నచికేత ఒక్క అడుగు వెనక్కివేసి అలానే నిలబడి పోయేడు.
రాబర్ట్ పెదవులు మంత్రాలను ఉచ్చరిస్తున్నాయి. కళ్ళు మూసుకున్నా అతనికి లీలగా ఏదో రూపం కనిపిస్తూ వుంది.
ఆ రూపం ఏమిటో అతనికి అర్ధం కావడంలేదు. సుసిరియో నేర్పిన మంత్రాలవల్ల అతనికి కొన్ని శక్తులు వచ్చాయి.
ఆ శక్తులు, తన కళ్లముందు లీలగా కదలాడే శక్తులను ఎదుర్కోగలదా?
అక్కడున్న ఐదుగురూ ఫ్రెండ్స్ నిశ్చేష్టులైపోయారు. ఏం జరుగుతుంది? తనను తాను పరిచయం చేసుకున్న అపరిచిత వ్యక్తి ఏం చేయబోతున్నాడు? లోపల్నుంచి ఆ మూలుగులు ఎవరివి?
కొంపదీసి రామయ్య ఆ గదిలో లేడు కదా?
నచికేత ఆలోచనలో ఉండగానే రాబర్ట్ రెండు చేతులను ఇంటూ ఆకారంలో పెట్టి స్టోర్ రూమ్ ఎదురుగా పద్మాసనం వేసుకుని కూచున్నాడు.
* * *
'మిస్టర్ పీటర్సన్...మీరు వర్రీ కానక్కర్లేదు. క్షుద్రోచ్ తంతు విజయవంతంగా పూర్తవుతుంది. బిత్రోచికి రక్త సమర్పణ జరుగుతుంది. నచికేత బలి, అతని మిత్రుల భయోత్పాతక మరణంతో బిత్రోచి సంతృప్తుడవుతాడు" చెప్పాడు రామయ్య.
ఆ గదిలో రామయ్య, డేనియల్, పీటర్సన్ వున్నారు.
"నాకు తెలుసు మిస్టర్ రామయ్య...ప్రపంచంలోని అతి కొద్దిమంది బిత్రోచి సేవకుల్లో మీరు ఒకరు. మా నమ్మకం వమ్ముకాదు. గత కొన్నేళ్లుగా మీరు బయట ప్రపంచానికి అనుమానం రాకుండా బిత్రోచికి అనుచరులను తయారుచేస్తూ, క్షుద్రోచ్ ని నిర్విఘ్నంగా కొనసాగిస్తూ వచ్చారు. ఇది చివరి తంతు...మనం బిత్రోచిని నిద్ర లేపగలిగితే...ఈ ప్రపంచమే కదా...ఈ విశ్వమే మన పాదాక్రాంతమవుతుంది.
సైతానులు విజృంభిస్తాయి. సైతాను అనుచరులు దేశాలను పరిపాలిస్తారు. క్షుద్రం, నీచం, స్వార్దం...ఊపిరి పోసుకుంటాయి...మనం అతి ప్రీతిగా రక్తాన్ని...
నేను పెరిగిమియో...ని మరోసారి నిర్వర్తిస్తాను...ఆ తర్వాత మూడవ తంతు...పూర్తి చేస్తాను. (పెరిగిమియోలో మూడు, ఏడు, తొమ్మిది, పదమూడవ తంతులు అతి క్షుద్రమైనవీ, జుగుప్సా కరమైనవి.
వీటి గురించి కొందరు వివరిస్తుంటే షాక్ లో ఉండి పోయేను. ఇలాంటి క్షుద్ర తంతులను వివరించకూడదనే చాలా వరకూ ఆ భాగాలను ఎడిట్ చేసి మీకు అందించడం జరిగింది.
ఇంకా వాటి గురించి పూర్తి వివరాలు నికోలాస్ అనే వ్యక్తి దగ్గరున్నాయని, అతనికి కొంత డబ్బు ఆఫర్ చేస్తే వాటి వివరాలు తెలియజేస్తానని చెప్పాడు.
నేను చాలా స్ట్రిక్ట్ గా 'ఎవాయిడ్' చేసాను. ఇలాంటివన్నీ తర్క, వితర్కాలకు అందని విషయాలు, అనవసర విషయాలు, అందుకే ఆ వివరాలను నేను తెలుసుకోవడానికి ఆసక్తి చూపించలేదు.-రచయిత్రి)
* * *
"వెల్ డన్ మిస్టర్ పీటర్సన్...మనం ఇప్పుడు బిత్రోచికి అతని సన్నిహిత దశలో, అతి సమీపంలో వున్నాం. చిత్రావతిని ఆ అయిదుగురు సమీపించిన మరుక్షణమే, వాళ్లలో విపరీతమైన ఆలోచనలు చోటు చేసుకుంటాయి' చెప్పాడు రామయ్య..
"అంటే..." ఈసారి ఆశ్చర్యపోవడం పీటర్సన్ వంతయింది.
రామయ్య విశ్వరూపాన్ని కొద్ది కొద్దిగా చూస్తోన్న కొద్దీ పీటర్సన్ కు మతిపోతోంది. తమ ప్రతినిధిగా రామయ్య ఇక్కడ ఉన్న విషయం తెలుసుగానీ, రామయ్యలో భయంకరమైన మరో మనిషి ఉన్నాడని ఇప్పుడు అర్ధమైంది పీటర్సన్ కు.
"యస్...మిస్టర్ పీటర్సన్...మిస్టర్ వాకర్ ని దిగ్భందం చేశాను." చెప్పాడు రామయ్య తాపీగా.
అదిరిపడ్డాడు పీటర్సన్.
"ఈజిట్ ట్రూ..."ఉద్వేగంగా అడిగాడు.
"యస్...ఇటీజ్ ట్రూ..వాకర్ నచికేత ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతను నిద్రలేచిన మరుక్షణం వింత వింత ధ్వనులు అతన్నుంచి వెలువడుతాయి. ఎప్పుడైతే, అతనువున్న గదిని తెరుస్తారో...అప్పుడు వాకర్ వాళ్లని ఆవహిస్తాడు...అతను వాళ్లని ఆవహించిన తర్వాత సరిగ్గా ఇరవై నాలుగు గంటల తర్వాత...వాళ్లలో విచిత్రమైన ప్రవర్తన మొదలవుతుంది.
బిత్రోచికి ప్రీతిపాత్రమైన స్వార్ధం, రక్త పిపాస, ద్వేషం మొదలైన గుణాలు బయటపడతాయి. ఒకరికొకరు శత్రువులవుతారు. ఎప్పుడయితే వాళ్ళు చిత్రావతిని చేరుకుంటారో...సరిగ్గా అప్పుడే వాళ్లలో విచిత్ర ప్రవర్తన మొదలవుతుంది. వాళ్ళు బిత్రోచి గెస్ట్ హౌస్ ను చేరుకునేలోగా అందులో బలమైనవాడు లేదా తెలివైనవాడు మాత్రమే ముగులుతాడు. బలమైన, తెలివైన వాడి రక్తం బిత్రోచికి అత్యంత ప్రీతిపాత్రమని మీకు తెలుసుగా పీటర్సన్...రామయ్యవైపు విభ్రమంగా చూస్తుండి పోయాడు పీటర్సన్..."వాహ్..గ్రేట్ మిస్టర్ రామయ్య చిర్నవ్వుతో అతని అభినందనలు స్వీకరించాడు. "సో...నీకిప్పుడు నచికేతతో పనిలేదు...ఆ ఇంటికి శాశ్వతంగా గుడ్ బై చెప్పినట్టేగా..." అడిగాడు పీటర్సన్.
"సర్టెన్లీ...ఇన్నాళ్లూ నా మంత్ర ప్రయోగాలకు ఓ డయాస్ లా ఆ ఇంటిని వాడుకున్నాను. అంతేకాదు, నచికేతలో ఓ ప్రత్యేకమైన శక్తివుంది. అది దైవశక్తి. ఆ శక్తి తనకు ఉన్న విషయం కూడా నచికేతకు తెలియదు. క్రమ క్రమంగా అతనికి తెలియని ఆ దైవశక్తిని మనం నిర్వీర్యం చేయాలి" వికృతంగా నవ్వాడు రామయ్య.
పీటర్సన్ రామయ్య భుజం తట్టాడు.
"మిస్టర్ పీటర్సన్...నేను ఇవ్వాళ అర్ధరాత్రే మరో తంతు ప్రారంభించాను. అందుకు ఏర్పాట్లు చేయండి.. ఇది బిత్రోచికి మనం సమర్పించే చివరి తంతు..." చెప్పాడు రామయ్య...
అందుక్కావలసిన ఏర్పాట్లు డేనియల్ కు అప్పగించాడు పీటర్సన్.
* * *
రాబర్ట్ పెదవులు మంత్రాలను ఉచ్చరిస్తూనే వున్నాయి.
ఐదుగురు మిత్రులూ అలానే నిలుచుండిపోయారు.
ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని విచిత్ర స్థితి.
రాబర్ట్ ముందే హెచ్చరించాడు.
"ఎటువంటి పరిస్థితిలోనూ మీరు వెళ్లి తలుపు తీయవద్దు. నేను చెప్పే వరకూ మీరున్నచోట నుంచి అంగుళం కూడా కదలొద్దు..."
స్టోర్ రూమ్ లో నుంచి చిత్ర విచిత్రమైన ధ్వనులు వినిపిస్తున్నాయి.
రాబర్ట్ కళ్ళు మూసుకుని ఉన్నాడు.
నచికేతకు ఏం చేయాలో తోచడంలేదు.
స్టోర్ రూమ్ లో నుంచి ధ్వనులు ఎక్కువవ్వసాగేయి.
ఎవరో తలుపులు దబదబ బాదుతున్నారు.
ప్రభు నచికేత చేతిని బలంగా పట్టుకున్నాడు.
కిటికీ రెక్కలు టపటపా కొట్టుకుంటున్నాయి.
ఒక్కసారిగా గాలి చండప్రచండమైంది.
బయటి వాతావరణంలో ఏదో మార్పు వచ్చినట్టనిపించింది.
హాలు తలుపులు వాటంతటవే మూసుకున్నాయి.
స్టోర్ రూమ్ లోనుంచి శబ్దాలు క్షణక్షణానికి పెరిగిపోతున్నాయి.
ఇంత జరుగుతున్నా రాబర్ట్ మాత్రం కళ్ళు తెరువలేదు. మంత్రోచ్చారణ ఆపివేయనూ లేదు.
* * *
"ప్లీజ్ ఓపెన్...ద డోర్...ప్లీజ్ ఓపెన్ ద డోర్..." లోపలి నుండి ఎవరో అరుస్తున్నారు. "ఎవరో తలుపు తీయమంటున్నారు...వెళ్లి తీద్దామా" అడిగాడు విలియమ్స్.
"మిస్టర్ రాబర్ట్ ఏం చెప్పారు? వద్దని చెప్పలేదూ..." నచికేత అన్నాడు.
"ప్లీజ్...ప్లీజ్...ఓపెన్ ద డోర్" మళ్ళీ స్టోర్ రూమ్ నుంచి రిక్వెస్టింగ్ గా వినిపిస్తుంది ఓ కంఠం.
అందరూ మొహమొహాలు చూసుకున్నారు.
కొద్దిసేపు మౌనం.
అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కాని ఆ మరుక్షణమే సన్నగా రోదిస్తున్నట్టు ఏడుపు.
ఏడుపు క్రమక్రమంగా పెద్దదవుతూ వస్తోంది.
"లోపల ఎవరో వున్నారు...పాపం ఏడుస్తున్నారు" సూర్యనారాయణ అన్నాడు.
"అవునవును" సూరజ్ కూడా అన్నాడు.
నచికేతకు ఏం చేయాలో అర్ధం కావడం లేదు.
రాబర్ట్ వైపు చూసేడు రాబర్ట్ మొహం క్రమక్రమంగా బూడిద వర్ణంలోకి మారుతోంది.
భయంతో కంపించిపోయాడు. రాబర్ట్ మొహంలో రకరకాల మార్పులు...
ఒకటి...
రెండు...
మూడు...
క్షణాలు నిమిషాలవుతున్నాయి.
సరిగ్గా అయిదు నిమిషాల తర్వాత...
రాబర్ట్ మొహం ఎరుపు వర్ణంలోకి వచ్చింది.
ఒక్కసారిగా కళ్ళు తెరిచి తీక్షణంగా స్టోర్ రూమ్ గదికి వేసివున్న తాళం వైపు చూసేడు...
అంతే...
తాళం కప్ప ఊడి వచ్చి గొళ్లెం దానంతట అదే పైకి లేచింది.
తలుపులు మెల్లగా తెరుచుకుంటున్నాయి. మెల్లి...మెల్లిగా...
అందరూ ఊపిరి బిగపట్టారు.
ఒక్కసారిగా ఆ గదిలోనుంచి ఉదృతమైన గాలి బయటకు వచ్చింది. గాలి ఎంత బలంగా వీచిందంటే...గదిలోని వాళ్లంతా ఎక్కడ ఆ గాలి వేగానికి కొట్టుకుపోతారో...అనిపించేంత.
ఆ గదిలో నుంచి వాకర్ శవం బయటకు వచ్చింది.
నిద్రలో నడుస్తున్నట్టు ఆ గదిలోనుంచి హాలులోకి వచ్చింది.
హాలులో నిలబడి తలను ఒక్కసారి చుట్టూ తప్పి, మధ్య స్థానానికి తీసుకువచ్చింది...మెయిన్ డోర్ దానంతటదే తెరుచుకుంది.
వాకర్ శవం నడుచుకుంటూ వెళ్తోంది.
