Previous Page Next Page 
కాంతం కాపరం పేజి 21


    భగవంతుడు ఈ ముసలమ్మ భక్తికి మెచ్చి వస్తున్నాడా? సనకస నందనాది మహామునులు, వాల్మీకాది భక్తులు సంవత్సరాల తరబడి నిద్రాహారములు లేక తపస్సు చేసినా అనుగ్రహించని భగవానుడు ఈ లంక పొగాకు చుట్టలు తగలేసే ఆయన భార్యకు, కనిపిస్తున్నాడా అని కొందరు నాస్తికులు అన్నారు. అంటే మట్టుకు ఆ మాటలకు విలువ లేకపోయింది.

    హరనాథ్ బాబా స్పిరిట్ వచ్చి ఇల్లాగ చేస్తున్నదనీ స్వర్గీయమయిన ఆత్మలు ఇల్లాగ వచ్చి, మనతో మాట్లాడటం మొదలైన పనులు ఇప్పుడు జరుగుతున్నవని, పశ్చిమ దేశాలలో ఈ విషయమై కొంత పరిశోధన జరుగుతున్న విషయము నేను చదివాననీ, మా ఆవిడతో చెప్పాను. అంతట ఆవిడకు ఈ విషయంలో మరీ నమ్మకం ఏర్పడింది. 
              
    ప్రతి శుక్రవారం తీరిక జేసుకొని, మా ఆవిడ కూడా ఈ భజనలకు వెళ్ళేది. ఒక రోజున అరటిపండ్లూ, ఇంకో రోజున వెన్నా, ఇంకో రోజున పాలూ ఇల్లాగ ప్రతిమారూ ఏదో ఒకటి అంతర్ధానమై పోతూ వచ్చింది. ఆవిడకు హరనాథ్ బాబాలో నమ్మకం కూడా హెచ్చు అయింది. ప్రత్యక్షంగా కళ్ళ యెదట పదిమంది మధ్యా జరుగుతున్న విషయాన్ని గురించి నమ్మకం కలగకుండా ఎట్లా ఉంటుందీ?

                                                                             2

    కొన్నాళ్ళు జరిగిన తరువాత భజన చేసే వాళ్ళల్లోనే కొందరు ఆమెను సమీపించి మీరు చేస్తేనే ఇల్లాగ జరుగుతుందా? మేము భజనచేసినా ఆరగింపు చేస్తాడా అని అడిగారు.

    మీ పూర్వజన్మ సుకృతం మీద ఆధారపడియున్న విషయం అది ఎట్లా చెప్పగలము. సంచితం ఏమీ లేకపోతే ఆయన కరుణిస్తాడు అని ఏమేమో వేదాంత వాక్యాలు నాలుగు సాగదీసి చెప్పేసి, అయినా ప్రయత్నం చేయండి, భక్తితో సాధించరాని దేముంది? భక్తి వలన మీ సంచిత కర్మా నశిస్తుంది. భగవదారణా కలుగుతుంది. ఆమాట అని ఆవిడగారు చెప్పినది.

    తదారభ్యః కొందరు హరనాధ బాబా భజన ప్రారంభించారు. మొదట్లో, ఎవ్వరింట్లోనూ ఏమీ ఆరగింపు కాలేదు.

    ఈ విషయం ఆవిడతో చెప్పుకొంటే ఆవిడ "మీరు ఇంకా తీవ్రభక్తితో భజన చేయండి. బాబా కరుణామయుడు, తప్పక మీ గృహాన్ని పావనం చేస్తాడు అని హితం చెప్పి పంపింది.

    చాలామంది విశ్వాసంతో భజనలు అల్లాగే చేశారు మానకుండా నాలుగైదు వారాలు గడచినా దయ కలగలేదు బాబాకు. ఆ భక్తురాలు ఒక్కొక్కవారం ఒక్కొక్క ఇంటికి వెళ్ళి భజనలు జయప్రదంగా సాగించింది. ఆవిడ సాన్నిథ్యంలో మాత్రం ఆరగింపు అవుతుండేది. ఆవిడ పరోక్షంగా మాత్రం ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడే ఉండేవి. కాని ఆవిడ ప్రోత్సాహంవల్ల ఆయనకు ఎప్పుడో ఒకప్పుడు దయ కలుగుతుందనే నమ్మకంతో అమ్మలక్కల భజనలు మానలేదు.

    ఆ వారంలో శుక్రవారపు భజనలో సుబ్బమ్మగారి ఇంట్లో పైనుంచి కర్పూరం పడ్డదని ఒక పుకారు పుట్టింది. అంతా జెప్పుకొని సంతోషించారు. ఆవిడ పుణ్యాత్మురాలన్నారు.

    ఆ రోజు నుంచీ, ఆవిడ ఆ భక్తురాలుకు ఆప్తురాలైంది. వాళ్ళిద్దరూ ఒక దగ్గరే కూర్చుని భజన చేయడం ఒకేసారి తన్మయత్వంలోకి పోవటం, ఒకేమారు ఉలిక్కి పడటం మొదలెట్టారు.

    వాళ్ళను చూచి ఇతరులు "అయ్యో మనమెంత పాపులమో, మన తపస్సు ఇంకా ఫలించలేదు కాబోలు? అని విచారపడ్డారు. కాని ఎవ్వరూ నిరుత్సాహ పడలేదు. అందరి ఇళ్ళల్లోనూ శుక్రవారం_శుక్రవారం భజనలు జరుగుతూనే వున్నాయి. మనవాడు (భక్తురాలి భర్త) లంక పొగాకు చుట్ట బాగా రూళ్ళ కర్రంత లావుపాటిది వాకిట్లో కూర్చుని తగలేస్తునే ఉన్నాడు.

                                         3

    సుబ్బమ్మగారి యింట్లోపడ్డ తరువాత వారం రోజులకు వెంకమ్మగారింట్లోను, తరువాత వరుసగా అన్నమ్మ గారింట్లోనూ ఆండాళ్ళ గారింట్లోనూ ఆరగింపులైనాయని పుకారు పుట్టింది ఇవ్వాళ మా యింట్లో ఆరగింపు అయిందంటే యివ్వాళ మా ఇంట్లో అయిందని భజన పరులంతా ఒకరితో ఒకరు చెప్పుకొని సంతోషించారు.

    ఆ స్థితిలో మా ఆవిడ కూడా భజన చేస్తానన్నది. నేనన్నానూ, మనమెందుకు చేయడం, మనం పుణ్యాత్ములమని నాకేం నమ్మకం లేదు. ఆ హరనాథ్ బాబు మన ఇంటికి కూడా వచ్చి ఫలహారాలు ఆరగిస్తే సరే ఉంది, లేని పక్షంలో, అంతా మనలని వట్టి పాపిష్టి వాళ్ళని అనుకోవచ్చు వద్దు సుమా' అని అంటే, బుర్ర కెక్కితేగా  మా ఆవిడకూ, 'అయ్యో అందరింట్లోనూ, ఆరగిస్తున్నాడండీ మన కర్మం ఏం గాలింది? రంకుముండ నాగామకంటే మనం తీసిపోయినామా అత్తలకు కోడళ్ళకు తెంపులు పెట్టి, కొంపలుతీసే రాకాసి రంగమ్మ కంటే తీసిపోయినామా! మన నెందుకు బాబా అనుగ్రహించడో చూస్తా" నన్నది. ఒకరికి ఎప్పుడూ, అపకారం తలపెట్టక గుట్టుచక్కంగా కాపరం చేస్తున్న మా యందు ఆయనకు ఎందుకు అనుగ్రహం కలగదని నాకూ నమ్మకం కలిగి సరేనన్నాను. మా పిల్లలు కూడా సరదా పడ్డారు.

    సరే మర్నాడే మా ఆవిడ భజన ప్రారంభించింది. మొదటిరోజున, ఆ భక్తురాలు పాపం పని వేళా వచ్చి ఆ తంతు అంతా నేర్పిందీ మా ఆవిడకు, తర్వాత వరసగా నాలుగు వారాలు ఈవిడ భజన చేసింది. మా ఇంట్లో వాళ్ళూ అద్దెకున్న వాళ్ళూ ముసలీ ముతగా, అంతా ఇరవైమంది చేరేవాళ్ళు శుక్రవారం శుక్రవారం.

    ప్రతి శుక్రవారం సాయంత్రం నేను యింటికి వడివడిగా నడిచివచ్చి, ఆఁ ఏమిటి? ఏమైంది? ఏమన్నా, పడ్డదా అని ఆదుర్దాగా అడుగుతుండేవాడిని, మా ఆవిడ, "అయ్యో అయ్యో మనబోటి వాళ్ళకే, అంత అదృష్టం. ఈ ముఖాలు చూసే ఆయన ఆరగించడం" అని ముక్కి మూలిగేది. హరనాథ బాబు ఆరగించక పోవటానికి పూర్తిగా కాకపోయినా, చాల వరకు నేనే కారణభూతమైనట్లు ఆమె మాట్లాడేది. నేనే పాపం ఎరుగనుగదా నిజానికీ, అయితే ఏమిటి? ఆవిడతో కలిసి, స్కూలు అయినా మానేసి నేను కూడ భజన చేయలేదనీ, హరనాథ్ బాబా యందు పూర్తియైన నమ్మకం నాకు లేదనీ ఆవిడకు నా యందు కోపం.

    "పోనీ నా ముఖం చూసి రాకపోతే నీ ముఖం చూసి అయినా రాకూడదా" అన్నాను ఒకరోజున నేను విసుగెత్తి, "అదిగాక మొగుడు చేసిన పాపం పెళ్ళాన్ని అంటదనీ, పుణ్యంలో మాత్రం సగభాగం పంచుకొంటుందనీ, పెద్దలు అంటారు కాబట్టి నాతోనూ, నా ముఖంతోనూ, నీ భజనకు ఏమీ సంబంధం లేదు. నమ్మకంతో నీవు సాగించ" మని హితం చెప్పాను.

    అందరిళ్ళల్లోనూ వారం వారం భజన చేస్తున్నప్పుడల్లా ఆయన ఆరగింపు చేసి పోతున్నాడని, అందరూ అనటం ఈవిడ ఒకర్తే ఇల్లాగ కేటాయింపు అయిపోవటం మూలాన ఆడవాళ్ళల్లో మా ఆవిడకు కొంచెం చిన్నతనం అయింది. అందరిళ్ళల్లోను అయిదో వారాన జొరబడ్డ బాబా పదోవారమైనా మా ఇంటికి రాలేదు. ఆ ఆచూకీ లేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS