ఏ మాగాడయినా పెళ్ళాం కన్నా మీరు అందంగా ఉన్నారు అని మరో అడదానితో అనగలిగితే ఆ ఆడది అంతరాల గురించి ఆలోచించదు. అదృష్టాన్ని తలుచుకుంటుంది.
"మీ ఆవిడ అందంగా ఉండదా?" అంది నెయిల్ కట్టర్ వ్రేళ్ళ చివర కదిలిస్తూ ! అటెండర్ రెచ్చిపోయాడు.
"అందం అనే మాటకి అర్ధమేటండీ! మనకేదిష్టమైతే అదే కదా అందం -----"
అయినా అందం మీలాంటోళ్ళ కుండాలి గాని మా కెందు కండీ!
అసలు వచ్చిన పని మర్చిపోయి వాగుతున్నాను."
"ఏమిటా పని" నెయిల్స్ కి పాలిష్ పట్టిస్తోంది.
"డబ్బు కావాలండి" గొంతు దీనంగా మార్చాడు.
"ఎంతేమిటి." పాలిష్ కంటేయినర్ అవతల పెట్టింది షీనా!
"అయిదొందలు కావాలండీ!" చురుక్కున తల త్రిప్పిందామె.
"నా దగ్గర లేవు. "అంది నిక్కచ్చిగా!
"పోనీ రెండొందలయినా చాలండీ!"
"నా దగ్గరే వందే ఉన్నాయి"
'అంతవరకే చాలండి! ప్చ్! అంతే ప్రాప్తం!"
"ఇంటికి వెళ్ళి త్వరగా వచ్చెయ్యాలి! తొమిదిన్నర కల్లా నువ్వూ నేనూ వెళ్ళి బాంకు షట్టర్స్ తెరవాలి కదా!"
"ఓ దానికేముందండి! నిమిషం"
ఆమె బీరువా తెరిచి వంద రూపాయలు తెచ్చి యిచ్చింది.
'అప్పుడప్పుడు యిరుకూ యిబ్బంది యిలాగే మనం సర్దుకోవాలండీ"
"ఏం రూలు పెడుతున్నావా?" రెప్పలకు మస్కారా వేసుకుంటూ కొంచెం కంఠస్వరాన్ని పెంచి అడిగింది షీనా!
"రూలంటే రూలే కదండీ మరి? తప్పయినా ఒప్పయినా కలసి చేసినప్పుడు అవుసరాలు కూడా కలిసే పంచుకోవాలి కదండీ!"
"షటప్! వంద యిచ్చా కదా! వెళ్ళు"
'అలాగేనండీ! మరీ గొంతు మీదికి వచ్చినప్పుడే కదండీ నేనొస్తా మమూలప్పుడు మిమ్మల్ని యిబ్బంది పెడతానా."
"షటప్! అండ్ గెటవుట్!" నవ్వుకుంటూ లాటరీ టికెట్స్ ఏజన్సీ వైపుగా వెళ్ళాడు అటెండర్!
ఫాన్ స్పీడు పెంచి ఒంటినిండా క్రమ్ముకున్న చిరుచెమటల్ని అర్పుకోవాలని ప్రయత్నిస్తోంది షీనా!
* * *
సాయంత్రం అయిదు గంటల ముప్పయి నిముషాలయింది!
అ లవ్ గ్రీన్ కలర్ కాంటేస్సా వచ్చి నోబుల్ పార్కు ముందు దిగింది. బిలబిలమంటూ ప్రియాంక బిగ్రేడ్ క్రిందికి దిగారు.
డోర్స్ లాక్ చేసి విండోస్ మూసేసి అందరి కన్నా చివరిగా దిగి వచ్చింది ప్రియాంక. పార్కులో కూర్చుని పచ్చగడ్డిలో పల్లీలు పోయించుకుని తింటున్న వాళ్ళ మొహాలు వాచిపోయినట్లు చూస్తున్నారు.
"చూడవే ఎలా చూస్తున్నారో! ఇంటి దగ్గర ఆడవాళ్ళ ముఖాలు చూడరా వీళ్ళు. ఆడపిల్లలు కన్పించగానే ముఖం వాచిపోయి చూస్తారేం. " అన్నదొక అమ్మాయి పంజాబీ డ్రస్ మీద అమర్చుకున్న రోజ్ మీద పిన్ను టైట్ చేసుకుంటూ! అందరూ అందాలు ఒలకబోస్తున్నారు.
"అలా చూడబడటంలో ఒరిజినల్స్ కి తలవొంపు కాదు. పైగా గర్వకారణం. ఇండియన్ లేడి ఆనందంగా వుండవలసిన వయసు యిది కదా.......!"
"ఛీ నీ కసలు సిగ్గులేదు" అంది పంజాబీ డ్రస్ అమ్మాయి.
'అంతేలే! నిజం చెప్పిన వాళ్ళు యెవరు చివాట్లు తినకుండా ఉన్నారు. "మిడ్డీతో వయసు తగ్గించుకున్న మరో కొమాలంగి సేటయిర్ విసిరింది.
ప్రియాంక వారి మాటలు పట్టించుకోలేదు.
నేరుగా వెళ్ళి ఆ బెంచి మీద కూర్చుంది. అక్కడే జయసింహ తో పాటుగా కొద్ది సేపు కూర్చుంది తాను.
జీవితంలో కొన్ని క్షణాలు యెంతో విలువని సంతరించుకుంటాయి. అని మన మనసు మీద ఒదిలిన ముద్రలు జీవితాన్ని మలుపు త్రిప్పుతాయి.
అతనితో పాటుగా కూర్చున్న ఆ కొద్ది క్షణాల్లో ఆమె జయసింహలో మహోన్నతమయిన ఆదరాన్ని చూడగలిగింది.
అతని విశిష్టమయిన వ్యక్తిత్వాన్ని అర్ధం చేసుకుంది.
తనకి అతనికీ మధ్య అతడు గీచిన గీటు చెరిపేయలన్న కృత నిశ్చయానికి వచ్చిందామే. అయితే అది తరతరాల అంతరం!
అంత తేలికగా చెదిరిపోయే సరిహాద్దు కాదు. దాన్ని భూతద్దంలో చూస్తున్నాడు జయసింహ! అసలు దాని గురించి పట్టించుకోకూడదనుకొంటోంది ప్రియాంక!
"లవ్ ఎఫైర్ లో చిక్కిన వాళ్ళు బాధ పడేందుకు యిలాంటి బాక్ గ్రౌండు కావాలి. మమ్మల్నేందుకు ఈ పార్కులో తెచ్చి పడేశావు." అంటూ ప్రారంభించిందొక అమ్మాయి.
"అవును! సినిమాలో ట్రాజెడీ సాంగ్ పాడుకునేందుకు పనికి వచ్చేలా ఉందీ పార్కు! ఇక్కడేం చెయ్యాలి మనం." మరొకామె!
"పోనీ నేనొక ట్రాజెడీ సాంగ్ పాడుతాను. మీరంతా వింటారా." లావుపాటి లలిత లేచి నిలబడి గొంతు సవరించుకుంది.
"వొద్దు తల్లీ! నువ్వు పాడితే విన్న దురదృష్టవంతులకి చిన్నప్పుడు త్రాగిన ఉగ్గుపాలు సైతం వెళ్ళుకొస్తాయి. అంత పని చెయ్యకు మమ్మల్ని యిలా సుఖంగా ఉండనివ్వు" అంటూ అందరూ కలసి ఆమెను బలవంతంగా కూర్చోపెట్టారు.
లావుపాటి లలిత కోపం వచ్చి మూతి బిగించుకుంది.
ప్రియాంక వారి లోకంలో లేదు. పార్కు నలుమూలలా ఆమె చూపులు గాలించి వచ్చాయి. జయసింహ కన్పించలేదు.
పానకాల్సామి పైపుతో పచ్చిక మీద నీళ్ళు చిమ్ముతున్నాడు.
బిలబిలమంటూ వచ్చి కూర్చున్న వారి వంక చూశాడు. ప్రియాంకను గుర్తించాడు. పైపు మడిచి క్రింద పడవేసి అటు వైపుగా వచ్చాడు.
"అమ్మాయిగారూ మీరా?" అన్నాడు అమితాశ్చర్యంగా!
"పానకాల్సామీ ఇవాళ ఈ సీటు ఖాళీగా ఉందేమిటి?"
"అవునమ్మా! బాబుగారు కన్పించి మూడు రోజులయింది "
"ఎక్కడున్నాడు?"
"ఏమోనమ్మా! నాకూ తెలియదు. చెప్పి వెళ్ళలేదు. తిరిగి రాలేదు. "
"బంధువులింటికి వెళ్ళారేమో!"
"తల్లీ తండ్రి లేరు. తోడబుట్టిన వారు లేరు. నాకు తెలిసినంత వరకూ బంధువులు కూడా ఎవరూ లేరు"
"జయ కోసం ఎప్పుడూ ఎవ్వరూ రాలేదా?"
"లేదమ్మా! నాలాగే అతనూ ఒంటరి ప్రాణి!"
"టికెట్ విషయం ఏమైనా తెలిసిందా"
"పాపం దురదృష్టవంతుడు దొరక లేదను కుంటాను"
'అతని కోసం ఎవ్వరూ రారు. ఉత్తరాలు కూడా రావా"
"రావు తల్లీ! తనే ఎప్పుడయినా పోస్టాఫీసుకి పోతుంటాడు."
"తన గురించి నీతో ఎప్పుడూ ఏమీ చెప్పాడా"
"అన్ని విషయాలు చెప్పాడు. ఒక్క విషయం తప్ప!"
"మొన్న నేను అడిగినప్పుడు కూడ చెప్పలేదు. ఏమిటా విషయం"
"అతనికి అర్జంటుగా కొన్ని లక్షలు కావాలి!"
"ఎందు కోసమో వివరాలు నీకు తెలుసా?"
"నాకూ తెలియదు. చెప్తే కదా తెలియటానికి"
"అతని జీవితం ఓ మిష్టరీ అన్నమాట?"
'అవునమ్మా! ఆ డబ్బు ఎవరికో పంపుతున్నాడు"
"మగవాళ్ళకా? ఆడవాళ్ళకా?"
"ఆ వివరం కూడా నాకు తెలియదు తల్లీ!"
"అంత డబ్బు అవసరమంటే అదేదో మిష్టరీ!"
'అవును తల్లీ! ఈ మధ్య తాను ఉంటున్న ఇల్లు కూడా అమ్మేశాడు. అదే కదా నీడ. అది కూడా పోయింది. అప్పటి నుంచి పార్కులోనే ఉంటున్నాడు. రాత్రి సమయాల్లో పార్కులోకి ఎవరినీ అనుమతించకూడదు కాని నాకు మాత్రం ఎవరున్నారు? నా బిద్దలానే చూచుకుంటున్నాను. ఇల్లు అమ్మగా అంత డబ్బు ఒకేసారి వచ్చింది కదా!
