Previous Page Next Page 
గజ్జె ఘల్లుమంటుంటే పేజి 22


    రాగిణి తల బాదుకుంది. చేతుల్లో తల పెట్టుకొని 'నాలాంటి కూతురు ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండకూడదు. కాశ్యప్, భరణీ వాళ్ళు ఆదుకున్నారు కాబట్టిగానీ, లేకపోతే వీరిగతి ఏమయివుండేది?' అంటూ పసిపిల్లలా ఏడ్చింది.   
    ఈలోగా సూర్యకుమారి లోపలికెళ్ళి భరణి, కాశ్యప్ పెళ్ళి ఫోటోలు అన్నీ తీసుకొచ్చి ముందరవేసింది. ఒక్కొక్క  ఫోటోని ఎంతో పరిశీలనగా, తదేకంగా చూస్తూ ఏదో తృప్తిపొందింది రాగిణి. ఆఫోటోలన్నీ అలా చూస్తూవుంటే, ఏదో తన్మయత్వం మండుతున్న గుండెలకి, ఉపశమనం కలిగించింది.
    "రండి స్నానాలుచేసి టిఫిన్ చేద్దురుగాని" అని పూర్ణిమ పిలువగానే! ఫోటోలన్నీ పెట్టేసి, ఒక్కక్కళ్ళేలేచారు.
    స్నానాలూ, టిఫిన్లూ అన్నీ అయ్యాక రాగిణి ఉత్తరాలు రాసే కార్యక్రమంలో మునిగిపోయింది.
    ఇరుగుపొరుగువారూ, ఇంటికొచ్చిన వారూ రాగిణిని వింతగా చూస్తున్నారు, ఇంతకు ముందెప్పుడూ చూడనట్టు. కొందరు గుసగుసలతో చెవులు కొరుక్కున్నారు. రాగిణి బాధపడినా. ఇవన్నీ తప్పవని తనని తాను ఊరడించుకుంది.
    శిల్పకీ, తల్లీ తండ్రికి, భరణికీ, కాశ్యప్ కీ, పెద్ద పెద్ద ఉత్తరాలు రాసింది. మనసులో ఉన్నదంతా అక్షరాలలో పెట్టేసరికి, గుండెలోని భారం కొంత తగ్గినట్టనిపించింది. భోంచేసి నిద్దరపోయింది రాగిణి! కోటయ్యబాబాయి గారి కుటుంబం తనని ఇంత బాగా ఆదరించి ఓదారుస్తుందని, కలలో కూడా ఊహించలేదు ఆమె. ఆ ఆదరణ దొరకకపోతే నీడలేని ఆడది, ఆత్మాహుతి చేసుకుంటుంది. అటువంటి పరిస్థితి నుంచి తప్పించి, తనకి ధైర్యాన్నిచ్చి, రక్షణ నిచ్చినవారి కుటుంబాన్ని చల్లగా చూడమని ప్రార్థించింది.
    రోజూ పోస్ట్ కోసం ఎదురుచూస్తోంది రాగిణి. పదిహేను రోజులు దాటినా, రాగిణికి ఎక్కడినుంచీ ఉత్తరమైనా రాలేదు.
    "బాబాయ్! ఇలా రోజులు తరబడి మీ ఇంట్లో వుంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకేమీ బాగాలేదు" అంది ఒక రోజున రాగిణి.
    "రాగిణీ! నీవల్ల మాకేం ఇబ్బందిలేదు. మేము తిన్నదేదో కలిగిన దానిలో నువ్వు తింటున్నావ్. అమ్మా నాన్నా ఇక్కడ లేరు కాబట్టి, కాస్త ఇబ్బందులు తొలగేదాకా మా ఇంట్లో వుంటున్నావ్. దీన్లో నువ్వు మొహమాట పడడానికి ఏమీలేదు" అన్నారు కోటయ్యగారు.
    చిన్నప్పటినుంచీ బాబాయ్ బాబాయ్ అంటూ ఒక్క నిమిషం వదిలి పెట్టేదానివికావు. శేఖర్ తప్ప. ఆడపిల్లలు లేని మేము, నిన్ను తీసుకొచ్చి, వారం పదిరోజులు వుంచుకుని పంపించేవాళ్ళం. భరణి అమ్మనీ, నాన్ననీ వదిలొచ్చి వుండేదికాదు." అంటూ ఆప్యాయంగా చిన్నప్పటి కబుర్లన్నీ, సూర్యకుమారీ కోటయ్యగారు చెబుతూ వుంటే మధ్యలో జరిగినవన్నీ ఒక పీడకలలా మరిచిపోయి ఆసక్తిగా వినేది రాగిణి.
    చంద్రిక బడినుంచి రాగానే దాంతో కబుర్లు చెబుతూ, కథలు చెబుతూ, హోంవర్కంతా తానే దగ్గరుండి చేయించేది. చంద్రికకి చదువు చెప్పేడ్యూటీ పూర్ణిమకి తప్పిపోయింది. రాగిణికి మంచి కాలక్షేపంగా వుంది.
    మద్రాసు నుండొచ్చాక, ఆ రోజు తీరిగ్గా కూర్చుని పెట్టెలు తెరిచింది రాగిణి.
                            *     *     *     *
    శిల్ప ఉత్సాహమంతా నీరు కారిపోయింది. కళ్ళు కన్నీటి తెరలతో మసకమసకగా కనబడ్డాయి. 'డియర్ కోటయ్య తాతయ్యా' ముత్యాల్లారాసిన ఆ అక్షరాలని అలా ఎంతసేపు చూసిందో!

    "ఆ వుత్తరాలు చదువు" అని కోటయ్యగారు మందలించేవరకు ఈలోకంలో లేదు రాగిణి. శిల్ప చుట్టూ తీగలా అల్లుకుపోయిన ఆలోచనల్లోంచి తేరుకుని, ముందు తల్లి ఉత్తరాన్ని తీసి చించింది వణకుతూన్న చేతులతో.
    "రాగిణీ! నీకీ జన్మలో మళ్ళీ ఉత్తరం రాయాల్సొస్తుందని అనుకోలేదు. మద్రాసులో నిన్ను తాగితందనాలాడుతుండగా చూసిన మాకు కడుపునిండిపోయింది. ఆ క్షణంలో అక్కడే ప్రాణాలు పోకుండా ఎలాగో బతికి బయటపడ్డాం. నీకు భగవంతుడు అందాన్నిచ్చాడనీ, దానికి తగ్గట్టు నాట్యకళ అబ్బిందనీ సంతోషించాను. నీకు రాజేష్ కి మధ్య జరిగిన ఘర్షణల్లో గుడ్డి మమకారంలో నిన్నే వెనకేసుకొచ్చాను. ఆ విషయంలో నాన్నగారి మాటను కూడా పెడచెవిని పెట్టాను. నీ బిడ్డకు నేను తల్లినై నిలిచి, నీ పరువు నిలబెడుతున్నాననుకున్నాను. అంతేకానీ నువ్విలా అడ్డమైన తిరుగుళ్లు తిరిగి, సిగ్గుమాలిన దానిలా ప్రవర్తిస్తావని అనుకోలేదు. ఇందులో మీ నాన్నగారన్నట్లు నీ తప్పుకన్నా నా తప్పెఎక్కువుంది, నిన్ను మందలించి బుద్ధి చెప్పి మంచో చెడో రాజేష్ తో నీ కాపురాన్ని నిలపవలసింది పోయి నిన్ను సమర్థించాను. అసలు నాట్యంకోసం నిన్ను ఊళ్ళకి పంపకుండా వుంటే రాజేష్ కూడా తటస్థపడేవాడు కాదు. భార్గవ సినిమాకోసం నిన్నడిగినప్పుడు, మీ నాన్నగారు వారిస్తున్నా వినిపించుకోకుండా పంపించాను నిన్ను నా చేతులారా! బహుశః నాలో ఒక గొప్ప నటిని తల్లిని నేను అని అనిపించుకోవాలన్న గర్వం, డబ్బుతో హోదాని పెంచుకోవాలన్న ఆశ, నాకు తెలీకుండానే వుండి వుండవచ్చు. అందుకనే కన్నతల్లిగా కర్తవ్యాన్ని మరచిపోయి, చేజేతులా నీ జీవితాన్ని నాశనం చేశాను. నేను నీకు కన్నతల్లిని కాదు. నీ పాలిటి శాపాన్ని! ఇందుకు దేముడు నాకే శిక్ష విధించినా చాలదు. నాలాంటి పాపాత్మురాలు, స్వార్థపరురాలు తల్లి అవకూడదు. నన్ను మన్నించు! శిల్ప ఎంతో తెలివైన పిల్ల! దానికి అంతా తెలిసిపోయింది. నీమీద ద్వేషం కూడా పెంచుకుంది. నేచేసిన పాపాలలో మరీ ఘోరమైనది. నీ బిడ్డని నీకు కాకుండా పెంచడమే. కనీసం, నీ శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించుకొని నీ బిడ్డని నీవైపుకి మళ్ళించుకో! తల్లినని గర్వంగా చెప్పుకునేలా బ్రతుకు. అందుకు నేనూ భగవంతుణ్ణి చేతులెత్తి మొక్కి వేడుకుంటాను. అదొక్కటే నా కోరిక. భరణి భర్త దేముడు. రత్నాల్లాంటి బిడ్డలు పుట్టారు. నా ఆవేదనా, ఆందోళనా అంతా నీ కోసమే! భరణి విషయంలో ఏ బెంగా లేదు. నాన్నగారి ఆరోగ్యం ఏమీ బాగోలేదు. ఏ క్షణాన రాలిపోతామో తెలీదు. కళ్ళు మూసుకునేలోగా, నువ్వూ నీ బిడ్డా సంతోషంగా వున్నారని తెలిస్తే చాలు! ప్రశాంతంగా పోతాము! కోటయ్య బాబాయి, పిన్నీ వాళ్ళు దేముళ్ళు! ఏనాటి బంధమో. అయినవాళ్ళందరూ వెలివేసినా, వాళ్ళు మనని ఎన్నడూ కించపరచలేదు. పల్లెత్తుమాట అనలేదు. వారే నీకు తల్లీ తండ్రి. ఏ పనిచేసినా వారి సలహాతోటే చెయ్యి. ఉంటా!
                                                                                                                     ఇట్లు
                                                                                                     అభాగ్యురాలైన నీ కన్నతల్లి."
    ఉత్తరంలోని ప్రతిమాటా సూదుల్లా గుచ్చుకున్నాయి గుండెలో. "అమ్మా!" అంటూ విలవిల్లాడిపోయింది.
    కోటయ్యగారికీ, సూర్యకుమారికీ కూడా ఏడుపొచ్చింది, ఆ ఉత్తరం వింటూవుంటే, పూర్ణిమ కూడా కళ్లొత్తుకుంది.
    తండ్రి ఉత్తరం తీసి చింపించి. "రాగిణీ! నీకు తెలుసు ఇప్పుడు పశ్చాత్తాపంతో ఎంత కుమిలిపోతున్నావో! కానీ ఏం లాభం? చేతులుకాలాక ఆకులు పట్టుకోవడమే! ఏ పనిచేసినా, ఆవేశంతో కాక, ఆలోచనతో చెయ్యాలి. డబ్బుపోతే మళ్ళీ వస్తుంది. వస్తువులు పోతే వస్తాయి. జరిగిపోయిన రోజు మాత్రం తిరిగిరాదు. పువ్వులాంటి నీ జీవితాన్ని చేజేతులా నలిపేసుకున్నావు. యౌవ్వనంలోని కోర్కెలు, గుర్రాల్లాంటివి. పరుగెత్తుతూ వుంటాయి. ఎటుపడితే అటు. ప్రతీదీ ఆకర్షణీయంగానే కనిపిస్తుంది. అప్పుడే మనిషి ఆలోచన అనే కళ్లెంవేసి, కోర్కెలని వెనక్కి లాగాలి! ఆ సమయంలో పెద్దల సలహా కావాలి! నీ విషయంలో, తల్లి నీకు సరైన సలహా ఇవ్వలేకపోయింది. ఇంతకీ విధిరాత అలా రాసివుంటే ఎవరు తప్పించగలరు?
    ఇన్నాళ్ళూ నాకు అంత చీకట్లోనూ ఒక చిరు ఆశ మిగిలి దీపపు పురుగులా, తళుక్కుమనేది. ఏదో ఒకరోజు, రాజేష్, నువ్వూ కలుసుకోకపోతారా అని. భార్గవతో నిన్ను ఆ రోజున, ఆ స్థితిలో చూశాక, ఆ ఆశ చచ్చిపోయింది. రాజేష్, పెళ్లిచేసుకుని, భార్యాబిడ్డలతో కెనడాలో వుంటున్నాడని తెలిశాక, శూన్యమే మిగిలింది. కానీ ఒక్క సలహా! ఇష్టమైతేనే పాటించు. శిల్ప చాలా తెలివైన పిల్ల! దాన్నైనా నువ్వు దక్కించుకుంటే అదృష్టవంతురాలివి. లేకపోతే నేనేం చెయ్యను.
    నీ దురదృష్టానికి చింతించడం తప్ప! భవిష్యత్తులోనైనా కోటయ్య బాబయ్యగారి సలహాతో, అడుగు ముందుకు వెయ్యి!
                                                                                            నీకు మంచిరోజులు రావాలని ఆశిస్తూ,
                                                                                           ఆశీర్వదిస్తూ,
                                                                                           నీకు ఏమీ చెయ్యలేని నిస్సహాయుడు
                                                                                           మీ నాన్న!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS