రాబర్ట్ తీక్షణంగా వాకర్ శవం వైపు చూసి-
"స్టాప్...దేర్..." అంటూ అరిచేడు.
అయినా వాకర్ నడుస్తూ వెళ్తున్నాడు.
రాబర్ట్ లేచి వేగంగా వాకర్ ని చేరి అతని భుజం మీద చేయేశాడు.
మరుక్షణం కొన్ని వేలవేల వోల్టుల విద్యుత్ శరీరానికి తగిలినట్టు గాలిలోకి నాలుగు అడుగుల ఎత్తు ఎగిరి పదడుగుల దూరంలో సోఫామీద పడిపోయాడు రాబర్ట్.
ఆ దృశ్యాన్ని చేష్టలు డిగి చూస్తుండిపోయారు ఐదుగురూ...
* * *
ఐదు నిమిషాల తర్వాత రాబర్ట్ తేరుకున్నాడు...
నచికేత గబగబా హాలులో ఉన్న ఫ్రిజ్ దగ్గరకెళ్లి చల్లటి వాటర్ తీసుకువచ్చి రాబర్ట్ కు ఇచ్చాడు. బాటిల్ నీళ్ళు గడగడా తాగేసి రిలక్సయ్యాడు రాబర్ట్.
"మీరు చాలా లక్కీ...ఏ మాత్రం ఆ తలుపు తాళం తీసినా, వాకర్ మీ ఐదుగురిలోకి ప్రవేశించి మిమ్మల్ని చంపేసేది. లేదా ఒకరినొకరు చంపుకునేలా చేసేది..." చెప్పాడు రాబర్ట్ నీళ్లు తాగి తేరుకున్నాక.
"నిజమా?" నచికేత తేరుకుంటూ అడిగేడు.
అతనికిదంతా ఆశ్చర్యంగా వుంది.
తన ఇంట్లో తనకు తెలియకుండా ఓ డెడ్ బాడీ...
"ఎలా..ఇదెలా సాధ్యం? హౌ...హౌ...ఈజిట్ పాజిబుల్?" తనలో తనే గొణుకున్నట్టు అన్నాడు.
"దుష్ట శక్తులు ఉన్న డెడ్ బాడీని, మంత్రశక్తులతో దిగ్భంధం చేయడం వల్ల సాధ్యమవుతుంది మిస్టర్ నచికేత...అంతేకాదు...మీకు తెలియని మరో విషయం. ఆ గదిలో క్షుద్రోపాసన జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా..." కూల్ గా చెప్పాడు రాబర్ట్.
అప్పటి వరకూ కొద్ది కొద్దిగా ఉన్న అనుమానం బలపడసాగింది. అంటే...దీనికంతటికీ కారణం రామయ్యే...
ఆ ఊహ వచ్చిన మరుక్షణమే నచికేత వొళ్ళు గగ్గుర్పొడిచింది. ఇన్నాళ్లూ తను ఓ క్షుద్ర మాంత్రికుడితో కలిసివున్నాడా? తనింట్లో తనకు తెలియకుండా క్షుద్ర పూజలు జరుగుతున్నాయా? అని ఒళ్ళు జలదరించింది.
ఇన్నాళ్లూ తనకు భయంకరమైన కలలు వస్తున్నాయంటే దానిక్కారణం రామయ్యే కాబోలు...అనుకున్నాడు...రాత్రి వేళల్లో రామయ్య పడుకున్నట్టు నటించడం, తన గది తలుపు బయట్నుంచి గొళ్ళెం వేసి ఉండడం...కాన్వాసుమీద రంగులు ఒలకడం...
ఒక్కొక్కటిగా అన్నీ గుర్తుకురాసాగాయి. అంటే...సూరజ్...సూర్యనారాయణల విషయంలో జరిగింది కూడా నిజమేనన్నమాట.
ఓ వింతయిన విషయం. వొళ్ళు గగుర్పొడిచే విషయం అనుభవంలోకి వచ్చేసరికి అతనికి తెలియకుండానే అతని శరీరంలో వణుకు వచ్చేసింది.
"వర్రీ కావాల్సిన అవసరం లేదు...మీకు నేను తోడుగా వుంటాను" నచికేత భుజం తట్టి ధైర్యం చెప్పాడు రాబర్ట్.
సరిగ్గా అదే క్షణంలో...
అర్దరాత్రి వేళ...శ్మశానంలో ఓ సమాధి మీద కూచుని క్షుద్ర తంతును నిర్వర్తిస్తోన్న రామయ్య ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు.
అతనికి తెలియకుండానే అతని వంట్లో సన్నని వొణుకు.
దానిక్కారణం...?
16
ఒంటిమీద గోచీతప్ప మరోటి లేదు.
క్షుద్ర తంతుని ప్రారంభించే ముందు రక్తంతో తడిసిన చిన్న గుడ్డ ముక్క తప్ప మరోటి ఉండకూడదు వంటిమీద
రామయ్య తన వణుకుని కప్పి పుచ్చుకుంటూ కళ్ళు తెరిచాడు.
ఎదురుగా వా...క...ర్
రామయ్య వైపే తీక్షణంగా చూస్తున్నాడతను.
వాకర్ శక్తి క్షీణించే సమయంలో రామయ్య క్షుద్ర తంతును ఉపయోగించి, స్టోర్ రూమ్ లో దిగ్భంధం చేసాడు. రాబర్ట్ తన మంత్రశక్తితో వాకర్ లో ఉన్న క్షుద్ర శక్తిని నిర్వీర్యం చేసాడు. వాకర్ శరీరంలోని దుష్ట ఆత్మ శక్తి సన్నగిల్లిపోతోంది.
వాకర్ ఆ పరిస్థితిలో చూసిన రామయ్య వొళ్ళు ఒక్క క్షణం జలదరించింది.
దూరంగా ఎవరిదో చితి కాలుతోంది.
ఆ వెలుగులో వాకర్ మొహం వికృతంగా భయంకరంగా తయారైంది. వాకర్ కనుగుడ్లు బయటకు పొడుచుకువచ్చాయి. అతని శరీరంనుంచి అదో విధమైన దుర్వాసన వస్తోంది.
"ఎం..దు..కొ..చ్చా..వి..క్క..డి..కి" రామయ్య గొంతులో కాఠిన్యం పలికింది.
వాకర్ బదులు పలకలేదు.
"ఎందుకొచ్చావిక్కడికి?" ఈసారి గొంతు మరింత పెంచి అడిగాడు రామయ్య.
వాకర్ కుడిచేతిని పైకి లేపాడు.
రామయ్య ఆ చేయి వైపు చూస్తుండగానే ఆ చేయి వాకర్ శరీరం నుంచి వేరుపడి కిందపడిపోయింది చిన్న శబ్దం చేస్తూ...
వాకర్ పెదవులు కదలడం లేదు...కానీ సన్నటి రోదన...
ఈసారి ఎడమ చేతిని పైకి లేపాడు.
ఆ చేయి కిందపడింది ధబ్ మని...
మరికొద్ది క్షణాల్లోనే తల మొండెం నుంచి వేరయింది. ఆ తర్వాత నడుం భాగం...కాళ్ళు...వాకర్ శరీరంలో నుంచి ఒక్కో భాగం...అలా వేరై కింద కుప్పలా పడిపోయాయి. రామయ్య ఇంకా దిగ్ర్భాంతిలో నుంచి తెరుకోనేలేదు.
తను నిర్వర్తించాల్సిన తంతు ఇంకా మొదలవ్వలేదు. ఇంతలోనే ఈ అవాంతరం. రెండు కళ్ళూ గట్టిగా మూసుకున్నాడు. క్షుద్రాత్మను పిలిచేడు.
క్షుద్ర తంతులలోని మూడవ తంతుని మొదలు పెట్టి (ఈ మూడవ తంతు చాలా జుగుస్పాకరంగా వుంటుంది. కొన్ని ఆటవిక తెగల్లోనివాళ్ళు మూఢనమ్మకాల్తో ఇలాంటి తంతులను నిర్వర్తిస్తారని తెలిసింది. దీని గురించి ఎంత తక్కువ తెలుసుకుంటే అంత మంచిది.)
ఆ శ్మశానంలో ఉండి వుండీ గాలి వేగంగా వీస్తోంది. ఆ గాలిలో ఏదో మార్పు. ఆ వాతావరణంలో ఏదో మార్పు. అసలే అర్దరాత్రి వేళ...
రామయ్య మూడవ తంతు పూర్తి కావస్తోండగా...శ్మశానంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది.
సమాధుల్లోని శవాలు నిద్రనుంచి లేచాయి. చితిలో కాలుతోన్న శవం బిగుసుకుపోయింది. ప్రేతాత్మలు కంపించిపోతున్నాయి.
క్షుద్రాత్మ వస్తోంది.
రామయ్య చేస్తోన్న మూడవతంతు చూసి సంతృప్తి చెందింది.
ఒక్కసారిగా శరీరంలో ఏదో మార్పు. చిన్న గగుర్పాటు. అయినా రామయ్య కళ్ళు తెరువలేదు.
కానీ ఒక్కో విషయం అర్ధమవ్వసాగింది. రాబర్ట్ తనకున్న శక్తులతో వాకర్ లోని క్షుద్ర శక్తులను నిర్వీర్యపరిచాడు.
అప్పటివరకూ అంటి పెట్టుకొని ఉన్న క్షుద్రశక్తులు అతడ్నించి వేరు కావడంతో అతడు తన శరీరంలోని అన్ని భాగాలను కోల్పోయాడు.
శరీరంలోని అంగాలను, అతడ్ని అప్పటివరకూ ఆవహించుకుని ఉన్న క్షుద్రశక్తులు పీక్కుతినడానికి సిద్దపడ్డాయి.
* * *
రామయ్య కళ్ళు తెరిచాడు.
వాకర్ శరీరం కానీ, అతని శరీరంలోని ఏ భాగం కానీ అక్కడ కనిపించలేదు.
అతనికి మెల్లగా అర్ధమవ్వసాగింది. అర్ధమయ్యేకొద్దీ అతని దవడ కండరాలు బుగుసుకున్నాయి. క్షుద్రోచితో మరో భయంకరమైన క్షుద్రమైన తంతును మొదలు పెట్టడానికి సిద్దపడ్డాడు.
* * *
నచికేత ఆలోచనలో పడ్డాడు.
"ఏదో థ్రిల్ కోసం మొదలు పెట్టాలనుకున్న అడ్వంచర్ కాస్త అనుకోకుండా భయంకరమైన మలుపు తిరుగుతోంది. స్టోర్ రూమ్ లో నుండి వాకర్ శవం నడిచి వెళ్లడం చూసేక, ప్రభు జ్వరంతో మంచం పట్టాడు. ఉదయం నుండి అతని వొళ్లంతా వేడెక్కిపోతూనేవుంది.
విలియమ్స్ పైకి చెప్పకపోయినా లోలోపల భయపడుతూనే వున్నాడు.
సూరజ్, సూర్యనారాయణల పరిస్థితి కూడా ఇంచు మించు అలాగే వుంది. నచికేత పైకి ధైర్యంగా వున్న లోలోపల అతను భయపడుతూనే వున్నాడు.
ఇన్నాళ్లూ తనకు తెలియని విషయాల గురించి ఆలోచిస్తూ వున్నాడు. ఇప్పుడు స్పష్టంగా కళ్లముందే కనిపిస్తుంటే నమ్మకలేకపోతున్నాడు.
రాబర్ట్ రాకపోయుంటే తమ పరిస్థితి ఏవిధంగా వుండేది?
రాబర్ట్ తమకు ధైర్యం చెప్పి వెళ్లాడు. తెల్లవారితే చిత్రావతి అడవిలోకి ప్రయాణం మొదలు పెట్టాలి.
రాబర్ట్ రేపు ఉదయం వస్తానన్నాడు.
ఈ రాత్రి తాము ఈ ఇంట్లో ఉండగలరా? స్టోర్ రూమ్ వైపు చూడాలంటేనే భయమేస్తోంది.
"నచీ...గెస్ట్ హౌస్ పందెం నుంచి డ్రాప్ అవుదామా?" నచికేత పక్కన కూచుంటూ అడిగాడు విలియమ్స్.
"ఇంతవరకూ వచ్చాక డ్రాప్ అవడం ఎందుకు? దాని అంతు తెల్చుకోవడమే బెటర్ అనుకుంటున్నాను..." అన్నాడు నచికేత.
"నాకైతే ఇదంతా చూస్తుంటే అనుమానంగా, భయంగా వుంది" సూరజ్ అన్నాడు.
"ఎందుకు?" అడిగాడు నచికేత సూరజ్ ని.
"ఎందుకంటే? మన వెనుక ఏదైనా కుట్ర జరుగుతుందేమో...లేదా...మనకు తెలియని ఏదో ఉపద్రవం మనల్ని చుట్టుముడుతుందని నాకు భయంగా వుంది" సూర్యనారాయణ అన్నాడు.
"పోనీ...అదేమిటో తెలుసుకుందాం..." నచికేత అన్నాడు.
ఎవరి ఆలోచనలో వారుండిపోయారు...
* * *
8.45 పి.యమ్
పరమహంస లైబ్రరీలో వున్నాడు. అది అతని పర్సనల్ లైబ్రరీ...అక్కడ వందల సంఖ్యలో పుస్తకాలు వున్నాయి. వివిధ రకాలైన సబ్జెక్టుల మీద ఉన్న పుస్తకాలవి.
