Previous Page Next Page 
నన్ను ప్రేమించవు పేజి 23

    సులోచన చప్పున తలదించుకుంది. కొన్ని క్షణాల తరువాత జనకుతో చెప్పింది.
    "శీతయ్యతో వచ్చాను."
    "నువ్వు ఇక్కడ కోస్తున్నట్టు నాన్నకి తెలుసా?" అనుమానంగా అడిగింది.
    "తెలియదు."
    కోపంగా చూసింది అర్చన.
    "ఆయన మనకోసమే బ్రతికున్నాడు. పైకి చెప్పడుగాని నా గురించి బాధపడుతుంటాడు. నువ్వు చెప్పకుండా వస్తే తట్టుకోగలడా? ఏం సాధించాలని ఇక్కడకు వచ్చావ్?"
    "ఆవేశపడకు...." అర్చనలో హఠాత్తుగా వచ్చిన మార్పు చూసి మధ్యలో అన్నాడు శివరావు.
    "ఏం చేస్తే దానికి బుద్దొస్తుంది? అమాయకుడైన తండ్రిని వదిలేసి వచ్చిందంటే దీన్ని ఏం చెయ్యాలి?" అంటూ ఏడుస్తూ నేలమీద కూర్చుండిపోయింది.
    "నాకు రావాలని లేదు. కాని ఏం చెయ్యాలో తోచక ఇంట్లోంచి పారిపోయి వచ్చాను." చెప్పి కొంగు ముడి విప్పి, నలిగిపోయిన కవరు ఒకటి తీసింది. దానిని శివరావు చేతికిచ్చింది.
    చాలా కాలం నుంచి దాచినట్టు నలిగిపోయి ఉందా ఇన్ లాండ్ లెటర్. మడతలు జాగ్రత్తగా విప్పాడు శివరావు. లోపల అక్షరాలు గజి బిజిగా ఉన్నాయి.
                                                                                                                              విశాఖపట్టణం.
                                                                                                                                  కాంతానికి,
          జనార్దనం వ్రాయు ఉత్తరం ఏమనగా, నేను నీకు ఐదువందలు ఇచ్చినాను. ఇక్కడ నుంచి వెయ్యి రూపాయలు పంపాను. అర్చనని అమ్మడం వల్ల అంతకంటే ఎక్కువ సొమ్ము రాలేదు. నేను వారం రోజుల్లో అక్కడికి వస్తాను. ఈసారి సులోచనని నాతో పంపు. మనకి రెట్టింపు డబ్బు వస్తుంది.
    అందర్నీ అడిగినట్లు చెప్పు.  
                                                                                                                                           ఇట్లు
                                                                                                                                          జనార్దనం.
    శివరావుకి ఉత్తరం అర్ధమయింది. అర్చనని వ్యభిచార గృహానికి అమ్మి కాంతానికి డబ్బు పంపాడు. అంటే అర్చన వ్యభిచార గృహానికి అమ్మబడుతుందని కాంతానికి ముందే తెలుసు. అలాగే సులోచనని కూడా అమ్మాలనుకున్నారు. తల్లి స్థానంలో ఉన్న ఆడది ఎంత దారుణంగా ప్రవర్తించింది.
    "జనార్ధనంతో పంపాలని అనుకుందా కాంతం?" అడిగాడు.
    తలూపి చెప్పింది సులోచన.
    "జనార్ధనంతో అక్క వెళ్ళిన తరువాత పిన్నిని చాలాసార్లు అక్క గురించి అడిగాను. ఏవో కల్పించి చెప్పేది. ఈ ఉత్తరం వచ్చిన తరవాత చదువుకుని రహస్యంగా దాచింది. నాకు అనుమానం వచ్చి ఉత్తరం సంపాదించి చదివాను. శీతయ్యతో చర్చించి ఇంట్లోంచి వచ్చేశాను."
    "ముందు మనం బస స్టాండ్ కి వెళదాం. శీతయ్య నీకోసం వెదుకుతుంటాడు" అన్నాడు శివరావు.
    ఇంటికి తాళం పెట్టి ముగ్గురూ రోడ్డు మీదకు వచ్చారు. కొంత దూరం నడిచిన తరువాత వాళ్ళకి ఆటో దొరికింది. అక్కడ నుంచి పది నిముషాల్లో బస్ స్టాండ్ చేరుకున్నారు. అర్దరాత్రి కూడా దాటిపోవడంతో బస్ స్టాండ్ లో ప్రయాణీకులు లేరు. బోసిగా కనిపిస్తున్న బస్ స్టాండ్ నిశ్శబ్దంగా ఉంది. కొంతమంది ప్రయాణీకులు అక్కడక్కడా పడుకుని ఉన్నారు.
    పడుకున్న వాళ్ళని చూసుకుంటూ చివరవరకూ వెళ్ళారు. శీతయ్య కనిపించలేదు. ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. మరోసారి ప్రయాణీకుల్ని చూసుకుంటూ వెళ్ళింది సులోచన. అప్పటికే ఆమె మొహం పాలిపోయింది. ఆమె ఏడవడానికి సిద్దంగా ఉందని గమనించాడు శివరావు. చివరగా ఎంట్రన్స్ దగ్గరకు వచ్చి నిలబడ్డారు. విశాఖపట్నంలో ఒక మనిషికోసం వెదకడం ఎంత కష్టమో తెలియడం వల్ల శివరావుకి ఆందోళనగా ఉంది.
    "మీరు ఇక్కడే నిలబడండి...." చెప్పి ఎంట్రన్స్ ముందున్న ఆవరణలోకి వచ్చాడు శివరావు. ఫెన్సింగ్ అవతల బస్సులు లోపలకు వచ్చే రోడ్డుంది. ఆ రోడ్డుని ఆనుకుని కనిపిస్తోంది సెంట్రల్ జైలు గోడ. ఆ గోడ సమీపంలో ఒకతను అక్కడా కూర్చోవడం అసహజంగా అనిపించింది. అతను ఫెన్సింగ్ దాటి అక్కడకు వెళ్ళాడు.
    "ఎవరు నువ్వు?" గంభీరంగా అడిగాడు.
    అతను తల తిప్పి మూల్గుతూ చెప్పాడు.
    "పొరుగూరండీ మాది...."
    "ఇక్కడేం చేస్తున్నావ్?" తిరిగి ప్రశ్నించాడు.
    ఆ వ్యక్తి నెమ్మదిగా చెప్పాడు.
    "నన్ను నమ్ముకున్న ఓ అమ్మాయిని తీసుకుని ఇక్కడకు వచ్చానండి. ఆకలేస్తోందని ఏదైనా తేవడానికి బయటకెళ్ళానండి. తిరిగొచ్చేసరికి ఆమె లేదు. బస్ స్టాండ్, చుట్టూ ప్రక్కల ప్రాంతాల్లో వెదికానండి. ఎక్కడా కనిపించలేదు. ఇక్కడే తప్పిపోయింది. తిరిగి ఇక్కడకే వస్తుందని చూస్తున్నాను...." చెప్పాడు. అతని గొంతు దుఃఖంతో పూడుకుపోయింది.
    "ఆమె నీకేమవుతుంది?"
    అతను మాట్లాడలేదు. దుఃఖాన్ని దిగమ్రింగడానికి ప్రయత్నిస్తున్నాడని గ్రహించాడు శివరావు. కొన్ని క్షణాల తరువాత తేరుకుని గొంతు విప్పాడు.
    "నన్ను నముకుని కొండంత అండగా ఉంటానని వచ్చింది. గేదెలు కాసుకునే వాడినని చూడకుండా నా గుండెల మీద పడుకుని కబుర్లు చెప్పేది. ఆ అమాయకురాలు ఈ పట్నంలో ఎటు వెళ్ళిందో అండగా ఉండడమంటే వెంట తీసుకెళ్ళడమని తెలియని మొద్దు వెధవని. నాకేమవుతుందని చెప్పను."
    అప్పుడే అక్కాచెల్లెళ్ళు అక్కడకు చేరుకున్నారు. ఆ వ్యక్తిని గుర్తుపట్టి గాబరాగా అరిచింది సులోచన.
    "శీతయ్యా...."
    ఆమె గొంతు విని అతను చప్పున లేచి నిలుచున్నాడు. సులోచన సుడిగాలిలా అతన్ని చుట్టేసింది. ఆమె బరువుకి శీతయ్య వెనక్కి పడ్డాడు.
    మొహం తిప్పి అర్చనవైపు  వారగా చూశాడు శివరావు. ఆమె అసహనంగా కదలడం కనిపించింది. చెయ్యి పట్టుకుని దూరంగా తీసుకెళ్ళాడు శివరావు.
    "బస్ స్టాండ్ ఆవరణలో ఏమిటా చోద్యం? చూడటానికి మీకు కళ్ళు చాలడం లేనట్లుంది, పిలవండి వాళ్ళని...." కోపంగా అరిచింది అర్చన.
    "ఇటువంటి దృశ్యాలు అదృష్టవంతుల కళ్ళల్లో  మాత్రమే పడతాయి..." అని నవ్వాడు శివరావు.
                                                                *    *    *    *
    ఉదయం తొమ్మిది గంటలకు ఇంటికొచ్చాడు రామకృష్ణ. రాత్రి తనకి దొరికిన కుక్కపిల్లని పదిలంగా తెచ్చాడు. ఇంట్లోని మనుషుల్ని చూసి వాళ్ళు తన వాళ్లయినట్టు తోక ఊపసాగింది. గదిలో ఒక మూల దిగులుగా కూర్చుంది అర్చన. ఆమెకు ఎదురుగా రాత్రి తీసుకొచ్చిన అమ్మాయి, ఆమె ప్రక్కన ఒక వ్యక్తి కూర్చున్నారు. వాళ్ళ మొహాలు కూడా దిగులుగానే ఉన్నాయి.
    అర్చన లేచి లోపలకు వెళ్ళింది.
    "నీ భర్త ఇతనేనా?" అడిగాడు రామకృష్ణ.
    సులోచన తలూపింది. అతన్ని పరిశీలనగా చూశాడు రామకృష్ణ. అతనికి ఇరవై సంవత్సరాలు ఉంటుంది వయసు. చిన్నతనం నుంచి కష్టపడి పని చెయ్యడం అలవాటైన వాడిలా అతని చేతులు బలంగా ఉన్నాయి. నూనూగు మీసాలతో అమాయకంగా కనిపిస్తున్నాడు. వాళ్ళని చూసి పల్లెటూరి నుంచి వచ్చిన వాళ్ళని గుర్తు పట్టొచ్చు.
    సులోచనవైపు చూశాడు రామకృష్ణ. ఆమె రెండు కళ్ళూ కన్నీళ్ళతో నిండి ఉన్నాయి.
    "ఎందుకేడుస్తున్నావ్? నీ భర్త దొరికాడు కదా!" ఆశ్చర్యంగా అన్నాడు.
    "అక్క నన్ను వెంటనే ఇంటికి వెళ్ళమంటోంది. మీరే మాకు సాయం చెయ్యాలి...." ప్రాధేయ పూర్వకంగా అంది.
    "అక్క ఎవరు?" ఆశ్చర్యంగా ప్రశ్నించాడు.
    "అర్చన" చెప్పింది.
    సులోచన రాత్రి తమ మధ్య జరిగిన వాదోపవాదాలు వివరంగా చెప్పింది. రాత్రి బస్ స్టాండ్ నుండి శీతయ్యని తీసుకుని ఇంటికొచ్చారు. వాళ్ళిద్దర్నీ వెంటనే గ్రామం వెళ్ళిపొమ్మని చెప్పింది అర్చన. నచ్చ చెప్పడానికి ఎంత ప్రయత్నించినా ఆమె ఒప్పుకోలేదు. చివరకు శివరావు మాట కూడా కాదంది. డ్యూటీకి వెళుతూ సులోచనని ప్రక్కకు పిలిచి రామకృష్ణ వచ్చిన తరువాత చెప్పమని సలహా ఇచ్చాడు శివరావు.
    "అర్చనా!" పిలిచాడు రామకృష్ణ.
    రెండోసారి పిలిచిన తరువాత వచ్చిందామె. రామకృష్ణ మొహంవైపు చూడకుండా తలొంచుకుని నిలబడింది.
    "వాళ్ళని మీ గ్రామం వెళ్ళిపొమ్మని అన్నావా?" అడిగాడు.
    ఆమె సమాధానం చెప్పలేదు.
    "సమాధానం చెప్పు......."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS