ఇది తథ్యం...అప్పుడు...మీ అందర్నీ ఆశీర్వదిస్తుంది. మనమంతా బిత్రోచి అనుచరులం. ప్రపంచమంతా బిత్రోచి వశమయ్యే సమయం ఎంతో దూరంలో లేదు."
మరోసారి తమ హర్షాన్ని తెలియజేశారు ఆ హాలులో ఉన్నవాళ్ళు.
రామయ్య పీటర్సన్ వైపు చూసి తర్వాత ఆ గదిలో వెలుగుతోన్న క్యాండిల్ వైపు చూసాడు.
ఆ హాలులో పెద్దక్యాండిల్ వెలుగుతోంది. హాలు తలుపులు మూసివేసి వున్నాయి.
పీటర్సన్, రామయ్య డయాస్ మీద వున్నారు.
డయాస్ ముందు ఓ టేబుల్ వుంది. దానిమీద పెద్ద క్యాండిల్ వుంది.
రామయ్య తీక్షణంగా ఆ క్యాండిల్ వైపు చూశాడు.
తన కుడిచేతి బొటనవేలితో ఎడమ చేతి మణికట్టు దగ్గర గట్టిగా గాయం చేసుకున్నాడు.
రక్తం చిమ్మింది.
ఆ రక్తాన్ని క్యాండిల్ వెలుతురు మీద ధారగా చిమ్మించాడు. క్షణక్షణానికి ఆ క్యాండిల్ వెలుతురులో మార్పు వస్తూ రంగులు మారుతోంది. ఒక్కక్షణం పసుపు రంగులోకి మారి, ఎరుపు రంగులోకి వచ్చింది.
అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.
డయాస్ మీద ఉన్న రామయ్య, పీటర్సన్ లు కనిపించలేదు. కానీ, ఎక్కడ్నుంచో మాటలు వినిపిస్తున్నాయి.
"ఫ్రెండ్స్...ఈ రోజునుంచి ప్రతిరోజూ అర్దరాత్రి పన్నెండు గంటలవేళ క్షుద్రోచిని ఆరాధిస్తూ క్షుద్ర పూజలు నిర్వర్తించండి. క్షుద్రోచీని ఆహ్వానిస్తూ ప్రతీరోజూ అర్ధరాత్రి మూడు చుక్కల రక్తాన్ని క్షుద్రోచికి సమర్పించండి"
మాటలు ఆగిపోయాయి.
ఆ హాలు నుంచి కదిలారు బిత్రోచి క్షుద్ర సంస్థ సభ్యులు...
* * *
ఉలిక్కిపడి కళ్ళు తెరిచారు సూరజ్, సూర్యనారాయణ. నచికేత, విలియమ్స్, ప్రభు తమవైపు ఆందోళనగా చూస్తూ కనిపించారు.
"వాట్ హేపెండ్?" అడిగాడు నచికేత వాళ్లిద్దర్నీ...
"రామయ్య...రామయ్య..." ఏదో జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేస్తూ అన్నారు.
"రామయ్య...లాంగ్ కోట్..." సూర్యనారాయణ గొణిగాడు.
"తల గిర్రున తిరిగింది. నాలిక కిటికీ దగ్గరికి వచ్చింది." కలవరిస్తున్నట్టు అన్నాడు సూరజ్.
నచికేత ఆశ్చర్యంగా వాళ్లిద్దరివైపు చూస్తుండిపోయాడు.
"ఏదైనా పీడకల వచ్చిందా?" విలియమ్స్ అడిగాడు.
"పీడకల కాదు...పీడకల లాంటి...నిజమైన సంఘటన..." సూర్యనారాయణ చెప్పాడు.
"పీడకల లాంటి...పీడకల లాంటి సంఘటన ఏంటి?" ప్రభు అనుమానంగా అడిగాడు.
సూరజ్ రాత్రి జరిగింది గుర్తు చేసుకోసాగాడు.
"రాత్రి మీరంతా ఏమయ్యారు..." సూర్యనారాయణ అడిగాడు అనుమానంగా చూస్తూ...
"రాత్రి బాగా నిద్రపట్టింది. నిద్ర మాత్రలు వేసుకున్నంత నిద్ర" అన్నాడు విలియమ్స్...
"అవునవును...తెల్లవారేదాకా మెలుకువ రాలేదు..." ప్రభు అన్నాడు.
"నేను లేచే సరికి నువ్వూ...సూరజ్ భయంతో వణికిపోతూ కనిపించారు" చెప్పాడు నచికేత సూర్యనారాయణతో.
సూరజ్- సూర్యనారాయణలు మొహమొహాలు చూసుకున్నారు.
సూరజ్ రాత్రి తాము చూసిన సంఘటన చెప్పాడు.
"మీరు నమ్మినా, నమ్మకపోయినా ఇది నిజం. రామయ్య లాంగ్ కోట్ వేసుకొని వెళ్తున్నాడు. మమ్మల్ని చూసి, తలని శరీరాన్ని కదల్చకుండానే వెనక్కి తిప్పాడు. నాలిక కిటికీ వరకూ సాగింది. అది చూసి భయంతో అరిచాం...మిమ్మల్ని పిలిచాం కూడా..." సూర్యనారాయణ అన్నాడు.
"ఇన్నాళ్ళు మీరు చెప్పిన వాటిని మేము తీసి పారేసాం...రాత్రి అనుభవమయింది. నాకు భయంగా వుందిరా నచీ..." సూరజ్ అన్నాడు.
నచికేత ఒక్క క్షణం మౌనంగా ఉన్నాడు. అతనికీ ఈ మధ్య రామయ్య మీద అనుమానంగా వుంది.
ప్రభు, విలియమ్స్ లకు కూడా రామయ్య ద్వారా అనుభవాలు ఎదురయ్యాయి.
"ఫ్రెండ్స్...నిజమే...రామయ్యను మనం ఓ కంట కనిపెట్టాలి..." నచికేత అన్నాడు.
"కనిపెట్టడం కాదు, ఇక్కడ్నుంచి రామయ్యను పంపించేయడమే బెటర్..." ప్రభు చెప్పాడు.
"అర్దరాత్రి హాస్పిటల్ కు వెళ్తున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది..." విలియమ్స్ అన్నాడు.
"సరే రామయ్య రానీ...తెల్సుకోవచ్చు..." నచికేత అన్నాడు.
కానీ వాళ్లకు రామయ్య ఇక రాడని తెలియదు.
* * *
అర్దరాత్రి పన్నెండయ్యింది.
రోజంతా రామయ్య కోసం ఎదురుచూస్తూనే గడిపారు.
"రామయ్య ఇంకా రాలేదేమిటి?" అనుమానంగా అన్నాడు ప్రభు.
"నాకూ అదే అనుమానంగా వుంది..." నచికేత అన్నాడు.
అందరూ ఈ విషయం మీద డిస్కస్ చేసుకోసాగేరు.
సరిగ్గా అదే సమయంలో ఎవరో డోర్ బెల్ ప్రెస్ చేసారు.
"ఇంత అర్దరాత్రి వేళ వచ్చేదేవరు? రామయ్య కాదు కదా..." అనుకుంటూ నచికేత వెళ్లి తలుపు తీశాడు. ఎదురుగా ఓ వ్యక్తి...అపరిచిత వ్యక్తి.
"హలో...అయామ్ రాబర్ట్...రాబర్ట్ ఫ్రమ్ సింగపూర్...అక్కడ పోలీసాఫీసర్ ని" చెప్పాడు రాబర్ట్ తనని తాను పరిచయం చేసుకుంటూ...
నచికేత ఆశ్చర్యంగా చూస్తూ పక్కకు జరిగి అతనికి దారి ఇచ్చాడు.
రాబర్ట్ అక్కడ ఉన్న నచికేత ఫ్రెండ్స్ వైపు చూశాడు.
నచికేత తన ఫ్రెండ్స్ ని పరిచయం చేసాడు.
* * *
"వెల్...ఇదీ జరిగింది. నేను సింగపూర్ నుంచి ప్రత్యేకంగా రావడానికి కారణం పీటర్సన్. ఇండియా వచ్చాక, నేను పీటర్సన్ ని ఛేజ్ చేస్తూ వచ్చాను. అతను పత్రికలో ప్రకటన ఇవ్వడం చూసాను. ఆ ఇంటర్ వ్యూకు చాలామంది అటెండ్ అయ్యారు. ఆఫ్ కోర్స్ వాళ్లలో మీరూ వున్నారనుకోండి. మిమ్మల్ని ఇంటర్ వ్యూ చేసిన పీటర్సన్ తన వేషం, పేరు మార్చుకున్నాడు.
మీ మధ్య జరిగిన సంభాషణను కూడా టేప్ చేసాను. అయితే అతను ప్రత్యేకంగా మిమ్మల్ని చిత్రావతికి ఎందుకు పంపిస్తున్నాడో, భిత్రోచి గెస్ట్ హౌస్ కు పంపించడం వెనుక మర్మమేమిటో తెలియదు. అది తెలియాలంటే మీరు బిత్రోచి గెస్ట్ హౌస్ కు వెళ్లక తప్పదు. అయితే ఈ ప్రయత్నంలో మీకు కొన్ని ప్రమాదాలు ఎదురైనా అవ్వొచ్చు..." చెప్పాడు రాబర్ట్.
అప్పటివరకూ రాబర్ట్ చెప్పిందంతా విని, స్థాణువులయ్యారు...
"ఆఫీసర్...ఇప్పటి వరకూ ఓ థ్రిల్ ను సొంతం చేసుకోవడం కోసమే, మేము చిత్రావతి వెళ్లాలని అనుకున్నాం. దీని వెనుక పెద్ద బ్యాగ్రౌండ్ వుందని మీ మాటల్లో తెలిసింది. మా వల్ల మీకు ఉపయోగం వుందో, లేదో తెలియదు కానీ, మేము బిత్రోచి గెస్ట్ హౌస్ కు తప్పక వెళతాం...ఈ విషయంలో మీకు మరే సాయం కావాలన్నా మేము చేయడానికి సిద్దంగా వున్నాం" అన్నాడు నచికేత మనస్పూర్తిగా.
రాబర్ట్ పీటర్సన్ కు సంబంధించిన అన్ని విషయాలు చెప్పలేదు. ఎంత వరకూ చెప్పొచ్చో అంతవరకే చెప్పాడు.
పీటర్సన్ ఓ క్రిమినలని, అతను సింగపూర్ నుంచి తప్పించుకుని ఇక్కడికి వచ్చాడని మాత్రమే చెప్పాడు.
ఓ నేరస్థుడిని పట్టుకునే విషయంలో తనకు సహకరించమని చెప్పాడు.
వాళ్లకి పీటర్సన్ ఓ క్షుద్ర మాంత్రికుడని, అతని దగ్గర క్షుద్ర విద్యలు ఉన్నాయని చెబితే బెదిరిపోవచ్చు. అందుకే ఆ విషయాన్ని అప్పుడే చెప్పదల్చుకోలేదు.
అతను చెప్పని మరో విషయం...తరళ...ఆమెకు సంబధించిన విషయాలూ చెప్పలేదు.
సింగపూర్ నుంచి ఇండియా వచ్చిన రాబర్ట్ పీటర్సన్ ని వెన్నంటే ఉన్నాడు.
ఇప్పుడతని ధ్యేయం...పీటర్సన్ ని నిర్వీర్యుడ్ని చేసి బిత్రోచిని అతను నిద్రలేపకుండా చూడ్డమే. అతని క్షుద్ర శక్తులను సమూలంగా నాశనం చేయాలి.
సరిగ్గా అప్పుడే రాబర్ట్ సిక్స్ త్ సెన్స్ ఏదో ప్రమాదాన్ని వూహించింది. ఆ ప్రమాదం, స్టోర్ రూమ్ నుంచి అని అర్ధమైంది...అర్ధమైన మరుక్షణమే రివ్వున లేచాడు.
15
"ఇక్కడెవరైనా అర్ధరాత్రుళ్ళు పూజలు చేస్తారా?" ఉన్నట్టుండి అడిగాడు రాబర్ట్.
"లేదు...ఎందుకలా అడిగారు?" ఆశ్చర్యంగా అడిగాడు నచికేత.
"వన్ సెకన్..." అంటూ రాబర్ట్ కళ్ళు మూసుకున్నాడు. అతని అడుగులు స్టోర్ రూమ్ వైపు పడుతున్నాయి.
మిగతా ఐదుగురు రాబర్ట్ ని అనుసరించారు. స్టోర్ రూమ్ దగ్గరికి వచ్చి ఆగాడు రాబర్ట్.
లోపల్నుంచి ఏదో మూలుగులు.
"లోపల ఎవరో ఉన్నట్టున్నారు?" అంటూ నచికేత ఆ గది తలుపు దగ్గరికి వెళ్ళబోయాడు.
"స్టాప్...స్టాప్ దేర్...ఆ తలుపు మీద చేయి వేయవద్దు..." చెప్పాడు రాబర్ట్ ఆందోళనగా...
