గంట_గంటకూ నేను మందు ఇస్తూనే ఉన్నాను. ఎత్తి పోస్తూనే వున్నాను. విరోచనాలు తగ్గలేదు. రాత్రి ఎనిమిది దాకా ఆవిడ మాట్లాడలేదు. ఎనిమిదింటికి అత్తగారు ఆవిడ ఎదుటకు రావటం చూచి "పిల్లలు అన్నం తిన్నారా? శాస్త్రి కడుపునిండా తిన్నాడా, పిచ్చి వెధవ వట్టి అమాయకుడు, అని అన్నది. తిన్నారమ్మా అంతా తిన్నారు. నేను తిని నీ దగ్గరకు వస్తాను" అని మా పిన్ని అంటే ఆవిడ గుడ్లనీళ్ళు తిప్పుకొని మీరే చూడాలె వాళ్ళని" అన్నదట. పక్కనున్న మహాలక్ష్మమ్మగారు వృద్దురాలు "నీకేమీ ఫరవాలేదమ్మా పిచ్చితల్లీ! నీకేం ఫరవాలేదు" అని ధైర్యం చెప్పితే విని కళ్ళువిప్పి ఎదురుగా కావలెనని పెట్టి ఉంచుకొనినకృష్ణుడిపటానికి రెండు చేతులెత్తి నమస్కరించి మళ్ళీ మగతగా పడుకొంది.
జబ్బు బలంగా ఉందనీ ఆదుర్దా పడుతున్నాము కాని, ఇంతపని అయ్యే స్థితిలో ఉందని మేము కలలోనైనా అనుకోలేదు. ఆ స్థితిలోకి దిగుతుందేమో అని భయపడ్డాము గాని,ఇదివరకే దిగింది, ఇక కొన్ని గంటలకాలమే వ్యవధి ఉందీ అని మేమెవ్వరమూ ఊహించలేక పోయినాము. ఆ మహాలక్ష్మమ్మగారు గ్రహించిందట, ఆమె మాకు చెప్పలేదు.
రాత్రి ఎనిమిది గంటలదాకా అంటే ఆవిడ ఈ లోకపు గొడవలో ఉన్నంతవరకూ, స్పృహ తెలిసినంత వరకూ, భర్త, పిల్లలూ, బంధువులూ, స్నేహితుల విషయమై కనుక్కోవలసిన విషయాలన్నీ కనుక్కుంటూనే ఉంది.
ఎనిమిది గంటలకు నాతో కడసారి అన్న మాటలు ఏమిటీ? చూడండీ, ఆ రాధిగాడు, చిట్టీ పోట్లాడు కొంటున్నారు. మీరు వెళ్ళి ఆ ఇద్దరినీ, పక్కలో పడుకోపెట్టుకొని నిద్ర పుచ్చండి...ఆ పాపకు కథ చెప్పండి. కథ చెపితేగాని నిద్రపోదది. రోజూ చెప్పే ఆ మేక కథే చెప్పండి-నిద్రపోతుంది అది అన్నది.
నేనూ, "పోనీలేవే. కాసేపు పోట్లాడుకొని వాళ్ళే నిద్రపోతారూ" అంటే, "అల్లాగ కాదు, మీరు నా దగ్గర ఉండనక్కరలేదు. నాకు అవసరం ఉంటే పిలుస్తాను లెండి" అని నన్ను పిల్లలను నిద్రపుచ్చటానికి పంపింది.
మాతృప్రేమ ఎంత విలువైంది. ఈ లోకంలో ఉన్నంత వరకూ, తనకు తెలివి ఉన్నంతవరకూ, మంచంలో వుండి, అంత జబ్బులో ఉండికూడా ఇంటికి సంబంధించిన అన్ని విషయాలూ చూచుకొన్నది. పిల్లలకు ఏమి కావాలో చూచింది. భర్త కష్టపడుతున్నాడే అని ఆవేదన పొందింది. వచ్చిన బంధువులకూ, మిత్రులకూ మర్యాదలో ఏమిలోపం జరుగుతుందో అని ఒక కంట కనిపెడుతూనే ఉంది. పిల్లల తగూలు తీరుస్తూనే ఉంది మంచంలో ఉండీ తెరవలేక తెరవలేక కళ్ళు తెరుస్తూ గృహకృత్యాలన్నీ నిర్వహిస్తూనే ఉంది.
ఎనిమిది గంటల తర్వాత_?__????
బాధ, బాధ, బాధ, బాధ, మూల్గు...చెప్పలేదు_ఏమిటో బాధ.
సుమారు రెండు గంటలప్పుడు మట్టుకు "ఎక్కడున్నారు, అంది." "ఎక్కడోనా తల్లీ, ఇక్కడే_నీ మంచం కోడును తలను ఆనించుకొని, కూర్చుని ఉన్నా."
నావంక తిరిగి, కన్నెత్తి చూడలేదు_
విరోచనం అయినట్లు ఉందీ అన్నది, వెంటనే ఆయిల్ క్లాతు తుడిచివేసి పైన తెల్లటి వస్త్రము వేశాను.
అట్లాగే గుడ్లు పెట్టికొని చూస్తున్నాను.
ఆమె నిద్ర పోలేదు మూల్గుతున్నది.
వళ్లు పట్టుకొని మాటిమాటికి చూశాను.
ఎప్పుడూ వేడిగానే ఉండేది.
ఎదుటనే గడియారం గోడపైనున్నది. ఎదుట గదిలో టక్_టక్_అని నీరసంగా రెండు కొట్టింది. చూస్తూ కూర్చున్నా_నాకు ఆమె స్థితిని గూర్చి భయం కలుగలేదు. దుఃఖం కలగలేదు. ఏమీ లేదు. మనస్సులో ఆలోచనలు ఏమీ లేవు...శూన్యం. గడియారం టక_టక శబ్దం దూరా నుంచి చాలా మందంగా వినిపిస్తున్నది. నేనూ, మహాలక్ష్మమ్మగారూ అల్లాగ కూర్చున్నాము.
అల్లాగ చూస్తూ కూర్చున్నాను.
నేనొక శిలామూర్తిని అయిపోయినాను. నా చూపులు ఆ అవిలోకితేశ్వరుని చూపులు అయినై.
టక్_టక్_టక్_మూడు కొట్టింది.
మళ్ళీ ఒకసారి శరీరాన్ని తాకి చూశాను. చూశానే గాని ఎందుకో తెలియదు.డాక్టరుగార్ని లేపాను. ఎందుకంటే అప్పుడు ఆమె బాధో_బాధో అని విపరీతమయిన బాధ పడ్డది.
ఆయన వచ్చి ఒక్క ఇన్ జెక్షన్ ఇచ్చాడు.
ఇచ్చీ_ఇయ్యటంతోనే కళ్ళు మూసింది. మూల్గు మానింది. నేను డాక్టరుగారివంక దీనంగా చూశాను, ఆయన భయం లేదు. నిద్రపోతుంది లేపబోకండి అన్నాడు.
బాధ తగ్గి ఆవిడకు నిద్ర పట్టింది, ఆవిడ బాధ పడటం లేదు, నిద్రపోతున్నది అన్న భావం మనోవ్యధను కొంత తగ్గించి ఉంటుంది. కాకపోతే మరేదో విచిత్రమైన, అనూహ్యమయిన కారణమయినా ఉండాలె. ఎందుకంటే నాకూ అప్పుడే కొద్దిగా కునుకు పట్టింది. ఆమె మంచపు పట్టెపై తల మోపి కళ్ళు మూశాను.
ఎంతసేపు? నాకు తెలియదు.
ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను. వెంటనే నా సుఖ దేవత ముఖంవంక చూశాను. ఏదో భయం వేసింది. తల్లీ అని గడ్డం పట్టుకొన్నాను.
ఇంకేముంది మహాప్రభో_కొయ్య, కొయ్యగా ఉంది.
చూస్తుండగానే కఫం అడ్డపడ్డా, అతికష్టంమీద ఏవో కొన్ని మాటలు అన్నది. నాకు తెలియలేదు, రుక్కూ, మంగా, శాస్త్రీ, రాధా, విజయా అని పేరు_పేరునా పిల్లలను పిలిచి అతికష్టంమీద రెప్పలెత్తి వాళ్ళను చూచింది. వాళ్ళంతా నమస్కరించి, "అమ్మా" అన్నారు.
అమ్మ పలకలేదు,
నేను పక్కనే ఉన్నాను. తల్లీ__కాంత__అన్నాను. కళ్ళెత్తలేదు. ఈ పాపిష్టిముండా వాణ్ణి చూడకపోవటమే మంచిది.
అమ్మా, అమ్మా, అమ్మా, అమ్మా, అమ్మా, అని అయిదుగురు పిల్లలూ అల్లాడి పోయినారు. అమ్మా అని పిలవటానికి అదే ఆఖరు.
గోడనున్న గడియారం అయిదు మీద ఆగిపోయింది. కాకులు కా, కా, అనుకొంటూ ఎక్కడికో, ఏ కొత్తదేశాలకో లేచిపోతున్నవి. సావిట్లో కట్టివేసిన లేగదూడ "అంబా" అంటూ తల్ల డిల్లి పోతూ ఉన్నది.
నా పిల్లలకు తల్లి లేకుండా పోయింది. నా కాంతం ప్రపంచానికంతా అయిపోయింది.
(శుభం)
