ఈ విషయాలన్నీ కృష్ణయార్యునీ, మంగమాంబనీ బాధిస్తూనే ఉన్నాయి. వారు వినేట్లుగా మాట్లాడి, బాధపడుతుంటే ఆనందించటం తమ విజయంగా భావించారు సోమయాజి అనుయాయులు. వాళ్ళు అంతకంటే ఇంకే చెయ్యగలరు?
ఒకరోజు సోమిదమ్మ పనిగట్టుకుని మరీ కృష్ణయార్యుని ఇంటికి వచ్చింది. చాలాసేపు కూర్చుని ఊళ్ళోవాళ్ళ కబుర్లన్నీ చెప్పింది. అత్తా కోడళ్ళిద్దరికీ భయమే - ఈ సంభాషణ ఎటు దారితీస్తుందోనని. అనుకున్నంతా అయ్యింది.
"అక్కా! వెంకూ ఏదీ? గుడికెళ్ళిందా?" అని అడిగింది ఉయ్యాలబల్ల మరోసారి ఊగటానికి కాలితో నేలనితన్ని.
"అదిగో నమ్మా! అక్కడ పంచలో బియ్యం విసురుతోంది" అంది కృష్ణయార్యుని తల్లి.
"సక్కుబాయికి కృష్ణుడిలాగా, మన వెంకుకి వెంకన్న సాయం చేస్తాడేమోలే విసరటానికి" అంది, ఉయ్యాలబల్లమీంచి లేచి, పంచలోకి తొంగిచూస్తూ.
అత్తాకోడళ్ళిద్దరూ ఏం మాట్లాడలేదు.
"అయితే ఇంటి పనులు కూడా చేస్తుందన్నమాట"
"అవును అత్తగారూ! ఇంటి పనులన్నీ మా వెంకూనే చేస్తుంది. నేనూ అత్తయ్యా ఇట్లాగే ఈ బల్లమీద కూర్చుంటాం. అంతే!"
"ప్రశ్నలూ, శకునాలూ చెప్పుతుందనుకున్నా! పనిమంతురాలే! ఏ మాటకామాట చెప్పుకోవాలి. బాగానే చెపుతుంది. ఒక్కమాట పొల్లుపోలేదింత వరకూ!" ఆగింది.
అత్తా కోడళ్ళకేం చెప్పాలో తెలియలేదు.
"పారిజాత కొడుకు మామిడిపిందెల మొలతాడు పాలేరు తలపాగాలో ఉంటుందని చెప్పింది చూసినట్టు. ఎట్లా చెప్పిందో! ఏమో?"
"పిల్లవాడిని పాలేరు నెత్తిన పెట్టుకుని ఊరంతా తిప్పాడుగా, ఏడుస్తుంటే. అక్కడ ఇరుక్కుపోయిందని చూసినవాళ్ళెవరైనా చెపుతారు! చూసిందికాబోలు అదే చెప్పి ఉంటుంది. అంతే!" మంగమాంబ తేలికగా తీసిపారేసింది.
"అదేం కాదు. ఏదో శక్తి ఉంది మనవెంకులో. లేకపోతే అవధానిగారి కోడలికి పట్టిన దెయ్యాన్ని ఎట్లా వదిలించింది చెప్పవే కోడలు పిల్లా."
"వెంకు దెయ్యాలని వదలించటమేమిటి? అంతా అబద్ధం వాళ్ళే ఏదో పొరపాటు పడి ఉంటారు. అసలు దెయ్యాలెక్కడ ఉన్నాయి? ఉన్నా మన ఊళ్ళోకి రావు. మన ఊరికి నరసింహస్వామి కాపాడుతున్నాడు. వాటికి స్వామి అంటే భయం."
"మరి, మీ ఇంట్లో దెయ్యం ఎట్లా ఉంది? ఎంత తెలివిగా కూతురి విషయం కప్పిపెట్టినా, నేను వదులుతానా?" అనుకుంది మనస్సులో, పైకి మాత్రం
"కాని, ఊళ్ళో అంతా మన వెంకుయే దెయ్యాన్ని వదిలించింది అనుకుంటున్నారు" అంది.
"ఎవరెట్లా అనుకున్నా అన్నీ తెలిసినదానివి. పండిత వంశంలో పుట్టినదానివి నువ్వు మాత్రం అట్లా అనుకోవుగా సోమిదమ్మా!" అంది కృష్ణయ్య తల్లి, మరోమాటకి అవకాశం లేకుండా.
"నేను అనుకోనులే అక్కా! లోకులు పలుగాకులు కదా! వాళ్ళ నాలికలకి నరాలుండవు. ఏదేదో వాగుతారు. మన పిల్ల కదా అని నాకు బాధ. అక్కడికీ వాళ్ళతో వాదిస్తాననుకో - ముక్కుపచ్చలారని 'పిచ్చి' పిల్ల గురించి అట్లా మాట్లాడవద్దని. ఎంతమంది నోళ్ళని మూయించగలను చెప్పు. వాళ్ళకేదన్నా అవసరం వస్తే 'వెంకమ్మా!' అంటూ వస్తారు గుళ్ళో ఉన్నప్పుడు 'నువ్వు మాదేవతవి' అంటారు. తరవాత 'దెయ్యం', 'భూతం' అంటారు."
"... ... ..."
"కాని, అక్కా ఒక్క సంగతి నిజం మన వెంకులో ఏదో శక్తి ఉంది. అదేంటో దాన్ని చూస్తుంటే ఒక్కొక్కసారి భయం వేస్తుంది. ఇప్పుడు చూడు నావంక ఎట్లా చూస్తోందో!"
అత్తాకోడళ్ళిద్దరూ పంచలోకి తొంగిచూశారు. తలవంచుకుని విసురుతోంది వెంకమాంబ.
అప్పుడే లోపలికి అడుగుపెట్టిన కృష్ణయార్యుని తండ్రి,
"అవును. వెంకుతల్లిలో శక్తి ఉంది. దైవశక్తి, నా మనుమరాలు దైవాంశ సంభూతురాలు. అదే బాలాజీ, అదే బాలాజీ, అదే చౌడీశ్వరీ దేవి, అదే నరసింహస్వామి, అదే శ్రీకృష్ణపరమాత్మ. తెలుసా! మంచి వాళ్ళకి దేవత, చెడ్డవాళ్ళకి దెయ్యంలాగా కనపడుతుంది వాళ్ళేదెయ్యాలు కనుక" అన్నాడు.
సోమిదమ్మ కంగారు పడింది పెద్దాయన రాకకి, మాటలకి.
"సోమయాజికి, అమ్మలక్కలకీ ఈ మాట చెప్పమ్మా!" అన్నాడు శాంతంగా.
"బావగారికి కోపం వచ్చినట్టుంది. నాదేముంది! అందరూ అనుకున్న మాట చెప్పాను అంతే! పొద్దుకూకుతోంది. వెళ్ళొస్తాను అక్కా! కోడలుపిల్లా జాగ్రత్త!' అని కదిలింది బొట్టూతాంబూలం తీసుకుని.
ఇంట్లో అందరి మనసులూ బరువెక్కాయి. మంగమాంబ కూతురి దగ్గరచేరి తిరగలిలో బియ్యం తనుపోస్తూ
"ఎందుకే వెంకూ ఈ నిందలు నీకు. హాయిగా అందరిలా ఉండచ్చుకదా! అందరి సంగతి మనకెందుకు?" అంది.
"అమ్మా! ఆ అజ్ఞానుల సంగతి వదిలెయ్యి! చదువులేదు, తెలివిలేదు" అంటూ పిండి ఎత్తటంలో మునిగిపోయింది వెంకమాంబ.
* * *
ఇంతకు ముందే పనులు చేయటం నేర్పించాలనుకున్న మంగమాంబ ఇప్పుడు మరింత పట్టుదలగా నేర్పటం మొదలు పెట్టింది, ఈ పనులలో దృష్టిపెట్టి ఊళ్ళోవాళ్ళసంగతులు పట్టించుకోటం మానేస్తుందని, అత్తవారింట్లో ఇబ్బంది ఉండదని. వెంకమాంబ ఎంతో శ్రద్ధగా నేర్చుకుని పనులన్నింటిలో నేర్పరితనం సంపాదించింది. కాని ఎవరైనా భర్తమాట ఎత్తితేచాలు చిరాకు పడేది.
ఒకసారి రామక్క అడిగింది "ఎప్పుడే కాపురానికి వెళ్ళేది?" అని
"నేనెక్కడికీ వెళ్ళను" అంది వెంకమాంబ.
"నీ అత్తవారింటికి వెళ్ళవా?"
"నాకత్తవారిల్లు తిరుపతే"
"నువ్వు భర్తదగ్గరికి వెళ్ళవా?"
