Previous Page Next Page 
నన్ను ప్రేమించవు పేజి 22

    ఆడదాన్ని కొట్టడం మగతనం కాదురా, ఆడదాన్ని పెళ్ళిచేసుకోవడం మగతనం...."
    "ఏమిటే అరుస్తున్నావ్, ఈరోజు మక్కెలిరగదీస్తా." శృతిమించిన కోపంతో బయటకొచ్చి ఆమె జుట్టు పట్టుకున్నాడు.
    "చంపేస్తున్నాడు బాబోయ్! రక్షించండి...." పెద్ద గొంతుతో అరిచింది.
    అప్పటికే చుట్టుప్రక్కల ఇళ్లనుండి జనం బయటకొచ్చి నిలబడ్డారు. ఎవరూ గణేష్ ని ఆపడానికి ప్రయత్నించలేదు. అతనంటే అందరికీ భయమే!
    సరిగ్గా అదే సమయంలో ఓ జీప్ వచ్చి ఆగింది. ఇన్ స్పెక్టర్ ఒకతను క్రిందకు దిగాడు. కొంతమంది కానిస్టేబుల్స్ అతన్ని అనుసరించారు. గణేష్ ఆమెను కొట్టడం ఇన్ స్పెక్టర్ చూశాడు. కానిస్టేబుల్స్ కి సైగ చేశాడతను. వాళ్ళు వెళ్ళి గణేష్ రెక్కలు విరిచి పట్టుకున్నారు. హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. ఆమె స్పృహ తప్పి క్రిందపడుంది. ఒకామె నీళ్ళు తెచ్చి మొహంపైన జల్లి మిగిలిన వాటిని త్రాగించింది. క్షణాల్లో ఆమె తేరుకుంది.
    "నిన్ను ఎందుకొట్టాడు?" అడిగాడు ఇన్ స్పెక్టర్.
    ఆమె తమ మధ్య జరిగిందంతా చెప్పింది. అప్పటికప్పుడు ఆమెచేత ఓ కంప్లైంట్ రాయించి తీసుకుని, గణేష్ ని తీసుకెళ్ళి లాకప్ లో పడేసాడు.
    ఇది శనివారం ఉదయం జరిగింది.
    రెండురోజుల క్రితం యం.పి. ఫోన్ చేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని ఇన్ స్పెక్టర్ కి చెప్పాడు. గణేష్ ని కదలకుండా చేసే పథకం చేసాదతను. ఆ రోజు జరిగిన సంఘటన మొత్తం ముందు ప్లాన్ చేసిందే! గణేష్ ప్రియురాలిని రెచ్చగొట్టడానికి తన స్నేహితుల్ని తీసుకెళ్ళింది మాజీ ఎమ్మెల్యే కూతురు భాగ్యలక్ష్మి.
    యం.పి. దగ్గర బాడీగార్డుగా పనిచేసే వ్యక్తి, రామకృష్ణకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు.
    శనివారం రాత్రి పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి టీ అమ్మే కుర్రవాడి అక్క పెళ్ళి నిరాటంకంగా జరిగిపోయింది. పెళ్ళి జరుగుతున్న సమయంలో ఎదురుగా ఉన్న ఇంటి అరుగుపైన కూర్చుని చూశాడు రామకృష్ణ.
                                                                                  9      
    రామకృష్ణకి మెలకువ వచ్చింది.
    తలెత్తి చుట్టూ చూశాడు. అంతా నిశ్శబ్దంగా ఉంది. తనకి మెలుకువ రావడానికి గల కారణం కనిపించలేదు. ప్రక్కకి తిరిగి దుప్పటి సరిగ్గా కప్పుకుని పడుకున్నాడు. క్రమంగా నిద్ర పట్టసాగింది.
    ఏదో కదిలినట్టయి మొహం పైనుంచి దుప్పటి తొలగించి చూశాడు. కళ్ళకి ఏమీ కనిపించలేదు. మరోసారి అటువంటి భావమే కలగటంతో లేచి కూర్చున్నాడు. ఈసారి చుట్టూ పరీక్షగా చూశాడు. చలికి ముసుగు పెట్టుకుని నిద్రపోతున్న కూలీలు మూటల్లా కనిపిస్తున్నారు. తనకి నిద్రాభంగం కలగటానికి తగిన కారణం కనిపించలేదు.
    మళ్ళీ ఏదో కదలిక.
    లేచి నిలబడి దుప్పటి మొత్తం తీసి చూశాడు. తల దగ్గర ఏదో చిన్న మూటలా కనిపించింది. ఆ మూట చిన్నగా కదలటం గమనించాడు. నెమ్మదిగా దానిని తాకాడు. ఆ స్పర్శకి చురుగ్గా కదిలి ఛాలెంజ్ చేస్తున్నట్టు అరవసాగింది.
    "భౌ....భౌ.....భౌ...."
    దాన్ని చేతిలోకి తీసుకున్నాడు రామకృష్ణ. అరవడం మానేసి అతని చేతిని నాకసాగిండా కుక్కపిల్ల. చలికి తట్టుకోలేక తన పక్కలోకి దూరిందని గ్రహించాడు. చేతికి డొక్కలోని లేత ఎముకలు తగిలాయి. తల్లి వెంట తిరిగే వయసు దానిది. రామకృష్ణ లుంగీ వదిలి ప్యాంటు వేసుకున్నాడు. కుక్కపిల్లని తీసుకుని సెంటర్ వైపు బయలుదేరాడు. చీకటితో నిండిన రోడ్డు మీద నడవ సాగాడు.
    "ఇక్కడ కెందుకు తీసుకొచ్చావ్?"
    ఒక స్త్రీ గొంతు అస్పష్టంగా వినిపించింది. అతను శబ్దం వచ్చిన వైపు చూశాడు. క్రొత్తగా కడుతున్న బిల్డింగ్ చీకటిలో లీలగా కనిపించింది. రాత్రి సమయం కాబట్టి మాటలు అక్కడ వరకూ వినిపించాయని గ్రహించాడు రామకృష్ణ.
    "సచ్చినోడా....వదులు...."
    ఈసారి గట్టిగా వినిపించాయి.
    అతను ఆలస్యం చెయ్యకుండా అటువైపు పరిగెత్తాడు. ఆ భవనం సమీపించి కుక్కపిల్లని గుమ్మం ప్రక్కన ఉంచి లోపలకు వెళ్ళాడు. ఎవరో క్రిందపడిన చప్పుడయింది. దానితో పాటు "అమ్మా..." అని బాధగా అరిచిన స్త్రీ గొంతు వినిపించింది.
    "ఎవరక్కడ?" గట్టిగా అడిగాడు రామకృష్ణ.
    ఒక ఆకారం బాణంలా బయటకు దూసుకుపోయింది. మరో ఆకారం వెక్కి వెక్కి ఏడవసాగింది.
    "ఎవరమ్మా నువ్వు?" అడిగాడు.
    "నేను మా ఆయన రాత్రి బస్సులో ఇక్కడకు వచ్చామండి. రాత్రికి బస్ స్టాండ లో ఉందామనుకున్నాం. ఆయన భోజనం తేవడానికి వెళ్ళాడు. ఇతను మా ఆయన రమ్మంటున్నాడని చెప్పి ఇక్కడకు తీసుకొచ్చాడు." చెప్పింది దుఃఖం దిగమ్రింగి.
    "అతను ఇంత దూరం తీసుకొచ్చే వరకూ ఎందుక్కూర్చున్నావ్?"
    ఆమె సమాధానం చెప్పలేదు.
    గుమ్మం ప్రక్కనుంచి కుక్కపిల్లని తీసుకుని ఆమెను వెంట పెట్టుకుని సెంటర్ వైపు నడవసాగాడు.
    "ఇక్కడ మీకు బంధువులు వున్నారా?" అడిగాడు.
    "ఏదైనా పని చేసుకుని బ్రతకాలని వచ్చాం..." చెప్పిందామె.
    ఇద్దరూ సెంటర్ చేరుకున్నారు. వెలుగులో ఆమెని చూశాడు రామకృష్ణ. పద్దెనిమిది నిండని వయసు. మాయ, మర్మం కనిపించని అందమైన మొహం. కళ్ళు నిర్మలంగా మెరుస్తున్నాయి.
    "రిక్షా ఎక్కిస్తాను. బస్ స్టాండ్ కి వెళ్ళు...." చెప్పాడు రామకృష్ణ.
    "నాకు భయమేస్తోంది...." అంది బెదురుగా.
    టీ కొట్టు దగ్గర పాలు తీసుకుని సాసర్ లో పోసి చల్లార్చాడు. కుక్కపిల్ల వాటిని ఆత్రంగా త్రాగింది. టీ కొట్టు దగ్గర కూర్చున్న మగవాళ్ళు ఆ అమ్మాయిని, తినేసేటట్టు చూస్తున్నారు. ఆమెను ఒంటరిగా పంపడం మంచిది కాదనిపించింది. ఆమె తొందరగా బస్ స్టాండ్ కి వెళ్ళకపోతే భర్త ఆమె గురించి వెదుకుతూ ఎటైనా వెళ్ళొచ్చు. కుక్కపిల్ల పాలు త్రాగడం పూర్తయ్యేసరికి అతను ఒక నిర్ణయానికి వచ్చాడు. రిక్షాని పిలిచి ఆమెను ఎక్కమన్నాడు. ఆమె సంశయంగా చూడటం గమనించి అన్నాడు.
    "నీ భర్త దగ్గరకు పంపే ప్రయత్నంలో ఉన్నాను తల్లి! ఎక్కు....."
    ఆమె ఎక్కి కూర్చుంది. పది నిముషాల్లో రామకృష్ణ రూముకి చేరుకున్నారు. అతను వెళ్ళి తలుపు కొట్టాడు. శివరావు తలుపు తీశాడు.
    "నువ్వు ఈ అమ్మాయిని తీసుకుని బస్ స్టాండ్ కి  వెళ్ళు. ఆమె భర్త అక్కడా ఉంటాడు. అతనికి అప్పగించి వచ్చేయి. ఒకవేళ అక్కడ ఆమె భర్త కనిపించకపోతే తిరిగి తీసుకొచ్చేయి. నేను గోడౌన్ కి వెళతాను....." చెప్పి అదే రిక్షాలో వెళ్ళిపోయాడు.
    "అన్నయ్యేనా వచ్చింది?" అప్పుడే గుమ్మం దగ్గరకు వచ్చిన అర్చన అడిగింది. పైట భుజాల నిండుగా కప్పుకుంది.
    శివరావు సాలోచనగా అర్చన వైపు చూసి తలూపాడు. లుంగీ కట్టుకుని, చొక్కా వేసుకుని తలుపు తెరవడానికి అతనికి రెండు నిముషాలు పట్టింది. ఆమె పూర్తిగా బట్టలు వేసుకుని తన వెనుక వచ్చింది. సినిమాకి వెళ్ళడానికి గంటల తరబడి తయారయ్యే ఆడవాళ్ళు క్షణాల్లో కూడా బట్టలు కట్టుకొనగలరు. అదే భావంతో ఆమె చాతీ వంక చూశాడు.
    అతని చూపు ఎక్కడ నిలిచిందో గమనించి పైట చెంగుని చాతీమీద మరింత బిగుతుగా లాక్కుంది.
    రోడ్డు పైన నిలబడిన ఆ అమ్మాయి వాళ్ళ వంక చూసింది. అర్చనని చూసి, మరోమారు మొహాన్ని పరీక్షగా చూసింది.
    "అక్కా...." అంటూ వెళ్ళి పెనవేసుకుంది.
    అర్చన ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయింది. జరిగిందేమిటో గ్రహించటానికి రెండు క్షణాలు పట్టింది.
అప్రయత్నంగా అర్చన కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఓదారుస్తున్నట్టు ఆ అమ్మాయి వీపు నిమరసాగింది.
    శివరావు శిలా ప్రతిమలా ఉండిపోయాడు తన కళ్ళముందు జరుగుతున్న దృశ్యాన్ని జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టింది.
    "ఈ అమ్మాయి నీకు తెలుసా?" అడిగాడు తేరుకుని.
    అర్చన సమాధానం చెప్పలేదు. పైట చెంగుతో ఆ అమ్మాయి కన్నీళ్ళు తుడిచింది. జాకెట్టుకి గుండీలు పెట్టుకోలేదనే విషయం ఆమెకు ఆ క్షణంలో గుర్తు లేదు.
    శివరావుని చూసి చెప్పింది.
    "నా చెల్లెలు సులోచన. దీని గురించి మీకు చాలాసార్లు చెప్పాను."
    "నాన్న ఎలా ఉన్నాడు?" లోపలకు వెళ్ళిన తరువాత అడిగింది
    "బాగున్నాడు."
    "నువ్వు ఇక్కడకెలా వచ్చావ్?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS