Previous Page Next Page 
బ్లాక్ టైగర్ పేజి 24

 

    ఒక్క చిన్న ప్రయిజు కూడా రాలేదు.
    "ఈ టికెట్స్ అన్నీ నువ్వే కొన్నావా."
    "అవును ఇవి మధ్య ప్రదేశ్ లాటరీ!"
    "ఇతర రాష్ట్రాలవి కూడా కొంటావా"
    "అన్ని రాష్ట్రాలు కొంటాను. ఏ క్షణం ఎలాంటిదో!"
    "మరి డబ్బెలా వస్తుంది నీకు!" ఆశ్చర్యంగా అడిగాడు.
    "గంజాయి తెచ్చి అమ్ముతాను! వారానికి వెయ్యి రూపాయలు మిగుల్తాయి. అవన్నీ టికెట్స్ కొంటాను"
    "ఇలా ఎంతకాలం నుంచి చేస్తున్నావు"
    "అయిదేళ్ళ నుంచి"
    "ఈ లాటరీ టికెట్స్ కొనకుండా ఉంటే ఆ డబ్బే కొన్ని లక్షలు అయ్యిండేది కదా!" ప్రశ్నించాడు జయసింహ.
    "ఏమో ఆ సంగతి నేనెప్పుడూ ఆలోచించలేదు" ఇంతదాకా వచ్చాక యిప్పుడేలా మానుకుంటాను. పోయిన డబ్బయినా రావాలి కదా"
    "ఎప్పడయినా ప్రయిజులు వచ్చాయా!"
    "ఈ అయిదేళ్ళలో రెండు సార్లు వెయ్యి రూపాయలు వచ్చాయి. వందలూ పదులూ చాలా వచ్చాయి గుర్తులేదు."
    "ఫస్ట్ ప్రయిజ్ ఎప్పుడూ రాలేదన్న మాట!"
    "అది మందాకారాదులే గురూ!"
    "ఎందుకు రాకూడదు"
    "అబ్బో చాల కధలున్నాయిలే! అవన్నీ యిప్పుడెందుకు!"
    "కధలంటే మోసాలేనా!"
    "అవున్నాయనా! లాటరీ గొడవలన్నీ కాచి వడపోశాను. అన్ని నాకు కొట్టిన పిండే! ఫస్ట్ ప్రయిజుల్లో మోసాలు జరుగుతున్నాయి. డూప్లికేటు టిక్కెట్స్ వస్తున్నాయి.
    నాలాగా చదువురాని మొద్దులకి అవుటాఫ్ డేట్లు అమ్ముతారు. అలా చిత్రంగా చూడకు మరి. నాకు చదువయితే రాదు కాని లాటరీ బాష మొత్తం కాంటోపాఠమే ! కొన్నాళ్ళ కమీషన్ మీద టికెట్స్ కూడా అమ్మాను. సబ్ కమీషన్ కూడా అమ్మాను"
    మాట్లాడి తీరవలసిన ఆ బైరాగిని అంతటితో వదిలి వేయటం చాలా పొరపాటు అన్పించింది.
    లేచిన వోడు మళ్ళా కూర్చున్నాడు జయసింహ! తను ఆలోచనలన్నీ మర్చిపోయాడు. అసహనాన్ని తగ్గించుకున్నాడు.
    "డూప్లేకేట్ టికెట్స్ అమ్ముతారని నీకు తెలుసా!"
    "ఎంత అమాయకుడివయ్యా బాబు! నకిలీ టికెట్స్ అమ్ముతారా----- అని అడుగుతున్నావా! ఎందుకమ్మరు. జనం కొనే లాటరీ టికెట్స్ లో చాలా భాగం డూప్లికేట్ టికెట్స్ మాత్రమె!
    లాటరీ టికెట్స్ మీద ప్రభుత్వానికి లాటరీ సంస్థల యాజమానులకి లక్షరూపాయలు లాభం వచ్చిందనుకో!
    అనేక ప్రాంతాల్లో అనేకమంది డూప్లికేట్స్ అమ్మే ముఠాలకి పది లక్షల రూపాయలు లాభం!
    అదొక పెద్ద యంత్రాంగం! డబ్బులు సంపాదించటానికి చాల దగ్గర దారి. ఏ వ్యాపారం లో అయినా లాభ నష్టాలుంటాయి. ప్రతి వ్యాపారంలో కూడా నష్టాలకి అవకాశాలుంటాయి.
    వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి కోట్ల రూపాయల డూప్లికేట్ లాటరీ టికెట్ లు ముద్రించి అమ్ముకునే వ్యాపారంలో మాత్రం లాభమే కాని నష్టం అన్న పదానికి తావులేదు.
    ఉత్పత్తి అయిన దగ్గర నించి కొనుగోలుదారు వరకూ తలా కాస్తా కమీషన్ దండుకుంటారు. చాల నిశ్చింత అయిన చీకటి వ్యాపారం. మంచి లాభాలోస్తున్నాయి."
    "ప్రభుత్వం ఈ నకిలీ వ్యాపారాన్ని అరికట్టదా!"
    'అరికట్టేందుకు చాల రహస్యంగా ప్రయత్నాలు చేస్తుంది. కాని బయటపడి చీకటి వ్యాపారాలన్నీంటి మీద ప్రకటించినట్టుగా యుద్దాన్ని ప్రకటించదు.
    అందుకో కారణం ఉంది. నకిలీ టికెట్స్ ఉన్నాయన్నా విషయం ప్రచారమైతే జనానికి వాటి మీద నమ్మకం పోతుంది. అలా జరిగితే ప్రభుత్వాలు ఆర్ధికంగా నష్టపడతాయి.
    సమాజ శ్రేయస్సు కోసం ఎవరైనా లాటరీలు నడుపుతారా! నడపరు. లాభాల కోసమే నడుపుతారు. అలాంటిది ప్రభుత్వం మాత్రం తాను ఎక్కి కూర్చున్న లాభాల కొమ్మను నరుక్కోదు కదా!
    అంతేకాదు ఈ నకిలీ లాటరీ టికెట్ల వ్యవస్థని నడుపుతున్న వాళ్ళని ఎవరూ ఏమీ చేయలేరు. వాళ్ళు బలవంతులు!"
    "దొంగ లాటరీ టికెట్స్ అమ్మటం సాధ్యమే కావచ్చు. డ్రా జరుగకుండా ఫస్ట్ ప్రయిజు ఏ నంబర్ కి వస్తుందో ఎలా తెలుస్తుంది!" అని అడిగాడు జయసింహ! తన సమస్యకి కూడా ఓ సమాధానం ఉంటుందా! ఒకవేళ అది నిజమయితే చాలా భారీ ప్రయత్నంలో తన టికెట్ దొంగిలించబడి ఉండవచ్చు. కాని డ్రా అనేది పెద్దల సమక్షంలో సుప్రసిద్దుడయిన రాజకీయ నాయకుడో, క్రికెట్ వీరుదో, సినిమా తారో తీయటం జరుగుతుంది.
    అప్పటికప్పుడే ఫలితాల్ని కూడా ప్రకటిస్తారు. ఇందులో కూడ మోసం జరగటానికి తావుంటుందా! ఫలితాలు ప్రకటించే సమయంలో విలేకరులు ప్రక్కనుంటారు.
    ఫలితాలు వెనువెంటనే పత్రికలూ ప్రకటిస్తాయి.
    ఇంత పకడ్భందీగా జరిగే వ్యవస్థలో మోసానికి తావుంటుందా! జయసింహ అమితాశ్చర్యంలో పడిపోయాడు.
    అతని మరో లోకం ముందు చీకటి వ్యాపారం తాలుకూ అసలు రూపం ప్రత్యక్షమవుతోంది.
    బైరాగి గంజాయి దట్టించి చిలుము వెలిగించాడు.
    గట్టిగా రెండు దమ్ములు లాగి కన్నులు అరమొగినాడు.
    "ఎంత అమాయకంగా అడిగావయ్యా! చదువుకున్నానంటున్నావు. ఇంకా లోకం తెలియలేదన్న మాట!
    ఈ ప్రపంచంలో నల్లదనం రాజ్యమేలుతోంది. కొన్ని వేల కోట్ల నల్లదనం ఒక్క భారత దేశంలోనే చెలామణి అవుతోంది.
    దాన్ని బయట పెట్టించ గలిగితే నాగార్జునసాగర్ ప్రాజెక్టులు లాంటివి డజను దాకా కట్టించవచ్చు.
    రెండు మూడు రాష్ట్రాలని ధనిక రాష్ట్రాలుగా మార్చవచ్చు.
    కానీ ఆ పని చేయటం ఎవరికీ సాధ్యం కాదు. నల్లధనంతో చీకటి రాజ్యాన్ని పాలించే మహానుభావులు చెయ్యలేని పని లేదు.
    వారు సాధించే అద్భుత కార్యాల్లో ప్రభుత్వాల్ని మార్చటం ఒకటి అతి చౌకగా తయారై కారు చౌకగా ప్రజల అవసరాలను తీర్చే సోలార్ యంత్రాలు కనిపెట్టే సైంటిస్టుల్ని ఏమర్చటం ఒకటి!
    ఇలాంటివే ఇంకా ఎన్నో అద్భుతాలున్నాయి.
    వాటిలో ఇదీ ఒకటి! డ్రా తియ్యకుండానే ఏ నంబర్ కి ప్రయిజ్ రావాలో నిర్ణయించటం వాళ్ళు చేసే పనుల్లో చాలా చిన్న పని!
    అర్ధమయిందా? ఈ గంజాయి చిలుం సాక్షిగా చెప్తున్నాను.
    దేవుడనేవాడు లేడయ్యా!
    తెలివయిన స్వార్ధపరులు తమకన్నా శక్తి వంతులయిన ప్రజా సమూహాన్ని త్రొక్కి ఉంచేందుకు కనిపెట్టిన ఓ సాధనం దేవుడనే పదం.
    ఒకవేళ దేవుడనేవాడు ఉన్నాడనుకో! అతడే ఈ సృష్టిని పాలిస్తున్నాడనుకో! అప్పుడు అంతకన్నా దయాహీనుడు అన్యాయపరుడు మరొక్కడు లేడు అని చెప్పుకోవాలి.
    ఇది గంజాయి దమ్ము ఇచ్చిన నిషాలో నేను అంటున్న మాటలు కాదు, నేను చూచిన ప్రపంచం నా కిచ్చిన అనుభవం యిది" అన్నాడు బైరాగి!
    గుబురు గడ్డంలోకి వెళ్ళు పోనిచ్చి సవరించుకుంటూ తన్మయలోకాన్నించి ఈ ప్రపంచాన్ని చూస్తున్నాడు.
    "ఇన్ని సంగతులు నీకెలా తెలిసాయి"
    "మొదట్లో నాకూ తెలియదు. నీలాగే అమాయకంగా ఉండేవాడిని. నగరంలో ఈ వ్యాపారాలకి కేంద్రం సవాయ్ బార్ అండ్ రెస్టారెంట్ అక్కడికి పోయాక ఈ లోకం తెలిసింది నాకు" అంటూ వివరించాడు భైరాగి! కాషాయ వస్త్రాలు కట్టుకుని అధునాతన ప్రపంచం ఎలాంటిదో అర్ధం చేసుకున్నాడు. అందుకు తగినట్టుగా నడుచుకుంటూ ఎన్నో అనుభవాలు సంపాదించాడు . బైరాగి సామాన్యుడు కాదు.  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS