Previous Page Next Page 
నన్ను ప్రేమించవు పేజి 21

    "శనివారం పెళ్ళి చెయ్యాలని నా తల్లిదండ్రులు అనుకుంటున్నారు. కాని పెళ్ళి జరగదు..." చెప్పాడు. అతని కళ్ళు వర్షించబోతున్న మేఘాల్లా ఉన్నాయి.
    "ఎందుకని?" ఆశ్చర్యంగా అడిగాడు రామకృష్ణ.
    "మా పేటలో ఒక రౌడీ ఉన్నాడు. అతను చిన్నప్పుడు అక్కతో కలిసి చదివాడట. అప్పుడు రెండు కుటుంబాల వాళ్ళు చనువుగా ఉండటంతో అతని కిచ్చి చెయ్యాలని అనుకున్నారట. ఇప్పుడతను రౌడీగా తయారయ్యాడు. అతన్ని మా అక్క చేసుకోనని చెప్పింది....."
    కొన్ని క్షణాలు ఆగి అన్నాడు.
    "అతను ప్రొద్దున మా యింటికొచ్చాడు. మా అక్కని అతనికే ఇచ్చి చెయ్యాలని, మరో సంబంధం చేస్తే తనతో తిరిగిందని ప్రచారం చేసి పెళ్ళి చెడగొడతానని వార్నింగ్ ఇచ్చాడు....."
    "మీ పేటలోని పెద్ద మనుషుల్ని మంధలించమని చెప్పండి....."
    ఆ కుర్రాడు నిట్టూర్చాడు.
    "అతనితో ఎవరూ మాట్లాడారు."
    "అతను నిజంగా పెళ్ళి చెడ గొడతాడా?"
    తలూపాడు.
    "అతని పేరేమిటి?"
    "గణేష్"
    రామకృష్ణ టీ త్రాగి గ్లాసు తిరిగి ఇచ్చేశాడు. కుర్రాడు దానిని కడిగి బకెట్ లో పెట్టుకుని చిన్న నోట్ బుక్ తీసి రామకృష్ణ ఖాతాలో టీ డబ్బులు రాసుకున్నాడు. మిగతా వాళ్ళకి టీ ఇవ్వడం కోసం వెళ్ళాడు.
    సాయంకాలం యూనియన్ ఆఫీస్ కి వెళ్ళాడు రామకృష్ణ. వినాయకరావు ఒక్కడే కూర్చుని పుస్తకాలు చూస్తున్నాడు. రామకృష్ణ రావడం గమనించి పలకరింపుగా నవ్వి అన్నాడు.
    "రా.....కూర్చో."
    అతను నమస్కారం చేసి ఎదురుగా ఉన్న బల్లపైన కూర్చున్నాడు. పది నిముషాలు తన పని చూసుకుని తలెత్తి అన్నాడు వినాయకరావు.
    "వచ్చే నెల మూడు రోజులపాటు యూనియన్ మహాసభ జరుగుతుంది. సెక్రటరీ రిపోర్టు, జమాఖర్చుల నివేదిక తయారు చేస్తున్నాను. ఆ సభలో నువ్వు యాక్టివ్ గా పని చెయ్యాలి. నీకు మంచి భవిష్యత్తు ఉంది."
    "మీతో చిన్న పనుండి వచ్చాను..." అన్నాడు రామకృష్ణ.
    "ఏమిటా పని?"
    "మనవాళ్ళ కోసం టీ తెచ్చే కుర్రవాడి అక్క పెళ్ళి జరుగుతోంది. ఒక రౌడీ ఆ పెళ్ళి జరక్కుండా చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడట. మన వాళ్ళని పంపి వార్నింగ్ ఇస్తే పెళ్ళి జోలికి రాకుండా ఉంటాడు."
    వినాయకరావు తన మీసాలు దువ్వుకుంటూ ఉండిపోయాడు.
    "అతనికి మరేదైనా సహాయం చేద్దాం. నువ్వు అడిగినట్లు మన వాళ్ళని పంపడం మంచిది కాదు, సాధ్యం కాదు కూడా! ఇటువంటి వాటిని మనం అలవాటు చేస్తే చిన్న చిన్న తగువులకు కలసి వెళతారు. యూనియన్ నాయకుడు అటువంటి వాటిని నివారించాలి తప్ప ప్రోత్సహించ కూడదు."
    రామకృష్ణకి నిరాశ ముంచుకొచ్చింది. వినాయకరావు తను అడిగిన దానికి అంగీకరిస్తాడని భావించాడు. అమాయకమైన ఆ కుర్రాడి మొహం గుర్తొచ్చింది.
    "పోలీస్ రిపోర్టు ఇవ్వమని చెప్పు. నేను యస్.ఐ.తో మాట్లాడతాను." రామకృష్ణ ఆలోచించటం చూసి అన్నాడు వినాయకరావు.
    "వస్తాను...." చ్జెప్పి బయటికొచ్చాదాతను. పరిసరాలు మర్చిపోయినట్టు రోడ్డు ప్రక్క నడుస్తూ వెళుతున్నాడు.
    "నమస్కారం సార్"
    తలెత్తి చూశాడు రామకృష్ణ.
    ఒక వ్యక్తి చేతులు జోడించి నిలబడున్నాడు. ఆ వ్యక్తి తనకి అపరిచితుడని గ్రహించాడు రామకృష్ణ. రోడ్డుపైన వెళుతున్న తనకి అతను ఎందుకు నమస్కారం చేసాడో అర్ధం కాలేదు.
    "నమస్తే" బదులు చెప్పాడు.
    "నా కొడుక్కి ప్రాణదానం చేశారు. మీ ఋణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు." అన్నాడతను వినయంగా.
    అతను ఏం మాట్లాడుతున్నాడో బోధ పడలేదు.
    "నా యజమానండి..." ఓ స్త్రీ గొంతు వినిపించి ప్రక్కకు చూశాడు. అక్కడా ఒకామె నిలబడి ఉంది. ఆమె ప్రక్కన క్రొత్త బట్టలు తొడుక్కుని పలక, బలపం పట్టుకుని బిక్కమొహం వేసుకుని చూస్తున్నాడు నాలుగు సంవత్సరాల పిల్లాడు. అప్పుడు గుర్తొచ్చింది నేల బావి నుంచి పిల్లవాడ్ని రక్షించటం.
    "దొరగార్ని స్కూల్లో చేర్చారా?" అడిగాడు కుర్రాడి వైపు చూస్తూ.
    "అవును బాబూ!" వికసించిన మొహంతో చెప్పిందామె. తన కొడుకుని దొర అనడం ఆమెకు సంతోషం కలిగించింది.
    "నువ్వేం పని చేస్తావ్?" అతన్ని అడిగాడు రామకృష్ణ.
    "యం. పి.గారి దగ్గర ఉంటానండి...." చెప్పాడతను.
    "వీడి పేరేమిటి?" కుర్రవాడ్ని ఎత్తుకుని అడిగాడు.
    "రాజకుమార్....."
    "వీడు బాగా చదువుతాడు....." చెప్పి కుర్రవాడ్ని తల్లి చేతికిచ్చాడు.
    "నీతో కొంచెం పనుంది. నా రూం కి వస్తావా?" అడిగాడు.
    "వస్తానండి."
    రెండు గంటల తరువాత రామకృష్ణని అతని రూం లో కలుసుకున్నాడతను. గంట తరువాత రామకృష్ణ రూమ్ నుండి అతను బయటకొచ్చాడు. సరిగ్గా అప్పుడే ఆ సందులోకి వచ్చిన ఆ యువతిని చూసి అతను నమస్కారం చేశాడు.
    "ఈ మధ్య రావడం మానేశావేం?" అడిగిందామె.
    "వస్తే అయ్యగారు కోప్పడతారని రాలేదు."
    యం.పి. దగ్గర చేరకముందు మాజీ ఎమ్మెల్యే దగ్గర బాడీగార్డుగా ఉండేవాడు. యం.పి. ఎమ్మెల్యే రెండు వర్గాలుగా విడిపోయినప్పుడు వాళ్ళ అనుచరులు తమకి నచ్చిన నాయకుని దగ్గర ఉండిపోయారు.
    "ఇటొచ్చావేం?"
    రామకృష్ణ దగ్గరకు రావడం, అతను తనకి అప్పచెప్పిన పని గురించి చెప్పాడు.
    "ఇంటి ముందే కదమ్మా, అతను మీకు తెలియదా?" అడిగాడు.
    ఆమె బదులుగా నవ్వింది.
                            *    *    *    *      
    బస్సు డ్రైవర్ వెంకటేశం సస్పెండ్ అయ్యాడు. అతన్ని అరెస్ట్ చేసి పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరు పెట్టారు. రిమాండ్ విధించటం వాళ్ళ అతన్ని సెంట్రల్ జైలుకు తరలించారు.
    అతని తల్లి చూడటానికొచ్చి ఏడ్చింది. ఆమె వైపు చూస్తుండి పోయాడు వెంకటేశం. తల్లి ఏడుస్తుంటే ఒక్క ఓదార్పు మాట కూడా చెప్పలేదు. ఆ సమయంలో అతని మనసు ఎక్కడో సంచరిస్తోంది.
    పెళ్ళయిన వెంటనే భార్యని తీసుకుని ఇంటికొచ్చాడు. ఆమె భయం భయంగా ఇంట్లోకి అడుగుపెట్టింది. ఎన్నో ఆశలతో కన్నవాళ్ళని వదిలి తనతో జీవితం పంచుకోవడానికొచ్చింది. ఆమె ఇంట్లో సంకోచిస్తూ తిరిగేది. మొదటి రాత్రి మీద చెయ్యేస్తే ఆమె శరీరం జలదరించటం గుర్తుంది. ఏనాడూ తల్లిమీద ఒక ఫిర్యాదు కూడా చెయ్యలేదు.
    ఇప్పుడామె లేకపోయినా జ్ఞాపకాలున్నాయి! ఎవరు దుఃఖించినా ఆమె తిరిగిరాదు.
    తల్లి వెళ్ళిపోవటం అతను గమనించలేదు.
                                                                                   8
    "మావా! ఓ మాటడగనా?" అందామె భయంగా.
    "ఏంటది?" అని బీడీ ముట్టించుకున్నాడు గణేష్.
    "రెండు సంవత్సరాలనుంచి పెళ్ళి చేసుకుంటానంటున్నావ్. ఎప్పుడు పెళ్ళి చేసుకుంటావ్ మావా?"
    "పెళ్ళి చేసుకోకపోతే నువ్వు నా దానివి కాదేంటి?" అన్నాడు.
    "అలాంటప్పుడు చేసుకోవడానికి ఆలస్యమేంటి?"
    "ఏమిటే! ఈరోజు తల తిరుగుతోందా?" అడిగాడు కోపంతో.
    "తల తిరగటం కాదు. పెళ్ళి చేసుకుంటానని చాలాసార్లు చెప్పావ్. ఇప్పుడా పని చేస్తే బాగుంటుంది...."
    "ఎప్పుడు చేసుకోవాలో నాకు తెలుసు లేవే...." విసురుగా అన్నాడు.
    "అదంతా నాకు చెప్పొద్దు. ఇప్పుడే చేసుకోవాలి...." మొండిగా అందామె.
    అతనికి ఆశ్చర్యం కలిగింది. ఎప్పుడూ ఎదురు చెప్పని ఆమె ఎందుకలా మాట్లాడుతున్నదో అర్ధంకాలేదు. ఆలోచించే అవకాశంలేకుండా కోపం ముంచుకొచ్చింది. లేచి సాచిపెట్టి ఆమెని చెంపమీద కొట్టాడు. ఆమె గుమ్మం దగ్గరకు వెళ్ళిపడింది. రోషంతో లేచి నిలబడింది.
    "ఈరోజు అటోఇటో తేలిపోవాలి. నన్ను చేసుకుంటావా లేదా చెప్పు...." అరిచింది. అప్పటికే ఆమె శరీరం చమటతో తడిచింది. జుట్టు ముడి ఊడిపోయి వెంట్రుకలు చెల్లాచెదురయ్యాయి.
    గణేష్ రెండడుగులు వేసి మరో దెబ్బ కొట్టాడు. ఆమె తలుపు మీద పడి అవి తెరిచి ఉండటంతో బయటకెళ్ళి నేలపైన పడింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS