Previous Page Next Page 
గజ్జె ఘల్లుమంటుంటే పేజి 21


    రాగిణికి మెలుకువ వచ్చేసరికి ఇంట్లో వాళ్ళంతా నిద్దర లేచిపోయి, ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. సూర్యకుమారీ పూర్ణిమా కలిసి వంట చేస్తున్నారు. చంద్రికా, కోటయ్యగారు కబుర్లు చెప్పుకుంటూ, పూలచెట్ల దగ్గర పూలుకోస్తున్నారు. చంద్రిక వేసే ప్రశ్నలకి నవ్వుతూ సమాధానం చెబుతున్నారు కోటయ్యగారు. చంద్రశేఖర్ డ్రాయింగ్ రూంలో కూర్చుని పేపరు చదువుకుంటున్నాడు.
    చంద్రికనీ, కోటయ్యగారినీ చూస్తూవుంటే శిల్పా, రామానుజంగారూ గుర్తువచ్చారు. శిల్ప ఎలావుందో? 'తెగ మాట్లాడేస్తోంది, దాంతో ఎవరూ మాట్లాడలేకపోతున్నాం' అని రాసింది అమ్మ ఒక ఉత్తరంలో. ఆ ఉత్తరంచూసి ఎంతో సంతోషించిన తను హైదరాబాదు రావాలనుకుంది. సరిగ్గా అప్పుడే భార్గవ కాశ్మీరు షూటింగు పెట్టాడు. కాశ్మీరులోనే తనని పెళ్లి చేసుకుంటానని కూడా వాగ్దానం చేశాడు. ఆ సుందర నగరంలో ఆ చల్లని ప్రదేశంలో స్వర్గంలో వున్నట్టుగానే అనిపించింది. ఆ మంచుకొండల మధ్య పడవల్లో ప్రయాణం చేస్తూ పడవల్లో ఉండడం, వేరేలోకంలో వున్నట్టుగా అనిపించింది. భార్గవా, తనూ రతీ మన్మథుల్లా ఒకరి కౌగిట్లో ఒకరు కరిగిపోయారు.
    "ఎంతసేపయింది లేచి? పళ్ళు తోముకో! కాఫీ తాగుదువుగాని" అంది సూర్యకుమారి రాగిణిని చూసి.
    పళ్ళు తోముకుని రాగానే కాఫీ గ్లాసందించింది పూర్ణిమ. కాఫీ తాగేసి, గ్లాసు కడగడానికనేసి పెరట్లో కోటయ్యగారి దగ్గరకు వెళ్లింది రాగిణి.
    "ఏమ్మా! బాగా నిద్దరపోయావా రాత్రి?"
    "బాగానే నిద్రపోయాను బాబాయ్"
     రాగిణి రాగానే చంద్రిక లోపలికెళ్లిపోయింది. "ఏయ్! చంద్రికా ఇంతసేపు తాతయ్యతో కబుర్లు చెబుతూ ఇక్కడున్న దానివి, నేను రాగానే వెళ్లిపోతావేం!" చంద్రిక చెయ్యిపట్టుకుని ఆపి అడిగింది రాగిణి.
    "నేను హోంవర్క్ చేసుకోవాలి! తాతగారితో కొంచెం సేపు మాట్లాడిపోదామని వొచ్చాను."
    "మరి మాట్లాడేశావా?"
    "ఓ......"!
    "ఏం చదువుతున్నావ్?"
    "ధర్డ్ స్టాండర్డ్!"
    రాగిణికి చంద్రికని చూస్తూన్నకొద్దీ శిల్ప గుర్తుకొస్తోంది. శిల్ప కూడా ధర్డ్ క్లాస్. శిల్ప ఈ సంవత్సరం సెలవులన్నీ వీళ్ళింట్లోనే గడిపిందిట. చంద్రికా, శిల్పా ఆడుకునే వారేమో. ఏవేవో అడగాలని వుంది. ఎవరినడగాలో, ఎక్కణ్ణుంచి మొదలెట్టాలో తెలీక అలా వుండిపోయింది ఆలోచిస్తూ. "ఆంటీ! నేను చదువుకోవాలి?" అంది అలా చెయ్యిపట్టుకుని వొదలకుండా, ఆలోచిస్తు కూర్చున్న రాగిణిని చూసి చంద్రిక.
    అప్పటికిగానీ రాగిణికి అర్థంకాలేదు, తను చంద్రిక చెయ్యి పట్టుకునే ఆలోచిస్తున్న సంగతి. "ఓ..... సారీ! వెళ్ళి చదువుకో" అంటూ చెయ్యి వొదిలేసింది రాగిణి. చంద్రిక వెళ్ళిపోయింది. కొందరిలో అవతల వారిని పరిశీలించే శక్తి ఎంత వుంటుందంటే దుఃఖం గుండెని పిసికేస్తుంటే...... వారి మొహం చూసి వారేమాలోచిస్తున్నారో చెప్పేస్తారు. చంద్రికని చూస్తూవుంటే రాగిణికి శిల్ప గుర్తుకొస్తోందని తెలుసుకున్నారు కోటయ్యగారు. అందుకే శిల్ప గురించి చెప్పటం మొదలెట్టారు.
    "శిల్ప..... అలా మూగదానిలా వుండేదా, ఇప్పుడెన్ని మాటలు మాట్లాడుతుందనుకున్నావ్? పెద్ద ఆరిందలా కబుర్లు చెబుతుంది." అన్నారు పెరట్లోని పారిజాతం చెట్టుకింద వేసుకున్న కుర్చీలో కూర్చుంటూ. అక్కడే వున్న మరో కుర్చీలో కూర్చుంటూ "నిజమా బాబాయ్! అన్ని మాటలు మాట్లాడుతోందా? బాగా చదువుకుంటుందా" అడిగింది రాగిణి.
    "శిల్ప క్లాసులో ఫస్టొచ్చింది. అందరితోటీ ఎంత కలిసిమెల్సిందో! దాని మాటలూ ప్రవర్తనా చూస్తూ వుంటే దాని వయస్సుకి మించిన దానిగా అనిపిస్తాయి!" అన్నారు కోటయ్యగారు.
    సూర్యకుమారి కూడా వంటింట్లో పని పూర్తిచేసుకొనొచ్చి, రాగిణి పక్కనే మరో కుర్చీలో కూర్చుంది. పారిజాతం చెట్టుకి దగ్గరగా వున్న చిన్న లాన్ లో అయిదారు కుర్చీలు పడేసి వుంచుతారు. ఎంత హాయిగా వుంటుందో చెప్పలేము!
    "బాబాయ్! శిల్ప అమ్మతో, నాన్నతో బాగా మాట్లాడేదా?"
    "గ్రాండ్ పా...... గ్రాండ్ మా అంటూ ఒక్క నిమిషం ఒదిలిపెట్టేది కాదు" అన్నారు.
    రాగిణి ఆశ్చర్యపోతూ, "బాబాయ్! శిల్ప నాన్ననీ అమ్మనీ అమ్మా...... నాన్నా అనే పిలిచేది. గ్రాండ్ పా...... గ్రాండ్ మా..... అని ఎవరు చెప్పారు?"
    జరిగిన కథంతా పూసగుచ్చినట్టు చెప్పారు, కోటయ్యగారు, సూర్యకుమారీ. రాగిణీ చీర కొంగు తడిసిముద్దయింది కన్నీళ్లతో.
    "పిన్నీ! నేనెంత నిర్భాగ్యురాలిని" అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది రాగిణి. శిల్ప ఊటీ నుంచి రాసిన ఉత్తరాన్ని చూపించారు కోటయ్య గారు. ప్రతి ఉత్తరంలోనూ గ్రాండ్ పా...... గ్రాండ్ మా...... భరణి పిన్ని. కాశ్యప్ చిన్నాన్నా, దీను, దివ్యల గురించి సగం వుత్తరం. మిగతాది తనూ అవినాష్ ఎలా చదువుకుంటున్నారో, స్కూలూ, పరీక్షల గురించి. మిగిలిన ఉత్తరం, కోటయ్యతాతా, సూర్య అమ్మమ్మ, ఫూర్ణిమా ఆంటీ, అంకుల్, చంద్రకళ గురించి. ఎక్కడా రాగిణి అక్క అన్న మాటగాని, మమ్మీ అన్న మాటగానీ లేదు. రాగిణి మనస్సు చివుక్కుమన్నా, తాను జీవితంలో ఎంత విలువైనవి పోగొట్టుకుందో తెలుసుకుంది.
    పూర్ణిమ, చంద్రికని స్కూలుకి తయారుచేసి పంపిస్తుంటే, ఆ తల్లీ బిడ్డల ఆనందం చూసి తను సిగ్గుపడిపోయింది.
    "బాబాయ్! శిల్పని ఒకసారి చూసిరానా?" అంది రాగిణి. "అలాగేనమ్మా! ముందొక ఉత్తరం రాయి" అన్నారు. అలాగే "అమ్మా నాన్నలకీ, భరణికీ కూడా ఉత్తరాలు రాయి" అని చెబుతూ "రాగిణీ ఇప్పుడు చెప్పు, నీ కేథేమిటో? దాన్ని బట్టి ఉత్తరాలెలా రాయాలో చెబుతాను" అన్నారు కోటయ్యగారు.
    హైదరాబాదొదిలి వెళ్ళినప్పటినుంచి, నిన్నరాత్రి మళ్ళీ హైదరాబాదుకి తిరిగొచ్చేదాకా ఏమేమి జరిగిందో అంతా వివరంగా చెప్పింది రాగిణి. కోటయ్యగారు బాధగా నిట్టూర్చారు.
    "రాగిణీ, రామూది చాలా సున్నితమైన మనస్సు. నీ ప్రవర్తనా నువ్వు సినిమాల్లో చేరడం ఆయనకే మాత్రం ఇష్టంలేదు. కన్న కడుపు మమకారాన్ని చంపుకోలేక ఆ రోజు పైకి కాదంటున్నా సరోజిని కోసం వచ్చినట్టు తాను వచ్చారు. కానీ ఆ నిషాలో నిన్నూ భార్గవనీ చూశాక, ఆయన గుండె పగిలిపోయింది. ఎలా వొచ్చి హైదరాబాద్ లో పడ్డారో తెలీదు" అన్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS