Previous Page Next Page 
యువత నవత పేజి 22

   
    లాస్ట్ పీరియడ్ లో ఫిప్ట్ క్లాస్ లో పిల్లలకు పాట నేర్పుతూ కనిపించింది.

    "మతం వద్దు! కులం వద్దు! మనమంతా ఒక్కటేరా"

    శాలిని గొంతు నిజంగా చాలా బాగుంది. ఆవిడ మాట్లాడుతుంటేనే చాలా మధురంగా,ఆవిడ మాటలు వింటూ ఎంతసేపైనా ఉండిపోవచ్చు నన్నట్టు మాట్లాడుతుంది. పాట మాటకన్నా బాగుంది.

    "పాటంతా ఒకసారి వినపిస్తాను!" అంటూ పాట ముగించగానే చప్పట్లుకొడుతూ ముందుకు వచ్చాడు శర్మ.
   
    "చాలా బాగా పాడతారు శాలినిగారూ; ఇంతబాగా పాడగలరని నిజంగా అనుకోలేదు ఇంతబాగా పాడగలిగిన "శ్రీరామచంద్రూనికి" అంటూ మీ అమ్మమ్మ పాట పాడి అదర గొట్టేశారెందుకు?" అడిగాడు చనువుగా.    
   
    నిప్పురవ్వ భగ్గుమన్నట్లుగా చూసి ముఖం మరోవైపుకు త్రిప్పుకొంది శాలిని.

    "సారీ శాలినిగారూ! నిన్న నా మాట వెనక్కి తీసుకొంటున్నాను" వినీ వినిపించనట్టుగా ఇంగ్లీషులో అన్నాడు. "అసలు సరదాగా అన్నమాట మీరింత సీరియస్ గా తీసుకొంటారనుకోలేదు."

    "మాట వెనక్కి తీసుకొంటారు నిజమే! కాని, మీ సంకుచితాన్ని  ఎక్కడ దాకుకొంటారు?"

    "దాచుకోను! మీ స్నేహంతో దాన్ని క్షాళితం చేసుకొంటాను"

    అతడి కంటి చివరినుండి ప్రణయ భావతరంగం ఒకటి ఒక మెరుపులూ వెలువడి సూటిగా శాలిని  హృదయంలోకి చొచ్చుకుపోయి; గిలిగింతలు  పెట్టింది. క్షణకాలం మాత్రమే! వెంటనే క్రోధంతో ముఖం ఎర్రజేసుకొంది.  "స్త్రీ పట్ల గౌరవభావంలేని మీతో నాకు స్నేహం ఏమిటి; శర్మగారూ?" అంది కరుగ్గా.    

    "స్త్రీలపట్ల నాకు గౌరవభావం లేదనిఎలా అనగలరు, శాలిని గారూ?"

    "నిన్న మీరు వేసిన సిల్లీ జోక్ ను బట్టి!"

    "సిల్లీ జోక్ కాదు! సరదాజోక్! ఒక్క మాటమీద మొత్తం వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం పొరపాటు శాలినిగారూ! ఈ ప్రపంచ జనాభాలో సగం తామై మిగతా సగానికి నవమాసాలు  మోసి జన్మనిస్తున్న స్త్రీలంటే నాకు చెప్పలేనంత గౌరవం. ఏ కొమ్ములు తిరిగిన మగవాడైనా తల్లి ఆలనా, పాలనా ఆమె ప్రేమా, వాత్సల్యం లేకుండా పరిపూర్ణ మానవుడు కాలేడుకదా? పెరిగి పెద్దయ్యాక మరో స్త్రీ సాహచర్యం, ఆమె ఆరాధనా లేకుండా అతడి జీవితానికి పరిపూర్ణత రాకుదకా? ఎలా చూసినా స్త్రీ చుట్టూ తిరుగుతూ, ఆమెతో తన జీవితాన్ని ముడివేసుకున్న పురుషుడు ఆమెను చులకన చేస్తాడంటే నేనొప్పుకోను."

    "ఒప్పుకోను అన్నంత మాత్రాన సరా? పురుషుడివల్ల స్త్రీకి జరుగుతున్నది మాత్రం అదే! ఒక స్త్రీ పురుషుడు పవిత్రమైన వివాహ బంధంలో జంటగా జీవించడానికి వరకట్నం  పేరుతో ఆమె నుండి పురుషుడు డబ్బు వసూలు చేయడం స్త్రీని అగౌరవ పర్చడంకాదా? తను పోయాక ఆమెను వితంతు  చిహ్నాలతో బ్రతికేట్టు చేయడం అగౌరవపర్చడం కాదా? సరిసమంగా బాధ్యతలు  వహించే సంసారంలో ప్రతి ముఖ్యమైన  విషయానికి రాజముద్ర తన చేతిలోనే పురుషుడు వుంచుకోవడం ఆమెను అవమాన పరచడం కాదా? ఫలానా డాక్టరుగారి భార్యను, జడ్జిగారి భార్యను హెడ్ మాస్టరు గారి భార్యను అని సగర్వంగా చెప్పుకుంటుంది ఆడది. ఫలానా  డాక్టరు గారి భర్తను ఫలానా వరలక్ష్మిగారి భర్తను అని గర్వంగా, గౌరవంగా అతడు ఎందుకు చెప్పుకోలేక పోతున్నాడు? నవమాసాలు మోసి కని పెంచి పిల్లల జీవితంలో ప్రదానపాత్ర వహించేది తల్లి. కాని పిల్లలు తండ్రి పేరుతోనే చలామణి కావడం ఎంత దారుణం. ఇంట్లో, వీధిలో ఎక్కడ చూసినా మగవాడి డామినేషన్, వీటన్నిటికీ కారణం ఆడది ఒక మనిషి  అనుకోకపోవడం వల్లే కదా? "ఆఁ ఆడది!" అన్న చులకన భావం వుండటం వల్లనేకదా.    

    మీరు హక్కులను గురించి గౌరవ మర్యాదల గురించి పురుషుడిని ప్రశ్నించేందుకు మీ ఆడవాళ్లు ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని నా మనవి. మగవాడంటే అపర ప్రమీలారాణుల్లా  ఈసడించే మీ ఆడవాళ్లు ఎంతమంది, మగవాడితో అవసరం లేకుండా, అతడిమీద ఆధారపడకుండా బ్రతక గలుగుతున్నారు? ఎంతమంది తమ కాళ్లమీద తాము నిలబడగలుగుతున్నారు? అలా బ్రతికేవాళ్లది చాలా తక్కువ పర్సెంట్ వస్తుంది  కదా? మగవాడి సంపాదనమీద ఆధారపడి, అతడి దయమీద ఆధారపడి నపుడు అతడి డామినేషన్ ఆమెమీద తప్పకుండా వుంటుందికదా?"

    "సంపాదించుకుని. ఆర్దిక స్వాతంత్రం కలిగివున్న ఆడవాళ్లమీద కూడా పురుషుడి డామినేషన్ తప్పడంలేదు కదా? వెయ్యి రూపాయలు సంపాదించుకునే ఆడది కూడా మగడు ఓ. కే. అంటేనే తనకిష్టమైన చీర కొనగల స్థితిలో వుందికదా?" కని పెంచి ఇంతదాన్ని చేసిన తల్లిదండ్రులకు ఓ పదిరూపాయలు సాయం చేయాలన్నా అతడి అనుమతే కావాలి కదా?"

    "ఎందుకంటే, అతడి ఆధిపత్యాన్ని తిరస్కరించగల వ్యక్తిత్వం సంతరించుకోలేదంటాను.  డబ్బు అవసరం లేకపోవచ్చు! మానసిక పరిణితి  లేకపోవడంవల్ల కూడా అతడిమీద ఆధారపడడం జరుగుతుంది. శారీరక బలహీనత, స్త్రీ శీలానికి సంబంధించిన కొన్ని హద్దులు కూడా పురుషుడి  మీద ఆధారపడేట్టు చేస్తాయి. తను అతడిమీద ఆధారపడిన సంగతి మరిచి పోయి, అతడు తనమీద  ఆధిపత్యం చలాయిస్తున్నాడని కారాలు మిరియాలు నూరడం అది మీ ఆడవాళ్లు అజ్ఞానం తప్ప మరేంకాదు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS