గది చిన్నదే. అయినా గాలీ వెల్తురూ ధారాళంగా వస్తాయి.
"అద్దె ఎంతండీ!" అడిగాడు. చెప్పిందావిడ. అతని గుండె ఆగి కొట్టుకుంది. కానీ అంతలోనే వివేకం మేలుకుంది. లొకాలిటీ మంచిది. రూం బాగుంది. మరింతమాత్రం పెట్టకపోతే లాభంలేదు అనుకున్నాడు. కానీలే అంతగాకాకపోతే ఏదైనా పార్ట్ టైం చెయ్యచ్చు అనుకున్నాడు.
"గది నాకు నచ్చిందండీ! సాయంత్రం ఏకంగా వచ్చేస్తాను" అని చెప్పాడు.
"సరే. అసలు ఈ ఇల్లు చాలా మంచిది. మాకు అన్నివిధాలా కలిసివచ్చింది. రెండేళ్ళకిందట రామారావు అని ఒకబ్బాయ్ గదిలోవుండి ఎంట్రెన్సు పరీక్షకి చదువుకున్నాడు. ఠకామని సీటొచ్చింది. ఆ తరువాత హనన్ అనే డాక్టరొచ్చాడు. ఇప్పుడు దుబాయ్ లో రెండు చేతులా సంపాదించుకుంటున్నాడు. అంతవరకూ ఎందుకు మొన్న- మొన్న దాకా వుండే శేఖరికి లాట్రీలో అయిదువేలు వచ్చాయి. ఈ ఇల్లు వదలను అక్కయ్యగారూ అంటూ వుండేవాడు. పాపంట్రాన్స్ఫర్ అయింది. ప్రైవేట్ కపెంనీలో పని అంటున్నారుకదా! ఏ గవర్న మెంటులోనో ఉద్యోగం వచ్చేస్తుందిలెండి. లక్షణంగా పెళ్ళి చేసుకుని జంటగా ఈ గది లోంచి మరో ఇంటికి వెళ్ళిపోదురుగానీ" అంది వుట్టిలక్ష్మి.
అసలు గది దొరికే సరికే రిలీఫ్ గా ఫీలౌతున్న శ్యామ్ కి ఆవిడ అలా పెళ్ళి విషయం ఎత్తేసరికి భలే సిగ్గు వేసింది. సిగ్గుగా తలోంచుకుని ముసిముసి నవ్వులు నవ్వాడు.
వేడివేడిగా కాఫీ యిచ్చింది. కాఫీ తాగి లేచాడు శ్యామ్.
"వెళ్ళొస్తానండీ! సాయంత్రం తప్పకుండా వస్తాను. మరెవరికీ మాట యివ్వకండి!" అన్నాడు వేడుకోలుగా.
"అలాగే!" అనేసింది లక్ష్మినవ్వేస్తూ.
వెళ్ళినంత వేగంగానూ ఆఫీసుకి చేరాడు శ్యామ్. వాకిట్లో చిట్టిబాబుగారి మోటార్ బైక్ కనిపించింది. బాస్ వచ్చాడు అనుకుంటూ కంగారుగా లోపలికి వెళ్ళాడు అతను.
వెళ్ళీ వెళ్ళగానే "అదేమిటండీ చెప్పా పెట్టకుండా అలా ఆదరా బాదరా వెళ్ళిపోయారు. ఎక్కడికెళ్ళారు?" అని అడిగాడు మోహన్.
సమాధానం చెప్పాడు శ్యామ్. ఆశ్చర్యంగా చూశాడు మోహన్.
"లేడికి లేచిందే ప్రయాణం అని అంత తొందర ఏం వచ్చింది సాయంత్రం వెళ్దాం అన్నానుకదా!"
"బాగుంది. మనం తీరిక చూసుకుని తీరుబాటుగా వెళ్ళేదాకా ఇళ్ళు ఖాళీగా వుంటాయా? అందుకే వెంటనే వెళ్ళిపోయాను. అలా వెళ్ళానుకాబట్టి పని జరిగిపోయింది!" అన్నాడు.
చిరాకేసింది మోహన్ కి. "బాగానే వుంది సంబరం. మీరటు వెళ్ళగానే బాస్ వచ్చాడు. శ్యాం ఏరి? అని అడిగాడు. యేదో పనుండి వెళ్ళాడని చెప్పాను. చిరాకు పడ్డాడు" విసుగ్గా చెప్పాడు.
"సరే మరి డ్యూటీటైంలో ఆఫీసులో కనిపించకపోతే చిరాకు పడక, మెచ్చి మేకతోలు కప్పుతాడా?" తేలిగ్గా తేల్చేసి తిన్నగా చిట్టిబాబు దగ్గరకి వెళ్ళాడు.
"మే ఐ కమిన్ సర్!" వినయంగా అడిగాడు.
తలెత్తి సీరియస్ గా చూశాడు చిట్టిబాబు. "కమిన్" అన్నాడు.
లోపలికి వెళ్లాడు శ్యామ్. చిట్టిబాబు ఏదో అడగబోతుంటే అతన్ని వారించి జరిగినదంతా దాచకుండా చెప్పేశాడు.
"డ్యూటీ టైంలో అలా వెళ్ళటం తప్పే సార్! కానీ ఆ క్షణంలో నాకు ఇంటి సమస్య భూతంలా తోచి ఇంకేం ఆలోచించకుండా వెళ్ళిపోయాను. ఈ గంటన్నరా సాయంత్రం ఎక్స్ ట్రా పనిచేస్తాను" అన్నాడు వినయంగా.
అతని నిజాయితీ చూస్తే సరదావేసింది చిట్టిబాబుకి. ఓ.కే. ఇట్సాల్ రైట్ వెళ్ళి పని చూసుకోండి!" అనేశాడు తను తలోంచుకొని తన పని చూసుకుంటూ.
ఆ పని ముగించి బయటకు వచ్చి మోహన్ టేబుల్ దగ్గర ఆగిపోయాడు. వినయంగా నిలబడ్డాడు మోహన్.
"ఏమిటి విశేషాలు? ఎంతదాకా వచ్చింది మీ ప్రేమాయణం?" అన్నాడు నవ్వుతూ.
తలోంచుకొని నవ్వేశాడు మోహన్. "మరి మన గడువు గుర్తుందికదూ! ఇవ్వాళ అప్పుడే జూన్ ఇరవై ఎనిమిదో తారీకు" అనేసి చేతిలోని కీచెయిన్ గిర్రున తిప్పుతూ బూట్లు టకటక లాడిస్తూ వెళ్ళిపోయాడు చిట్టిబాబు.
లంచ్ టైంలో తనకు రూం దొరికిన విషయం మరో సారి వివరంగా చెప్పాడు శ్యామ్ అతనుకూడా తన ఇంటి దగ్గరే వుంటాడని తెలిసి చాలా సంతోషించాడు మోహన్ "ఇకనుంచి యిద్దరం కలసి యింటికెళ్ళోచ్చు" అన్నాడు.
అన్నట్లే సాయంత్రం బయలుదేరుతూ "ఏమిటి మరి? ఈ పూటే షిప్ట్ చేస్తారా? నేనొచ్చిసాయం చేసేదా" అన్నాడు.
"నేనిప్పుడే రావడానికి కుదరదు మరోగంటన్నర పైగానే పడుతుంది. అయినా మిరోచ్చి సాయం చేసేటన్ని సామానులు ఏం లేవు నాకు. షిప్టు అయిపోగలను. రేపటి నుంచి యిద్దరం కలిసి వెళదాం!" అన్నాడు శ్యామ్.
కానీ ఆ మర్నాడుకూడా యిద్దరూ కలసి వెళ్ళడం కుదరలేదు. ఆఫీసు అవగానే ఏదయినా పార్ట్ టైం జాబ్ కోసం వెతకాలని బయలుదేరాడు శ్యామ్.
చిట్టిబాబు పందెం గురించి రిమైండర్ యిచ్చాక మోహన్ తీవ్రంగా ఆలోచించడం మొదలు పెట్టాడు. మర్నాడు ప్రొఫెసర్ గారి దగ్గరకు వెళ్ళితే ఆయన ఏమిటో డిక్టేట్ చేసి పాతిక పేజీలు రాయించి మరీ కదిలాడు. ఆ మర్నాడు పెద్ద ముద్ద బంకమట్టి తెప్పించి దాన్నంతా బల్ల పరుపుగా పరచమన్నాడు.
షర్టు చేతులు పైకి లాక్కుని, పాంటు పైకి ముడుచుకొని బంకమట్టి ముందేసుకుని కూర్చున్న మోహన్ కి విసుగు వేసింది. ఇక లాభం లేదు. ఇలా ఇసక జల్లించుకుంటూ, మట్టి ఉండలు చేసుకుంటూ కూర్చుంటే ఏం లాభం లేదు. ఏదయినా మార్గం ఆలోచించాలి. ఆలోచింస్తుంటే మెరుపులా తట్టింది ఆలోచన.
వెంటనే చేతులు కడుక్కుని తిన్నగా ప్రొఫెసర్ గారి దగ్గరకు వెళ్ళాడు. కుర్చీ బర్రున లాక్కుని కూర్చున్నాడు. ఆ శబ్దానికి ఉలిక్కిపడి చూశారు సీరియస్ గా చదువుకుంటున్న ప్రొఫెసర్ గారు!
అది చాలదన్నట్లు "అసలు మీ పద్ధతి నాకేం నచ్చలేదు సార్!" విసురుగా అన్నాడు మోహన్. అతని అవి ధేయతను సహించలేకపోయారు పృధ్వి.
"మోహన్! వాటీజ్ దిస్! నేను సీరియస్ గా స్టడీ చేసుకుంటూ వుంటే!"
ఆయన మాట పూర్తిచేయకుండా మధ్యలోనే అందుకున్నాడు మోహన్. "ఆ స్టడీయే, నా తలకాయ స్టడీ! ఎందుకొచ్చిన అనవసర శ్రమ" అన్నాడు ఎగతాళిగా!
నోటమాట రానంత ఆశ్చర్యపోయారు ప్రొఫెసర్ గారు.
"మీ కోపం వచ్చినా సరే ఉన్నమాట చెప్పేస్తాను. మిమ్మల్నీ మీ రీసెర్చినీ చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది ఒక్కసారి అలా యూనివర్శిటికి వెళ్ళి చూడండి. నిన్నగాక మొన్న పుట్టిన పిల్లకాయలందరూ రీసెర్చి మొదలుపెట్టి ఏడాది తిరక్కుండానే పూర్తిచేసేసి పి.హెచ్. డి. చంకన పెట్టుకుని చక్కాపోతున్నారు.
మరి మీరో! ముఫ్ఫయ్ అయిదేళ్ళుగా పరిశోధించినా యింకా ఎక్కడి రీసెర్చి అక్కడే వుంది పరిశోధన ముందుకి సాగడంలేదు, సాగడంలేదు అని గోలపెడతారు. అసలు నాకు తెలీక అడుగుతాను ఎలా సాగుతుంది చెప్పండి?"
"ఏమిటోయ్ నువ్వు అనేది?" అన్నాడు.
"చూడండి సార్! మీ పరిశోధన ఏమిటసలు? భూమి గురించి ఔనా? భూమి గురించి పరిశోధన చేసే మీరు ఇలా నాలుగ్గోడల మధ్య కూర్చుని ఇనకతోనూ, బంకమట్టితో నూ కాలిక్యులేషన్సు చేస్తూ కూర్చుంటే మరో ముప్ఫయ్ అయిదేళ్ళు గడిచినా మీ రీసెర్చ్ ఇలాగే సాగుతూ వుంటుంది" బెదిరించాడు.
