Previous Page Next Page 
కాంతం కాపరం పేజి 22


    "పాప పరిహారం కావాలె. సంచితం నశించాలె, ఆయనకు దయగలగాలె" అని వాళ్ళూ వీళ్ళూ అనడం వల్ల కూడా మా ఆవిడకు మరీ కష్టం వేసింది. వాళ్ళంతా మహా పవిత్రులైనట్లూ!! కాని భజన మాత్రం మా ఆవిడ ఆపలేదు.

    మా ఇంటికి బాబా ఆరగింపుకు రాని కారణాన స్త్రీలు ఇక్కడికి రాక ఆ సుబ్బమ్మగారింటికీ ఆండాళ్ళ గారింటికీ వెళ్ళడం సాగించారు. ఇంట్లో అద్దెకున్న వాళ్ళూ, మా పిల్లలూనూ ఆవిడా, పని చేసేది, ఇంకా ఎవరైనా ఒక రిద్దరు మాత్రం భజనకు కూర్చుంటూ ఉండేవాళ్ళు.

    సరిగ్గా పదకొండో వారంరోజున, నేను ఇంటికి వచ్చీ రావడంతోనే పిల్లలంతా ఒక్కసారి గొల్లుమని గోలచేసి, నవ్వుతూ, ఎగురుతూ నా చుట్టూ చేరారు. వాళ్ళ వెనకాల భర్తను స్వశక్తిచేత బ్రతికించుకొన్న సావిత్రిలాగా ఆవిడ నిలుచున్నది. పైకి నవ్వుతున్నా కళ్ళల్లో ఎక్కడో వెనకాల కొద్దిగా విచార రేఖలున్నాయి.

    ఏమిటీ ఇంతకూ, హరనాథబాబు కరుణించి మా ఇంట్లో కూడా అడుగు పెట్టాడట! కాని పండు ఫలమూ ఇటువంటివి ఆరగింపక వెండిగిన్నె ఎత్తుకు పోయినాడని చెప్పేసరికి నా గుండె గుభేలు మన్నది.

    ఏ వెండిగిన్నె అని నే నడగలేదు. అడగవలసిన అవసరమూ లేదు. మా యింట్లో వున్నది ఒక్కటే వెండి గిన్నె, మా పసి దానికని చేయించిన దుక్కగిన్నె. యాభై అరవై తులాల బరువు, నలభై రూపాయలదాకా ఖరీదు అయింది, ఆ ఒక్కగిన్నె పోయిందనేసరికి, కష్టం వేసింది.

    ఏమనటానికి తోచలేదు హరనాథ బాబు మమ్ము మా గృహాన్ని పావనం చేశాడని సంతోషించేదా? దుక్కగిన్నె ఎత్తుకెళ్ళాడని దుఃఖీంచేదా?

    "వెండిగిన్నె ఎందుకు ఎత్తుకెడతాడు? ఎక్కడయినా ఉందేమో చూడండి" అన్నాను.

    "మీకింకా నమ్మకం లేదన్నమాట" అంటూ ఎత్తుకొంది మా ఆవిడ. "అందులో పాలుపోసి ఇక్కడ పెట్టానండీ, పెట్టింది నేనూ, ఇక్కడే కూర్చున్నాను. భజన చేస్తూ చేస్తూ, ఆరగించాడేమో హరనాధబాబు అని కళ్ళు తెరచి చూసే సరికి ఆ గిన్నె లేదూ పాలూ లేవు. ఇది తప్పకుండా బాబా మహత్యమే" అంది.

    "అయినా వెదకండి" అన్నాను.

    "ఎందుకూ వెదకటం" అని మాట తోసేసింది ఆ ఇల్లాలు ఈసడింపుతో.

    హరనాథ్ బాబా పాలు తాగేసి గిన్నె ఎక్కడైనా పారేసి పోయివుండకూడదూ" అన్నాను నేను. ఈ మాట కొంచెం సమంజసంగానే కనబడ్డది కాబోలు ఆవిడా, పిల్లలూ ఒక ఘంట సేపు ఇల్లంతా వెతికారు" ఎక్కడా గిన్నె కనపడలేదు.

    నేను కొంచెం విచారంగా వుండటం మా మనిషికి బొత్తుగా ఇష్టం లేకపోయింది. పోతే పోయిందండీ భగవదర్పణ అయిన విషయంలో మనం బెంగ పెట్టుకోకూడదు. గుళ్ళు గోపురాలు కట్టించేవాళ్ళు కట్టిస్తూ వుండగా, భగవంతుడికి మనమొక వెండి గిన్నె సమర్పించుకోలేమా, ఆయనకే కరుణ గలిగితే మనకు ఐశ్వర్యం రాదా అన్నది.

                                                                             4

    రోజుకు గడిచిపోయినవి. మాకేవిధమైన ఐశ్వర్యమూ రాలేదు. తరువాత రెండు వారాలు ఏ ఆరగింపూ లేదు. "ఇక్కడ పెట్టిన వస్తువులలో నీకు ఇష్టమైంది పండో, ఫలమో, అవీ మట్టుకు ఎత్తుకుపోకు. ఇదివరలో తీసుకుని వెళ్ళిపోయింది కూడా, ఎట్లా తీసికొని వెళ్ళావో అట్లాగే గప్ చుప్ గా ఇచ్చేసెయ్యి" అని భజన సమయంలో ప్రార్ధించమనీ కళ్ళు తెరిచివుంచే ప్రార్ధన చేయమని, నేను మా యింటి ఆవిడకు సలహా చెప్పాను. కాని ఆవిడగారి మతం ఆవిడదీ, నా సలహా అంగీకరించిందని నాకు నమ్మకం లేదు.

    ఎందుచేత నంటారా, ఆ వెండిగిన్నె పోయిన తరువాత మూడో శుక్రవారంనాడు, గుండుకంచు చెంబు హరనాథ బాబా ఎత్తుకొని పోయినాడు. అందులో పానకం పోసి అక్కడ పెట్టిందట. కళ్ళు తెరిచి చూచేసరికి గుండు చెంబు పానకమూ, విచిత్రంగా మాయమైనవి.

    ఈ మాటు మాత్రం మా ఆవిడ కొద్దిగా విచార పడ్డట్టు స్పష్టంగా కనిపించింది. కాని హరనాథ్ బాబా ఎత్తుకెడుతున్నాడని ఆవిడ కింకా గట్టి నమ్మకం.

    నాకుమట్టుకు చాలా కోపం వచ్చింది. "నీవు ఇంకా భజనలు సాగిస్తావా? ఆపేస్తావా?" అన్నాను.

    మరి మధ్యలో ఆపేయటంలో ఎల్లాగ? మన వస్తువులు మనకు ఇచ్చేసేదాకా అన్నా భజన చేయవద్డా" అన్నది నవ్వుతూ.

    నేను గట్టిగా నోరు జేసుకోవాలసి వచ్చింది. "ఇదిగో చూడూ, కాంతం నేను చెప్పే మాటలు వినకపొతివా ఇక మన సంసారం గుల్ల అయిపోతుంది. ఈ హరనాథ బాబా భజన వద్దని మొదట్లోనే చెప్పాను, ఏదో పండూ, పాలూ, ఎత్తుకొని పోయి తింటే నాకేమీ అభ్యంతరం లేదు. వెండి గిన్నెలు గుండు చెంబులు ఎత్తుకొని పోవటం నాకేమాత్రం యిష్టం లేదు. వారానికి ఓ వస్తువు చొప్పున ఇంట్లో చెంబులూ తపాలాలూ ఎత్తుకెళ్ళుతుంటే మనగతి ఏం కావాలె? అందింది గదా అని యివ్వాళ వెండిగిన్నె ఎత్తుకొని వెళ్ళాడు, రేపు నీ మెళ్ళో కాశీ గుండ్లు కాస్తా తెంచుకొని పోతే నేనెవ్వరితో చెప్పుకొని ఏడ్చేది? కాబట్టి...

    "పాపం మాటలు అనకండి. పిల్లలు గల వాళ్ళము" అంది ఆవిడ.

    "పాపం మాటలు నేనేం అనటంలేదు. ఆయన మహానుభావుడు కావచ్చు, కాని ఈ పద్ధతి మీద అయితే మట్టుకు ఆయన మన కొంపకు రావటం నాకు ససేమిరా యిష్టం లేదు. మనవి మనకు ఇచ్చేసి ఇక ఈ కొంపకేసి తిరిగి చూడవద్దని ఆయనను ప్రార్ధనచెయ్యి" అన్నాను. 
 
    ఈ మాటలు విని దేముణ్ణి దూషించానని ఆ ఇల్లాలు చిన్నపుచ్చుకున్నది. నేను కటినంగా మాట్లాడటం మూలానో, మా ఆవిడ నాగోల పడలేక భజనలు మాని వేయటం మూలంగా కోపంవచ్చో, కాని హరనాథ్ బాబా మళ్ళీ ఏమి ఎత్తుకెళ్ళలేదు. అయితే ఇదివరలో ఎత్తుకెళ్ళినవి తెచ్చి యివ్వనూ లేదు. "భజనలు మానేసినట్లేనా" అన్నాను. చాలా కాలమయిన తరవాత ఒక రోజున "మనస్సులో అనుకోకుండా, మీరాజ్ఞ పెడతారా" అంది ఆ పెంకె మనిషి.

    ఆవిడ హృదయం మాత్రం హరనాథ్ బాబాకు అంకితమై పోయింది, నా ఒత్తిడి పడలేక, ఈ పాపిని సంతోషపెట్టటానికి భజనలు మానిందేకాని ఆమె హృదయ పాత్ర భక్తితో నిండివున్న సంగతి నేను తెలుసుకోలేదు.

                                                                          * * *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS