పిల్లలు గల తల్లి
కాంతం మంచంలో పడుకొని వుంది. అప్పటికి పదిరోజుల నుంచీ రక్త విరోచనాలు. లేవటానికి శక్తి లేదు. బార్లినీళ్ళే ఆహారము. అటునుంచి యిటు పొర్లటానికి కూడా ఓపిక లేక ఆయాస పడుతున్నది. ఇంట్లో తగినంత ఆడదక్షత లేకపోవడం మూలన బయటపని ఇంట్లో పనికూడా నేనే చూచుకో వలసి వచ్చింది. నానాయాతన పడుతున్నాను.
ఆ రోజున సోమవారం_సంక్రాంతి సెలవులు అయిపోయి స్కూలు తెరిచారు. భార్యకు జబ్బుగా వుంది. ఈ రోజున సెలవు ఇయ్యాలిసిందని అడిగాను. స్కూలు తెరిచిన రోజున సెలవు యివ్వటానికి రూల్సు ఒప్పుకోవు. వచ్చి తీరాలె ఒక్క పూటైనా, లేకపోతే సెలవుల జీతం అంతా పోతుందన్నారు. ఏం జేస్తాము. రూల్సు!! రూల్సుకు హృదయం ఉందా? అవి కొండవీటి నల్ల రాళ్ళు. వాట్లో రక్తమాంసాలు లేవు, అందుకని దయాదాక్షిణ్యాలు లేవు. లేవు మరి ఏం జేస్తానూ! రూల్సు! రూల్సు! రూల్సు ప్రకారం నేను ఆ రోజు స్కూలుకు పోవాలె, తప్పదు.
కొంతసేపటికి తెల్లవారింది. తెల్లవారటంతోనే నేనూ ఆవిడకు మొఖం కడిగించాను, బెడ్ పాన్ అవీ కడిగి, పక్క దులిపి_క్రొత్త దుప్పటి వేశాను. కాసిని బార్లీ నీళ్ళు కొద్దిగా పండ్లరసం యిస్తే ఆవిడ సుఖంగా పడుకొన్నది. కొద్దిగా నిద్ర పట్టింది. ఎవరో ఒకమ్మను, ఆవిడకు కనిపెట్టివుండమని చెప్పి, నేను బజారు కెళ్ళి ఇంట్లోకి కావలసిన వస్తువులూ; మందూ తెచ్చాను తరువాత నేను స్కూలుకు వెళ్ళాలిగా! వెళ్ళాను.
నేను వచ్చేసరికి ఒంటిగంట అయింది. వచ్చీ రావటంతోనే ఆవిడ దగ్గరకు వెళ్ళి మందుయిచ్చి ప్రక్కలో కూర్చున్నాను. చాలా నీరసంగా ఉంది, కళ్ళెత్తి దీనంగా_కడు దీనంగా నా వైపు చూచి మళ్ళీ కళ్ళు మూసుకొంది.
ఒక్క క్షణంలో ఏదో జ్ఞాపకం వచ్చినట్లు చటుక్కున కళ్ళు తెరిపిడి చేసికొని, మీరు "భోజనం చేశారా" అని నా గడ్డం తన మునివేళ్ళతో పట్టుకొని అడిగింది, "లేదు, వెళతాలే, మరేమీ తొందరలేదు" అన్నాను నేను. "ఇంకా భోజనం చెయ్యలేదండీ? రెండు కావచ్చింది. ప్రొద్దున చేసిరండీ" అని అంటూ మృదువుగా శుష్కించిన ఆ వేళ్ళతో నా చెంపలు తాకింది, "తొందర లేదులే కాంతం" అన్నాను నేను.
"ఇంకా తొందర లేకపోవటం ఏమిటండీ? నాకేమీ అక్కరలేదు. మీరు వెంటనే వెళ్ళి అన్నం తిని రండి. పాపం, ఈ పదిరోజుల నుంచీ మీకు తిండి అమరటం లేదు. చిక్కి సగమయి పోయినారు, నాకోసం మీరేం దిగులుపడబోకండి. నాకేం ఫరవాలేదు. ఆ కృష్ణభగవానుడు నన్ను రక్షిస్తాడు. ఆ ప్రభువునే నమ్ముకున్నాను." అని చెంపల మీద వేళ్ళతో "డ్రం" చేసి దీనంగా చూసింది.
అయ్యో పరమదుర్మార్గుణ్ణి. అపుడు ఆమెను ఒక ముద్దుకూడా పెట్టుకోలేదు. ఈ పాడుజన్మకు అదృష్టం లేదు.
నమ్మాను ఆవిడ మాటలు. భగవంతుడు భక్త రక్షకుడు అనుకొన్నాను.
కృష్ణ భగవానుడు ఆమెను నిజంగా రక్షిస్తాడనుకొన్నాను.
ప్రభువు అన్యాయం చేశాడు.
భోజనం చేసివచ్చిన తరువాత మళ్ళీ ఆవిడ దగ్గర కూర్చుని కాళ్ళు విసురుతున్నాను. "నేనెంత పాపాత్మురాలినో నండి. మీచేత కాళ్ళు పిసికించుకుంటున్నాను" అన్నది, నాకు ఏమనాలిసింది తోచలేదు, భర్త అయిన వాడికి అది విధి అని చెపితే ఆవిడకు నచ్చుతుందా? నచ్చ చెప్పడానికీ ఎక్కువగా మాట్లాడటానికీ అది సమయమా?" "మరేం ఫరవాలేదు కాంతం" అని మరింత శ్రద్ధగా కాళ్ళు వత్తాను. పది నిమిషాలు కాబోలు మగతగా పడుకొంది.
ఇంతలో చటుక్కున కళ్ళు తెరచి_"మళ్ళీ మరచి పోతాను చెప్పటం, మా మరదలుకు మనం త్రాగే కాఫీ సహించటం లేదు, అది కాఫీ త్రాగటం లేదట. గుండు కాఫీ గింజలు ఒక సవాశేరు తెప్పించండి" అని చెప్పింది. అంత జబ్బులో కూడా గృహ నిర్వహణభారం వదలలేదు.
ఈ మాటలు మాట్లాడడం వల్ల ఆయాసం కలిగిందో ఏమో, మళ్ళీ సొమ్మసిల్లి కళ్ళు మూసింది.
ఇంతలో రాధాయ, విజయ పలక పుల్ల కోసం పోట్లాడుకొన్నారు. "అమ్మా చూడవే, నా పలక పుల్ల అబ్బాయి తీసుకొన్నాడు" అని అమ్మతో కంప్లైంటు చేసింది. పసివాడు వచ్చి ఆ పలక పుల్ల దానిదికాదే నాదేను, అది తీసుకొని నాకివ్వనంటే నేను లాక్కున్నా నన్నాడు. ఈ ఇద్దరిమాటలు విన్నది. అంత జబ్బులో వున్న మనిషికి ఈ కుక్క జట్టీలన్నీ విని సద్దడానికి నిజానికి ఎంత విసుగు!
నాకే కోపం వచ్చింది, "పో వెధవ. పో అవతలకి. అమ్మకు జబ్బుగా ఉంటే వెధవ కంప్లైంట్స్ అన్నీ తీసుకొస్తావు" అని విసుక్కున్నాను.
నాకు కోపం వచ్చింది. ఆమెకు రాలేదు. నేను విసుక్కున్నాను గాని ఆమె విసుక్కోలేదు. నా మాటలు విని ఆమె " అలా అనకండి. వాళ్ళకేం తెలుసు? రా నాన్నా,మా తండ్రీ రారా, మా అమ్మా చిట్టితల్లీ, రా అమ్మా" అని వాళ్ళిద్దరినీ ప్రక్కలో కూర్చో పెట్టుకుని ముద్దాడింది. ఆ తల్లి ముద్దులో ఏం మహత్యం ఉందో కానీ. వాళ్ళిద్దరూ తమ పోట్లాటను, ఆ క్షణంలో మరచిపోయినారు. ఆ తగూ ఇట్టే తీరిపోయింది. చిన్నది తల్లి మెడకు కౌగిలించుకొంది. రాధాయ తల్లి కాళ్ళమీద పడ్డాడు.
ఆ మాతృ హృదయం, ఈ పుత్ర_పుత్రికా కాగాపరిష్యంగంలో ఎంత సంతోషించిందో, ఆమె ఎంతటి బ్రహ్మానందం పొందిందో!
కానీ,
నేను వచ్చి పాపిష్టి ముండావాణ్ణి, నేనే వచ్చి, లేవండి నాన్నా, అమ్మమీద పడబోకండి, అమ్మకు జబ్బుగా ఉంది," అని వాళ్ళిద్దరిని చెరో రెక్కతో పట్టుకొని మంచం దింపి, హాల్లో దిగవిడిచి వచ్చాను. తల్లి పాపం, దీనంగా చూచిందే కానీ మాట్లాడ లేదు. ఆ మాతృహృదయం పొందిన పరితాపమంతా ఆ నీరసించిన కళ్ళలో చూడటానికి నాకు కళ్ళు లేక పోయినాయి.
తల్లినీ పిల్లలనూ వేరు చేసింది నేనే. ఆ రోజున దుర్మార్గం చేశాను. నేనే ఈ చేతులతో విడతీశాను. ఈ చేతులను ఏ మహాత్ముడైనా ముక్కలు-ముక్కల క్రింద నరికి, కాకులకూ, గద్దలకూ వేసి పుణ్యం కట్టుకుంటే బాగుండును.
పిల్లలు తల్లి మీదపడి ఆవిడకు బాధ కలుగజేస్తారనుకొన్నాను గాని, అదే ఆఖరుసారిగా వాళ్ళు మాతృమూర్తిని ధ్యానిస్తూ ఉన్నారని నేను ఊహించలేక పోయినాను.
మా ఆవిడకు జబ్బుగా ఉందని తెనాలి నుంచి డాక్టరు గారు వచ్చారు. ఆయనకు ఎక్కడ మర్యాద తక్కువ అవుతుందోనని ఆదుర్దాపడి ఆవిడ మూడు గంటలకు నన్ను దగ్గరకు పిలిచి చెవిలో అన్నదీ, "డాక్టరుగారికి ఫలహారం తెప్పించారా" అని. "లేదు" అన్నాను నేను. "చూశారా పెద్దమనిషి మన ఇంటికి ఎందుకొస్తాడు చెప్పండి. ఆయన మా తమ్ముడ్ని పట్టి నన్ను చూడటానికి వచ్చాడు. కోటయ్యను పంపి ఫలహారం, కాఫీ తెప్పించి ఇయ్యండి" అని అనలేక అన్నది. ఇక గంటలలో ఉంది ఆమె ప్రయాణం. అయినా ఆమె కుటుంబ విషయమై జాగ్రత్త పడుతూనే ఉంది.
ఆరోజు సాయంత్రం కూడా మళ్ళీ నన్ను పిలిచింది సంజ్ఞా పూర్వకంగా మాట చాలా నీరసంగా ఉండటం మూలాన వంగి, ఆ మాటలు వినటానికి ప్రయత్నించాను. చూడండీ, సాయంత్రానికి పిల్లలు ఏమైనా పెట్టమంటూ వస్తారు. మధ్యాహ్నం తెచ్చినవి ఏమైనా మిగిలివుంటే సరేసరి. లేకపోతే కాస్తన్నా చెయ్యమనండి అత్తగారిని. పసి వెధవలు ఆడుకొనివచ్చి ఏమయినా పెట్టవే అమ్మా అంటూ వస్తారు. వాళ్ళసంగతి కాస్త చూడమనండి ఆవిడను" అన్ని మాటలు నీరసంగా ఒక్కొక్క మాటే అనలేక, అనలేక అని మళ్ళీ కళ్ళు మూసింది.
