫీ తాగమని బలవంత పెడుతున్నా వినకుండా "నా ఆరోప్రాణం బట్టల షాపులో వుంది వెళ్ళాలి మరి, యింకోసారి వస్తాంలే" అనేసి బయలుదేరాడు.
