Previous Page Next Page 
మరో కర్ణుడి కథ పేజి 22


    జనకమహారాజు సేవకులు పొలం దున్నుతున్నారు!


    ఎడ్లు ముందుకు వస్తూ వుంటే ఆ తల్లి గుండెలు చిక్కబట్టాయి. ఆ పిల్లను వాళ్ళు చూడకపోతే?


    తనబిడ్డ ఎద్దు కాలికింద పడితే? నాగలి కర్రబిడ్డను ఎత్తేస్తే? తల్లి హృదయం విలవిలలాడిపోయింది.  


    శ్వాస బిగబట్టి చూస్తూ నిల్చుంది దూరంగా.


    పొలం దున్నేవాళ్ళు పొత్తిళ్ళలోని బిడ్డను చూశారు.


    "అమ్మయ్య అనుకొని గుండెలనిండా గాలి పీల్చుకుంది తల్లి.


    వాళ్ళు ఆ బిడ్డను పదిలంగా ఎత్తుకొని జనకమహారాజుకు చూపించారు.


    పొత్తిళ్ళలో మెరిసిపోతున్న బంగారు పాపను చూశాడు, సంతానం లేని అతని కళ్ళు ఆనందంతో వెలిగాయి.   


    ఆప్యాయంగా చేతులు చాచాడు!


    సీత తల్లి హృదయంలో ఆనందం, దుఃఖం, ఉప్పెనలా పెరిగాయి? కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది.


    ఆమె సీతను చూటుమాటుగా చూసి సంతృప్తి పడుతూ వుంది.


    సీత వివాహం కూడా దూరం నుంచి చూస్తుంది, కన్నీళ్ళతో అభినందిస్తుంది.


    ఇలాగే ఆమె సీతను నీడలా అన్నివేళలా ఎలా కనిపెట్టుకుని తిరిగిందో చిత్రించాడు. సీత సంతోషంగా వుంటే ఆమె హృదయం నిండుగా వుండేది. సీతకు కష్టం వస్తే ఆ తల్లి హృదయము తల్లడిల్లిపోయేది.  


    ఆ పుస్తకం చదువుతూ సీత తల్లి కొరకు కన్నీరు కార్చని వారు వుండరేమో?


    కాని కొందరు - బూజు పట్టిన సంప్రదాయాన్ని గుర్తుకు తెచ్చుకున్నామనుకునే పెద్దలూ పండితులూ - అది చదివి నోరూ నోరూ కొట్టుకుంటే లబలబ లాడిపోయారు.


    సీత లాంటి మాహాసాధ్విని అక్రమ సంతానంగా చిత్రించడం మహా ఘోరం అన్నారు, దేశానికే మహాపచారం జరిగినట్టు వాపోయారు.


    సమాజం లైసెన్సు లేని బిడ్డలు మంచివాళ్ళు కాలేరా? చిన్న పొరపాటు వల్ల జన్మించిన బిడ్డ పతివ్రత కాకూడదా? సీత మహా పతివ్రత. బాగానే వుంది. తల్లి ఏదో పాపం చేసిందే అనుకుందాం. అది సీత వ్యక్తిత్వాన్ని ఎలా కళంకితం చేస్తుంది?    


    హిందీ విశారద పాసయిన శరత్ మరోసారి "సీతా కీ మాఁ అన్న పుస్తకంలోని కథను గురించి ఆలోచించసాగాడు.  


    ఆ మధ్య ఒక రచయిత్రి తెలుగులో రాసిన వ్యాసం అకస్మాత్తుగా జ్ఞాపకం వచ్చింది.  


    ఈనాటి సాహిత్యంలో స్త్రీలను పతితల్నిగా చిత్రిస్తున్నారని విమర్శిస్తూ వ్రాసిన వ్యాసం అది.


    మనదేశంలో స్త్రీల పరిస్థితి ఎలా వుంది? వాస్తవాన్ని చూసి ఎందుకు బెదిరిపోవాలి?


    రోజుకు ఎంతమంది స్త్రీలు ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్టు క్రింద అరెస్టు కావడం లేదు? వారు అలా ఎందుకు అవుతున్నారో ఆలోచించాల్సిన బాధ్యత రచయితలకు లేదా?  


    ఈ జీవితం ఇంత దుర్భరంగా వుంటే, సినిమాల్లోనూ, కథల్లోనూ రంగులు పూసి, ప్రేమ తిని బతికేవాళ్ళను గురించి, భర్త రోజూ తంతూన్నా ఆడ బ్రతుకే మధురం" అంటూ పాటలు పాడుకొనే వారి గురించీ చిత్రించాలా?  


    గట్టిగా తమ కళ్ళమీద తాము నిలబడితే, సంఘం దుమారానికి పడిపోకుండా, కదలకుండా నిలబడగలరట! ముఖ్యంగా ఆమెకు గుండె నిబ్బరం కావాలట అది వుంటే స్త్రీ సవ్యమైన మార్గం వెతుక్కోగలదట.


    మనుషుల్లో మార్పు రావాలట.


    సంఘాన్ని తప్పు పట్టి లాభం లేదట.


    మనిషి మారనంత కాలం విప్లవాలు ఏమీ చెయ్యలేవట. వ్యవస్థకు మనోబలం ఎలా వస్తుంది?


    ఎక్కడినుంచి వస్తుంది? అందుకు అవసరమైన అవకాశాలు సంఘంలో వున్నాయా?


    వ్యక్తిని సంఘం శాసిస్తుంది. వ్యవస్థ స్వభావాన్ని బట్టే మనుషుల మనస్తత్వం ఏర్పడుతుంది.


    వ్యవస్థ మారకుండా వ్యక్తులు మారాలని బోధించడం కేవలం శాస్త్రీయమైన దృక్పథం లేకపోవడం వల్లనే.


    శరత్ బుర్ర బద్దలైపోతోంది.


    కణతలు అదురుతున్నాయి.


    ఆలోచనలు గజిబిజిగా అల్లుకుపోతున్న మస్తిష్కం చిక్కుపడిన దారపు వుండలా వుంది.


                            *    *    *


    "బాబూ! పదిపైసలు ఇప్పించండి. బాగా బతికినదాన్ని."


    బస్ కోసం విసుగ్గా ఎదురు చూస్తున్న శరత్ చివ్వున తలెత్తి ఆమే.   


    తను వెదుకుతున్న బిచ్చగత్తె!


    శరత్ ఆమెను పరీక్షగా చూశాడు.


    ఆమె ముఖం చూసి. ఆమె వయసు ఎంతో తెలుసుకోవడం అంత తేలికకాదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS