"ఓ జత బట్టలయినా కుట్టించుకోలేదు. మొత్తం ఎవరికో పంపాడు"
"ఎప్పుడొస్తాడో నీకు తెలుసా?"
"తెలియదు తల్లీ ఏదీ చెప్పడు కదా!"
"అతను అమ్మేసిన ఇల్లు ఎక్కడో నీకు తెలుసా?" "మాటల మధ్య ఎప్పుడో చెప్పిన జ్ఞాపకం " అంటూ ఇంటి వివరాలు చెప్పాడు.
"జయ వస్తే నా కోసం రమ్మని చెప్పు" లేచిండామే!
"పార్కుకి పోదామంటే సరదాగా కాలం గడపటానికి కాబోలు అనుకున్నాం. ప్రియా ఏమిటా వ్యవహారం?"
"తర్వాత చెప్తాను" త్వరగా నడుస్తోందామె.
"ప్రేమ వ్యవహారం అయి వుండాలి" మొదలు పెట్టారు.
"బాయ్ ఫ్రెండ్ కోసం వచ్చేటప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిచావే?"
"తర్వాత చెప్తానంటావు. తర్వాత అంటే ఎప్పుడు?" పెళ్ళయిన తర్వాతా?"
"కాదు పిల్లలు పుట్టిం తరువాత కాబోలు?"
"ఎలా చదువు కున్నాడు? ఎన్ని కంపెనీలున్నాయి"
"బంగారు బొమ్మవి కదా? ఎంత గొప్పవాడు రావాలో?"
"బంగారు బొమ్మ కాదు. వజ్రాల బొమ్మ! ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ప్లాటినం బొమ్మ! ఖరీదయిన అమ్మాయి కదా!"
"మీలాగే వాగుతూ ఆలస్యం చేశారంటే నేను వెళ్ళిపోతాను"
"అంతపని చేయకే ! ఆగాగు! మేమూ వస్తున్నాం" డోర్స్ తెరచుకుని అందరూ కారులోకి దూరి పోయారు.
కారు అమిత వేగంతో నడుపుతోంది ప్రియాంక! ఆమె చేరవలసిన చోటు నగరం శివార్లలో ఉన్న ఓ గ్రామం పూర్వం ఆ గ్రామానికి వేరే పంచాయితీ ఉండేది. సిటీ లిమిట్స్ లోకి చెరువుగా ఉండేది.
ఇప్పుడు నగరంలో అంతర్భాగంగా కలిసి పోయింది.
ఆక్కడకు చేరుకున్న తరువాత కావలసిన అడ్రస్ కోసం ఎనరినో అడిగి తెలుసుకుంది. కారు నేరుగా ఆ ఇంటి ముందు ఆగింది.
చిన్న పెంకుటిల్లు! ముందూ వెనుకా కొద్దిపాటి ఖాళీ స్థలం. చుట్టూ ప్రహరీ! ఒకటే వాటా! చూసేందుకూ ముచ్చటగా ఉంది.
ఇంటి ముందు కారు ఆగగానే ఓ పదకొండు సంవత్సరాల అమ్మాయి కొత్త పరికిణీ టపటప లాడించుకుంటూ వచ్చింది.
"ఎవరున్నారమ్మా ఇంట్లో!"
"మా నాన్నాగారున్నారు పిలవనా...? అంది ఉత్సాహంతో.
"పిలువు.... మాట్లాడాలి "
ఆ అమ్మాయి లోపలికి వెళ్ళి తండ్రిని తీసుకొచ్చింది.
"ఎవరు కావాలి మీకు ?"
"జయసింహ గారున్నారా?"
"వాళ్ళు ఈ ఇల్లు అమ్ముకుని వెళ్ళిపోయారు"
"వారి తాలుకూ బంధువులు ఎవరూ లేదా?"
"ఎవరూ లేరు. జయసింహ తండ్రి ఎక్కడో అప్రతిష్ట పడి ఈ ఊళ్ళో ఈ చిన్న ఇల్లు కొని ఆస్థి అంతా ఆవ చేశాడని విన్నాను. ఆ తరువాత ఆ కొడుకు ఈ ఇల్లు కూడా అమ్ముకుని వెళ్ళిపోయాడు. ఇంతే నాకు తెలుసు" అన్నాడాయన!
10
"బాబూ! మూడు రోజులుగా యిక్కడే కన్పిస్తున్నావూ? ఈ ఊరేనా?" ఆంజనేయస్వామి ఆలయంలో ఒంటరిగా కళ్యాణ మండపం మీద చాలా పరధ్యానంగా కూర్చుని ఉన్న జయసింహ తల త్రిప్పి చూశాడు.
ఎవరో తన వంకే చూచి నవ్వుతున్నారు. బాగా మాగిపోయిన కంపు కొడుతున్న కాషాయవస్త్రాలు! పెరిగి అట్టలు కట్టి పోయిన జుట్టు ముఖం మీద విభూది రేఖలు! మధ్యలో కుంకుమ బొట్టు!
"ఈ ఊరే!" చాలా ముక్తసరిగా జవాబిచ్చాడు.
"ఇంటికి వెళ్ళలేదు ఎందుకని .....?
"ఎక్కడుంది ఇల్లు !" అన్నాడు జయసింహ! గంజాయి దమ్ము నిషా తలకెక్కి ఉన్న బైరాగి ఆ మాటని తన అర్ధంలో తీసుకున్నాడు.
"అంతేలే! ఎక్కడో ఉంది ఇల్లు! ఈ ఇంటి నించి చిలక ఎప్పుడు లేచి పోతుంది. మళ్ళీ రాదు కదా !"
నిన్ను చూస్తె బాల్య చాపల్యంతో ఇల్లు వదిలి వచ్చే వయసు కాదు అనిపిస్తోంది. భార్యా బిడ్డలు కలికి బంధాలే!
వెంట వచ్చేవారు ఎవరు? మన చుట్టూ మాయని మనమే అల్లుకుంటున్నాం. పెళ్ళాం పిల్లల్ని వొదిలేసి వచ్చావా?" అన్నాడు ఆసక్తిగా.
"ఊ!" అన్నాడు జయసింహ. అంతటితో వదిలి పోతాడని. ఆలోచనల నెగడు మనసులో రగుల్చు కున్నాడు.
అది మండితేనే తృప్తి! భాదని అనుభవించగలగడంలో ఓ తృప్తి !
ఈ మాటలు అనగానే చాలా చనువుగా ప్రక్కనే కూర్చున్నాడు బైరాగి! ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఆశ్రయించుకుని చాలా మంది బైరాగులున్నారు. వారితో కొన్ని బైరాగి కుటుంబాలు కూడా! పూర్తీ స్వేచ్చా జీవులు!
"నేను కూడా అంతేనయ్యా! నా పెళ్ళాం అందంగానే ఉండేది. జరుగుబాటు కూడా లోటు లేదు. పిల్లలూ ఉన్నారు.
నా ఆత్మ ఆపదలో పడినప్పుడు వీరెవరూ వెంటరారు కదా! ఈ బంధాలన్నీ మనం తగిలించుకున్న జంజాటాలె కదా!
పది రోజులు పనిచేసి సంపాదించక పొతే పెళ్ళాం మన గురించి ఏమంటుంది. పిల్లలు అడిగినవి యివ్వకపోతే ఏమంటారు? డబ్బు సంపాదించ లేకపోతే పదిమంది ఎలా చూస్తారు?
ఆత్మ విముక్తికి మనం తగిలించుకునే అడ్డంకులే యివన్నీ కూడ! గుండెల నిండా గంజాయి దమ్ము లాగించి కళ్ళు చూసుకున్నాం అనుకో! వాస్తవం అనుకున్న ఈ ప్రపంచమంతా ఏమవుతుంది ? చిలుముంది. ఇస్తా ఓ పట్టు పడతావా?"
"నాకొద్దు" అన్నాడు జయసింహ చిరాగ్గా!
ఎవరయినా పొరపాటున ఇల్లు వదిలివస్తే మంచి మాటలు చెప్పి తిరిగి వెనక్కి పంపరు. ఇలాంటి వేదాంతమే చెప్పి మెల్లగా గంజాయి అలవాటు చేస్తారు సన్యాసులు!
బైరాగి జన సంఖ్యలో మరో అంకె పెంచేందుకే చూస్తారు.
"అక్కర లేకపోతే బలవంతం చెయ్యను. నెమ్మదిగా అదే అలవాటవుతుంది. గంజాయి అలవాటయింది అనుకో! వెనకటి బాధలు, జ్ఞాపకాలు అన్నీ యిట్టే మర్చిపోగలుగుతావు"
"అది సరే నువ్వు చదువు కున్నావా?"
"ఊ" అన్నాడు జయసింహ! అంతటితో వేడిచి పెట్టపోయేలా లేడు. తనే లేచి వెళ్ళిపోవాలి. సిద్ద పడుతున్నాడు!
మనిషికి ఒక్కొక్కసారి ఒంటరితనం కావాలి!
ఒకప్పుడు తనని తానే అభినందించుకుంటాడు. మరొకప్పుడు ఎందుకైతేనేం? ఏకాంతం కావాలి!
దానికి భంగం కలిగితే విసురు చిరాకు! బయల్దేరాడు.
'ఆగాగు నీతో కొంచెం పనుంది. ఈ పేపరు చూడు అందించాడు.
"ఏం కావాలి?"
"మధ్యప్రదేశ్ లాటరీ ఫలితాలు వచ్చాయి కదూ!"
"అవును వచ్చాయి!"
"ఈ టిక్కెట్లకి ప్రయిజ్ వచ్చిందేమో చూసి పెట్టు" అంటూ జోలి లోకి చెయ్యి పోనిచ్చాడు బైరాగి.!
సేమ్ ట్రబుల్! తన బాధ లాంటిదే ! చూపెట్టొచ్చు!
బైరాగి వరుసగా టికెట్స్ తీసి యిస్తున్నాడు. ఫలితాలు చూసి పెదవి విరుస్తున్నాడు జయసింహ!
ఒకటి, రెండు, అయిదు, పది, పాతిక, యాభై , వంద ఇంకా తీస్తూనే ఉన్నాడు. జయసింహ కి అలుపోచ్చింది. బైరాగి ఇంకా టికెట్స్ తీసి యిస్తూనే ఉన్నాడు. ఎన్నెన్ని కొన్నాడో! యాచించిన డబ్బుతో మొహమాటపడి ఒప్పుకున్నందుకు అతని పని పూర్తీ చేశాడు.
