Previous Page Next Page 
సంసారంలో శ్రీశ్రీ పేజి 22

    అయితే  ఈ సినిమా పని  నేను అనుకోనిది. నా ధ్యేయంవేరు. అయినా గడ్డు రోజుల్లో ఆర్ధికంగా నన్ను ఆదుకున్నది ఈ సినిమాయే. నిత్యజీవితానికి  ఏదో ఒక ఉపాధి  కావాలి. ఇది దొరికింది. అందులోనూ నువ్వు వచ్చిన తర్వాత నేనిందులో  కూరుకు పోయాను.

    సైలెంట్ మూవీల నుండి చూశాను. ఎప్పుడూ నేలమీదనే కూర్చునేవాడిని. అందరిలాగే  నేనూ, ఆదా మొగా తారల్ని  ఆరాధిస్తూ ఉండేవాడ్ని. పోతే రోజుకో కొత్త తార రావడం వల్ల  అభిమానతార  అంటూ  ఎవరూ  ప్రత్యేకంగా లేరు. నాకు చార్లీ చాప్లిన్  అంటే చాలా సరదా. సైలెంట్ మూవీలకి  ధ్వని  ముద్రణ  కూడా  చేశాడాయన" అని అన్నారు.

    ఇంతలో  తలుపు  చప్పుడయింది. నేను వెళ్ళి తీశాను.



                                                     "తల్లి" పుట్టింది


    సర్వర్ వచ్చాడు. అతన్ని భోజనం  తెమ్మని  చెప్పి, లాగే మరో నైట్ హార్స్ విస్కీ, రెండు బీరులూ  తెమ్మని డబ్బులిచ్చారు శ్రీశ్రీగారు.

    బాత్ రూంకి  వెళ్ళొచ్చి  ఓ పెగ్ బిగించారు. "ఆఁ...ఎక్కడ ఆపేశాను?" అని అడిగారు.

    "ఎక్కడ  ఆపేస్తే  ఏం గానీ_నేనోమాట సూటిగా  అడుగుతాను  నిజం చెప్తారా?" అన్నాను.

    "నాకు అబద్ధం  ఆడడం  చేతకాదు సరోజా!" అన్నారు.

    "ప్రేమ, పెళ్ళి  సెంటిమెంట్లు_వీటి మీద  మీకు నమ్మకం లేదని  అడుగడుక్కీ  అంటూ వుంటారే, మీరు నిజంగా  నన్ను ప్రేమించలేదా ?
    ప్రేమించకుంటే పెళ్ళెందుకు  చేసుకున్నారు?" అని అడిగాను.

    ఒక సెకండ్ మాట్లాడలేదు. తర్వాత  "నిజం  చెప్పమంటావా ? అబద్ధం చెప్పమంటావా?" అని అడిగారు.

    "అబద్ధం  చెప్పడం  చేతకాదన్నారుగా?"

    "నేను నిజంగానే  నిన్ను ప్రేమిస్తున్నాను  సరోజా! ప్రేమ వేరు_పెళ్ళి  వేరు. ప్రేమించి పెళ్ళిచేసుకున్నానంటే  అర్ధం  ఏమిటి? నా జీవితంలో  ప్రేమ అంటే ఏమిటో  నీ వల్లే తెలుసుకున్నాను. ఎంతమందితో  నువ్వుపోయావని  నిన్నెవరయినా  అడిగితే  నాకు నువ్వే వస్తుంది. నేనెవర్నీ  ప్రేమించలేదు.

    కమలని  ఒకామె  వుండేది. మేమిద్దరం  ఒకర్నొకరం  చూసుకోకుండానే  ఓ సంవత్సరంపాటు  ఉత్తరాలు  ప్రత్యుత్తరాలు  జరుపుకున్నాం. తర్వాత  ఆమెను చూశాననుకో. మా ముసల్దాని  అనుమతితో ఆమెను పెళ్ళి కూడా చేసుకుందామనుకున్నాను. కానీ తప్పిపోయింది" అన్నారు.

    "మరి సంవత్సరంపాటు  ఉత్తర ప్రత్యుత్తరాలు  జరుపుకొని  పెళ్ళిదాకా వచ్చినవాళ్ళు  ఆవిడ్ని  ఎలా వదిలేశారు?" అని అడిగాను.

    "వదిలేయడం ఏమిటి? చేసుకుందామనుకున్నాను. జరగలేదు. అంతే_

    ఆవిడ పెళ్ళి చేసుకొని  ఒక కొడుకును కూడా కంది" అన్నారు.

    "అంటే మీరామెను  ప్రేమించలేదా?" అని అడిగాను.

    "లేదు" అన్నారు.

    "మరి మీ ఆవిడని?" అని అడిగాను.

    "అది పెద్దలు  చూసి ఏర్పాటు  చేసిన పెళ్ళి సరోజా! ముందే చెప్పానుగా ప్రేమ వేరు, పెళ్ళి వేరు  అని. నిన్ను చూసిన తర్వాత  నీతో పరిచయమైన తొలి రోజుల్లోనే  నాలో వుండే సుఖవ్యాధుల్ని  తరిమెయ్యాలనిపించింది. నీకు తెలియకుండా  డాక్టర్ కృష్ణగారి దగ్గరికి వెళ్ళి నా అభిప్రాయం చెప్పాను. 'దానికో పూర్తి కోర్స్ వుంది. ఓ వారం రోజులు  ఇంజక్షన్ లు తీసుకోవాల'న్నారు. రెండుపూటలా  ఇంజక్షన్ లు తీసుకున్నాను. తర్వాత నీకు తెలిసి ఆ మూలవ్యాధి బాధ కూడా  నివారణ అయింది" అని అంటూవుండగా  బోయ్ వచ్చాడు. బీర్లు, విస్కీ  వగైరాలు పెట్టేసి వెళ్ళిపోయాడు.

    "టేబిల్ మీదున్న గ్లాసు  తీసుకురా" అన్నారు.

    "దేనికి?" అని అడిగాను.

    "చెప్పినపని  చెయ్యి సరోజా! అడ్డు ప్రశ్నలు వెయ్యకు" అన్నారు.

    బుద్ధిగా  వెళ్ళి తెచ్చాను.

    మళ్ళీ బోయ్ వచ్చి చికెన్, గుడ్లుతో  నాన్ విజిటేదియన్  మీల్స్ ఒకటి, చపాతీ డాలుతో  విజిటేరియన్ మీల్స్ ఒకటి పెట్టేసి వెళ్ళిపోయాడు.

    శ్రీశ్రీగారు గ్లాసులో బీరు  పోసి, "తీసుకో సరోజా!" అన్నారు.

    తీసుకోనని చాలాసేపు  అల్లరిపెట్టాను. చివరికి  ఓడిపోయాను.

    ఓ గ్లాసు ముక్కు మూసుకుని గడగడ తాగేశారు. కసగా ఉన్నట్టనిపించింది. మొదట ఐదు  నిమిషాలు ఏం కాలేదు. త్రేన్పులు  మాత్రం వచ్చాయి. మళ్ళీ మరో గ్లాసు పోశారు. నెత్తీ నోరూ మొత్తుకున్నా వినలేదు. నాకూ ఏదోలా వుండడం ప్రారంభించింది. రెండో గ్లాసు కూడా  తాగేశాను. అంతే. దానితో  వికారం  ప్రారంభమయింది. కళ్ళు తిరగడం  ప్రారంభించాయి. ఏం మాట్లాడుతున్నానో  నాకే అర్ధం  కావడంలేదు. అరగంట కూడా కాలేదు. భళ్ళున  వాంతి చేసేశాను. గోడమీదా, కిందా  కూడా వాంతే! లేస్తే  పడిపోయేట్టున్నాను.

    పాపం_వారు ఓ గుడ్డ  తీసుకుని గోడమీదా కిందా  అంతా తుడిచారు. అన్నం తినమన్నారు. 'సయించలేదు' అన్నాను. 'అదే సయిస్తుంది తిను' అన్నారు.

    "అన్నం  తింటే మళ్ళీ వాంతి  అవుతుందేమో! కడుపులో  తిప్పేస్తోంది. తల కూడా నొప్పిగా  వుంది. మీరు అన్నం తినండి" అని మంచంమీద  వాలిపోయాను.

    తర్వాత  ఏం జరిగిందో  నాకేం తెలియదు. మర్నాడు నాకు  తెలివి వచ్చేసరికి  పది గంటలయింది.

    "బాగా నిద్రపోయావా?" అని అడిగారు.

    లేస్తూనే  గొడవ  ప్రారంభించాను. "చూడండి. మీరు  ఎంతయినా  తాగండి. నాకు మాత్రం అలవాటు  చెయ్యకండి" అంటూ ఏడుపు  ప్రారంభించాను. "సరే సరోజా! ఆ మాత్రం  దానికి ఏడుపెందుకూ? నీ కిష్టం లేకుంటే మానెయ్యి. నిన్ను బమవంత పెట్టనులే" అన్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS