ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోవడం మొదలు పెట్టారు.
* * *
ఫ్రెండ్సంతా భోజనాలకు కూచున్నారు.
రామయ్య అందరికీ వడ్డిస్తున్నాడు. ప్రభు రామయ్య వంక చూడ్డం లేదు. అతని వైపు చూడ్డానికే భయపడుతున్నాడు. విలియమ్స్ కూడా అదే స్టేజ్ లో వున్నాడు. రామయ్య వడ్డిస్తుంటే అతని కుడిచేతి మణికట్టుకు ఉన్న రంగురంగుల దారాలు కిందికి వేలాడుతున్నాయి.
"ఏమిటవి రామయ్యా?" ఆ దారాల వంక చూపిస్తూ అడిగాడు సూర్యనారాయణ.
తల తిప్పి సూర్యనారాయణవంక చూశాడు.
ఒకే ఒక్కక్షణం...సూర్యనారాయణ వొళ్ళు జలదరించింది.
ఆ క్షణంలో రామయ్య మొహంలో అనేక రకాల బావాలు కనిపించాయి సూర్యనారాయణకు.
నచికేత, విలియమ్స్, ప్రభు, సూరజ్ ఇవేమీ గమనించలేదు.
"రామయ్యా...సాంబార్..." అన్నాడు నచికేత.
రామయ్య సాంబర్ ను ప్లేటులో పోశాడు.
"మీకేం కావాలి?" సూర్యనారాయణను అడిగాడు రామయ్య తీక్షణంగా చూస్తూ...
"ఏమీ...వద్దు" అన్నాడు.
"ఏంట్రా సూర్యా,. ఒక్కసారిగా డల్ అయిపోయావ్? ఏంటీ కథ?" సూరజ్ అన్నాడు.
"నతింగ్...ఏమీలేదు" సర్దుకుని అన్నాడు సూర్యనారాయణ.
ఆ రాత్రి అందరూ నచికేత గదిలో పడుకుందామనుకున్నారు.
"ఇవ్వాళ రాత్రి నేను ఇంట్లో ఉండడంలేదు" చెప్పాడు రామయ్య నచికేతతో.
"అదేంటి...నువ్వెప్పుడూ ఇల్లు విడచి వెళ్లవుగా?'
"మా దగ్గరి చుట్టాలకు సుస్తి చేసింది. హాస్పిటల్ లో వున్నారు. చూడ్డానికి వెళ్లాలి. మళ్ళీ రేపు ఉదయం వస్తాను"
"సరే...రేపొద్దున్నే వచ్చేయ్...డబ్భులేమన్నా కావాలా?"
"అక్కర్లేదు" అన్నాడు తల అడ్డంగా వూపుతూ...
"ఎప్పుడెళ్తావ్?"
పన్నెండు గంటలకు" చెప్పాడు రామయ్య.
"అంత అర్దరాత్రి వేళా? అదేంటి...నువ్వు హాస్పిటల్ లో ఉన్న వాళ్లను పరామర్శించడానికి వెళ్తున్నావా? క్షుద్రపూజలు చేయడానికి శ్మశానానికి వెళ్తున్నావా?" జోకేశాడు సూరజ్.
రామయ్య తలతిప్పి సూరజ్ వైపు చూశాడు.
"ఏయ్...సూరజ్...పెద్దాయనతో జోకులేంటి?" అంటూ "నువ్వెళ్లు రామయ్య...మేము పెందలాడే పడుకోవాలి. వెళ్ళేప్పుడు మాకు ప్రత్యేకంగా చెప్పి వెళ్లక్కర్లేదు...వెళ్లి రేపు ఉదయమే వచ్చేయ్" అన్నాడు నచికేత.
రామయ్య అలానే అన్నట్టు తలూపాడు...
* * *
చలి కిటికీలోంచి రివ్వున వీస్తోంది.
"అబ్బ చలి చంపేస్తోంది. కిటికీ రెక్కలు మూసేయండి" అన్నాడు నచికేత.
సూరజ్ వెళ్లి కిటికీ రెక్కలు వేసి వచ్చాడు.
"నచీ...నాకెందుకో ఈ పనిమనిషి రామయ్యని చూస్తోంటే అనుమానం కలుగుతోంది. అయినా అర్దరాత్రి పన్నెండు గంటలకు హాస్పిటల్ కు వెళ్ళడమేంట్రా?" విలియమ్స్ అన్నాడు నచికేతతో...
"అన్నీ మనకెందుకులేద్దు..." అన్నాడు నిద్రొస్తుందన్నట్టు ఆవలిస్తూ...కానీ నచికేతలో కూడా రామయ్యపట్ల అనుమానం లేకపోలేదు.
ఐదుగురిలో ఆ అనుమానం వుంది.
ముఖ్యంగా సూరజ్ కు ఇందాకటి సంఘటన గుర్తొచ్చి వణికిపోయాడు. ఒక్కక్షణం రామయ్య కనుగుడ్లు ఎరుపు రంగులోకి మారడం ఎలా సాధ్యం? అతను కోపంగా చూసిన చూపు తను మరచిపోలేదు.
అందరూ కాసేపు టీవీ చూసి నిద్రకు ఉపక్రమించారు.
* * *
అర్ధరాత్రి పదకొండు యాభై...
సూరజ్ కు మెలకువ వచ్చింది. అటూ ఇటూ లేచి పచార్లు చేయసాగాడు. ఎంతకీ నిద్రపట్టలేదు మళ్ళీ...
అతనికాయింట్లో నిద్రరావడం లేదు.
ఎందుకో అతనికే అర్ధం కావటంలేదు.
"నిద్రరావటం లేదా?"గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తోన్న సూరజ్ ని అడిగాడు సూర్యనారాయణ.
"నీకూ నిద్రరావడం లేదా?" సూరజ్ అడిగాడు.
"ఊహు...నిద్రరావడం లేదు. కళ్ళు మూసుకున్నా, తెరిచినా ఆ రామయ్యే గుర్తొస్తున్నాడు. చెప్పాడు భోజనాల దగ్గర జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ..." సూర్యనారాయణ.
"ఏం జరిగిందేంటి?"
భోజనం దగ్గర జరిగిన విషయం చెప్పాడతను. సరిగ్గా అప్పుడే ఆ గదిలో కరెంటు పోయింది.
"అదేంటి కరెంటు పోయింది..." అంటూ సూర్యనారాయణ తడుముకుంటూ వెళ్లి కిటికీ తలుపులు తెరిచాడు. బయట్నుంచి వెలుతురు లోపలికి పడుతోంది.
"ఒక్క మన గదిలోనే కరెంటు పోయినట్టుంది" గొణిగినట్టు అన్నాడు సూర్యనారాయణ. సరిగ్గా అప్పుడే సూరజ్ కూడా బయటకు చూశాడు.
మరుక్షణం...
ఆ ఇద్దరి శరీరాలు ఏక కాలంలో జలదరించాయి...
అక్కడ లాన్ లో రామయ్య...?
14
కిటికీలోంచి లాన్ స్పష్టంగా కనిపిస్తోంది.
అక్కడ ఓ వ్యక్తి లాంగ్ కోటు వేసుకొని, నెత్తిన హేట్ పెట్టుకుని వెళ్తున్నాడు. ఆ ఇంటి గేటు తీయబోతూ ఆ వ్యక్తి తలను వెనక్కి తిప్పాడు.
ఆ వ్యక్తి మరెవరో కాదు, రా...మ...య్యే...
లాంగ్ కోట్, హేట్ పెట్టుకొని...రామయ్య తలని వెనక్కి తిప్పకుండానే వేగంగా గుండ్రంగా కదిలించాడు. కొన్ని క్షణాలు గిర్రు గిర్రున తిరుగుతూ, ఒక్క క్షణం తల వెనక్కి తిరిగి ఆగింది. గేటువైపు ఉన్న రామయ్య, వెనుకవైపు తిరిగి అతని తల...కనుగుడ్లు పైకి పొడుచుకు వచ్చాయి.
చాలా తీవ్రంగా కిటికీలో నుంచి చూస్తోన్న సూర్యనారాయణ. సూరజ్ లవైపు చూశాడు రామయ్య. ఒక్కక్షణం అతని నాలిక పొడవుగా సాగింది. ఎంత పొడవుగా అంటే...దాదాపు పదిహేడు అడుగుల దూరంలో ఉన్న కిటికీ తలుపులను తాకేంత...
భయంతో వణికి, గభాలున కిటికీలు మూసేసారు. వళ్లంతా చెమటలు పట్టింది. భయంతో శరీరం కంపించింపోతోంది.
"ఇ...ఇ...ది నిజమా? భ్రమా?" గోడకు జారగిలపడుతూ అడిగాడు భయంగా సూరజ్.
"ని...నిజమే..." అన్నాడు సూర్యనారాయణ భయంతో బిగుసుకుపోతూ.
"నచీని, విలియమ్స్ ని, ప్రభుని లేపుదామా?"
"అ...లా...గే..."
ఇద్దరూ తడుముకుంటూ మంచం దగ్గరికి వెళ్లారు.
"నచీ...నచీ..."
"ప్రభూ..."
"విలియమ్స్..."
మంచం ఖాళీగా వెక్కిరించింది. చీకటిలోనే తడిమి చూసారు. "ఎవరూ లేరేంటి?" భయంగా అడిగాడు సూర్యనారాయణ.
బదుల్లేదు.
"సూరజ్"
మళ్ళీ నో రెస్పాన్స్..
"ప్రభూ...విలియమ్స్...నచీ...సూరజ్..." పిచ్చెక్కినట్టు పిలుస్తూ భయంతో స్పృహ తప్పి పడిపోయాడు సూర్యనారాయణ.
* * *
"డియర్ ఫ్రెండ్స్...
ఆ హాలులో పీటర్సన్ కంఠం ఖంగుమంటూ వినిపించింది.
"ఇక్కడికి వచ్చిన మీ అందరికీ బిత్రోచి ఆహ్వానం పలుకుతోంది. గత పదమూడు సంవత్సరాలుగా మీరు బిత్రోచి సేవలో తరించారు.
చెడు ఆలోచిస్తూ, చెడు తలంపులు చేస్తూ, రక్తాన్ని ఇష్టపడే మిమ్మల్ని చూసి బిత్రోచి వికృతానందంతో నిద్రపోతోంది.
బిత్రోచి నిద్రలేచే సమయం ఆసన్నమయింది. దేశం నలుమూలల నుంచి ఈ రోజు జరిగే ఈ సమావేశంలో పాల్గొన్న మీ అందరికీ బిత్రోచి తన ఆశీస్సులు అందజేస్తోంది.
పీటర్సన్ మాట్లాడ్డం ఆపి ఓసారి అందరి వంకా చూసేడు.
అందరూ బ్లాక్ గౌన్లు వేసుకొని, వాటిమీద ఎర్రటి పట్టీలు ధరించి వున్నారు. అందరి కుడిచేతులకు రంగు రంగుల దారాలు కట్టబడి వున్నాయి.
పీటర్సన్ చూపులు రామయ్య మీద పడ్డాయి.
రామయ్య నిశ్శబ్దంగా లేచాడు. లాంగ్ కోటులో ఉన్నాడు రామయ్య.
పీటర్సన్ స్వయంగా దగ్గరికి వచ్చి అతడ్ని డయాస్ మీదకి తీసుకువెళ్లి..."ఫ్రెండ్స్...మీకిప్పుడో ఇంపార్టెంట్ పర్సన్ ని పరిచయం చేస్తిను...మీట్ మిస్టర్ రామయ్య...క్షుద్రోచి తంతును నిర్వర్తించగల ఒకే ఒక వ్యక్తి...ఎనిమిది ధారాలను ధరించి, ఐదు క్షుద్ర తంతులను పూర్తిచేసి బిత్రోచికి అత్యంత ఆప్తుడయ్యాడు.
ఇప్పటి వరకూ మీకు అజ్ఞాతంగా ఆజ్ఞలు జారీచేస్తూ వివిధ ప్రాంతాలలో ఉన్న మిమ్మల్ని బిత్రోచి వైపు నడిపిస్తోన్న వ్యక్తి..." చెప్పాడు పీటర్సన్...
ఆ హాలులో ఉన్న వాళ్లంతా మోకాళ్లమీద కూచుని రెండు చేతులనూ 'ఇంటూ' ఆకారంలో పెట్టి తమ హర్షాన్ని తెలియజేశారు.
రామయ్య గొంతు విప్పాడు.
"ఫ్రెండ్స్...సుమారు ఇరవయ్యేళ్లుగా నేను బిత్రోచిని ఆరాధిస్తూ వచ్చాను. బిత్రోచికి ఇష్టమైన చెడు చేస్తూ, 'చెడు'ను ఆచరిస్తూ స్వార్ధపూరిత జీవితాన్ని గడుపుతూ అంచెలంచెలుగా ఐదు క్షుద్ర తంతులను సాధించాను.
ఇంతవరకూ అజ్ఞాతంగా వుంటూ ఎప్పటికప్పుడు ఆదేశాలు అందజేస్తూ మిమ్మల్ని బిత్రోచికి దగ్గర చేసే ప్రయత్నం చేసాను. త్వరలో బిత్రోచి నిద్రలేస్తుంది.
