Previous Page Next Page 
ఇదీ కధ! పేజి 22

 

    "మాధవికి ఏ రకమయిన మానసిక రుగ్మతా లేదని రుజువయితే నేను మాధవిని చేసుకోవడానికి మీకు అభ్యంతరం లేదు కదా?" ఏదో ఆలోచిస్తూ , ఎక్కడో చూస్తూ అన్నాడు సాగర్.
    'డాక్టర్! వీడు మళ్ళీ మొదటికే వచ్చాడు." సాంబశివరావుకు చిర్రెత్తి పోయింది.
    "సాగర్! మాధవి నార్మల్ గా ఉన్నదనేనా యింకా నీ నమ్మకం!" డాక్టర్ అడిగాడు.
    "ఇప్పుడు కాకపోవచ్చును! త్వరలో మాధవి మాములు మనిషి అవుతుందని నా నమ్మకం. మీరు డాక్టర్ మీకు నేను చెప్పాల్సిన పనిలేదు. మాధవి ప్రవర్తనలో ఇప్పుడు కనిపిస్తున్న అస్తవ్యస్తత తాత్కాలికమైనదనే నా నమ్మకం. హటాత్తుగా ఆమెలో కలిగిన మార్పుకు కారణాలను తెలుసుకో గలిగితే  చాలు. వాటిని తొలగించడం అంత క్లిష్టమైనదేమీ కాదు."
    అవును! నీ అభిప్రాయంతో నేనూ ఏకీభవిస్తున్నాను. ప్రయత్నించు. అందుకు నేను కూడా సహాయం చేస్తాను. కానీ నీకున్న నమ్మకం నాకు లేదు! వ్యాధి ఒక్కోసారి ఉదృత మయ్యే ప్రమాదం కూడా ఉన్నది. పట్టాలు తప్పుతున్న బండిని ఇంకా ముందుకు తోసినట్టే అవుతుంది. ఏమయినా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా జడ్జీ రామానాధం గారే తీసుకోవాలి. మెంటల్ హాస్పిటల్ లో చేర్పించి షాక్ ట్రీట్ మెంట్ ఇప్పించి చూడమని రామనాధం గారికి సలహా ఇస్తాను."
    "మెంటల్ హాస్పిటల్లోనా!" సాగర్ బుర్ర తిరిగి పోతున్నది.
    'డాక్టర్ గారూ వీడితో మాట్లాడి లాభం లేదు. పిచ్చి కుదిరింది రోకలి తలకు చుట్టమన్నట్టుంది వీడి ధోరణి! అసలు పిచ్చి ఆ అమ్మాయికి కాదు, వీడికే!' సాంబశివరావు అన్నాడు.
    "నాన్నా!" కసిగా అరిచాడు సాగర్.
    "సాగర్ టేకిట్ ఈజీ! ఉద్రేకపడకు. తాపీగా ఆలోచించు. త్వరపడి ఏ నిర్ణయానికి రావద్దు. ఒక్కనోక్క బిడ్డవు, పుత్రవాత్సల్యంతో మీ తండ్రి ఏదో అంటున్నాడు. నువ్వేమీ బాధపడకు!" డాక్టర్ మూర్తి సాంబశివరావు కేసి తిరిగాడు.
    "సాంబశివరావ్ లీవ్ హిమ్ ఎలోన్! సాగర్ మీద మీరు ఎలాంటి ఒత్తిడి చేయకూడదు. అలోచించి అతన్నే ఓకే నిర్ణయానికి రానివ్వండి."
    'అంతకంటే నేను చేయగలిగిందేముంది డాక్టర్!' సాంబశివరావు నిట్టూర్చాడు.
    "సార్! ఫోన్!" అంటూ అర్దర్లీ విక్టర్ వచ్చాడు. సాంబశివరావు ముందుకు కదిలాడు.
    "మీక్కాదు సార్! అబ్బాయిగారికి , ఎవరో చంద్రశేఖర్ గారంట" అన్నాడు అర్దర్లీ.
    "ఎవరూ/ ప్రొఫెసర్ చంద్ర శేఖరమా!" డాక్టర్ మూర్తి సాగర్ కేసి చూసి అన్నాడు.
    "అవును సైక్రియాటిస్ట్ చంద్ర శేఖరమే!" ఉబికి వచ్చే కసిని అణుచుకుంటూ అన్నాడు.
    "ఇంతకూ ,ముందే ఆయన్ను చూశావన్న మాట! వెరీ గుడ్! అయన అభిప్రాయం ఏమిటి?" డాక్టర్ సాగదీస్తూ అన్నాడు. సాగర్ డాక్టర్ కేసి అదోలా చూసి సమాధానం చెప్పకుండా టెలిఫోన్ ఉన్న గదిలోకి వెళ్ళిపోయాడు. డాక్టర్ మూర్తి సాగర్ వెనకే టెలిఫోన్ దగ్గర కొచ్చాడు. సాగర్ కు ఒళ్ళు కంపరమేత్తిపోయింది. ఓరగా డాక్టర్ ను చూస్తూ టెలిఫోన్ రిసీవర్ అందుకున్నాడు.
    "హల్లో! సాగర్ స్పీకింగ్ నమస్కారం ప్రొఫెసర్!"
    "మిస్టర్ సాగర్! రేపు ఉదయం పేషంట్ ని తీసుకొని రాగలవా?" టెలిఫోన్ లో ప్రొఫెసర్ కంఠం వినిపించింది.
    పేషెంట్ ఎవరు ప్రొఫెసర్?"
    "ఐ యాం సారీ- నీ ఫియాన్సీ ---- అదే నీ స్నేహితురాలిని తీసుకురాగలవా?"
    "ఎల్లుండి కదా నాకు అపాయింట్ మెంట్ ఇచ్చారు?"
    "దటీజ్ రైట్ ! కానీ నేను సాయంకాలమే బెంగుళూరు వెళుతున్నా! మళ్ళీ వారం దాకా రాను. అంత వరకూ అగగాలిగితే నాకేం అభ్యంతరం లేదు."
    'అలా అయితే రేపు ఉదయమే వస్తాము. ఓ.కే థాంక్యు!' అంటూ సాగర్ రిసీవర్ కిందకు దింపాడు.
    "సాగర్! జస్ట్ ఏ మినిట్!' అంటూ డాక్టర్ సాగర్ చేతుల్లో నుంచి రిసీవర్ అందుకున్నాడు.
    "హల్లో ప్రొఫెసర్! డాక్టర్ మూర్తి స్పీకింగ్ హియర్!"
    "ఓ డాక్టర్! మీరిక్కడున్నారా?"
    "సాగర్ ఫాదర్ నా ఫ్రెండ్! మేము ఫామిలీ ప్రెండ్స్ మీ. మీరు పర్సనల్ ఇంటరెస్టు తీసుకోవాలి. సాగర్ రేపే మాధవిని మీ దగ్గరకు తీసుకువస్తాడు. మీ టెస్ట్స్ అన్నీ పూర్తి చేయండి. వెంటనే ట్రీట్ మెంట్ మొదలు పెట్టడం మంచిది. మీరు బెంగుళూరు ప్రయాణం వాయిదా వేసుకో గలిగితే మాకు చాలా సహాయం చేసినవారవుతారు."
    'అమ్మాయిని టెస్ట్ చేశాక అవసరమయితే బెంగుళూరు ప్రయాణం వాయిదా వేసుకుంటాను. ఐ విల్ డూ మై బెస్ట్"
    "థాంక్యు ప్రొఫెసర్! మళ్ళీ రేపు రింగ్ చేస్తాను"
    "సాగర్! ఏమిటలా చూస్తున్నావ్? ప్రొఫెసర్ చంద్ర శేఖరంతో నాకు బాగా పరిచయముంది. నీకు ఉపయోగంగా  ఉంటుందని నేను కూడా చెప్పాను. రేపు మాధవిని తీసుకొని వెళ్ళు! తర్వాత ఏమయింది చెప్పు!"
    "మీరే ప్రొఫెసర్ తో మాట్లాడుతానన్నారుగా?" మళ్ళీ నేను చెప్పడం ఎందుకన్నట్లు వ్యంగ్యంగా అన్నాడు సాగర్.
    "యస్ యస్ . నేనే మాట్లాడతాను."
    "థాంక్యు డాక్టరు గారూ!' సాగర్ టెలిఫోన్ దగ్గర నుంచి లేచాడు.
    "విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్!" డాక్టర్ గదిలో నుంచి గబగబా బయటికొచ్చాడు.
    సాంబశివరావు డాక్టర్ ను కారుదాకా సాగనంపటానికి వెళ్ళాడు. సాగర్ తల్లి గదిలోకి వెళ్ళాడు.


                                                              10

    "పాపా?"
    "ఊ!"
    "నీ పేరేమిటమ్మా?"
    "సునీత!"
    సాగర్ అదిరిపడ్డాడు. ఖంగారుగా ప్రొఫెసర్ చంద్ర శేఖరాన్ని చూశాడు.
    ప్రొఫెసర్ చంద్ర శేఖరం లేబరేటరీలో టేబుల్ మీద మాధవి పడుకొని ఉన్నది. ఊదా, ఎరుపు , పచ్చని బల్బులు, ఆరుతూ వెలుగుతూ గదిలో వున్న యంత్ర పరికరాల ఉనికిని తెలియజేస్తున్నాయి. ఆమె తలకు తగిలించిన వైర్లు చేరవేస్తున్న భావ ప్రకంపనలను యంత్రాలు రికార్డు చేస్తున్నాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS