ఇంతలో కాళ్ళదగ్గర ఏదో కదిలినట్టు అయితే అటు చూసింది. లావుపాటి నర్సు తోలుబెల్టుతో తన కాళ్ళు కట్టెయ్యబోతూంది. అది చూసీ చూడగానే కాళ్ళు వెంటనే వెనక్కు లాక్కోబోయింది. కానీ- రెండో నర్సు చప్పున వాటిని పట్టుకుంది. ప్రార్థన నిస్సహాయంగా, అలానే పక్కకి వత్తిగిలి పడుకోవాల్సి వచ్చింది.
"ఒక్క నిముషం ప్రార్థనా! బి ఎ గుడ్ బేబీ....." డాక్టరు అటుతిరిగి అన్నాడు. చిన్న కత్తితో ఇంజెక్షన్ బాటిల్ చివర బ్రద్దలు కొడుతున్న శబ్దం వినిపించింది. కొత్తగా వచ్చిన నర్సు ప్రార్థన గౌను మోకాళ్ళ పైకి ఎత్తింది. ప్రార్థన రెసిస్ట్ చెయ్యబోయి ఆగిపోయింది. ఇంతలో డాక్టరు ఇటు తిరిగి, దూదితో ఆమె తొడపైన రాసేడు. చల్లటి స్పిరిట్ లాంటి ద్రవం కాలిమీదనుంచి పొత్తి కడుపుమీదకు ధారగా జారింది. ఈ కొత్తరకం పరీక్ష అంత బాధగా లేకపోవటం ఆమెకి సంతృప్తినిచ్చింది. ముఖ్యంగా రక్తపరీక్షలోలా సూదులు గుచ్చక పోవటం, ఇది ఇంత సులభంగా అయిపోతుందని అనుకోలేదు.
ఆమె రిలీఫ్ తో కళ్ళు విప్పింది. ఎదురుగా ముగ్గురు నర్సులూ నవ్వుతూ కనపడ్డారు. కానీ వాళ్ల మొహాలమీద నవ్వు అతికినట్టు, కేవలం తనకోసమే నవ్వుతున్నట్లూ కృత్రిమంగా వుంది. చప్పున ఆమెకేదో అనుమానం వచ్చి డాక్టరువేపు చూసింది.
డాక్టరు ఒక కుపచ్చటి గుడ్డని తనకాలి పైభాగాన కప్పటం గమనించింది. డాక్టరు వెనుదిరిగి ట్రేలోంచి మరో పరికరాన్ని తీసుకున్నాడు. చెక్కలకి స్క్రూలు బిగించేముందు రంధ్రం చేయటం కోసం వడ్రంగులు ఉపయోగించే 'బర్మాలా' వుందది. ప్రార్థన దాన్ని చూసి, రాబోయే ప్రమాదాన్ని గమనించి జింక పిల్ల బెదిరినట్టు బెదిరిపోయింది. ముగ్గురు నర్సులూ షార్ప్ గా రియాక్టు అయ్యారు. కాలి దగ్గర ఇనుపగొలుసు బిగిసినట్టు వత్తిడి ఎక్కువయింది. లేవబోయిన పాపని ఒక నర్సు వెనక్కి నొక్కి పెట్టింది. ఈ లోపులో డాక్టరు సిరెంజి తీసుకుని ఇటు తిరిగాడు. దాదాపు మూడు 'రత్నం' పెన్నుల మందంలో వున్నదా సిరెంజి.
"నో ..." ఊపిరితిత్తుల్లో వున్న శక్తినంతా కూడదీసుకుని గట్టిగా అరిచింది. కాళ్ళదగ్గిరా, ఛాతీమీదా మరింత వత్తిడి ఎక్కువయింది.
అంతలో ఒక నిప్పుల్లో కాల్చిన ఇనుప ముక్క దూర్చినట్టూ, చర్మాన్ని చీల్చుకుని సూది లోపల ప్రవేశించింది.
ఆ తరువాత కొన్ని నిముషాలకి ఎముక తొలుస్తున్న శబ్దం ప్రారంభమయింది. అదృష్టవశాత్తూ ప్రార్థనకి అది వినిపించలేదు. భయంతో అంతకుముందే స్పృహ తప్పింది.
* * *
డాక్టర్ విజయభార్గవ కారు ఆస్పత్రి కాంపౌండ్ లోకి ప్రవేశించి మొక్కల పక్కగా ఆగింది. అతడు దిగి పేథాలజీ వేపు నడిచాడు. అతడికి తన భార్య ఎక్కడనుంచి ఫోన్ చేసిందో తెలియలేదు. సరాసరి అన్నాజీరావు ఛాంబర్ కి వచ్చాడు. అక్కడ ఆమె కనపడలేదు. ఎదురుగా వస్తున్న నర్సుని అడిగాడు.
"ఆయన థియేటర్ లో వున్నారు" అంది. అతడికి ఏం చెయ్యాలో తోచలేదు. ప్రార్థన పరీక్ష పూర్తిచేసి అతడు థియేటర్ కి వెళ్ళిపోతే, తల్లీ, కూతుళ్ళు ఇద్దరూ యింటికి వెళ్ళిపోవచ్చు కదా. మళ్ళీ తనకి ఫోన్ చెయ్యటం దేనికీ? అందులోనూ ఇక్కడికి రమ్మని?
అతడు థియేటర్ వేపు నడిచాడు.
వరండా అంతా ఖాళీగా వుంది. డాక్టరు బహుశా ఇంకా థియేటర్ లో వున్నాడేమో అనుకుని, కూర్చోవటం కోసం ఆంటీ రూమ్ తెరిచాడు.
అక్కడ వుంది వసుమతి. అటువేపు తిరిగి కిటికీలోంచి బయటికి చూస్తూ ఏదో ఆలోచిస్తున్నదల్లా చప్పుడుకి వెనక్కి తిరిగి భర్తని చూడగానే గాలిలా అతడి దగ్గరికి వచ్చింది. అతడి భుజాలు పట్టుకుని వూపేస్తూ "-ఏమండీ" అని మాత్రం అనగలిగింది. ఈ హఠాత్ పరిణామానికి అతడు నిశ్చేష్టుడయ్యాడు. ఏదో తెలియని భయంతో వళ్ళు జలదరించింది. "ఏమిటి? ఏమైంది వసుమతీ?" అన్నాడు కంపిస్తున్న గొంతుతో. ఆమె మాట్లాడలేదు. ఆమె తన మెడచుట్టూ వేసిన చేతుల బరువుకి అతడు నిలదొక్కుకోలేక ముందుకు వంగవలసి వచ్చింది. ఆమెని సరీగ్గా నిల్చోపెడుతూ "ఏమిటి- ఏమైంది?" అని మళ్లీ ఇంకోసారి అడిగాడు.
అంతలో తలుపు తెరుచుకుని అన్నాజీరావు బయటకొచ్చాడు. పరాయివ్యక్తి వచ్చాడని కూడా ఆమె భర్తనుంచి దూరంకాలేదు. ఆమెని అలాగే పొదివి పట్టుకుని అతడు డాక్టర్ వేపు తిరిగాడు. "మీరయినా చెప్పండి, ఏమిటి అసలు విషయం?"
అన్నాజీరావు ఆమెవేపు చూసి "మీరు చెప్పలేదా?" అని అడిగాడు. వసుమతి జవాబు చెప్పలేదు. అసలు ఆమె ఈ మాటలు విన్నదో లేదో కూడా అనుమానమే.
"నేను కొంచెం సేపు బయట వుంటాను" జనాంతికంగా అని, అన్నాజీరావు బయటికి నడవబోయాడు. భార్గవ చప్పున అతడిని ఆపుచేసి "అసలేమయింది, చెప్తారా లేదా?" అన్నాడు ఇరిటేషన్ నిండిన గొంతుతో.
"వెల్ ...." అన్నాడు డాక్టరు. "విల్ యూ ప్లీజ్ సిట్ డౌన్"
భార్గవ కోపంతో "విల్ యూ ప్లీజ్ టెల్ మి" అని అరిచాడు.
అన్నాజీరావు అతడివేపు తలెత్తి చూసేడు. డాక్టర్ గా పుట్టటం మనిషి చేసుకున్న దురదృష్టం ... తప్పదు. అతడి పెదాలు స్పష్టంగా కదిలాయి. "భార్గవా...." అన్నాడు, "ప్రార్థనకి లుకేమియా".
సగం తెరుచుకున్న భార్గవ నోరు అలానే వుండిపోయింది. కళ్ళలోకి రక్తం కెరటంలా ప్రవహించింది. ఉన్నట్టుండి ఆ గది చల్లబడుతున్నట్టు, అన్నివేపుల్నుంచీ కుదించుకుపోతున్నట్లు భావన కలిగింది. ఆ గదిలో ముగ్గురు వ్యక్తుల్నీ నిశ్శబ్దం తన కబంధ హస్తాల్లోకి తీసుకుని వికటాట్టహాసం చేసింది. ఆ అచేతనావస్థలోంచి ఒక్కసారి స్పృహ వచ్చినట్టు కదిలాడు భార్గవ. మెరుపులా డాక్టర్ ని చేరుకుని పిచ్చి ఆవేశంలో అతడి భుజాలూ, టై పట్టుకుని వూపేస్తూ "ఎంత ధైర్యం మీకు? నా మీద ప్రాక్టికల్ జోకు వేస్తారా?... ఆ" అంటూ పిచ్చిగా నవ్వబోయాడు. గొంతు గద్గదికమయింది. అతడి పట్టు విడిపించు కోవటానికి అన్నాజీరావు పెనుగులాడసాగేడు. వసుమతి చప్పున కదిలి వాళ్ళిద్దరి మధ్యకూ చేరుకొని బలవంతంగా భర్త చేతులు విడిపించే ప్రయత్నం చేసింది. ఎప్పుడూ ఎంతో గంభీరంగా పెద్దమనిషిలా వుండే అతడు ఈ విధంగా మారిపోవటంలో ఆమెకి ఆశ్చర్యం కలగలేదు. పైకి కనబడకపోయినా, ప్రార్థనని అతడు ఎంతగా ప్రేమిస్తున్నాడో- ప్రార్థనంటే ఎంత అభిమానమో ఆమెకు తెలుసు. అయినా ఆ పాపంటే అభిమానం లేనిదెవరికి? ఈ వార్త తెలియగానే ఆమెకైతే భూమే కంపించింది. కానీ ఇప్పుడు అతడిని వోదార్చవలసిన బాధ్యత వుంది. అసలు ప్రార్థనలాటి పాపకి అనారోగ్యం ఏమిటి? లేత చిగుర్ని తినటానికి పురుగుకెలా మనసొప్పుతుంది. విరిసీ విరియని గులాబీని కోయటానికి మనిషికెలా బుద్ధి పుడుతుంది? చిన్నారి పాపల్ని తన దగ్గిరకి అంత తొందరగా తిరిగి పిలిపించుకోవటానికి దేవుడికి ఎందుకు కోరిక కలుగుతుంది?
అన్నాజీరావు ఇబ్బందిగా అతడి చేతుల్లోంచి విడిపించుకోవటానికి ప్రయత్నం చేయసాగేడు. వసుమతి కూడా స్ట్రగుల్ అయింది. అతడు మామూలు మనిషి అవటానికి రెండు నిముషాలు పట్టింది. అయినా ఐదు నిముషాల క్రితం భార్గవకీ, ఇప్పటి భార్గవకీ అసలు సంబంధం లేదు. ఎన్నో సంవత్సరాల వృద్ధాప్యం మీదపడినట్టు వున్నాడు. ముఖంమీద ముడతలు స్పష్టంగా కనపడుతున్నాయి.
