"మీ గురించి చాలా విన్నాం అంకుల్" అన్నాడు అతని కొడుకు.
"అవునురా అబ్బాయ్. నువ్వు మంచివాడివే కానీ మీ అన్న వొట్టి సన్నాసి" మళ్లీ మొదలెట్టింది అతని తల్లి.
తనకు అస్సలు పడని తమ్ముడిని పొగుడుతూ, తనని అన్ని తిడుతుంటే పైకి నవ్వుతూ నటించటం అతను భరించలేకుండా ఉన్నాడు.
వెనక నుంచి కిసుక్కున నవ్వు వినపడింది. తిరిగి చూశాడు.
లత....వాకింగ్ కి వెళ్లి తిరిగి వస్తోందట. తమ మాటలు వినపడి ఆగిపోయానంది.
ఆ తిట్లన్నీ విన్నట్లుంది. మొహంలో ఆనందం కనిపిస్తోంది.
"తన మీద ఊరందరికీ ఈవిడే చెప్తూ ఉండి ఉంటుంది" ఉక్రోషంగా అనుకున్నాడు.
అంతలోనే రాము తల్లి మళ్లీ మొదలెట్టింది.
"నిన్ను ఇష్టపడి ఇది పెళ్లి చేసుకోలేదు. నువ్వేమో మీ అన్న వల్ల జైలు పాలయ్యావు. ఇంత మంది జీవితాలు నాశనం చేసి వాడేం బాగు పడతాడు. సర్వనాశనం అయిపోతాడు" మెటికలు విరుస్తోందామె.
తన మీద పగ పట్టినట్లుందీ ముసల్ది. వీలైతే కరోనా వైరస్ కూడా తన వల్లే వ్యాపిస్తోంది అని ప్రచారం చేసేలా ఉంది.
"మామ్మా...ఇక ఆపేయ్యి" గద్దించినట్లుగా అంది లత.
ఆమె ప్రవాహానికి అక్కడితో అడ్డుకట్ట పడింది.
లత తో పాటే ఇంటి వైపు అడుగులు వేస్తున్న సుధీర్ కి అలజడి గా ఉంది. అక్కాచెల్లెళ్ళు ఇద్దరూ కార్తీక్ గాడినే ఇష్టపడ్డారా? చెల్లెలి కోసం త్యాగం చేసి బృంద తనని చేసుకుందా? టాలీవుడ్ సినిమా కథ చూపిస్తున్నారు అక్కాచెల్లెళ్ళు ఇద్దరూ కలిసి తనకి.
ఇందాక ముసల్ది ఎన్ని తిట్టింది తనని. తన అనుచరులకు తెలిస్తే ఒక్క నిమిషం పట్టదు వాళ్లకు ఆమె ఒకప్పుడు భూమి మీద ఉందేదన్న ఆనవాళ్లు లేకుండా చేయటానికి.
***
మరి కొన్నాళ్ళు ఇంట్లోనే గడిపేశాడు సుధీర్. అప్పుడే వారం అయిపోవస్తోంది.
తనకి అసలేం చేయాలో తోచడం లేదు. ఒకటా రెండా ఎన్ని కేసులు….మరో రెండేళ్లలో ఎలక్షన్లు...ప్రజలతో మంచివాడనిపించుకుని ఎలాగయినా వచ్చే ఎలక్షన్ గెలవాలి. నోట్ బుక్ ముందు పెట్టుకుని ఆలోచిస్తున్నాడు.
ఇంతలో లత వచ్చింది.
"సుధీర్ టీవీ పెట్టు ఒకసారి" అంది
ఆమె మొహం ఉద్విగ్నంగా ఉంది.
"ఎందుకు…? ఏ ఛానెల్?" అడిగాడు.
"అన్నిటిలో లైవ్ వస్తోంది. పెట్టు." అందామె.
అప్పటికే ఆన్ చేసాడతను. కార్తీక్ మాట్లాడటం చూపిస్తున్నారు.
అంటే తన స్థానంలో కార్తీక్ ని తెచ్చినట్లుంది బృంద.
ఆ మధ్య ఎవరో ఒకమ్మాయి భర్తని చంపి బాయ్ ఫ్రెండ్ మీద ఆసిడ్ పోయించి మొహం మార్చి భర్తలా నటింపజేయటానికి కుట్ర పన్నిందట.
ఇక్కడ ఆ అవసరం కూడా లేదు. అన్నీ బృంద కోరుకున్నట్లే జరిగిపోతున్నాయి. తనేమో దాక్కోవాల్సిన పరిస్థితి. వాడేమో అచ్చు తన పోలికే.
"ఛీ ఛీ….బృంద అలాంటిది కాదు" తన మీద తనే చిరాకు పడ్డాడు.
పక్కకి చూసేసరికి లత టీవీ లో కార్తీక్ ని చూసి బుగ్గల్లో గులాబీలు పూయిస్తోంది. కాసేపు ఈర్ష్య గా అనిపించింది అతనికి. ఇన్నేళ్లు ఉంటుందా ఒక మనిషి మీద ఇష్టం? తను దురదృష్టవంతుడిని అనిపించింది అతనికి.
***
మర్నాడు సుధాకర్ అండ్ కో కి తామిచ్చిన కాంట్రాక్టులు అన్ని రద్దు చేశారన్న వార్త చూసి అతనికి పై ప్రాణం పైనే పోయింది.
వెంటనే బృంద కి ఫోన్ చేసాడు.
ఆమె ఏమన్నది? అటువంటి వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటే దాని వల్ల కలిగే కష్ట నష్టాలు భరించక తప్పదు అని కదూ అన్నది. ఎంత కాఠిన్యం...ఇద్దరి మధ్య మాటలు లేకపోవటమే ఒకరకంగా మంచిదేమో అనిపించింది ఆ నిమిషాన అతనికి.
మర్నాటి నుంచి అసెంబ్లీ.
ఈ కార్తీక్ గాడు అక్కడేం చేస్తాడో. పార్థు రాజీనామా చేయమనగానే చేసేస్తాడేమో.
టెన్షన్ తో చచ్చిపోతున్నాడు సుధీర్.
----***-----
