Previous Page Next Page 
కౌగిట్లో కృష్ణమ్మ పేజి 22

 

    బాధగా మూల్గుతూ తల ప్రక్కకు వాల్చేసింది సవర యువతి.
    ఆమెను పరిశీలించి కట్లు విప్పేశాడు దొళబేహార.
    "పట్నవాసం దొరసానీ! ఈమె శరీరాన్ని ఆశ్రయించిన ప్రేత శక్తులు దూరంగా వెళ్ళినాయి. అవి యింక ఈ అనంత విశ్వంతరాళంలో విలీనమావుతాయి. ఈమె మామూలు మనిషి అయిపొయింది" అంటూ వివరించాడు దొళబెహర.
    "దొరా! ప్రేతాత్మలు మానవ శరీరాలతో ప్రత్యేక్ష సంబంధం కల్గించుకోగలవా?" అని ఆశ్చర్యంగా అడిగాను.
    "దొరసానీ! కనులారా చూచినదాన్ని కూడా అనుమానించటమే కదా మీ నాగరికుల బలహీనత! ఇప్పుడు నీవు చూచినదంతా అసత్యమని నీవు అనుకోగలవా?" అని అడిగాడు అతడు.
    నేను బదులు చెప్పలేక మౌనం వహించాను.
    అరగంట తరువాత ఆ యువతికి చైతన్యం వచ్చింది. లేచి కూర్చుంది . తన బిడ్డ కోసం పిచ్చి చూపులు చూడసాగింది.
    వాకిలి తలుపులు తీయవలసిందని సైగలందించాడు దొర. నేను వెదురు చీలికలతో అల్లిన అభ్యంతరాన్ని ప్రక్కకు ఒత్తిగించాను. ఎదురుగా రక్తపు ముద్దలా మరొకరి చేతిలో వున్న బిడ్డను చూచుకుని బావురుమంది సవర మాత.
    ఒక్క ఉదుటున వెళ్ళి బిడ్డను ఒడిలోకి తీసుకుని పిచ్చిదానిలా శిశువుకు స్తన్యం అందించింది. మృత శిశువు చలించలేదు. మాతృత్వం పొంగి పొరలగా అనాచ్చాదిత వక్షోజాల నించే క్షీర ధారలు పొంగిపొరలి నేలపాలయినాయి.
    తన బిడ్డ ప్రాణాలను కాపాడుకుందుకు యిచ్చుకోవలసిన స్తన్యధారలు వృధాగా మట్టి పాలవటం చూచి సవర మాత క్షోభిల్లింది.

                                 7

    "కొద్ది సేపటి తరువాత ఎవరి దారిన వారు వెళ్ళిపోయినారు. కాని ఇంక ఆ రాత్రి నేను నిద్రకు నీళ్ళోదులుకున్నాను. దొళ'బేహార ను ప్రేతాత్మల గురించి ఎన్నో ప్రశ్నలు అడిగి విసిగించాను. అతడు నా ప్రశ్నలన్నింటికీ ఎంతో ఓర్పుగా సమాధానాలు చెప్పాడు."
    "నేను చదివిన తత్త్వశాస్త్ర విషయాలన్నీ ఒక ఎత్తు, ఆ రాత్రి అతడు ప్రేతాత్మల గురించి చెప్పిన సమాచారమంతా ఒక ఎత్తు అనిపించింది . జ్యోతి! నా మట్టుకు నేను ప్రేతాత్మలు ఈ సువిశాల విశ్వంతరాళంలో సంచారిస్తాయని నమ్ముతాను. ఎప్పుడో, ఎందుకో -- మనం మానవ మేధస్సుతో ఊహించలేని ఏ కారణం చేతనో -- అవి మనుషుల భౌతిక శరీరాలతో ప్రత్యక్ష సంబంధం పెట్టుకుంటాయి.
    అది నా నమ్మకమే కాదు, నా అనుభవం కూడా !"
    "అందునించి ప్రేతాత్మలు మానవులతో ప్రత్యక్ష సంబంధం పెట్టుకుంటాయా? అన్న నీ ప్రశ్నకు అవును అనే సమాధానం చెప్తాను. ఆత్మరూపాలు చర్మ నేత్రాలకు కన్పిస్తాయని అంగీకరిస్తాను." అంటూ తన అనుభవాన్ని వివరించింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
    ఆమె చెప్పే మాటలను శ్రద్దాసక్తులతో విని మనసుకి పట్టించుకుంది జ్యోతి. ఊగిసలాడే మనసు 'అవును' అన్న సమాధానం దగ్గర ఆగిపోయింది. ఇంక తాను ప్రయత్నాలు ప్రారంభించవచ్చు అనిపించింది. ఉన్నాయో, లేవో తెలియని అనిశ్చిత స్థితిలో వాటి గురించి అన్వేషించాలని పూనుకోవటం తగని పని. ఇప్పుడా సంశయాలన్నీ పటాపంచలయానాయి కాబట్టి, కార్యరంగంలోకి దిగవచ్చు అనిపించింది.
    అన్వేషణ ఎక్కడ నించి ఎలా ప్రారంభించాలి?
    ఈ పరిశోధనలో ఆర్కేలాజికల్ వారి సహాయాన్ని అందుకోవడం అవసరమని ఆలోచించింది జ్యోతి. వెంటనే తమ మనోగతాన్ని ప్రొఫెసర్ శ్రద్దాదేవితో చెప్పిందామె. ప్రొఫెసర్ గత అనుభావాలను మనసులో ఉంచుకుని భయపడకుండా జ్యోతి పరిశోధనలకు పూనుకోవడంతో తృప్తి పడింది.
    "అమ్మా! నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నా నీకు ఏ సహాయం కావలసివచ్చినా అందించేందుకు నేను సిద్దంగా ఉన్నానని మర్చిపోకు . నన్ను అడిగేందుకు రవంతయినా సందేహించకు.
    "నాగార్జునసాగర్ ఐలాండ్ మ్యూజియంలో ఆర్కియాలజీలో మేధావులు కొందరున్నారు. నా దగ్గర చదువుకున్న జయకృష్ణ ఇప్పుడు అక్కడే ఉంటున్నాడు అసిస్టెంట్ క్యూరేటర్ గా పనిచేస్తున్నాడనుకుంటాను చాలా మంచి వ్యక్తీ.
    "విద్యను బోధించతమనేది ఉపాద్యాయుల కర్తవ్యం. డ్యూటీ -- మైండేడ్ గా మేము ఆ పని చేస్తాం . కాని మానిమ్చి విద్యావంతులయినవారు కొందరు మా గురించి మర్చిపోతారు.
    మరికొందరు జ్ఞాపకం వుంచుకుని ఎప్పుడు కన్పించినా కృతజ్ఞతాభావంతో మాట్లాడతారు.
    జయకృష్ణ అలాంటి కోవకు చెందిన మంచి విద్యార్ధి.
    "ఇప్పుడు తాను పెద్ద ఉద్యోగంలో వున్నానని గర్వించడు. అదంతా తనకు విద్యా భోధించే ఉపాధ్యాయుల కరుణ వల్లనే జరిగిందని భావిస్తాడు. నీవు వెళ్ళి అతడి సాయం కోరితే నీకు ఏదైనా సాయం లభించవచ్చును. అవసరమయినప్పుడు నేను కూడా వస్తాను" అంటూ ప్రోత్సహించింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
    ఆ మాటలు జ్యోతికి కొండంత దైర్యాన్నిచ్చాయి. కొద్ది రోజుల తరువాత కావలసిన వస్తువులు అన్నీ సమకూర్చుకుని నంది కొండకు బయలుదేరిందామె.
    ఆమెకు ధైర్యం చెప్తూ వీడ్కోలు యిచ్చింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి. "అమ్మా! జ్యోతీ! ఈ పురుషాధిక్య ప్రపంచంలో ఆడది ఒంటరిగా చేలాయించుకు రావాలంటే కొండంత గుండె నిబ్బరం కావాలి. కొన్ని దశాబ్దాలుగా నేను అనుభవించిన ఒంటరి తనంలో ఎన్నో నిష్టూరాలు ఎదురుఅయినాయి.
    అయితే మనలాంటి వారిని కాపాడగలిగినవి ధైర్యమూ, చొరవా నిజాయితీ ! వాటిని పదిలంగా కాపాడుకున్నంత కాలం నేర్పరి అయిన వేటగాడు అడవి మృగాల మధ్య సురక్షితంగానే తిరుగగలం."
    "ఒక్క సంగతి జ్ఞాపకం పెట్టుకో!
    మనిషికి నిండా బ్రతికితే నూరేళ్ళు. ఆ నూరేళ్ళ బ్రతుకులో జీవిత గమనం మన యిష్టాన్ని అనుసరించి సాగేది బహు కొద్ది కాలం, యౌవన కాలంలో మన ప్రవర్తన ఒక్కటే మన భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది.
    "యౌవన మనేది రంగుల హరివిల్లు. ఆ రంగులు అంతరించి పోతాయనే సంగతి ఎల్లవేళలా మనం జ్ఞాపకం వుంచుకోవాలి.
    మాసిపోయే రంగులు మన బ్రతుకుని ఉద్దరించలేవు. మనవ్వక్తిత్త్వమే మనలను కాపాడాలి.
    తల్లీ! బాల్యంలో తప్పు చేస్తే తెలియక చెసిందంటారు. పెద్దఅయాక తప్పు చేస్తే సమర్ధించుకోగలదు కనుక చేయగలిగింది అంటారు. కానీ యౌవనంలో తెలియక తప్పు చేసిన తెలిసే చేసిందంటారు. యౌవనమనేది స్త్రీ జీవితంలో యమగండం లాంటిది. అగ్ని పరీక్ష లాంటిది. వివేకంతో చిత్తశిద్దితో, దృడతరమయిన దీక్షతో అగ్ని పరీక్షకి నిలిచి నెగ్గితేనే అడ బ్రతుకు పరిపూర్ణమయిన అర్ధాలను సంతరించుకుంటుంది.
    నీకు ఎప్పుడూ మంచి జరగాలన్న కోరికతో ఈ మాటలు చెప్తున్నాను. జ్ఞాపకం పెట్టుకో తల్లీ!" అని చెప్పింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
    జ్యోతి చెమరించిన కనులతో కృతజ్ఞత పూర్వకంగా చివాలున వంగి ఆమె పాదాలకు నుదురు తాకించి నమస్కరించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS